Friday, April 26, 2024

అమెరికాలో అమీతుమీ తేలే సమయం ఆసన్నం

ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఆ రోజు వచ్చేసింది.అది నేడే. నవంబర్ 3వ తేదీనాడు అమెరికాను పాలించే కొత్త  ప్రభువు ఎవరో  తేలిపోతుందని అందరూ అనుకుంటున్నారు. కానీ, అది నేడే తేలుతుందా? ఇంకా సమయం పడుతుందా? వేచి చూడాల్సిందే. అమెరికాలో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున డోనాల్డ్ ట్రంప్ -డెమోక్రాటిక్ పార్టీ తరపున జో బైడెన్ రేసులో ఉన్నారు.

సర్వేలు బైడెన్ ను గెలిపిస్తున్నాయి

జో బైడెన్ దే గెలుపని ఎక్కువ శాతం సర్వేలు చెబుతున్నాయి. గత ఎన్నికల ఫలితాల తీరు, ట్రంప్ ఆత్మవిశ్వాసం చూస్తుంటే, మళ్ళీ ట్రంప్ కొనసాగుతాడా? అనే చర్చలు మొదలయ్యాయి. కరోనా నేపథ్యంలో ఈసారి ఎక్కువమంది ఓటర్లు పోస్టల్ విధానంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగిలినవారు బ్యాలెట్ పద్దతిలో ఎంచుకున్నారు. సోమవారం నాటికి, దాదాపు 9కోట్లమంది ఓటు వేసినట్లుగా సమాచారం. ఇందులో, డెమొక్రాటిక్ పార్టీ మద్దతుదార్లు పోస్టల్ ద్వారా ముందస్తుగానే ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ నాడే ఓటు హక్కును వినియోగించుకోవాలని ట్రంప్ తమ పార్టీ మద్దతుదారులకు సూచించారు. దీనివల్ల ఈరోజే  (నవంబర్ 3) వాళ్ళు ఓటు వేసే అవకాశం ఉంది. పోస్టల్ విధానాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. అవకతవకలు జరుగుతాయేమోనని అనుమానిస్తున్నారు. ఈసారి పోస్టల్ విధానం  ద్వారా  ఎక్కువమంది ఓట్లు వేసిన నేపథ్యంలో, లెక్కించడానికి చాలా సమయం పడుతుందని అనుకుంటున్నారు.

కమ్ముకుంటున్న అనుమానాలు

ఈ తరుణంలో, ఫలితాల ప్రకటన ఆలస్యమవుతుందా? అనే అనుమానాలు కమ్ముకుంటున్నాయి.(1) సర్వేలు ట్రంప్ కు వ్యతిరేకంగా ఉన్నాయి, (2) పోస్టల్ విధానంపై ట్రంప్ కు అనుమానాలు ఉన్నాయి (3)ఇప్పటికే, తన ప్రతిపక్ష డెమోక్రాటిక్  పార్టీ మద్దతుదార్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కారణాలతో ఫలితాలపై ట్రంప్ పేచీ పెట్టే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. దీని వల్ల అధ్యక్ష అభ్యర్థి ప్రకటన ఆలస్యం కావచ్చు. అమెరికాలో  ఎంపిక విధానం మనకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ విధానం మిగిలిన కొన్ని దేశాల కంటే కూడా వైవిధ్యంగా ఉంటుంది.(1) ప్రజలు వినియోగించుకొనే ఓటు (2) ఎలక్ట్రోరల్ కొలేజ్ ఓట్లు. ప్రజాదరణ వల్ల ప్రజల నుండి ఎక్కువ ఓట్లు వచ్చినా, తక్కువ వచ్చినా, అధ్యక్షుడు ఎంపికను ఎలక్ట్రోరల్ కొలేజ్ ఓట్లు  మాత్రమే నిర్ణయిస్తాయి.మొత్తం 50రాష్ట్రాలలో కలిసి 538కొలేజ్ ఓట్లు ఉన్నాయి. ఇందులో 270ఓట్లు ఏ అభ్యర్థికి వస్తే, ఆ వ్యక్తి అమెరికాకు అధ్యక్షుడుగా ఎంపికవుతాడు.

ఎలక్టొరల్ కొలేజీ ఓట్లపైనే ట్రంప్ విశ్వాసం

గత 2016లో జరిగిన ఎన్నికలు దీనికి ఉదాహరణ. ఆ ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ కు ప్రజాదరణ (పాపులర్ ఓట్ ) తక్కువ వచ్చింది. ఎలక్ట్రోరల్ కొలేజ్ ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఈ కారణం వల్ల, 2016లో ట్రంప్ ఎంపికయ్యారు. ఇప్పుడూ ట్రంప్ అదే విశ్వాసంలో ఉన్నారు. ప్రజాదరణ ఎట్లా ఉన్నా, ఇందులో పైచేయి తనదేననే ధీమాలో ఉన్నారు. ఒకవేళ ఓడిపోతే, కోర్టులో తేల్చుకోడానికి ట్రంప్, ఆయన మద్దతుదార్లు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఈ ఎంపిక తంతు న్యాయస్థానాల తలుపు తట్టితే, అధ్యక్ష్య ప్రకటన ఇంకా ఆలస్యం అవుతుంది. ఈసారి బ్యాలెట్ కంటే, పోస్టల్ ద్వారా ఎక్కువ ఓట్లు నమోదు కావడం వల్ల లెక్కింపుకు మరికొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. ఈరోజు రాత్రే (నవంబర్ 3) ఈ మొత్తం ప్రక్రియ పూర్వవ్వడం ఎంతవరకూ సాధ్యమన్నది చెప్పలేము. ఓట్ల లెక్కింపు ఆలస్యమైనా,  దీని ప్రభావం పెద్దగా ఏమీ ఉండదనీ, రాష్ట్రాల ఎలక్ట్రోరల్ కొలేజ్ ఓట్లతో అధ్యక్షుని ఎంపిక పూర్తి చేస్తారని నిపుణులు చెబుతున్నారు.

ఫలితం కోర్టు ప్రకటించే పరిస్థితి వస్తుందా?

ఒకవేళ ఫలితాల వ్యవహారం కోర్టుకు వెళితే, అధ్యక్ష ఎంపికకు ఎక్కువ సమయం పడుతుందని 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికలు చెబుతున్నాయి. అప్పుడు,  సుప్రీం కోర్టు తీర్పుతో విజేతను ప్రకటించారు. దీనికి నెల రోజుల సమయం పట్టింది. అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్ జూనియర్. ప్రజాదరణ ఓట్లు (పాపులర్ ఓట్ ) తక్కువ వచ్చి, ఎలక్ట్రోరల్ కొలేజ్ ఓట్లతో ఈయన గెలిచాడు. 2016లో ట్రంప్ పరిస్థితి కూడా అదే. ఈసారి కోర్టుకు వెళితే ఎవరు గెలుస్తారో?  ప్రస్తుతం చెప్పలేం. ట్రంప్ గెలుపొందితే: రెండు అంశాల్లోనూ జూనియర్ బుష్ తో డోనాల్డ్ ట్రంప్ ను పోల్చవలసి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో జోబైడెన్ అధ్యక్షుడు అవుతాడా? డోనాల్డ్ ట్రంప్ అవుతాడా? ప్రస్తుతం చెప్పడం కష్టమే.

వైఫల్యాలు ఉన్న మాట నిజం

ఒకటి మాత్రం నిజం: కరోనా పోరాట  వైఫల్యం, మినిపొట్టా రాష్ట్రంలో జాత్యహంకారానికి బలైపోయిన నల్లజాతీయుడైన జార్జ్ లాయిడ్ ఉదంతం, విదేశీయుల పట్ల కరకుగా వ్యవహరిస్తున్న వీసా ప్రక్రియ, మితిమీరిన శ్వేతజాతీయవాదం, అడ్డుఆపూ లేకుండా దురుసుగా మాట్లాడే విధానం, మాటలు మాటిమాటికీ మార్చడం మొదలైనవి డోనాల్డ్ ట్రంప్ పట్ల వ్యతిరేకతను పెంచాయి. ఓటర్లు ఎక్కువగా తెల్లజాతివారు  ఉన్నారు కాబట్టి, వారి మద్దతు పొందడానికే  ట్రంప్ కొన్ని వ్యూహాలు  ఎంచుకున్నారు. అదే ఈ శ్వేతజాతీయవాదం అని భావించాలి. తనజాతివారి మద్దతు పొందడానికి మిగిలిన జాతీయులను తక్కువగా చూడడం రాజకీయం కావచ్చునేమో కానీ, మానవీయం కాదు. ఏది ఏమైనా? అమెరి’కాయా’? పండా? కొన్ని గంటల్లో తేలిపోతుంది.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles