Thursday, September 19, 2024

ప్రపంచ అద్భుత భర్తలు (World Wonderful Husbands)-6

కులం అనేదే లేదు. వేదకాలాలను బట్టి, శాస్త్రాలను బట్టి. చరిత్రలో కులాలుగా మనుషులను విభజించిన కాలం “జీరో”. పవర్ విభజనలో వచ్చిన మార్పు మాత్రమే. ఈ మార్పుకు సాన బెట్టి సాన బెట్టి కులాలుగా విభజనకు గురి చేయబడ్డ “కాలం” ఒక్కటే చరిత్రలో ఉంది. అదే నిచ్చెన మెట్ల స్థితికి వచ్చింది. పవర్ మార్పులో భాగంగా  వచ్చిన విభజనే  కులం. దీనియొక్క ఇనుపగొలుసుల బలం అప్పుడు  అర్ధం కాలేదు. మతాలను శాసిస్తున్న పెద్దలే పవర్ను  / అధికారంను / శాసించే తత్వం లోకి వచ్చారు. మెల్లగా పవర్ విభజనను కులంగా కన్వర్ట్ చేసారు, పనులు చేపించటం మొదలు పెట్టారు. కులానికి మొదటి మెట్టు అంటరాని తనం. ఇందులోకి ఆడవాళ్లను లాగారు. విదేశీ వలసపాలకులకు ముందు”దేవదాసిల”ను దేవుడుకు సేవచేసే వారుగాను, క్లాసికల్ నాట్య మయూరులు గాను కొనియాడారు. వీరికి సమాజంలో ఒక గుర్తింపు ఒకప్పుడు ఉన్నది. విదేశీ వలస పరిపాలకులు ఎప్పుడైతే భారత దేశంను  ఆక్రమించుకున్నారో, అప్పుడే దేవదాసి వ్యవస్థ “దేవాలయాలలో వ్యభిచారంగా” మారిపోయింది అని చరిత్ర చెపుతుంది. విదేశీ పాలకులకు మహిళలు అందుబాటులో ఉండాలి. ఇందులో భాగంగానే కోల్కత్త రెడ్ లైట్ ఏరియా స్థాపింప బడ్డది. ఈ రెడ్ లైట్ ఏరియా ను అద్యయనం చేస్తే నమ్మలేని నిజాలు ఎన్నో.

Also read: 124-ఏ ఐపీసీ పై సుప్రీం కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: పౌర హక్కుల ప్రజా సంఘం – తెలంగాణ రాష్ట్రం

స్వాతంత్ర్య పోరాటంలో మహిళల భాగస్వామ్యం

మన దేశానికి స్వాతంత్రము తెచ్చుటలో మహిళల భాగస్వామ్యం ఉంది. అది ఎంత శాతం అనేది పక్కన పెట్టాలి. ఎంతో గొప్పగా కీర్తించే రజాకార్ ఉద్యమంలో మహిళల పాత్ర ఎంతో ఉంది. మహిళలు కష్టం చేస్తున్నారు, కష్టపడుతున్నారు. అయితే, సమానత్వం దగ్గెరకు వస్తే ఏదో సాకులు చూపించటం, చెప్పటం జరుగుతూనే ఉంది. ఇందిరా గాంధీని చూపిస్తూ “మహిళలు’ రాజ్యాన్ని ఏలారు అంటారు. మహిళలు రాజ్యాన్ని ఏలారు అని గర్వంగా చెప్పుకున్నప్పుడు, మహిళలపై దాడులు, మానభంగాలు, స్త్రీలను ఎత్తుకపోవటాలు, హత్యలు చేయటాలు, వ్యభిచారం చేపించటం ఎందుకు జరుగుతున్నాయి?  సమాజంలో కుటుంబాన్ని అవమాన పరిచేటందుకు మహిళలను ఎందుకు టార్గెట్ చేస్తున్నట్లు ? మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ ఎందుకు లేదు? భూమి యాజమాన్యపు హక్కును కలిగి ఉండేటందుకు ఇన్ని పోరాటాలు  సంస్కరణలు ఎందుకు జరిగాయి? సహజ సిద్ధంగానే  మహిళలకు సమానత్వం ఉండాలిగా ? ఎందుకు లేదు? భగవంతుడు స్త్రీ పురుషుడికి ప్రాణం పోసినట్లైతే ఇద్దరి మధ్య ఈ వ్యత్యాసం ఏంటీ? వీటికన్నింటికీ ఒకే ఒక జవాబు స్త్రీ పురుషుల పుట్టుకలోనే “కాన్స్పిరసీ” ఉందంటాను. నటరాజన్ చాలా విషయాలు, సమస్యల తీవ్రతను చెప్పారు. నేను వాటిజోలికి వెళ్ళటం లేదు. ఈ సభలో కర్షకులు ఉన్నారు. వారిని చెప్పమనండి. వ్యవసాయ పనుల్లో స్త్రీల భాగస్వామ్యం లేదని, కార్మికులూ ఉన్నారు వారిని చెప్పమనండి మహిళలు వారితో కలిసి సమానంగా పనిచేయటం లేదని. కానీ వారికిచ్చే జీతభత్యాలు మగవాళ్ళ కన్నా తక్కువ. ఎందుకు? ఇది ఇప్పుడు వచ్చిన ఆచారం కాదు. కొన్ని వేల వేల ఏళ్ళనుండి వస్తున్నటువంటిది. మహిళలకు మాత్రం సమాన వేతనం లభ్యం కాదు. సమానత్వం గురించి మాత్రం మాట్లాడుతారు, సమానత్వం దొరకదు. స్త్రీలు భోగ వస్తువు కాదు అంటారు.  భోగ వస్తువుగానే “ట్రీట్” చేస్తారు.  మహిళల అలంకరణలో కూడా  తండ్రులది, భర్తలది, లేకపోతే కొందరి మగవాళ్ల  “జోక్యం” ఉండాలి.  ఎందుకు?  స్త్రీల  నడకనూ శాసించాలి, పరదాల ఆచారంతో పరదాలోనే స్త్రీలను ఉంచుతున్నారు. స్త్రీలు గాలి పీల్చుకోవటానికే కూడా అనుమతి కావాలి.  చదువుకూ అనుమతి కావాలి. మీలో ఎంతమంది మహిళలు స్వేచ్ఛగా ఆలోచించేటందుకు స్వేచ్ఛను ఇస్తారు. మీ ఎదల పై చేతులు వేసుకొని చెప్పండి. మహిళలకు తగులుతున్న గాయాలను ఎంత మంది అర్ధం చేసుకుంటున్నారు? గాయాలు ఒక్క శరీరానికేనే కాదు .. హృదయానికి, చెవులకు, కళ్ళకు, వారు నడిచే పాదాలకు తగులుతున్న గాయాలను ఎలా మాన్పగలరు. విప్లవ రాజకీయాలలో మహిళలకు గౌరవం ఉందా ? మార్క్స్ , ఎంగెల్స్ గురించి మాట్లాడుతారు. మరి ఆడవాళ్ళ పట్ల వారి ప్రవర్తన? అక్కడ ఎంత మంది నాయకులు మహిళల డెసిషన్ మేకింగ్ ను గౌరవిస్తున్నారు. పురుషుల అడుగు జాడలలో నడిచే మహిళా కార్యకర్తకు ఇచ్చే ప్రాధాన్యత  “డెసిషన్ మేకింగ్ చేసే కార్యకర్తకు” ప్రాధాన్యత ఉన్నదా?  ఉంటది అంటే నమ్మశక్యం కాదు. అందులో పనిచేసి బయటకు వచ్చి సాధారణ జీవితాలను గడుపుతున్న ఉత్సాహవంతులైన మహిళా కార్యకర్తలు చాలామంది ఉన్నారు. వారే ఒక సాక్ష్యం. ఎందుకంటె పురుష కార్యకర్తలూ ఈ సమాజం నుండే విప్లవోద్యమాలలోకి వెళ్తారు, వెళ్తున్నారు కాబట్టి. వారిలో విప్లవ రాజకీయ చైతన్య కలిగి ఉండక పోవటం ఒక కారణం. అయితే,  సమాజంలో మహిళల పట్ల ఎలాంటి “చూపు ” ఉందొ దాన్ని పుణికి పుచ్చుకొని అందులోకి వెళ్తున్నారు. మెరుగైన ప్రవర్తన ఎలా ఉంటది? మానవ పుట్టుక  చరిత్రలోనే  మహిళల గురించి ఒక వైపు కీర్తిస్తూ , మరో వైపు అణచివేయబడే పద్ధతులే ఉన్నాయి.  వీటిని  పారద్రోలకుండా మహిళలపట్ల పురుషుల  ఆలోచనా ధోరణి ఎలా మారుతుంది.

Also read: బేగరి నాగరాజు (24) హత్య దేని పైన దాడి? అంటరానితనమా? వివక్షా? అగౌరవమా? పరువు హత్యా? మత హత్యా? రాజ్యాంగంపైన దాడా?

దేవదాసీ వ్యవస్థను పెంచిపోషించింది ఎవరు?

దేవదాసి వ్యవస్థ ఏ సమాజం పెంచి పోషించలేదో చెప్పమనండి ఈ ప్రభుత్వాలను? దీనికి ప్రత్యేకమైన రాజకీయాలు అవసరం లేదు. దేవదాసి వ్యవస్థ అంటే అదియేదో పై నుండి ఊడి పడిలేదు. వ్యవస్థ తయారు చేసుకున్న ఒక విష సంస్కృతికి వెసులు బాటు. వీటిని రూపుమాపడం కోసం మరో వ్యవస్థను చట్టాల రూపంలో, అభాగ్యులకోసం తెచ్చిన దేవదాసి పథకాల రూపంలో వ్యవస్థ యొక్క బలహీనతకు మరో వెసులు బాటు. మానవ సమాజం ఏర్పడినప్పటి నుండి స్త్రీలకు ఇచ్చిన గుర్తింపు ఏంటిది?  స్త్రీల విషయంలో పిల్లల విషయంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి అనే నినాదం. ఈ నినాదం  అన్ని రాజకీయ పార్టీలకు ఒక ఊతపదంగా అయ్యింది. పార్టీల నిర్మాణంలోనే స్త్రీలను పక్కకు పెడతారు. మహిళలను ఆర్గనైజ్ చేసేటందుకు మాత్రమే మహిళా విభాగం అని మొక్కుబడిగా పెడుతున్నారు. ప్రభుత్వంలో ఎలా ఒకటి స్త్రీ  శిశు సంక్షేమ శాఖ అని ఉంటుందో అలానే ఇక్కడ కూడా. ప్రభుత్వం యొక్క స్త్రీ  సంక్షేమ శాఖ ఎలా పనిచేస్తుందో మీకందరికీ తెలుసు. జాతీయ మహిళా కమిషన్ 1992 లో ఏర్పడింది. దీనియొక్క చట్టం 1990 లో వచ్చింది. ఆ నాటికి  మనకు స్వాతంత్ర్యం వచ్చి 45 ఏళ్ళు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 42 ఏళ్ళు. మహిళలకు ఏపాటి గుర్తింపు ఉందో, గుర్తింపు ఇస్తున్నారో ఈ లెక్కలు చాలు. ప్రభుత్వాలకు, ప్రతిపక్షాలకు, వామపక్ష పార్టీలకు, విప్లవ పార్టీలకు మహిళల విషయంలో ఆలోచించే విధానం లో  ఏమంత తేడా లేదనే చెప్పాలి. అందుకే దేవదాసి వ్యవస్థను ‘వ్యభిచరించే’ టందుకు ఏర్పాటుచేసుకున్న ఒక స్థలం అంటాను నేను. మీకో విషయం చెపుతాను……..  ఒక దేవాలయం ఉంది. అందులో “దేదదాసి” గా ఒక అమ్మ ఉండేది. ఆమెకు ఒక కూతురు బబ్లీ. దేవుడికి సేవ చేసే వారిని దేవదాసి అని నామకరణం చేసినప్పుడు, బబ్లీ ఎక్కడి నుండి వచ్చినట్లు?!. ఓ రోజు బబ్లీ ప్యూబర్తి అయ్యింది.  “ప్యూబర్తి” ని గుడిపెద్దలు, ఆ ఊరు జనం కలిసి మహా వైభవంగా ఉత్సవం జరిపారు. ఆ రోజు బబ్లీ పేరు చాందినీ గా మార్పు జరిగింది. అమ్మ స్థానంలోకి చాందిని. అమ్మ చాందినికీ మార్గదర్శకురాలిగా అయ్యింది.

Also read: ప్రపంచ అద్భుత భర్తలు(World Wonderful Husbands) -5

పూజారి కొడుకుపై నిషేధాజ్ఞలు

 ఆ గుడి పూజారికి  ఇద్దరు కొడుకులు పెద్దబ్బాయి చాందినీ వయసు. స్నేహం అయ్యింది. ఈ స్నేహం ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి చేరింది. అమ్మకు చాలా కోపం వచ్చింది. పూజారికి ఫిర్యాదు చేసింది. పూజారి అన్నీ గమనిస్తున్నాను మీరు దిగులు పడవద్దు అని భరోసా ఇచ్చారు. కానీ సరిఅయిన సమయంలో పూజారి స్పందించలేదు. అమ్మ ఊరు పెద్ద మనుషుల దగ్గెరకు వెళ్లి విషయం చెప్పింది. ఊరు పెద్దమనుషులుగా పిలువబడే వారందరూ సమావేశం అయ్యారు. పూజారి పెద్దకొడుకు ఆ గుడి ప్రాంగణంలోకి, ఆ చుట్టుపక్కల కనిపించకూడదు అని కట్టుబాటును నిర్ణయించారు. ఒకవేళ కట్టుబాటును పెద్దబ్బాయి అతిక్రమిస్తే ఊరును వదిలిపెట్టాలని నిర్ణయం జరిగింది. ఇది జరిగిన రెండవ రోజు అమ్మతో పాటు అమ్మ వయసు దేవదాసీలు కలిసి చాందినీకి  ప్రత్యేకమైన  అలంకరణకు ఏర్పాటు చేసారు.   ఈ అలంకరణతో రాత్రికి మనసా వాచ శరీరంతో దేవుడికి చాందిని అంకితం కావాలి. ఇది చాందినీకి నచ్చలేదు. అలంకరణతో పెద్దబ్బాయితో కలిసి పారిపోయింది. దీనికి కారకులు పూజారి అని పూజారిని వెలివేసారు. ఈ చర్యను ఏమనాలి?

Also read: (World’s Wonderful Husbands) ప్రపంచ అద్భుత భర్తలు-4                     

దేవదాసి వ్యవస్థను ‘వ్యభిచారం’ చేసేటందుకు ఏర్పాటు చేసుకున్న ఒక వ్యవస్థ అనకూడదా?  దేవుడి సేవకోసం పుట్టిన వ్యవస్థ  అని అన్నప్పుడు బబ్లీ ఎక్కడనుండి వచ్చినట్లు. మాతంగి వ్యవస్థ అని వేరే  ప్రాంతాలలో ‘వ్యభిచారానికి’ మరో  పేరు. ఇంకా కొన్ని ప్రాంతాలలో ‘భోగమోళ్ళు” అని. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో మెహబూబ్ – కా –మెహందీ     ప్రాంతం, బాంబే, కలకత్తా ప్రాంతాలలో “రెడ్ లైట్ ఏరియా” ప్రాంతాలుగాను, సాని కొంపలు ఉండే ప్రాంతాలు వగైరా , వగైరా పేర్లతో పిలుస్తున్నారు. ఇవన్నీ కూడా మత  కుల ఆచారాల ముసుగులో మహిళలను ఒక ‘వాణిజ్య వస్తువు ‘ గా చూపే ప్రయత్నంలోనే భాగం అని అంటాను.  ఈ పేర్లన్నీ మహిళల ప్రైవేట్ పార్టులకు ఇస్తున్న గుర్తింపే. మొదటి సారిగా ఈ గుర్తింపు 6 వ శతాబ్దంలో వచ్చినట్లు చరిత్రలో ఉంది. 13 వ శతాబ్దం వరకు దేవదాసి అనే పదం చాలా పాపులర్ గా సాగింది.  చాలా కఠినంగా సాగింది. మహిళల శరీర అంగాలకు ఇస్తున్న గుర్తింపు ఏమయ్యింది అంటే “స్త్రీ మా సొంతం” అనే స్థాయికి తీసుకొని ఈ వ్యవస్థ వెళ్ళింది. ఇక్కడ స్త్రీల అవయవాలకు గుర్తింపు ఇస్తూ పేరు పెట్టుకున్నారు. విదేశాలలో స్త్రీలను పశువులను అమ్మినట్లు బజార్లలో పెట్టి అమ్మేశారు. ఇది 1883 వరకు కొన్ని ప్రాంతాలలో జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ లో స్త్రీలకు ఓటు హక్కు 1928 లో వచ్చింది. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలుగా కీర్తించబడుతున్న దేశాలలోని స్త్రీల పరిస్థితి ఆ విధంగా ఉంటే అభివృద్ధిలోకి అడుగుపెట్టబోతున్న దేశాలలోని స్త్రీల పరిస్థితి ఇంకెలా ఉంటాదో ఆలోచించండి.

Also read: (World’s Wonderful Husbands)ప్రపంచ అద్భుత భర్తలు-3 

ఇంటి పెద్దదిక్కు పోతే పరిస్థితి ఏమిటి?

ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త అకాల మరణం చెందాడు. ఆ మహిళకు ఆదరువు ఏమిటి? పిల్లల పోషణ? భూమిలేని కుటుంబాల పరిస్థితి? ఇంటి పెద్ద దిక్కు పోయినప్పుడు ఆ కుటుంబ పరిస్థితి? తల్లి తండ్రులు ఏది చెపితే అదే. అత్తమామలు ఏది శాసిస్తే అదే. ఇద్దరు పిల్లల బ్రతుకు కోసం ఆ స్త్రీ ఒక “ఉంపుడు గత్తెగా” వెళ్ళింది.  చిన్నవయసులో పెళ్లి చేస్తే ఎంత అనర్ధం అయ్యిందో అనే విషయం పై అత్తమామలకు, తల్లి తండ్రులకు బాధలేదు. ఒక చింత లేదు. ఉంపుడు గత్తెను ఏమనాలి?   దీన్ని వ్యభిచారం అనకూడదా? ఒక స్త్రీ జీవితం విధ్వంసం అందరూ కలిసి చేసినట్లు కాదా? దీనికి మీరు ఏం పేరు పెడతారు?

స్త్రీల విషయంలో ప్రభుత్వాలకూ, పార్టీలకూ పట్టింపు లేదు

ఈ నాడు భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలు పాలక వర్గ పార్టీలుగానే మిగిలిపోయాయి అని చెప్పేటందుకు నేనేమి వెనకడుగు వేయను. ఎందుకంటె స్త్రీల విషయంలో ప్రభుత్వాలకు ఏవిధంగా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేదో, అదే విధంగా మిగతా పార్టీలకు లేదు. స్త్రీలపై అమానుషంగా అఘాయిత్యం జరిగినప్పుడు, దాడి జరిగినప్పుడు, స్త్రీలను కిరాతకంగా చంపినప్పుడు, వారి భర్తలను చంపినప్పుడు మాత్రమే కొంతవరకే స్పందన వస్తుంది. ఆ తరువాత ఎక్కడా స్త్రీలకోసం ప్రజా పోరాటాలు నిర్మించిన సందర్భాలు లేవు. ఈ పార్టీల పరిస్థితి ఎలా కనిపిస్తుంది అంటే పాలకుల చేతుల్లో వీరు “ఒక సాధనం / పని ముట్టు” నా అని మనకు    ఆశ్చర్యం కలిగేంతగా. 1971 నుండి 2012 వరకు మహిళలపై అత్యాచారాలు, అపహరణలు బాగా పెరిగాయి. కారణం భారతదేశంలో వ్యభిచారం చట్టబద్ధమైనది. అయితే వేశ్య గృహాలను నడపటం, చిన్న పిల్లలతో వ్యభిచారం చేపించటం, హోటళ్ళలో  వ్యభిచారం నడిపించటం, బలవంతంగా “సంభోగం” కోసం  అభ్యర్థించటం, పింపులతో బ్రోతల్ హౌస్ లను నడిపించే లాంటి చేష్టలు చట్ట విరుద్ధమైనవి. వ్యభిచారం చట్టబద్ధం చేస్తూ గుర్తింపు ఇచ్చిన ప్రాంతాలు ప్రముఖంగా 8 ఉన్నాయి. ఆసియా దేశాల మొత్తంలోనే అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా  కోల్కత్త. కోల్కత్తాలోని సోనాగచ్చి అనే ప్రాంతం వ్యభిచారానికి ప్రపంచంలోనే అతి మంచి “సేఫెస్ట్” ప్రాంతంగా కీర్తించబడుతున్నది.(1). కామాఠిపుర, ముంబాయ్,(2). బుధ్ వార్ పేట్, పూణే,(3). మీర్ గంజ్, అలహాబాద్,(4). జి.బి. రోడ్, ఢిల్లీ,(5). చతుర్భుజిస్తాన్, ముజఫర్పూర్,(6). ఇత్వారి, నాగపూర్,(7). శివదాస్పూర్, వారణాసి. ప్రభుత్వంచేత గుర్తింప బడి, లైసెన్స్ లతో స్త్రీల అవయవాలకు ‘మార్కెట్’ ను ఏర్పాటు చేయబడింది. స్త్రీలను ప్రభుత్వాలే “వాణిజ్య వస్తువు” గా ముద్ర వేస్తే , స్త్రీలకు  సమానత్వం ఎవరు, ఎప్పుడు ఇస్తారు? పాలకులకు, ఇతర రాజకీయ పార్టీలకు ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనది గా కనిపించదు. 34 ఏళ్ళు వెస్ట్ బెంగాల్ / కోల్కత్తా ను ఒక వామపక్ష పార్టీ పాలించింది!

రూపు మారిన ప్రజా ఉద్యమాలు         

ప్రపంచవ్యాప్తంగా ఒక ఉప్పెనగా – LPG (Liberalisation, Privatisation and Globalisation) – సరళీకరణ ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ లు  రాజకీయ, ఆర్థిక, సాంఘిక రంగాలను ఊపు ఊపింది. ఈ ఊపు భారత దేశం మీద విపరీతమైన ప్రభావం చూపింది. ఈ దెబ్బతో 1990 తరువాత ప్రపంచ వ్యాప్తంగా, భారతదేశంలో ప్రజా ఉద్యమాల రూపు మారింది.  అన్ని వర్గాల స్త్రీలలో చదువుకోవాలనే జిజ్ఞాస పెంచింది. పాలక వర్గాలలో స్త్రీలను చేరదీయక పోతే “పాలించలేమని” ఒక నిర్ధారణకు వచ్చాయి. ఎప్పుడైతే నిర్ధారణకు వచ్చారో వారి ఇంటిలోనుండే స్త్రీలను బయట తిప్పటం మొదలు పెట్టారు. ప్రజలను లొంగదీసుకోవటానికే ఎల్లపుడూ పాలకులు నూతన పద్దతులను అవలంభింస్తుంటారు. ఆ నూతన పద్దతే వారికి చెందిన మహిళలను బయట తిప్పటం.  43 ఏళ్ళ స్వాతంత్య్ర అనంతరం (1990 తరువాత) పాలక వర్గాలు మహిళలకు రాజకీయాలలో ఒక అనుచిత స్థానం ఇవ్వాలని ఒక ధృడమైన నిర్ణయానికి వచ్చారు (అంతక ముందు లేదా అంటే, ఇంత ధృడంగా లేదు). విప్లవ ఉద్యమాలు, కమ్యూనిస్టు ఉద్యమాలు స్త్రీలను బయటకు తీసుక రాలేదు అనేది నా భావన కాదు. ఆ ఉద్యమాల నేపథ్యం, పరిస్థితులు వేరు. వీరి ఉద్యమాల సెగకే పాలక వర్గాలు తమ ఇంట్లోని ఆడకూతుర్లతో, కుటుంబాలలోని చుట్టాలతో, బంధువులతో, రాజకీయ లబ్ధిని ఆశించే స్నేహితుల కుటుంబాలతో మహిళలను రాజకీయ ఆరెంగేట్రం చేపించారు. మహిళలు ఆయా కుటుంబాల మగతోడుతో అడుగులు నేర్చుకుంటున్నారు. మగవారి ఘనమైన అనుభవాలను కొందరు స్త్రీలు నేర్చుకోవటం మొదలు పెట్టారు. LPG ప్రభావంతో రాజకీయ వెసులు బాటు కోసం, అధికారం వారి వారి మధ్యనే ఉంచుకోవటం కోసం మహిళలను బయటకు తెచ్చారు.

రిమోట్ మగవాళ్ళ చేతిలోనే

ఈ మహిళలు చూడటానికే శక్తివంతంగా కనిపించవచ్చు. కానీ మొత్తం రిమోట్ కంట్రోల్ “మగవాళ్ల చేతిలోనే” ఉండి పోయింది.  ఇక్కడ  ఒక సంఘటన ప్రస్తావిస్తాను ఒక నాయకుడి భార్య, కూతురు వారి పార్టీ ప్రయోజనాల కోసం ప్రచారంచేస్తున్నారు. మరో నాయకుడు జన సమూహంలో ఆ కూతురు “ప్రైవేట్ పార్ట్శ్” ను టచ్ చేస్తున్నాడు. జన సమూహం కాబట్టి పొరపాటున తగిలింది అని ఆ కూతురు అనుకున్నది. పదే పదే టచ్ చేయటం మొదలు పెట్టాడు. ఆ కూతురు చెప్పుతీసుకొని ఆ నాయకున్ని కొట్టింది. కొట్టటం తప్పు అని పెద్ద గొడవ జరిగింది. కూతురు తండ్రి కూతురునే మందలించాడు. కూతురు వాదన .. ఆ నాయకుడి చూపులు బాగాలేవు నాన్నా అని చాల సార్లు  చెప్పినప్పుడు, ఆ నాయకుడిని పట్టించుకోకు అన్నారు. శృతి మించింది కొట్టాను అన్నది. తండ్రి మాత్రం ఆ నాయకుడి చర్యను తప్పు పట్టలేదు. కూతురు చర్యను తప్పుపట్టారు. కూతురు తల్లి ఇలాంటి భర్తను భరించి భరించి అలసిపోతున్నాను అని వాపోయింది. కొన్ని నెలల తరువాత ఆ కూతురు చంపబడింది. ఆ నాయకుడి ప్రవర్తనకు ఏం పేరు పెడతారు మీరు?       

ప్రేమికులకు ఉరి

నేడు స్త్రీల పై జరుగుతున్న దాడులు  విస్తృత ప్రజానీకంను  ప్రజా పోరాటం వైపు మళ్లించేంతగా  పరిస్థితులున్నాయి. కూతురు చంపబడింది అని చెప్పాను కదా. ఆ కూతురు ఆ పార్టీలోని కార్యకర్తను ప్రేమించింది. ప్రేమించటం ఆ కూతురు చేసిన తప్పు. ఈ తప్పుకు దండన గా అబ్బాయి కులపు పెద్దలు, అమ్మాయి కులపు పెద్దలు కలిసి ఒక పండుగలాగా ఇద్దరిని భాజాభజంత్రీలతో  ఊరిలో ఊరేగించి, ఊరు బయట ఉన్న చెట్టుకు ఉరివేసారు. ఏ పోలీసులు, ఏ చట్టం ఈ చర్యకు అడ్డుచెప్పలేదు. ఆ ఇద్దరూ కుల కట్టుబాటుకు వ్యతిరేకంగా ప్రవర్తించారు కాబట్టి  ఉరి వేసామని సమర్ధించుకున్నారు. ఒక నాయకుడు “కూతురు ప్రైవేట్ పార్ట్స్” ను పదే పదే టచ్ చేస్తే కులం, మతం ఆచారాలు, కట్టుబాటు అక్కడ పనిచేయలేదు. ఆ నాయకుడి చర్యను తప్పు పట్టలేదు. ప్రేమిస్తే మాత్రం ‘ఆచారాలు, కట్టుబాటు’ పనిచేసాయి.  అమానుషంగా బ్రతికి ఉన్న మనుషులను ఊరు మొత్తం కదిలి “ఉరి వేయటం” ను ఏ రకంగా సమర్థిద్దాం?  ఈ  చర్యకు ఏం పేరు పెడదాం? 

Also read: (World Wonderful Husbands) ప్రపంచ అద్భుత భర్తలు-2

పరిష్కారం దొరకని పజిల్

భారత దేశంలోని స్త్రీని ఇంటి మహాలక్ష్మిగా భావిస్తారు. స్త్రీని గౌరవించే ఇంట్లో, భార్యాభర్తల మధ్య ఒకరినొకరు గౌరవించుకునే భావన ఉన్న ఇంట్లో ఎప్పుడూ శాంతి ఉండటమే కాకుండా లక్ష్మీదేవి కూడా ఉంటుంది అని ప్రగాఢమైన నమ్మకం. కానీ స్త్రీలకు భద్రత లేదు. స్త్రీలకు “శీలం” ముఖ్యం అంటారు.  స్త్రీల శీలాలపై  దాడి చేసే వారు పురుషులు. తిరిగి వారే స్త్రీలకు శీలం ముఖ్యం అంటారు. ఇది ఒక పరిష్కారం దొరకని “పజిల్” (సమస్య)?! ఎందుకంటే …. మన సామజిక పరిస్థితులలో వచ్చిన ఏ మార్పు సంపూర్ణంగా రాలేదు. 5000 సంవత్సరాల పూర్వం ఆహార సేకరణ మీద ఆధార పడ్డ సంచార జీవులే. అంటే దొరికిన ఆహారాన్ని ఏరుకొని / వేటాడి తింటూ స్థిర నివాసం లేకుండా సంచరిస్తూ ఉండేవారు. ఆ తరువాత క్రమంగా ఆహార సేకరణ మాని ఆహారాన్ని ఉత్పత్తి చేయటం అలవర్చుకున్నారు. 5000 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఆ మార్పు పూర్తి కాలేదు. ఆహార సేకరణ మీద ఆధారపడి ఉన్న ఆటవిక తెగలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఆ తరువాత వచ్చిన మార్పులూ ఇంతే. ఏ మార్పు కూడా పూర్తిగా రాలేదు. అన్నింటిలోనూ పాత వ్యవస్థను ఇప్పటికీ మిగుల్చుకున్న ప్రజలున్నారు. ఆటవిక సంస్కృతి, సంప్రదాయాలు కొత్త రూపంలోకి మారింది. ఎందుకంటె మార్పు వచ్చిన చోట గూడా కొత్త వ్యవస్థ పాత వ్యవస్థను పూర్తిగా నాశనం చేయలేదు. దీని పర్యవసానమే స్త్రీల కోసం  దేవదాసి వ్యవస్థ పైననే రెడ్ లైట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మనిషికి ఆహారం చాలా చాలా ముఖ్యం. ఆహారాన్నిఅతిగా  సంపాయించుకోవటం కోసమే LPG లు వచ్చాయి. వెనుకబడి ఉన్న పాత వ్యవస్థను సమూలంగా నాశనం చేయకుండా దాని మీదనే అంటే అవే ఆచార వ్యవహారాలపైననే సామాజిక నిర్మాణం చేస్తున్నారు. వీటికి ఉదాహరణలే “వ్యక్తిగత చట్టాలు – Personal  Laws”  వీటి పునాదులనుండి స్త్రీలకు వచ్చిన గుర్తింపు “స్త్రీ ఒక వాణిజ్య వస్తువు.” 13 ఏళ్ళ అమ్మాయి మెహబూబ్ కా మెహందీ ప్రాంతంలో అమ్మివేయబడింది. ఆ పాపను వెతికి పట్టుకునేటందుకు 10 ఏళ్ళు పట్టింది. అమ్మాయి వెతుకులాటలో “మెహబూబ్ కా మెహందీ ” ప్రాంతాన్ని ప్రభుత్వం  ఎత్తి వేపించింది. గోవాలో రెండు వ్యభిచార ప్రాంతాలను  ప్రభుత్వం   మూసివేపించింది. కామాఠిపుర ప్రాంతాన్ని జల్లెడ పట్టింది. ఎంతో మంది అమాయక స్త్రీలను ప్రభుత్వం రక్షించింది / రిస్కు చేసింది. 13 ఏళ్ళ అమ్మాయి 23 ఏళ్ళ మహిళగా దొరికింది. అప్పటికే తల్లి చనిపోయింది. తండ్రి ఈ బిడ్డను తీసుకొని ఎక్కడ దాచుకోవాలి అన్నాడు. అది ఒక హృదయ విదారకమైన సన్నివేశం. ఆ తండ్రి మాటలు ఈ సమాజాన్నీ చెర్నాకోలతో కొట్టినట్లు భావించాము. ఇష్టంలేని ఆడవాళ్లను వ్యభిచార గృహాలకు తరలిస్తున్నారు అని immoral traffic (prevention) Act 1956 (1987 లో సవరణ వచ్చింది, మళ్ళీ 2006 లో సవరణ కోసం బిల్ వచ్చింది) ప్రకారం బాధ్యులపై  ప్రభుత్వం కేసులు పెట్టింది. 

Also read: World Wonderful Husbands (ప్రపంచ అద్భుత భర్తలు) -1

స్త్రీల శరీరాలను మాంసపు ముద్దలుగానే చూద్దామా?

చివరిగా నేను ఒకమాట మీతో పంచుకుంటాను …. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అని చాల గొప్పగా చెప్పుకుంటాము, భావిస్తున్నాము. భారత దేశ సంస్కృతి సంప్రదాయాలు భిన్నత్వంకు ప్రత్యేకత ఉండవచ్చు. స్త్రీలు భిన్నత్వానికి ప్రతీకలా?  మనం రాసుకున్న భారత రాజ్యాంగంను ఏం చేద్దాము? చెప్పండి. కర్మకాండలకు, మత ధర్మప్రచారాలకు వదిలేద్దామా? స్త్రీల శరీరాలను మాంసపు ముద్దలుగానే చూద్దామా? స్త్రీల అంగాలకు వెలకట్టనిద్దామా?

మనం నిశ్శబ్దంగా ఉందామంటే మహిళలను నిరాశపరిచిన వాళ్ళం అవుతాం. చురుకైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలి. మహిళల మనసులలో   ఒక కొత్త విశ్వాసాన్ని నింపాలి. రాజ్యాంగబద్ధమైన కొత్త సంస్కృతితో సమాజాన్ని నిర్మించాలి. మరియం, మహీంద్రా మీతో సంభాషించాలి అనుకుంటున్నారు.

Also read: నాగచైతన్య, సమంతల విడాకులు సరే, అసలు పెళ్ళి నమోదు చేసుకున్నారా?     

-అజీబ

     

అజీబ 

Jaya Vindhyala
Jaya Vindhyala
రచయిత్రి తెలంగాణ హైకోర్టులో న్యాయవాది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో సభ్యురాలు. హైకోర్టు బార్ అసోసియేషన్ ప్యాట్రన్. మెహబూబ్ కా మెహందీ, బాండెడ్ లేబర్ వంటి అంశాలపైన కేసులు వాదిస్తారు. పోలీసుల వేధింపులకూ, పోలీసు కస్టడీలో మరణాలకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అధ్యక్షురాలిగా పని చేశారు. ప్రస్తుతం అదే సంస్థ తెలంగాణ విభాగానికి ప్రధానకార్యదర్శి. నక్సలైట్లకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్య 2004లో జరిగిన చర్చలలో చురుకైన పాత్ర పోషించారు. అసంఘటిత కార్మికుల సమస్యలపై విదేశాలలో జరిగిన సమావేశాలకు హాజరైనారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఎల్ఎల్ బీ చదివారు. న్యాయవాదన వృత్తి అయితే కథలు రాయడం ఆమె ప్రవృత్తి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles