Friday, April 26, 2024

(World’s Wonderful Husbands)ప్రపంచ అద్భుత భర్తలు-3

  • ఆడపిల్లల్ని పెద్ద చదువులు చదివించిన సర్పంచ్
  • ప్రగతి శీలాన్ని జీర్ణించుకోలేకపోయిన గ్రామస్థులు
  • సర్పంచ్ ను తప్పుపట్టి వెలివేసిన పెద్దమనుషులు
  • రేపటి వేగుచుక్క సర్పంచ్ అన్న

సర్పంచులను ఎన్నుకోవటం కొత్తగా రాజకీయాలలో ప్రవేశ పెట్టారు. ఇంకో మాట కూడా ఇక్కడ ప్రస్తావించాలి… కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి గ్రామాలలో ప్రచారంలోకి వచ్చింది. గ్రామాలలోని చోటా మోటా నాయకులు సంతోషంలో  కెవ్వుమంటున్నారు. పట్టణాలతో పాటు గ్రామాలు కల కల లాడుతున్నాయి. స్కూటర్లు, ఇంధనంతో నడిచే రెండు చక్రాల బళ్ళు ప్రతీ ఇంట్లోకి దూసుకెళ్లినవి. అంబాసిడర్, ఫియట్ కంపెనీ కార్లూ గ్రామాలకు వచ్చి పోతున్నాయి. నగర, పట్టణ, గ్రామ రాజకీయాలలో చాలా మార్పులు వచ్చాయి. మిత్ర పక్షాలు (వామ పక్షాల తో పాటు) ఒక్కటైనాయి. కాంగ్రెస్ ను గద్దె దింపాలని ఒకటే గోల. రచ్చ బండ పంచాయతీలు కాస్త పోలీస్ స్టేషన్లో పంచాయతీలు జరిపే రోజులు మొదలయ్యాయి అని కూడా చెప్పవచ్చు. మొత్తం కలిపితే గ్రామాలలో కొంత మార్పులు చేర్పులు జరుగుతున్న నేపథ్యంలో…

ఆడపిల్లలు మెలమెల్లగా స్కూళ్లకు, కాలేజీల బాటపడుతున్న కాలం. ఆడపిల్ల పెళ్ళి చేయాలి అంటే ‘ఏం చదివింది, చదువుతో పాటు వంట వచ్చా .. అత్త మామలను  బాగా చూసుకుంటదా?’ అని అడుగుతున్న రోజులు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆడపిల్లలను పురిట్లోనే  చంపవద్దు, ఆడపిల్లలను చదివించండి అని ప్రచారం చేస్తూన్న కాలం. కొన్ని గ్రామాలకు వేగవంతంగా రోడ్డు సౌకర్యం కూడా కలిపిస్తున్న రోజులు. పెళ్ళి సంబంధాలను చుట్టుపక్కల గ్రామాలలో కూడా చూసే రోజులు…

ఊరి సర్పంచ్  ఆన్న కాంగ్రెస్ పార్టీ లో చాలా ఔత్సాహిక వ్యక్తి. ఇందిరా గాంధీ రాజకీయాలకు బాగా స్ఫూర్తిని పొందిన ఆన్న. ఎవ్వరి ఇంటిలో ఏం కష్టం వచ్చినా తన ఇంట్లోనే కష్టం వచ్చింది అని తన తలపై పెట్టుకొని ఆ కష్టాన్ని మోసే ఆన్న. ఊరికి రోడ్డు వేపించాడు. ఊరిలో 5 వ తరగతి వరకే స్కూల్ ఉంది. పక్క ఊరిలో 10 వ తరగతి వరకు ఉంది. 5 వ తరగతి వరకు చదివిన ఆడపిల్లల చదువు 5 తో  పూర్తయి పెళ్ళిళ్ళు చేసి పంపుతున్నారు. ఆడపిల్లలను  ఇంకా చదివించాలి అంటే పక్క ఊరిలో చదివించాలి. ఎలా? ఆన్న ఆలోచించాడు, తన కూతురితోనే మొదలు పెట్టాడు. సొంతంగా 3 సైకిళ్లను కొని చురుకైన 6 ( తన కూతురితో సహా) మంది ఆడపిల్లలకు సైకిళ్ల ను తొక్కటం నేరిపించాడు. ఒక్కో సైకిల్ పైన ఇద్దరేసి ఆడపిల్లలను ఎక్కించి పక్క ఊరిలోని చదువుకు పంపడం మొదలు పెట్టాడు. వారి వెనక ఆ ఆన్న మరో సైకిల్ వేసుకోని వెళ్లేవాడు. అమ్మాయిలు సైకిళ్ళు వేసుకోని చదువుకు వెళ్తున్నారు అనే విషయం తెలుసుకున్న రెండు ఊర్ల ప్రజలకు ఒక వింతగా అనిపించింది. కొందరు బహిరంగంగానే వ్యతిరేకించారు. మరికొందరు సర్పంచ్ ఆన్నను తిట్టారు. సర్పంచ్ ఆన్నను సొంత కులపోల్లు దూరం పెట్టారు. సర్పంచ్ ఆన్న తల్లి, తండ్రి, భార్య  అవమానంగా భావించినారు. కొన్ని నెలల వరకూ పగటిపూట సర్పంచ్ ఆన్న ఇల్లు దర్వాజనే తెరచుకోలేదు.  ఓ రోజు సర్పంచ్ ఆన్న తండ్రి చనిపోయాడు. కులపోల్లు ఎవ్వరూ చావుకు రాలేదు. కుటుంబ సభ్యులు ఇంకా అవమానంగా భావించినారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చూసీ చూడనట్లు వుండిపోయారు. మొఖం చాటేశారు. మొత్తానికి తండ్రి చావును అయిపోగొట్టాడు. సర్పంచ్ ఆన్న కూతురు తో పాటు చదువుతున్న 5 గురు అమ్మాయీల తల్లి తండ్రులు 10 వ తరగతి తో చదువును అపేసి ఏదో పెళ్ళిళ్ళు చేసి అత్తగారి ఇళ్లకు పంపాలి, ఇంకా చదివించాలి అంటే చాలా కష్టాలను ఎదుర్కోవాలి అనుకున్నారు. అనుకున్నదే తడవుగా సర్పంచ్ ఆన్నతో వారి మనసులోని మాటను చెప్పారు. ఆన్న మౌనంగా విన్నాడు. ఆన్న తల్లీ, ఇన్ని బాధలు పడ్డందుకైన పై చదువులు చదివిస్తేనే బాధలకు ఒక అర్ధం వుంటది అని ముందుకు అడుగు వేయమన్నది. కాలేజీ ఉన్న టౌన్ లో రూమ్ తీసుకోని, పిల్లలకు వంటచేసి పెడతాను, చదువుకొమ్మని  పురమాయించింది. ఆరుగురు అమ్మాయిల్లో ఇద్దరు ఇంటర్తో ఆపేసినారు. ముగ్గురు అమ్మాయిలు డిగ్రీతో ఆపేశారు.  ఒకమ్మాయి విశ్వవిద్యాలయం వరకు వెళ్ళింది. ఆన్న కూతురు మాత్రం కాదు.

Also read: (World Wonderful Husbands) ప్రపంచ అద్భుత భర్తలు-2

డిగ్రీ పూర్తి చేసిన అమ్మాయిలలోని ఒకమ్మాయి కాలేజీలో ఒకబ్బాయి తో కాస్త చనువుగా వుంటుండేది.  దూరపు బంధువు. చుట్టరికం చాలా విచిత్రంగా ఉంది, ఆ అమ్మాయి అక్కను ఆ అబ్బాయి కి దూరపు బంధువు వరుసకు పెదనాన్న కొడుకు కోడలు తమ్ముడికి ఇచ్చి వివాహం చేశారు. కూతురు వరుస. పేరు పెట్టి పిలిసేవాడు. ఇదీ కాస్త దుమారం రేపింది.

తల్లి తండ్రులు ఏదో కష్టపడి టీచర్ ఉద్యోగం చేస్తున్నా ఓ కుర్రాడికి ఇచ్చి పెళ్ళి జరిపించారు. అమ్మాయి తన కంటే మూడు క్లాసులు ఎక్కువ చదివింది అని టీచర్ బాధ. టీచర్ (భర్త) బాధను తగ్గించేందుకు ఆ అమ్మాయి మాట్లాడే మాటలలో ఇంగ్లీష్ ముక్క దొర్లకుండా చూసుకొనేది. భర్త, భర్త నుండి కలిగే పిల్లలకోసం, అత్త మామల కోసం మాత్రమే తల్లీ తండ్రులు చదివించారు అని చెప్పుకొనేది. అయినప్పటికినీ భర్తకు ఎక్కడో అనుమానం. ఓ రోజు గొడవ పడ్డాడు. డిగ్రీ చదివావని నీకు చాలా తల బిరుసు ఉంది అని గొడవ చేశాడు. మరో రోజు కాలేజీలో నీకు “లవర్” వున్నాడట కదా అని గొడవ. ఈ గొడవలు కాస్త పోలిస్ స్టేషన్ వరకు వెళ్లాయి. సర్పంచ్ అన్ననే ముందు నిలబడ్డాడు.. పోలీస్ స్టేషన్ లో అమ్మాయిదే తప్పు అన్నారు. విషయం పెద్దగా కాకుండా ఇద్దరినీ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేపించాడు. తిరిగి (మళ్లీ) సంసారం మొదలు పెట్టారు.

విశ్వవిద్యాలయం వరకు వెళ్ళిన అమ్మాయికి పెళ్లి సంబంధాలు చాలా కష్టం అయ్యింది. ఇంత చదివిన అమ్మాయిని కోడలుగా తీసుకుపోయి ఏం చేసుకోవాలి అని పెళ్ళి చూపులకు వచ్చిన వారు కొందరు మొఖం మీదనే చెప్పి వెళ్ళేవారు. పెద్ద చదువులు వద్దు అంటే నా మాట విన్నారా అని అమ్మాయి నాయనమ్మ ఒక వైపు,  సర్పంచ్ ఆన్న అంటే గిట్టని వాళ్ళు మరొక వైపు సూటి పోటి మాటలతో అమ్మాయి తండ్రిని, తల్లిని, సర్పంచ్ ఆన్నను హింసించి ఆనందించే వాళ్ళు. వీటిని అర్థం చేసుకున్న అమ్మాయి జులాయిగా తిరిగే మేనమామను గుడిలో పెళ్ళి చేసుకున్నది. అమ్మాయి నాయనమ్మ అది పెళ్ళే కాదు, సచ్చిపోతాను అని భయపెట్టింది. అమ్మాయి తల్లి, తమ్ముడికి పిల్లను ఎవ్వరూ ఇవ్వట్లేదు అనే దిగులు పోయింది. కానీ కన్నపేగు కదా, మామను పెళ్లి చేసుకుని ఏం సుఖ పడుతావు అన్నది. తండ్రి కేమో పెళ్ళి చేయలేక పోతున్నాను అనే బాధనుండి బిడ్డ విముక్తి చేసింది అని దేవుడికి దండం పెట్టుకున్నాడు. కొడుకైనా, కూతురైన ఆ అమ్మాయి ఒక్కతే కాబట్టి తల్లీ తండ్రి నాయనమ్మ నోరును మూయించారు. సర్పంచ్ ఆన్న ఒక్కడే ధైర్యంగా ఆ అమ్మాయికి సపోర్ట్ ఇచ్చాడు. టౌన్ లో ఆ అమ్మాయికి లెక్చరర్ ఉద్యోగం వచ్చేటట్టు సహాయ పడ్డాడు.

ఊరి లోని కొందరు పెద్దలు, నాయకులు గా చెలామణి అవుతున్న వాళ్ళు గింత చదువు చదివిన ఆడోళ్ల కు అనుమానించే భర్త, జులాయి భర్త … బాగా దొరికారు. దీనికీ ఇంత చదవాలనా? ఆడోల్లు మగాడి మాట వినకుండా చేస్తున్న ఆ సర్పంచ్ ను అడుగుదాం అని బయలు దేరి వెళ్లారు.

….. అజీబ

Also read: World Wonderful Husbands (ప్రపంచ అద్భుత భర్తలు) -1

Jaya Vindhyala
Jaya Vindhyala
రచయిత్రి తెలంగాణ హైకోర్టులో న్యాయవాది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో సభ్యురాలు. హైకోర్టు బార్ అసోసియేషన్ ప్యాట్రన్. మెహబూబ్ కా మెహందీ, బాండెడ్ లేబర్ వంటి అంశాలపైన కేసులు వాదిస్తారు. పోలీసుల వేధింపులకూ, పోలీసు కస్టడీలో మరణాలకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అధ్యక్షురాలిగా పని చేశారు. ప్రస్తుతం అదే సంస్థ తెలంగాణ విభాగానికి ప్రధానకార్యదర్శి. నక్సలైట్లకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్య 2004లో జరిగిన చర్చలలో చురుకైన పాత్ర పోషించారు. అసంఘటిత కార్మికుల సమస్యలపై విదేశాలలో జరిగిన సమావేశాలకు హాజరైనారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఎల్ఎల్ బీ చదివారు. న్యాయవాదన వృత్తి అయితే కథలు రాయడం ఆమె ప్రవృత్తి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles