Thursday, April 25, 2024

ప్రపంచ అద్భుత భర్తలు(World Wonderful Husbands) -5

కార్ల్‌మార్క్స్‌, మావో , లెనిన్ , స్టాలిన్ …. లేకపోతే చేగువీర … ఇంకా భగత్ సింగ్ .. ఆజాద్ చంద్ర శేఖర్, సుభాష్ చంద్ర బోస్.. ఇంకా కొంత దూరం నడుస్తే మహాత్మా గాంధీ , నెహ్రు … లోక్ నాయక్ జయ ప్రకాష్ నారాయణ్ .. రామ్ మనోహర్ లోహియా .. ఇందిరా గాంధీ .. పూలే, సావిత్రి పూలె, పెరియార్, డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్, సరోజినీ నాయుడు, జాకిర్ హుస్సేన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం  … వగైరా వగైరా పేర్లను నాయకుల నోటి నుండి ప్రజలు  వింటూ ఉంటారు. కమ్యూనిస్టులు కమ్యూనిస్టులను అనుసరించే వారు వారి నాయకుల పేర్ల గురించి చెపుతారు. వారిని  కొందరు అనుసరిస్తారు. వారే వారి పేర్లను వింటారు. విప్లవ రాజకీయాలకు చెందిన నాయకులు వారికి చెందిన నాయకుల గురించి చెపుతారు, వారిని అనుసరించే వారు వారి గురించి వింటారు. ఓటు హక్కు రాజకీయాల గురించి చెప్పే నాయకులూ వారి వారి నాయకుల గురించి వారిని అనుసరించే వారికి చెపుతారు, వారే వింటారు. మతానికి చెందిన నాయకులు, మత పెద్దలు  వారి వారి మతానికి చెందిన మత నాయకుల గురించి చెపుతారు, ఆయా మతాలకు చెందిన వారు, వారిని అనుసరించేవారు  వింటారు. కానీ, ప్రజలకు ఏం కావాలి .. ఏ ఏ నాయకులు ఏం చేసారు .. ఏం చేస్తారు అనేది ఆయా రాజకీయ పార్టీల నాయకులు చెప్పారా? లేదు అనే విషయం మీరందరూ నేడు చూస్తూనే, వింటూనే ఉన్నారు. ఈ విషయం మహిళా నాయకులకు చాలా అనుభవం ఉన్నది. 

Also read: (World’s Wonderful Husbands) ప్రపంచ అద్భుత భర్తలు-4

 ఇటీవల నెలకొన్న సంఘాలు ఎన్నో!

కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, యువజన సంఘాలు, కుల సంఘాలు, అస్తిత్వ పోరాటాల సంఘాలు, ఉప -కుల సంఘాలు ఇలా చాలా సంఘాలు 1990 తరువాత ఈ సమాజంలో ఎన్నో నెలకొన్నాయి. అలానే మానవ సంబంధాలలో, స్త్రీ -పురుష సంబంధాలలో  కూడా విపరీతమైన మార్పులు వచ్చాయి. మానవ సంబంధాలలో మార్పులు వచ్చాయి అనేకంటే “మానవ సంబంధాలు మార్పుకు చాలా  గురైనవి” అనటం ఉత్తమం. మానవ సంబంధాల గురించి చాలా సందర్భాలలో ” ఉమ్మడి కుటుంబాలలో ఉన్న ప్రేమలు -ఆప్యాయతలు ఇప్పుడు కరువైనవి / లేవు ” అని వారి బాధలను వ్యక్తం చేస్తున్న వారు కోకొల్లలు. ఈ రకమైన మాటలు చెప్పే వాళ్ళు బేసికల్లి “అభివృద్ధి” అనే పదానికి ఇచ్చే అర్ధం “పరిమితం” చేసి మాట్లాడటమే. ఎందుకంటె సమాజ నిర్మాణం జరగకుండా అభివృద్ధికి అర్ధం ఇవ్వటం కుదురదు. ఇది అర్ధం చేసుకోకుండానే .. మా కాలంలో ఇలా ఉండేది కాదు – ఆలా ఉండేది కాదు అని అనుకోవటం / చెప్పటం  భౌగోళికంగా ఇప్పటివరకు వచ్చిన మార్పును ఒకవైపు ఆస్వాదిస్తూ .. మరోవైపు “గతం” లా ఉండాలి అనే వారిని సాంప్రదాయవాదులు  అని ఒక్క మాటతో సరిపెట్టుకుందామా? సమస్య ఇదే? దీన్ని ఎలా అధికమించాలినో చెప్పకుండా “గతం” బాగుండే అని ఒక్క మాటతో “మానవ సంబంధాలనే” గందరగోళం చేస్తే ఎలా. మా నాయనమ్మ ఆమె చిన్నప్పటి రోజులు బాగున్నాయి అంటది. ఆమె తండ్రి ఆయన చిన్నప్పటి రోజులు బాగున్నాయి అని చెపుతారు. ఆమె కొడుకులు కూతుళ్లు వారి చిన్నప్పటి రోజులు బాగున్నాయి అంటారు. వీరి పిల్లలు వారి చిన్నప్పటి రోజులు, ఆనాటి వంటలు, తినే పదార్థాలు బాగున్నాయి అంటారు. అయితే నాయనమ్మ కాలం నాటి స్థితే నేడు సమాజంలో ఉన్నదా? లేదు. కాలి నడక నుండి వాహనాలను నడుపుకుంటూ తిరిగే స్థితిలోకి వచ్చాము. దీన్ని మార్పు అందామా ? అభివృద్ధి అందామా? ఇంత చేంజ్ వస్తున్నప్పుడు, మానవ సంబంధాలలో, స్త్రీ – పురుష సంబంధాలలో మార్పు రావటం  కూడా సహజమే కదా ? అయితే ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనేదే  నేడు ఎదురౌతున్న సమస్య, దీని గురించి మాట్లాడకుండా, పరిష్కారం చెప్పకుండా “విమర్శ” చేస్తూ పోతే ప్రజల జీవన స్థితి ఏంటి? అందులో ముఖ్యంగా స్త్రీల పరిస్థితి? సమస్య ఆయుధం అయితే మరి పరిష్కారం? పరిష్కారం కూడా ఆయుధమే గా. సమస్య – పరిష్కారం రెండిటికీ ఆయుధం కావాలి. ఇక్కడ  ఆయుధం అంటే ‘గన్’ కాదు “ఓటు” .. అప్పుడే ఈ అష్ట వంకల సమాజాన్ని “సెట్ రైట్” చేయగలం.. ఏమంటారు మీరు?

Also read: (World’s Wonderful Husbands)ప్రపంచ అద్భుత భర్తలు-3      

 ఆడవాళూ, మగవాళ్ళూ, విలువలూ

బహిరంగ సభలో సామాజిక రాజకీయ  కార్యకర్త ‘ఆడవాళ్లు – మగవాళ్ళు – విలువలు’ అనే విషయం పై నటరాజన్ మాట్లాడుతున్నాడు. ఆయన తరువాత ‘దేవదాసీ వ్యవస్థ – సమాజం – రాజకీయాలు’ అనే విషయంపై సుమాలిని అక్క మాట్లాడాల్సి ఉంది. సభకు వచ్చిన వాళ్ళు నటరాజన్ ఉపన్యాసానికి మంత్రముగ్ధులై వింటున్నారు. ఊహించినదానికన్నా ఎక్కువమంది వచ్చారు. ఈ సభ ఒక “మేధావుల” సభగా నిలుస్తుందని నిర్వాహకులు అనుకున్నారు. అయితే అన్ని వర్గాల వారు వచ్చారు. సుమాలిని అక్క క్షేత్ర స్థాయిలో కూడా పనిచేస్తుంది. అందుకే రైతులు – కార్మికులు కూడా వచ్చారు. ఒక్కసారి నటరాజన్ స్వరం దద్దరిల్లింది. ఒక్కసారి “సెక్స్” అంటే మీరేమనుకుంటున్నారు. ప్రజల జీవితాలకు – ప్రభుత్వాలకు మధ్య ఉండే అవినాభావ సంబంధం ఎలానో ” సెక్స్ కు – స్త్రీ -పురుషుల జీవితాలకు” మధ్య  అవినాభావ సంబంధం ఉంటది. ప్రతీధీ కొన్ని “విలువలను – కమిట్మెంట్స్ ను – వాగ్దానాలను” కలిగి ఉంటది. ప్రేమ అంటే సెక్స్, సెక్స్ అంటే కోరిక (లస్ట్), కోరిక అంటే ఇష్టం (లైక్), ఇష్టం అంటే జీవితం. జీవితం అంటే “రాజకీయాలు – బ్రతుకు పోరు” ఈ బ్రతుకు పోరులో ఆడ – మగ మధ్యన ఆకర్షణ ఉంటది. ఈ ఆకర్షణకే “విలువలు” ఉండాలి. గతం గురించి ఒక్క విషయం చెపుతాను “ఆడ -మగ” మధ్యన ఎలాంటి కట్టుబాట్లు లేవు కానీ “స్త్రీలను” జంతువుకన్నా “హీనమైన” జాతిగా చూడబడింది. స్త్రీల గురించి కొన్ని వేల సంవత్సరాల నుండి పోరాటం చేయగా – చేయగా నేడు ఒక మనిషిగా కొంచెం గుర్తింపు పొందింది. దీనికి అందమైన పేరు “స్త్రీల సంస్కృతి – సాంస్కృతి”. స్త్రీలను “కులపరంగా – మత పరంగా – ప్రాంతాల వారీగా” వారిని చూడటం మరొక సంస్కృతి. స్త్రీలను సంపూర్తిమనిషిగా చూడాలని ఇంకా ఎన్నో పోరాటాలు – సంస్కరణలు, సమూల మార్పుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మనం ఈరోజు ఈ సభను జరుపుకుంటున్నాం అంటే పోరాటమే. స్త్రీలను బజారులో పెట్టి అమ్మిన దినాలు ఉన్నాయి. స్త్రీలు బానిసగా మౌనంగా భరించిన గతం ఉంది. ఎన్నికలలో ఓటు వేసే అర్హతకోసం పోరాటం చేసిన గతం ఉన్నది. స్త్రీలను ఒకవైపు దేవతలుగా పూజిస్తూ, మరొక వైపు స్త్రీలు సైతానులతో సమానం అన్న గతం ఉన్నది. ఒకే స్త్రీని వంతులవారీగా మగాళ్లు అనుభవించిన గతం ఉన్నది. ఒక మగాడు ఎంతమంది స్త్రీలనైనా మనువాడవచ్చు అన్న గతం ఉన్నది. స్త్రీలలో చైతన్యం వస్తున్నప్పటికినీ ఇప్పటికినీ 5 గురు భార్యలను కలిగివుండటం మా మత “సంస్కృతి” అంటున్న మతమౌఢ్యులు ఉన్నారు. ఇప్పుడు మీదృష్టికి ఓ విషయాన్ని తీసుకరావాలనుకుంటున్నాను … ఈ విషయం పై  సుమాలిని అక్కతో కూడా ఆలోచించాను. తాను కూడా అది వారి సంస్కృతి అంటున్నారు .. మీతో ఆ విషయం పంచుకోవాలనుకుంటున్నాను ..  సభ నిశ్శబ్దంగా సాగుతోంది.

Also read: (World Wonderful Husbands) ప్రపంచ అద్భుత భర్తలు-2

‘నువ్వు మీ నాన్నలా కాకూడదు’

నేను పుట్టింది ఓ పట్టణంలో. మా కుటుంబం ఆర్థికంగా బాగా కలిగిన కుటుంబం. సామాజికంగా – రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబం. అమ్మ ఒక విషయం ఎప్పుడూ నాతో  చెప్పేది “నీవు మీ నాన్నల కాకూడదు” అని, అప్పుడు అర్ధం అయ్యేది కాదు. మా నాయినమ్మను అమ్మ చెప్పే మాటల గురించి చెపితే .. మీ అమ్మ ఒక పిచ్చిది. మగాడు అంటే మీ నాన్ననేరా మనవడా అనేది. అమ్మకు – నాన్నమ్మకు తేడా తరువాతి రోజులలో అర్ధమయ్యింది. నాకు అమ్మ ఒక్కతే కాదు ఇంకా ఇద్దరు అమ్మలు ఉన్నారని. అమ్మను నాన్న చాలా బాగా చూసుకొనే వారు. ఏదానికి లోటు లేకుండా చూసుకొనే వారు. రాత్రులు ఎప్పుడో వచ్చేవారు. అమ్మ తినకుండా అలానే గడపలో ఎదురు చూడాలి లేకపోతే నాయనమ్మకు కోపం వస్తది. మరికొన్ని రోజులకు అర్ధమయ్యింది నాన్నకున్న పలుకుబడితో కొందరి  ఆడవాళ్లను లోబరచుకొనే వారని. ఆ ఆడవాళ్లు కూడా అది తప్పు అని భావించే వారు కాదు. దేవుడి సమానవంతమైన మనిషి అడుగుతే “కాదనకూడదు” అనే సంస్కృతిని కలిగివున్న మహిళలు వారు. నాన్నతో కలిసి పడుకోవటం గొప్ప అదృష్టంగా ఆ మహిళలు భావించేవారు. ఈ విషయం చాలా బహిరంగంగా వారు మాట్లాడుకొనే వారు. అమ్మకు ఇవి నచ్చేవి కావు. ఓ రోజు అమ్మ మమ్మల్ని వదిలి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయింది. నాయనమ్మ “ఆడపురుగు” ఇంట్లో ఎప్పుడూ తిరుగుతుండాలని అమ్మ వెళ్ళిపోయిన వారం రోజులకే నాన్నకు మరో పెళ్లి చేసింది. నాయనమ్మ ఆడవాళ్లు “పురుగులతో’ సమానం అనేది. వచ్చిన అమ్మ నాయినమ్మ ఏం చెప్పినా అదే తూచా తప్పక వినేది. అది ఆమె సంస్కృతి ? .. నేను ఇంటినుంచే స్త్రీలను అగౌరవ పరిచే ప్రతీ విషయాన్ని బహిరంగంగా వ్యతిరేకించటం మొదలు పెట్టాను. స్త్రీల గురించి ఎన్నో పుస్తకాలను చదివాను. మా పట్టణం మొత్తం నాకు బాగా గుర్తింపు వచ్చింది. ఈ గుర్తింపు ఎంతలా అంటే ” భర్తతో బ్రతకటం కష్టం” అని భావించిన మహిళలు అందరూ నన్ను ప్రత్యక్షంగా కలిసి వారికి వచ్చిన కష్టాలను చెప్పుకునేంతగా.

Also read: World Wonderful Husbands (ప్రపంచ అద్భుత భర్తలు) -1

నా భర్త రెండో పెళ్ళికి మొగ్గు చూపుతున్నాడు

ఒక మహిళ కలిసి “భయ్యా నేను డాక్టర్ చదివి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను. పెళ్లి అయ్యింది. ఒక పాప. మా ఆయన కూడా  ప్రభుత్వ ఉద్యోగి. మా మతం ఆచారం ప్రకారం మగవాళ్ళు 4 భార్యలను కలిగివుండవచ్చు. కానీ మేమిద్దరం బాగా చదువుకున్న వారిమీ, బాధ్యతకలిగిన ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నాము. అయినా నా భర్త  రెండవ పెళ్ళికి మొగ్గుచూపుతున్నారు అని కన్నీళ్లు పెట్టుకుంది. తన భర్తకు ముగ్గురు అన్నలు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. అందరూ వ్యాపారం చేస్తున్నవారు. బాధితురాలు, బాధితురాలి భర్త మాత్రమే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. తనను ఉద్యోగం మానిపించాలని చాలా బాధలు పెట్టారు. ఆమె అత్తమ్మ అయితే ప్రతీ పనికి వంకలు పెట్టేది. ఆ బాధితురాలు మూడు సార్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఉద్యోగం మానేస్తే అన్ని బాధలు పోతాయి అని ఆ బాధితురాలికి ఉచిత సలహా ఇచ్చారు. మరియు ఉద్యోగం మానేసి అత్త -మామలకు సేవ చెయ్యమని చెప్పారు. ఇప్పుడు మరో సమస్య ఆమెకు వచ్చింది. భర్తకు రెండవ పెళ్లి అత్తా – మామలు జరిపిస్తున్నారు అని ఆ బాధితురాలు పోలీసులను ఆశ్రయిస్తే ..  “మీ మతంలో రెండవ పెళ్లి మామూలే. మేం ఏం చేయలేం’’ అని చేతులెత్తేసారు. ఆ బాధితురాలు రెండవ పెళ్లిని ఆపమని నా సహాయం కోరింది. ఈ దేశంలో పుట్టిన ప్రతిఒక్కరికి భారత రాజ్యాంగం ప్రకారం వచ్చిన చట్టాలే వర్తిస్తాయి. ఏ చట్టాలు వర్తించం .. ఇది మీకు తెలుసా ? ఇదే విషయం పోలీసులకు చెప్పాను,  కేసు పెట్టలేమన్నారు. పోలీసులు ఏదో సాకులు చెప్పారు, పై అధికారుల దృష్టికి ఈ విషయం తీసుకవెళ్ళాము, కొట్లాడాము అప్పుడు  పోలీసులు కేసు పెట్టారు. అయితే  ఆ ఆడకూతురును ఇంట్లో నుండి అత్తా -మామలు – భర్త కలిసి గెంటివేసారు. బాధితురాలికి పాపను కూడా ఇవ్వలేదు.

Also read: నాగచైతన్య, సమంతల విడాకులు సరే, అసలు పెళ్ళి నమోదు చేసుకున్నారా?

వారి మతంలో ఇంకా సంస్కరణలు రాలేదు

సుమాలిని అక్కకు ఈ విషయం చెపితే “వారి మతంలో సంస్కరణలు ఇంకా  రాలేదు” వారికి సపరేట్ చట్టం ఉంది. వారు 5 పెళ్లిళ్లు చేసుకోవచ్చు. ఇందులో ఏం చేయలేము’’ అన్నారు. సభలో ఉన్న మీరందరూ ఈ లజ్జాకరమైన విషయం పై  ఏమంటారు? మనం ఏం చేయలేమా? చూస్తూ – వింటూ తలదించుకొని వెళ్లిపోదామా ? మన అభ్యుదయంకు సంకెళ్లు వేసుకుందామా ? సభ మొత్తం ఒక్కసారి గోలగోలగా మారింది. మీరు అనవసరమైన వాటిల్లో తల దూరుస్తున్నారు అనే గొంతులు సభలో నుండి  వినిపించాయి, మరి కొన్ని గొంతులు ఏం చేద్దామో చెప్పండి అన్నారు … ఇంకా కొన్ని గొంతులు ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే ప్రభుత్వాలు ఉన్నన్ని రోజులు ఇది తప్పదు అన్నారు.

పురుషులకూ, మహిళలకూ విలువలు వేరువేరుగా ఉండవు

మీ అందరికీ మరొక విషయం చెప్పాలనుకుంటున్నాను .. ఎంతో విజ్ఞానాన్ని , వైజ్ఞానాన్ని అందుకుంటున్న రోజులు ఇవి,   వేగంగా పరుగెడుతున్న  రోజులలో మనమందరం  ప్రయాణిస్తున్నామ్.. . స్త్రీలు కూడా అందులో భాగస్వాములే .. వారి భాగస్వామ్యం లేకుండా ఈ వేగవంతమైన రోజులు “అభివృద్ధి” పథంలోకి వెళ్ళలేవు… కారణం ఏదన్నాగాని, నేడు  స్త్రీల జీవన విధానం – పురుషుల జీవన విధానాలను వేరు వేరుగా చూడటం అభివృద్ధి కానే కాదు. విలువలు అనేది స్త్రీలకు వేరుగా, పురుషులకు వేరుగా ఉండవు. స్త్రీలింగం విలువ – పులింగం  విలువ  అని విడదీసి చూస్తే నేటి వైజ్ఞానిక పరిభాషలో “విలువ రేట్ గా కన్వర్ట్ ” అయిపోతుంది. ఇది మానవ సమాజానికే పెద్ద విఘాతం. భౌగోళికంగా ‘మార్పు’ సహజం అనుకుంటే మానవ సంబంధాలకు విలువలను జోడించాలి. స్త్రీలకు సపరేట్ – పురుషులకు సపరేట్ “విలువలు” అంటే కుదురదు. సమాజ నిర్మాణంలో  స్త్రీ -పురుషుల మధ్య సమానత్వం రావలసిందే. లేకపోతే మా అమ్మ జీవితం, బాధితురాలు ఆడకూతురు లా ఉంటది. వీటికి అంతం చెప్పాలి.  ఎలా ఉండాలినో – ఎలా ఉండకూడదో చెప్పటం మాత్రమే జవాబు కావాలి. స్త్రీ – పురుషుల మధ్య జనించే ప్రేమే విలువలను శాసించేది గా ఉండాలి. అప్పుడే ఇది సమాజ నిర్మాణంలో భాగం అయిపోతది. నిరంతరం ఇది ఒక ప్రవాహం .. ఎప్పటికప్పుడు “ఆర్థిక, రాజకీయాల”ను బట్టి “ప్రేమ – విలువలు” మారుతాయి. నా భార్య మరియం ఈ సభలోనే ఉంది. రెండు దశాబ్దాల నుండి నన్ను, పిల్లలను, ఇంటిని జాగ్రత్తగా చూసాను అంటుంది. ఇప్పుడు రాబోవు తరం కోసం పనిచేస్తాను, సమాజ నిర్మాణంలో భాగస్వామిని అవుతాను అంటుంది.. సభ ఒక్కసారి చప్పట్లతో దద్ధరిల్లింది. మరియం ఎందుకోసం పనిచేయాలి అనుకుంటుందో తానే మీ అందరితో తన భావాలను పంచుకుంటది. సుమాలిని అక్క ఏం చెబుతాదో విందాం. దేవదాసి వ్యవస్థ ఇంకా ఈ 1990 లో  ఉందా ? దీనికి రాజకీయాలు ఉన్నాయా ? లేక రాజకీయాలలో దేవదాసి వ్యవస్ధ ఉందా ?

Also read: న్యాయమూర్తులను ప్రశ్నించడమే కోర్టు ధిక్కారమా?

…… అజీబ

Jaya Vindhyala
Jaya Vindhyala
రచయిత్రి తెలంగాణ హైకోర్టులో న్యాయవాది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో సభ్యురాలు. హైకోర్టు బార్ అసోసియేషన్ ప్యాట్రన్. మెహబూబ్ కా మెహందీ, బాండెడ్ లేబర్ వంటి అంశాలపైన కేసులు వాదిస్తారు. పోలీసుల వేధింపులకూ, పోలీసు కస్టడీలో మరణాలకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అధ్యక్షురాలిగా పని చేశారు. ప్రస్తుతం అదే సంస్థ తెలంగాణ విభాగానికి ప్రధానకార్యదర్శి. నక్సలైట్లకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్య 2004లో జరిగిన చర్చలలో చురుకైన పాత్ర పోషించారు. అసంఘటిత కార్మికుల సమస్యలపై విదేశాలలో జరిగిన సమావేశాలకు హాజరైనారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఎల్ఎల్ బీ చదివారు. న్యాయవాదన వృత్తి అయితే కథలు రాయడం ఆమె ప్రవృత్తి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles