ఈరోజు 1 – 12 – 2023 శుక్రవారం పొన్నూరు లుంబిని వనంలోనిఅంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ కు కారంచేడు బాధితుల కాలనీ చీరాల విజయనగర్ నుండి కారంచేడు బాధితుల కమిటీ దుడ్డు భాస్కర రావు గారు, ఎస్. భగత్ సింగ్ గారు తేళ్ల దేవదానం గారు, మరి కొందరు వచ్చారు. అస్పృశ్యుని యుద్ధ గాథ రెండో భాగం ద్వితీయ ముద్రణను ఆవిష్కరించారు. కారంచేడు ఉద్యమ చరిత్ర భారతదేశ చరిత్రలో పోరాట ఘట్టాలను రక్తాక్షరాలతో లిఖింపదగినదని, కారంచేడు ఉద్యమ నేపథ్యాన్ని ఆలోచిస్తే కమ్మవారు రెండు, మూడు వందల సంవత్సరాల క్రితం వలస వచ్చిన సాయుధ భూస్వామ్య ఆధిపత్య ముఠాలని తేలిందని, అందుకే వీళ్ళు మూడు జిల్లాల్లోనే కేంద్రీకృతమై ఉన్నారని, అప్పటికి వ్యవసాయదారులుగా ఉన్న మాల, మాదిగ వంటి కులాల మీద సాయుధ దాడులు చేసి , భూములు ఆక్రమించి వీరినే కూలీలుగా మార్చారు. స్వాతంత్రోద్యమం తర్వాత వీరిలోకి విద్య ప్రవేశించి చైతన్యం వచ్చి, మూడవ తరం ఎదురు తిరిగే సరికి సాయుధంగా గుంపు దాడులు చేయడం ప్రారంభించారని, వీరి పైన ఉద్యమ క్రమంలో తిరుగుబాటు చేసిన పోరాట గాథ ఈ అస్పృశ్యుని యుద్ద గాథ అని, ఇది ప్రతి దళిత బహుజనుల ఇంటిలో ఉండవలసిన గ్రంథమని, ఈ గ్రంథం ద్వారా కమ్మ ,రెడ్డి వెలమ, క్షత్రియుల నిజ స్వరూపం మనకు తెలియ వస్తుందని, అందుకే ప్రతి ఒక్కరూ ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసి నూతన చైతన్యాన్ని పొందవలసిన చారిత్రక సందర్భమని ఉద్భోదించారు.
ఈ సందర్భంగా దుడ్డు భాస్కరరావు గారు మాట్లాడుతూ నీతికి, నిజాయితీకి కత్తి పద్మారావు అన్నగారు నిలువెత్తు సాక్ష్యం అని, రక్తపు మడుగులోంచి వచ్చిన వారికి 50 ఎకరాల కాలనీ నిర్మించి, ఉద్యోగాలు ఇప్పించి, భూములు ఇప్పించి, ఆత్మగౌరవ పోరాట కాలనీగా విజయనగర్ కాలనీ రూపొందించారు అని, అక్కడ చనిపోయిన వారి సమాధులకు రుధిర క్షేత్రమని , విజయానికి గుర్తుగా బాధితుల కాలనీకి విజయనగరం అని పేర్లు పెట్టి చిరస్మరణీయం చేశారని, కత్తి పద్మారావు అన్నగారి మేలు దళితులు ఎప్పటికీ మరిచిపోరని అన్నారు. ఇప్పుడు మళ్లీ ఒక కొత్త ఇండస్ట్రీని ఆ కాలనీలో రూపొందించే ప్రయత్నం కోసం కత్తి పద్మారావు అన్న గారిని కలిశామని, అందరం కలిసి పోరాడి మళ్లీ దాన్ని సాధిద్దామని అన్న చెప్పారని దుడ్డు భాస్కరరావు గారు అన్నారు. ఈ సమావేశంలో తేనీటి విందు జరిగింది. ఈ సమావేశంలో డక్కుమళ్ళ సంధ్యారాణి గారు, గేరా శ్రీ రంజని గారు, కట్టా సృజన గారు, దళిత స్త్రీ మేధావి సుకన్య గారు పాల్గొన్నారు. ఈ సమావేశం ప్రేమ పూర్వకంగా, కృతజ్ఞతలతో, నూతన ఉత్సాహంతో జరిగింది – దళిత మీడియా