Monday, April 29, 2024

అణచివేతకు అద్దంపట్టిన గుఱ్ఱంజాషువా గబ్బిలం

సత్కవి గుఱ్ఱం జాషువా డా॥ బాబాసాహెబ్ అంబేడ్కర్ సమకాలికుడు. అంబేడ్కర్ కంటే నాలుగేళ్ళు చిన్నవాడు. అస్పృశ్యతను చవిచూసిన ఈ కవివరేణ్యుడు తన ఖండ కావ్యం ‘గబ్బిలం’లో నాటి సామాజిక వ్యవస్థ మూలాలను, అమానవీయ దౌష్ట్యాన్ని కరుణారస భరితంగా వర్ణించి సాహిత్య వేదికపై మానవజాతిని మేలుకొల్పిన సంఘసంస్కర్త. మరీ ముఖ్యంగా అరుంధతీయుల ధుర్భర జీవనగతులను ప్రశ్నించే ‘చైతన్యంతో అనుసంధించి సమర సతాత్మక ప్రభోదంతో, సమాజాన్ని తట్టిలేపిన విశ్వనరుడు’. జాతీయోద్యమం స్పూర్తితో దేశభక్తి కొత్తపుంతలు తొక్కుతున్న సమయాన పేదల పక్షాన నిలబడ్డ దార్శనికుడు.

చిట్టి ‘చందమామ’ కథలతో సంతృప్తిచెందే చిన్నతనంలో ఆత్రంగా చదివిన ఉన్నవ లక్ష్మి నారాయణ ‘మాలపల్లి’, గురజాడ ‘కన్యాశుల్కం’, బోయి భీమన్న ‘పాలేరు’, జాషువా ‘గబ్బిలం’ వంటి సాంఘీక నవలలు, నాటికల సారాన్ని పునఃశ్చరణ చేసుకుని సారాన్ని సంగ్రహించటానికి ఆరు పదుల వయస్సు మీద పడిన తరువాత గానీ సాధ్యపడలేదు. ‘కోవిడ్-19’ బలవంతంగా రుద్దిన విరామ సమయంలోనే ఈ పుస్తక పఠనం వీలైంది. పని వత్తిడి, అనవసరమైన తిరుగుడు లేదు కదా!

కుల వ్యవస్థను, సామాజిక అంతరాల్ని నిరసిస్తూ వెలువడిన సాహిత్యానికి శతాబ్దాల చరిత్ర వుంది. పాల్కురి సోమన, యోగి వేమన, దున్నా ఇద్దాసు, పోతులూరి వీర బ్రహ్మం, నారాయణ గురు, చొక్కామేళ ఇత్యాది విముక్త దక్షిణ భారతదేశాన సామాజిక పరివర్తనదిశగా తమదైన ముద్ర వేశారు. ఈ పరంపరను ఉత్తరాదిన కూడా సంత్, సాధువులైన రవిదాసు, కబీరు, తుకారాం వంటి సంఘ సంస్కర్తలు కులాధిపత్యాన్ని నిలదీశారు. ఈ వరవడిలో స్వానుభవంతో జాషువా కవి శత్రువును సైతం క్షమించాలనే బౌద్ధ సుగుణం ఇతని పద్యాల్లో మరింత వెలుగు చూపింది స్వాతంత్రోద్యమ సమయాన దేశ భక్తి మెండుగా, తెలుగు కవితా వేదికగా.

శ్రీకృష్ణదేవరాయల ఎడబాటు నాలుదిక్కులా, సాహితీ చీకట్లు కమ్మిన సమయాన, తెలుగు కవితా సరస్వతి దారి బత్తెంతో తంజాపురం వైపు వలసపోయిన వేళలో, అపర రాయలైన రఘునాథరాజు తన ఆస్థానంలో ఆశ్రయం ఇచ్చిన వైనం జాషువా కవి వర్యుడు తన ఈ ఉద్గ్రంధంలో వర్ణించిన తీరు అజరామరం. చేమకూర వెంకట కవి తెలుగనే పద్మాక్షికి రెండర్థాల మాటలు నేర్పిన సమయం అది. ముద్దు పళని ముద్దులొలికే తన కవిత్వంతో కొంగు చాటు లేని శృంగారానికి తెర లేపిన వేళయది. మువ్వ గోపాలుణ్ణి స్తుతించటానికి క్షేత్రయ్య కలం పట్టుకున్న తరుణమది.

ఈ సాహిత్య నేపథ్య నిలువుటద్దంలో బాసటగా, రఘునాధుడి ఏలుబడిలో తంజావూరుకు దక్షిణాన నివాసమేర్పరుచుకున్న ఒక అరుంధతీయుడు, అతడు గర్భ దరిద్రుడు, తన ఊరట లేని దీనావస్థను స్నేహ పూర్వకంగా ఓ పక్షి (గబ్బిలాని) కి వివరించే వృత్తాంతమే ఈ ‘గబ్బిలం’ జాషువా కావ్య కృతి.

కుల మదంతో పొగరెక్కిన ఈ సమాజంలో, పురుగు, పుట్ర కాక పేదలకు ఆప్తులు, ఆత్మీయులు ఎవరున్నారని ప్రశ్నిస్తూనే, అతని గోరువెచ్చటి కన్నీటికి చక్రవాక పక్షులతో వ్యాఖ్యానం పలికించటం మానవతావాదిగా జాషువా కవికే చెల్లింది.

కావ్య నాయకుడిగా చెప్పుకోవలసి వస్తే, ఈ అరుంధతీయుడు భారత మాతకు పుట్టిన కడగొట్టు బిడ్డ, మూల వాసి, అందరికీ నాల్గు దిక్కులుంటే, ఏ దిక్కూ, మొక్కులేని దీనుడితడు. సవర్ణులు ఈతనికి ఎన్నో మనోః క్లేశాల్ని మిగిల్చినా, ఏనాడూ వారికి ఎదురు తిరగాలని అనుకోలేదు. పై పెచ్చు వారి పాదాలు కంది పోకుండా చెప్పులు కుట్టి ఇస్తాడు. ఈతడు మాత్రం చెప్పులు తొడుక్కుని సాటి నరుని కంట పడరాదు. ఈతడు ఆలయాన్ని తాకితే త్రిమూర్తులు కూడా ఉపవాసం ఉండవల్సిందే. ఈతని తలకు నులిమిన బురదను ఆకాశ గంగ కూడా కడగలేక పోతుంది. ఈతడు చేసిన సేవకు యావత్తు భారతావని అప్పు పడిందని వాపోతాడు జాషువా కవీంద్రుడు హైందవ సమాజ హితునిగా,

కులం లేని పేదవాడిగా, పుట్టు బానిసగా బ్రహ్మచర్యదీక్షపూనిన ఈ అరుంధతీయుడు, పగలంతా రెక్కదించి, సూర్యుణ్ణి సాగనంపి తన గూటి (గుడిశ) కి చేరి, కాసిన్ని గంజి నీళ్ళు త్రాగి, నిద్రకై కుక్కి మంచంపై మేను వచ్చినాడు ఒకనాడు.

ముక్కూ, ముఖం లేని చీకటి ముద్దలాగవున్న గబ్బిలం (పక్షి) ఒకటి అటు తిరుగాడుతూ వచ్చింది గుడిశెలోకి, దాని రెక్కల గాలికి ఈతని ఇంటవున్న ఆముదపు ప్రమిదవున్న చందంగా కొండెక్కింది. చీకటిలో దయ్యపు పిల్లలాగా తిరుగుతున్న ఆ తాపసి పిట్టను చూచి, ఈతనిలో కొత్త ఊహలు మొగ్గతొడిగి చిగురించటం ఊహాతీతం. ఆ గబ్బిలాల రాణికి స్వాగతం పలుకుతూ పవిత్ర ఆలయాల్లో తిరుగాడే నీవు, ఈ అంటరాని వాడి ‘నిషిద్ధ’ గృహానికి వస్తే ఈ లోకం నిన్ను కూడా బహిష్కరిస్తుందేమో? “ఇది హృదయం లేని లోకం సుమీ!” అంటూ హెచ్చరిస్తాడు.

“జంతు ధర్మం, పక్షి ధర్మం నీలో వున్నాయని ఇప్పటికే ఈ లోకం నీ ముఖం చూడదు. ఈ నిరుపేదకు అలాంటి పట్టింపులు లేవు. ఈ కాళరాత్రి నా గుండె దిగులు పోగొట్టి, ఆ త్రిశూలధారికి నా ఈ సందేశాన్ని చేరవేద్దువు గానీ, ఆలయంలో తల క్రిందులుగా వేలాడేటప్పుడు శివయ్య చెవికి కాస్త దగ్గరగా వున్నపుడు, పూజారి లేని వేళలో, నా దీనవస్తాను వినిపించు స్వామికి, పూజార్లు వింటే నీకు ప్రాయశ్చిత్తం చేసేరు సుమీ!” అంటూనే, ఇక్కడ బ్రహ్మాది దేవుళ్ళు ధనం గలవాడి అదుపాజ్ఞలో బందీలయినారని వాపోతాడు ఈ అరుంధతీయుడు.

ఈ గ్రంధం (గబ్బిలం) కేవలం కవిత్వం కాదు. ఒక అస్పృశ్యుడి ఆర్తనాదం. భారతీయతత్వం, భాషలు, సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని లోకానికి తెలియ జెప్పిన ‘భారతదర్శిని’ – అదీ ఒక అరుంధతీయుడి మాద్యం ద్వారా…

(జులై 24 జాషువా వర్థంతి)

దాసరి శ్రీనివాసులు

రిటైర్డ్ IAS అధికారి

Dr Dasari Srinivasulu
Dr Dasari Srinivasulu
Dr Dasari Srivasulu is an IAS officer who worked in United AP and Telangana. He published an extraordinary book on the tribal life in AP. After retirement, he joined the BJP.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles