Monday, April 29, 2024

ఏదో తేడా ఉన్నట్టుగా అనిపించడం లేదూ…?!

జాన్ సన్ చోరగుడి

మొదటి నుంచి దక్షణ కోస్తాగా పిలువబడే సెంట్రల్ ఆంధ్రప్రదేశ్ పైన కొన్ని అపప్రధలు ఉండడం అయితే నిజం. “అంతా జరిగేది ఆ రెండున్నర జిల్లాల వాళ్ళ కనుసన్నలలోనే” అనుకునేట్టుగా అవి ఉండేవి. అంటే దానర్ధం అటువంటివి ఇప్పుడు లేవని కాదు, ఇప్పుడూ ఉన్నాయి. ఎటొచ్చి అటువంటివి నిజంగానే అపప్రధలు కనుక అయితే, వాటిని తుడుచుకోవడానికి వీళ్ళు చేసింది ఏమిటి? అనేది ఇక్కడ ప్రధాన అంశం. గతంలో తెలంగాణ వాళ్ళు వేలెత్తి చూపుతూ- ‘ఆంధ్రోళ్లు’ అన్నది వీరినే, ఇప్పుడు రాయలసీమ, ఉత్తరాంధ్ర వాళ్ళు మళ్ళీ అదే మాట మరింత స్పష్టంగా అంటున్నది కూడా వీరినే!

Also read: ‘వై… ఏ.పి. నీడ్స్ దిస్ గవర్నెన్స్?’   

కృష్ణా, గుంటూరు జిల్లాలు ప్రకాశంలో కొంతమేర ఈ- “మూడున్నర జిల్లాల” బరువును మొదటి నుంచి మోస్తున్నాయి. ఈ మాట అనేవారి సూత్రం ప్రకారం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోని కరువు ప్రాంతాలు అన్నీ కలిపి దాన్ని 1970లో ప్రకాశం జిల్లా చేయక ముందు అవి రెండే అయ్యుండాలి? ఆ తర్వాత మరో ‘అర’ కలిసింది. ఏదేమైనా, ఇటువంటి- ‘బలుపు బరువు’ వీరు మోస్తూ ఉండగానే, ‘అమరావతి’ రాజధాని అంటూ మరో అదనపు భారాన్ని అప్పటి ముఖ్యమంత్రి, చిత్తూరు జిల్లావాసి కృష్ణా జిల్లా అల్లుడు అయిన చంద్రబాబు వీరి మీదికి ఎత్తారు.

అర్బన్ ప్లానింగ్ నిపుణులు, సామాజిక శాస్త్రవేత్తలు- ‘ఒకే చోట కేంద్రీకృత అభివృద్ధి వద్దు’ అంటున్నప్పటికీ ఆయన వినలేదు. ఇప్పుడు దాన్ని సరిచేయడం గడచిన నాలుగేళ్లుగా జరుగుతూ, టవర్ల రాజధాని అంటూ- ‘వెర్టికల్’గా మొదలయిన  అభివృద్ధి రాజకీయ వ్యూహాం ఇప్పుడు నలుదిక్కులకు విస్తరిస్తూ- ‘హారిజాంటల్’ అవుతున్నది. అయితే ‘సెంట్రల్ ఆంధ్రప్రదేశ్’ గురించి అంతా వాళ్ళే, అంటూ జరిగిన ప్రచారం ఎంతవరకు నిజం? ఈ ప్రాంతమంతా అంత సుభిక్షంగా ఉందా? అనే లోచూపు అవసరం కూడా ఉంది.

అప్పటి ముఖ్యమంత్రి డా. శ్రీ వై ఎస్ రాజశేఖర రెడ్డి ‘మా ప్రభుత్వం నక్సలైట్లతో చర్చలకు సిద్ధంగా ఉంది’ అని అన్నప్పుడు, ఏ ఉత్తరాంధ్ర అడవుల నుంచో లేదా తెలంగాణ అడవుల నుంచో వాళ్ళు బయటకు వస్తారు అనుకుంటే, తీరా వాళ్ళు కర్నూలు గుంటూరు ప్రకాశం మూడు జిల్లాల సరిహద్దుల్లో దోర్నాల వద్ద నల్లమల అడవిలో నుంచి బయటకు వచ్చి ఏకంగా  దేశానికి ‘షాక్’ ఇచ్చారు! అయితే, అన్ని పార్టీల ప్రభుత్వాలకు ఇటువంటివి పట్టవు.

Also read: సర్కారు తలనెరిసిన తనానికి సలాములు

గత అనుభవానికి కొనసాగింపు అన్నట్టుగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 2020లో కొత్త జిల్లాలు ఏర్పాటు అన్నప్పుడు, సెంట్రల్ ఆంధ్రప్రదేశ్ పై పెట్టిన ‘ఫోకస్’ ప్రత్యేకమైనది. జగన్ దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో ‘వైఎస్ఆర్’ మొదలుపెట్టి పూర్తిచేసిన పులిచింతలతోను, పూర్తి చేయవలసిన ‘వెలుగోడు’తోనూ సరిపెట్ట లేదు. నక్సలైట్లు ‘బయటకు’ వచ్చిన ప్రాంతం ‘లోపలికి’ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశించింది. ఇది- యాభై రెండేళ్ల తర్వాత జరిగింది. గుంటూరు నగరం మధ్య బ్రిటిష్ దొరలు కలక్టర్లుగా ఉన్నప్పటి నుంచి ఉన్న ‘కలక్టరేట్’ నుంచి ఒక భాగాన్ని తీసుకెళ్లి- దాన్ని ఆయన ‘పల్నాడు’ మధ్య ఉంచారు. ఇప్పుడు నరసరావుపేట కేంద్రంగా పల్నాడు ఒక కొత్త జిల్లా.

డెబ్బై దశకంలో- 1971లో ప్రకాశం జిల్లా ఏర్పడ్డాక 1978లో సి.ఎం.గా డా. మర్రి చెన్నారెడ్డి ఉన్నప్పుడు, అప్పటి హైదరాబాద్ జిల్లాను రంగారెడ్డి పేరుతో రెండు చేశారు. ఆ తర్వాత దాని విస్తరణ అభివృద్ధి ఎలా జరిగిందో తెలిసిందే. అదే రంగారెడ్డి జిల్లాను తెలంగాణ ఏర్పడిన తర్వాత 2016లో మరోసారి- వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాలుగా విభజించారు. అయితే ఇప్పుడు జరిగిన ఈ విభజన ప్రతిఫలనం ఎలా ఉండబోతున్నదీ కొన్నాళ్ళకు తెలుస్తుంది. కానీ రంగారెడ్డి జిల్లా ఏర్పడినప్పుడు – ‘ఆ… ఏముంది? చేతిలో పనికనుక చెన్నారెడ్డి వాళ్ళ మామ పేరుతో కొత్తగా ఓ జిల్లా చేసుకున్నాడు’ అన్నవాళ్ళు అప్పట్లో ఉన్నారు. అయితే, అదే మాట ఇప్పుడు ఎవరైనా అనగలరా?

ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలు 26 అయ్యాయి. అయితే విభజన అనేది అది ఎప్పుడు ఎక్కడ జరిగినా అంతిమంగా అది అభివృద్ధి చెందవలసిన (అప్ కమింగ్) వర్గాలవారి మేలుకే అవుతుంది. అంతేగాని, అది- రెడ్ల కోసమో, కమ్మవారి కోసమో మరొకరి కోసమో జరగదు. గుంటూరును మూడు జిల్లాలు చేయడం అయినా, ప్రకాశంలో కొంత బాపట్ల, కొంత నెల్లూరు జిల్లాలలో కలపడం అయినా అటువంటిదే. ఇటువంటివి జరిగిన వెంటనే, అప్పటివరకు అక్కడ ఆధిపత్యం అనుభవిస్తున్న వారి స్వప్రయోజనాలు తాత్కాలికంగా దెబ్బతింటే తినవచ్చు, కానీ అందువల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఎక్కువమంది అనుభవిస్తారు.

అయినా యుద్ధం జరిగిన ప్రాంతాలు ఎలా ఉంటాయో తెల్సిందే. అక్కడ గడ్డి మొలవదు. ఇందుకు చరిత్రలో ‘కళింగ’ కంటే ఉత్తమ ఉదాహరణ మనకు దొరకదు. మనవద్ద కూడా అందుకే బొబ్బిలిని కలుపుకొని, విశాఖపట్టణం – శ్రీకాకుళంలో కలిసిఉన్న విజయనగరంను 1979లో జిల్లా చేయవలసి వచ్చింది. అటువంటి సున్నితాలు తెలిసిన ప్రభుత్వం ఉన్న కారణంగా మళ్ళీ ఇప్పుడు 2022లో మరో యుద్ధభూమి పల్నాడు జిల్లా అయింది.  

ఒక వందేళ్ల క్రితం నాటి దక్షిణ కోస్తా నేపధ్యంగా ‘బకింగ్ హాం’ కాల్వ వెంట సాగే కథనంతో సుప్రసిద్ధ జి. కల్యాణరావు నవల ‘అంటరాని వసంతం’లో ‘పల్నాడు’ ప్రస్తావన అంత లోతుగా కనిపించదు కానీ, నల్లూరి రుక్మిణి కథ (2004) ‘కుమ్ము’లో నల్లమల అడవులను ఆనుకొని ఉన్న పల్నాడు గ్రామాల్లో విప్లవ ఉద్యమాల్లో చురుకుగా ఉండే యువతపై సాగే పోలీస్ నిఘా అక్కడి దిగువ మధ్యతరగతి కుటుంబాల్లోని అమ్మా- నాన్నలకు కలిగిస్తున్న కలవరం గురించి ఆమె బలంగా చెబుతారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి, ఇటువంటి ప్రాంతంలో అమరావతిని కలిపి దాన్ని పల్నాడు జిల్లా చేసి పొలిటికల్- ‘రీమ్యాపింగ్’ అంటే ఏమిటో చూపించారు.

ఇప్పుడైనా ఇంత వెనక్కి ఎందుకు వెళ్లాల్సివచ్చింది ఇక్కడొక మాట చెప్పాలి. నల్లమల టైగర్ రిజర్వ్ ప్రాజెక్టును ఆనుకుని ఉన్నవరికిపూడి సెల వాగు నుంచి పక్కనున్న గురజాల డివిజన్ లోని వెల్దుర్తిపాడు మండలంలోని వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ళ, సిరిగిరిపాడు, బొందలవీడు, గంగలకుంట, కండ్లకుంట, గ్రామాల్లోని 24,900 ఎకరాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా 340.26 కోట్ల వ్యయంతో పూర్తిగా పైపులతో నిర్మిస్తున్న ప్రాజెక్టు పనులకు అటవీ పర్యావరణ శాఖ అనుమతులు ఈ ప్రభుత్వం సాధించింది. ప్రాజెక్టు ప్రారంభం కోసం గత నెల 15న జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లారు. ‘వాళ్ళు బయటకు వచ్చిన చోటికి ఈయన లోపలికి వెళుతున్నారు’ అంటున్నది ఇటువంటి చొరవను చూసే… 

Also read: ఏ.పి. కొత్త ‘గ్రోత్ మోడల్’ తో కమ్మలు త్వరలోనే కలిసిపోతారు…

గుంటూరు అంటే, మిర్చి-పసుపు అని కొత్తగా ఎవరికీ మనం చెప్పనక్కర లేదు. అటువంటిది ఇక్కడ అదీ పల్నాడు జిల్లా మధ్య యడ్లపాడు మండలంలోని వంకాయలపాడులో 2022 నవంబర్ లో 200 కోట్లతో ఐటిసి లిమిటెడ్ ‘గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్’ను ప్రారంభించింది. ఇక ముందు ఏటా 15 రకాల ఆర్గానిక్ ఉత్పత్తులు 20,400 మెట్రిక్ టన్నుల మేర బ్రిటన్, అమెరికా, కెనడా దేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతున్నాయి అంటే, ఏ సమస్యను ఎలా పరిష్కరించాలి? అనే వివరం తెలిసిన నాయకుడు ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతాయి. లేకపోతే 500 కోట్లతో పిడుగురాళ్ల మండలంలో ప్రభుత్వం మెడికల్ కాలేజి పెట్టడం ఏమిటి?

ఇదంతా చూశాక, అమరావతి రాజధాని గురించి తెలంగాణ ఎన్నికల వేళ హైదరాబాద్ లో సభ పెట్టడం అయినా, గన్నవరం విమానాశ్రయం వద్ద ప్రియాంక గాంధీని రాజధాని అమరావతి సభకు కాంగ్రెస్ ఆహ్వానించడం అయినా, రాష్ట్ర విభజన జరిగినది మొదలు ఇక్కడి ప్రతిపక్ష రాజకీయ పార్టీల ‘సైక్’ లోనే ఏదో పైకి తెలియని సమస్య ఉన్నట్టుగా అనిపించడం లేదూ?!

Also read: మొదలయిన చోటే తప్పటడుగుల గుర్తులు చెరిగిపోతాయి… 

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

2 COMMENTS

  1. ఇవన్నీ సరే! సామాజిక అంశాల విశ్లేషణల్లో
    ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలు, విలువలు, మర్యాదలను మంటగలిపేస్తున్న తీరు తెన్నుల పరిగణన ప్రస్తావన అవసరంలేదా?
    ప్రజల భాగస్వామ్యం లేని వృద్ది ప్రజాతంత్రమా? వ్యక్తిస్వామ్యమా?

    • మీరు అంటున్న ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలను కాపాడ వలసింది 9 ఏళ్ల కిందట ఏర్పడిన మన రాష్ట్ర ప్రభుత్వమా?
      లేక అందుకోసం పార్లమెంట్ లో తగిన చర్చ జరిగి, అందుకు అనుగుణంగా జరగవలసిన శాశ్విత పరిష్కారమా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles