Monday, January 30, 2023

యుద్ధము… శాంతి

కొన్ని రూపాలు మాయమవుతాయి,

కొన్ని కొనప్రాణం తో కొట్టుకొంటుంటాయి,

కొన్ని రక్తారుణ దుఃఖాన్ని పులుముకొని

జీవచ్చవాలు గా మిగిలిపోతాయి.

కాలం చరిత్రకు మరిన్ని పేజీలను జోడించి

పాప ప్రక్షాళనకు వాన కోసం వేచి చూస్తుంది.

విషపూరితమైన ఆకాశం నెలల తరబడి

అవిరత వమన వేదనతో విలవిలలాడుతుంది.

ఎగిరిపోయిన పక్షులు తిరిగివచ్చి

కాలి బూడిదైన గూడులను వెతుక్కొంటాయి.

కొండలు, గుట్టలు, ముగిసిన యుద్ధం నాటి

కరవాలాల ఖణేల్ ఖణేల్ శబ్దాల

ప్రతిధ్వనులను వినిపిస్తూనే ఉంటాయి.

ఒకప్పటి రేగడి నేలలపై

అగ్ని శిఖలు ఆగక నాట్యం చేస్తూనే ఉంటాయి.

పాపం భూమాత …తనపై చెల్లాచెదురుగా పడివున్న

దుర్గంధభరిత మాంస ఖండాలను

మింగలేక కక్కలేక ఉక్కిరిబిక్కిరి అవుతుంది.

ఎటూ పోలేని గాలులు ఊపిరి బిగబట్టి

అటూ ఇటూ తూలుతూ, తేలుతూ

అక్కడక్కడ సుడులు తిరుగుతాయి.

క్షతగాత్ర అయిన ప్రకృతి, వికృతం గా కనిపిస్తుంది.

వయసు మీద పడ్డ విధాత

ధారలు కడుతున్న కన్నీటిని తుడుచుకొంటు

తనలోకపు తలుపులు మూసివేస్తాడు.

అవును…అన్ని యుద్దాలు ఇలాగే ముగుస్తాయి.

ఉపశృతి:

శవాల గుట్టల మధ్య

సింహాసనాలపై కూర్చుని ఆ నలుగురు,

మద్యం మత్తులో పిచ్చిగా నవ్వుతూ

శాంతి పత్రం పై సంతకాలు పెడతారు.

Also read: ఎరుపు-తెలుపు

Also read: వర్షం

Also read: అమ్మ

Also read: నూతన జీవితం

Also read: ఎవరతను?!

MAHATHI
మైదవోలు వేంకటశేష సత్యనారాయణ కలం పేరు మహతి. ఆయన ఇంగ్లీషులో ప్రఖ్యాతిగాంచిన కవి. భారతీయ ఇతిహాసాన్నీ, పురాణాలనూ తన సుదీర్ఘమైన గేయాల ద్వారా ప్రపంచంలో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేసే మహాప్రయత్నంలో ఉన్నారు. ఛందోబద్ధంగా ప్రాచీన శైలిలో గేయాలు రాయడానికి ఇష్టపడతారు. స్వేచ్ఛాగీతాల రచనకు విముఖులేమీ కాదు. ‘ఫైండింగ్ ద మదర్ (శ్రీ సుందరకాండ),’ ‘హరే కృష్ణ,’ ‘ఓషన్ బ్లూస్,’ ‘ద గాంజెస్ అండ్ అదర్ పోయెమ్స్’ వంటి గ్రంథాలు ఆయనకు గొప్ప పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ఆయన రచనలు అనేకం ప్రచురితమైనాయి. కవి ఫొన్ నంబర్ +91 83093 76172

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles