Thursday, April 25, 2024

“హరే కృష్ణ” – సమీక్ష

రామాయణ భారతాల కంటే భాగవతం భిన్నమైనది. మొదటి రెండు ధర్మ ప్రబోధాలు. రామాయణం జీవిత విలువల గురించి, భారతం విలువలతోపాటు గెలుపు గురించి ప్రమాణాలుగా నిలుస్తాయి. భాగవతం భక్తి ప్రధానమైనది. కృష్ణలీల రస భరితం, ఆనందకరం. మనసు  తాదాత్మ్యం చెందుతుందిక్కడ. రామాయణ, భారతాల్లాగే అసుర సంహరం జరుగుతున్నా అది ప్రధాన విషయంగా కనిపించక పోవడం భాగవతం ప్రత్యేకత.

మహతి రచించిన హరేకృష్ణ

సంస్కృతంలో వ్యాసుడు, తెలుగులో పోతన రాసిన భాగవతాన్ని ఆంగ్లంలో రాయ పూనుకోవడం సాహసమే. మహతి అలాంటి సాహసాలకు అలవాటు పడ్డారు. అదివరకు సుండరకాండ ఆధారంగా “ఫైండింగ్ ద మదర్” రాశారు. భారతీయులకు తెలిసిన కధను మళ్ళీ రాసి మెప్పించడం కష్టం. మహతి సాహసం, కష్టం వృధా కాలేదు. కమ్మటి కావ్యం తయారయింది. కృష్ణుడి ఊరు వ్రజపురం పాలు, వెన్న సువాసనలతో ప్రేమను వెదజల్లుతుందని వర్ణిస్తారు. కృష్ణుని నలుపు రంగులో ఉన్న అందం, కళ; పేలవంగా కనిపించే తెల్ల తోలులో ఉండదంటారు.

కావ్యానికి కొంతమేర నాటకీయతను జోడించారు మహతి. వ్యోమాసురుడు దాగుడు మూతలాడుతున్న కృష్ణుడి సఖులను పట్టుకుని ఆకాశ మార్గాన   పోతుంటే కృష్ణుడు వెంటాడి వాడిని చంపి తన వారిని రక్షించడం దృశ్య నాటకంలా ఉంటుంది. అలాగే కృష్ణ జనన సమయంలో కంసుడికి నిద్ర రాక శయ్యపై దొర్లడం, అక్రూరుడిని పంపుతున్నపుడు కంసుడు పళ్లు పటపటలాడించడం, గోపబాలకుల్ని ఆకాశయానం చేయించడం ఈ రచనకు నాటకీయత తెచ్చిన సన్నివేశాలు.

కధనంలొ కాలక్రమణికను అక్కడక్కడా తప్పించారు. యాదవ  వంశ చరిత్రను వదలి కృష్ణజననంతో  మొదలు పెట్టారు. సాలవృక్షాలు కూలిన తరువాత  వాటి పూర్వ వృత్తాంతం వివరించడం శిల్ప సౌందర్యాన్ని పెంచాయి. అలాగే చాణూర మర్ధనాన్ని వివరంగా చెప్పి ప్రతినాయకుడు కంసుడితో  యుద్దాన్ని తేలిక చేయడం, కంస వధకు ముందే దేవకీ, వసుదేవ, ఉగ్రసేనుల విడుదల శిల్పసౌందర్యంతోపాటు నాటకీయతనూ, కొంత కొత్తదనాన్ని కలిగిస్తాయి.

పద్య కవిత్వాన్ని సామాన్యుడి  భాషలో జనరంజకంగా, భావ స్ఫోరకంగా వాడడం అభినందనీయం. విదేశీ పాఠకులను దృష్టిలో ఉంచుకొని అక్కడక్కడా వారికి రుచించే ‘హీదెన్’ లాంటి పదాలను వాడుకున్నారు.

మహతి కృష్ణుడు ప్రేమకోసం మనిషిలా పరితపిస్తాడు. తాను భగవంతుడైన కారణంగా ప్రేమలో తాదాత్మ్యం పొందలేక పోతున్నానని బాధ పడతాడు. ఇది  ఆలోచింపజేసే విషయం.

“హరే కృష్ణ” చదివినంతసేపు బాహ్య ప్రపంచాన్ని మరచి కృష్ణలీలలను, మహతి కావ్య రసాన్ని ఆనందంగా అనుభవించవచ్చు.

Also read: లాజిక్

Also read: “తెలుగు”

Also read: “మానవ జీవితంలో భగవద్గీత”

Also read: “జీవితం ఎందుకు?”

Also read: తెలుగును ఆంగ్లంతో కలుషితం చేస్తున్నామా?

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles