Saturday, April 20, 2024

దీదీ కోటకు బీటలు?

• రవాణా మంత్రి సుబేందు అధికారి రాజీనామా
• అసంతృప్తికి కారణమవుతున్న ఎన్నికల వ్యూహకర్త నిర్ణయాలు
• పార్టీలో మమత మేనల్లుడి జోక్యంపై అసంతృప్తి
• పీకే నిర్ణయాలతో విభేదిస్తున్న పలువురు సీనియర్ నేతలు

అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఉన్న బెంగాల్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత కొంతకాలంగా పార్టీతో విభేదిస్తూ అధినేత్రిపై నిరసన గళం వినిపిస్తున్న రవాణా మంత్రి సుబేందు అధికారి ఎట్టకేలకుతన పదవికి రాజీనామా చేశారు. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన జెడ్ కేటగిరీ భద్రతను కూడా వదులుకున్నారు. ఆయన రాజీనామాను పరిశీలిస్తున్నామని రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ కర్ వెల్లడించారు. గత వారం సుబేందు హుగ్లీ రివర్ బ్రిడ్జ్ కమిషనర్స్ ఛైర్మన్ పదవికి కూడా రాజీనామా చేశారు.

రవాణా మంత్రి రాజీనామా

రవాణా నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సుబేందు అధికారి గత కొంత కాలంగా పార్టీ అధినాయకత్వంపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీకి సంబంధించిన కీలక విషయాల్లో సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై సుబేందు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దీంతో గత కొంత కాలంగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలకు కూడా ఆయన హాజరు కావడంలేదని మంత్రి అత్యంత సన్నహితులు చెబుతున్నారు. అంతేగాక టీఎంసీ జెండా లేకుండానే సుబేందు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేపడుతున్నారు. దీంతో పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మంత్రి సుబేందుని విశ్వసించడంలేదని తెలుస్తోంది.

సుబేందు పార్టీని వీడితే ప్రభావితం కానున్న 40 నియోజకవర్గాలు

రాజీనామా చేసిన సుబేందు బీజేపీలో చేరతారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలకు దగ్గర పడుతున్న సమయంలో మంత్రి సుబేందు పార్టీని వీడితే అది తృణమూల్ కు పెద్ద నష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తూర్పు మేదినీపూర్ లో బలమైన నేతగా ఉన్న సుబేందు పార్టీని వీడితే ఆయన స్థానాన్ని భర్తీ చేసే మరో నేత టీఎంసీలో లేరని తెలుస్తోంది. అంతేకాకుండా సొంత నియోజకవర్గం తో పాటు పశ్చిమ మేదినీపూర్, పురూలియా, ఝాగ్రమ్, భీర్భుమ్, గిరిజనులు అధికంగా ఉండే జంగిల్ మహల్ ప్రాంతంలో సుబేందు ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం. సుబేందు కనుక పార్టీని వీడితే ఈ ప్రాంతాల్లోని దాదాపు 35 నుంచి 40 నియోజకవర్గాల్లో పార్టీ ఓటు బ్యాంకుకు భారీ నష్టం వాటిల్లుతుందని అంచనా.

అంతర్గత విభేదాలకు ఆజ్యం పోస్తున్న వ్యూహకర్త నిర్ణయాలు

వచ్చే ఏడాది ప్రధమార్థంలో జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి అధికారం చేజారకుండా ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ ను నియమించడం పార్టీలో అంతర్గత విభేదాలకు ఆజ్యం పోసింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ ప్రశాంత్ కుమార్ ను తమ శిబిరంలోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. బెంగాల్ లో చాప కింద నీరులా విస్తరిస్తూ తమ మనుగడకు సవాల్ విసురుతున్న బీజేపీని నిలువరించేందుకు పీకేను తమ శిబిరంలో కి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. పీకే సూచనలను మమతా బెనర్జీ అమలు చేయడంతో పార్టీ నేతల్లో ఆగ్రహం పెరుగుతోంది. ముఖ్యంగా మమత తీసుకుంటున్న నిర్ణయాలతో సంస్థాగతంగా మార్పులు చేయడంతో సీనియర్ నేతల్లో అసంతృప్తి రాను రానూ పెరిగిపోతోంది. రవాణా మంత్రి సుబేందు అధికారిలో అసంతృప్తి పెరగడానికి, ఆయన రాజీనామా చేయడానికి దారితీసిన పరిస్థితులకు పీకేనే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

మమత నిర్ణయాలతో పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి

ప్రశాంత్ కిశోర్ నిర్ణయాలను అమలు చేస్తున్న మమతా బెనర్జీ పార్టీ సీనియర్ నాయకుల్ని పక్కన పెడుతున్నారని, గత ఎన్నికల్లో బీజేపీకి లోపాయికారిగా ఉంటూ సాయం చేసిన వారిని పార్టీలో అందలమెక్కిస్తున్నారని అంసతృప్త నేతలు ఆరోపిస్తున్నారు. పీకే నిర్ణయాలపై పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగానే విమర్శలు కురిపిస్తున్నారు. ముర్షిదాబాద్ లో పార్టీ బలోపేతానికి కృషి చేసిన సుబేందు అధికారి అనుచరులను పార్టీ వేధిస్తోందని పలువురు నేతలు విమర్శిస్తున్నారు. ఎన్నికల వ్యూహకర్తగా పార్టీలో ప్రవేశించిన ప్రశాంత్ కిశోర్ సూచనలతో మమతా బెనర్జీ పార్టీలో సమూల ప్రక్షాళన చేసేందుకు సిద్ధమయ్యారు. కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గల పార్టీ కమిటీలలో మార్పులు చేశారు. ఈ మార్పులే పార్టీలో అసంతృప్తికి కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సుబేందు అధికారి సొంత జిల్లా తూర్పు మేదినీపూర్ లో పీకే బృందం నిర్వహించే సమీక్షా సమావేశాలకు సుబేందు హాజరుకాకపోవడం పార్టీలో పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనమని విశ్లషకులు అభిప్రాయపడుతున్నారు.

బీజేపీ వైపు చూస్తున్న అసంతృప్తులు

సుబేందు అధికారి రాజీనామాతో తృణమూల్ కాంగ్రెస్ భారీ ఆటుపోట్లకు గురికానున్నట్లు తెలుస్తోంది. పార్టీలో ఉన్న మరికొందరు అసంతృప్త నేతలు కూడా పార్టీని వీడతారని తెలుస్తోంది. పార్టీని వీడేందుకు ఎదురు చూస్తున్న నేతలు సరైన సమయం కోసం వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేసిన సుబేందు అధికారి బీజేపీలో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే పలువురు నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు క్యూ కట్టడం ఖాయమని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు పార్టీలో జరుగుతున్న పరిణామాలు తృణమూల్ కాంగ్రెస్ కు అంత శుభసూచకం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. బెంగాల్లో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే పార్టీలో అసంతృప్త నేతలను బుజ్జగించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని విశ్లేషకులు భావిస్తున్నారు.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles