Friday, April 26, 2024

వాక్సిన్ కి ఏడాది

  • మరణాలు తగ్గించిన టీకా మందు
  • వేగం పుంజుకున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ

కరోనా వైరస్ నుంచి రక్షణకు మహాస్త్రంగా,మహాకవచంగా అభివర్ణించే ‘వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో ప్రారంభమై ఏడాది పూర్తయ్యింది. గత ఏడాది జనవరి 16వ తేదీన శ్రీకారం జరిగింది. ఈ సంవత్సర కాలంలో 156 కోట్లకు పైగా డోసుల పంపిణీ జరిగింది. ప్రజలను కరోనా ముప్పు నుంచి బయటపడవేయడంలో వ్యాక్సిన్లదే కీలకపాత్ర అని డబ్ల్యూ హెచ్ ఓ కూడా చెబుతూ వచ్చింది.

Also read: ప్రపంచవ్యాప్తంగా సూర్య నమస్కారాలు

టీకాలపైన పెరిగిన విశ్వాసం

మొదట్లో, కోవీషీల్డ్ – కో వాక్జిన్ టీకామందుల తయారీ కంపెనీలు ఒకదానిపై మరొకటి దుమ్మెత్తి పోసుకున్నాయి. దానితో  ప్రజలకు నమ్మకం కలగక పోగా, గందరగోళంలో పడిపోయారు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి వంటి దేశాధినేతలు మొదలు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులు, అధికారులు వ్యాక్సిన్ తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ప్రజల్లో  భరోసా పెరిగింది. గత జనవరి 16 వ తేదీన ప్రారంభమైనప్పటికీ,

ప్రథమార్ధంలో ప్రక్రియ మందకొడిగానే సాగింది. సంసిద్ధతలో వైఫల్యమే దీనికి ప్రధాన కారణంగా పరిశీలకులు భావించారు. కేంద్రం పదే పదే ప్రచారం చేసిన స్థాయిలో పంపిణీ జరగలేదన్నది వాస్తవమనే చెప్పాలి. మొదట్లో ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడం వల్ల విదేశాలకు తరలించారనే విమర్శలు వచ్చాయి.

Also read: యూపీలో బీజేపీకి టోపీ

కట్టడి చేయడంలో వెనకబడడం వల్లనే రెండో వేవ్ లో దేశం తీవ్ర పరిణామాలను చవిచూచింది. కేసులు పెరగడమే కాక  ప్రాణనష్టం కూడా జరిగింది. ఈ పరిణామాలపై అంతర్జాతీయ మీడియా వరుస కథనాలు వడ్డించింది. ద్వితీయార్ధంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంది. నేడు కోటి యాభై ఆరు లక్షలమందికి చేరడం శుభపరిణామం.

భాగస్వామ్యులైన వారందరికీ కృతజ్ఞతలు చెప్పి తీరాలి. ఈ విజయం వెనకాల ఎందరిదో స్వేదం, త్యాగం దాగివున్నాయి. రూపకల్పనలో మేధోశ్రమ, శారీరక శ్రమ రెండూ కలిసి సాగాయి. మన దేశ జనాభా 140 కోట్లకు పైగా ఉంది. మనది అభివృద్ధి చెందుతున్న దేశం. సమగ్రంగా, సమృద్ధిగా వ్యాక్సిన్లు అందించడం అంత ఆషామాషీ విషయం కాదు. ప్రగతి ప్రయాణంలో చైనా వలె మనం కూడా కాస్త ముందుగా మేల్కొని ఉంటే, ఆర్ధికాభివృద్ధి జరిగిఉండేది. ఆరోగ్యసంపదను పొంది ఉండేవాళ్ళం. వనరులు, వసతులను సమకూర్చుకొనే వాళ్ళం. ఇటువంటి ఉప్పెనలు చుట్టుముట్టినప్పుడు మరింత దృఢంగా ఎదుర్కొని ఉండేవాళ్ళం. వ్యాక్సిన్ల రూపకల్పనలో అగ్రగామిగా నిలిచేవాళ్ళం. డబ్బుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఇటువంటి పరిణామాల నుంచైనా మనం గుణపాఠాలు నేర్చుకోవాలి.

Also read: మౌనమే మాయావతి భాష

క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇంతదూరం ప్రయాణించినందుకు మనల్ని మనం అభినందించుకుంటూనే, కనీసం ఇక నుంచైనా మేలుకుందాం, వేగంగా బలమైన అడుగులు వేద్దాం. ఒమిక్రాన్ ప్రమాదకారి కాదనే మాటలు వినపడుతున్నా, నిర్లక్ష్యం చేయలేము కదా, స్వేచ్ఛగా తిరగలేము కదా. మన బాధ్యతలు మరువలేము కదా,జీవిక కోసం చేసే యాత్ర ఆపలేము కదా. ఇవ్వన్నీ సజావుగా సాగాలంటే కరోనా రోజుల నుంచి బయటపడాల్సిందే.

వైరస్ అనివార్యం

నిన్న డెల్టా అన్నారు, నేడు ఒమిక్రాన్ అంటున్నారు, రేపు ఇంకేదో అంటారు. వైరస్ లో ఇలా వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. వైరస్ తో కాపరం చెయ్యక తప్పదనీ అంటున్నారు. నిజంగా వ్యాక్సిన్లు సంజీవినిలా పనిచేసేలా ఉంటే దేశ జనాభాకు ఎన్ని డోసులు అవసరమో అన్ని డోసులను వేగిరం పూర్తి చేయడమే తక్షణ కర్తవ్యం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల ప్రభావం కొన్ని నెలలు మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. సమర్ధవంతమైన వ్యాక్సిన్లను అందించడం ఎంత ముఖ్యమో, జీవిత కాల వ్యాక్సిన్ల రూపకల్పన చెయ్యడం అన్నింటి కంటే ముఖ్యం.  వేరియంట్లను ఎదుర్కొంటూ వ్యాక్సిన్ల రూపకల్పన కత్తిమీద సాము వంటిది. మన దేశంలో మొదటి డోసు ఇప్పటి వరకూ 90 శాతానికి పైగా చేరింది. రెండో డోస్  ఇంకా 30శాతం మందికి అందాలి. ప్రీకాషస్ డోస్ (ముందుజాగ్రత్త డోస్ ) వారం క్రితం మొదలైంది. అత్యవసర సేవా సిబ్బంది, ఫ్రంట్ లైన్ వారియర్స్, 60 ఏళ్ళు పైబడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఈ డోస్ అందిస్తున్నారు. నిత్యం క్షేత్రంలో పనిచేసే జర్నలిస్టులను కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి. బూస్టర్ డోస్ గా మూడో డోస్ అందరికీ అందించడం అవసరమని ఎన్నో దేశాలు గుర్తించాయి. మన దేశంలోనూ శీఘ్రగతిన అందించేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. 15-18 ఏళ్ళ లోపువారికి ఈ నెలలోనే వ్యాక్సినేషన్ మొదలైంది. 15ఏళ్ళ వయస్సులోపు పిల్లల విషయంలో స్పష్టత రావాల్సివుంది. వ్యాక్సినేషన్ మహాప్రస్థానంలో నేనుసైతం అని నిలిచిన ప్రభువులకు, బోయీలకు జేజేలు.

Also read: లాక్ డౌన్ అనివార్యమా?

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles