Monday, January 30, 2023

లాక్ డౌన్ అనివార్యమా?

  • రాష్ట్రప్రభుత్వాల తడబాటు
  • ప్రజలలో భయాందోళనలు
  • దిల్లీ, ముంబయ్ లో తీవ్రతరం అవుతోన్న ఒమిక్రాన్

గత కొన్ని రోజుల నుంచి కరోనా ఉధృతి పెరిగిపోతోంది. గడచిన ఒక్కరోజులోనే 1.6 లక్షల కొత్త కేసులు వెలుగు చూశాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నాలుగువేలకు చేరువవుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం దాటింది. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. మొన్నటి దాకా తగ్గుముఖం పట్టిన కోవిడ్ వ్యాప్తి ఒమిక్రాన్ వేరియంట్ వల్ల మళ్ళీ ఊపందుకుంది. థర్డ్ వేవ్ ప్రభావంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

Also read:ఎన్నికల నగారా మోగెన్

ప్రధాని సమీక్ష

ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి ముందుగా డిసెంబర్ 24న కూడా ప్రధాని సమీక్షించారు. రెండు వారాల వ్యవధిలోనే రెండు సార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించారంటే,భవిష్యత్ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రధానమంత్రి నిర్వహించిన తాజా సమావేశంలో ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటారని ఎక్కువమంది భావించారు. దేశ వ్యాప్తంగా మళ్ళీ లాక్ డౌన్ విధిస్తారా? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి కరోనా ప్రారంభ దశలో లాక్ డౌన్ పై కేంద్రం నిర్ణయం తీసుకున్నా, ఆ తర్వాత పరిణామాల్లో నిర్ణయాధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. ఇప్పుడు కూడా అదే జరిగే అవకాశాలు ఉన్నాయి.దిల్లీలో పాజిటివిటీ రేటు 20శాతానికి చేరుకుంది. మొన్న శనివారం ఒక్కరోజులోనే 20వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే వారాంతపు లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. మిగిలిన ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. మాస్క్ విధిగా ధరించడం, వ్యక్తిగత దూరం పాటించడం, మిగిలిన నిబంధనలను పాటిస్తే సంపూర్ణ లాక్ డౌన్ విధించాల్సిన అవసరం లేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంచుమించుగా ఇదే ఆలోచనలో ఉంది. ముంబయి మేయర్ ఇటీవల తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కేసులు పెరుగుతున్నప్పటికీ సంపూర్ణ లాక్ డౌన్ పై మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సుముఖంగా లేవు. పరిస్థితులను బట్టి,పాక్షిక లాక్ డౌన్ వైపే మొగ్గు చూపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. అంతర్రాష్ట్ర ప్రయాణాలు, కదలికలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో పెద్దగా భయపడనవసరం లేదనే మాటలు మొదటి నుంచీ వింటున్నాం. అదే సమయంలో, నిర్లక్ష్యం చేస్తే ముప్పు తప్పదని డబ్ల్యూ హెచ్ ఓ హెచ్చరిస్తోంది. నిపుణులు కూడా అదే చెబుతున్నారు. లాక్ డౌన్ వల్ల ఎంత నష్టపోయామో అందరికీ అనుభవమే.

Also read: భద్రతా లోపం, ప్రచార పటాటోపం

లాక్ డౌన్ ఇబ్బందులు వర్ణనాతీతం

మళ్ళీ లాక్ డౌన్ విధిస్తే తట్టుకొనే పరిస్థితిలో ఎవ్వరూ లేరు. ముఖ్యంగా సామాన్యులు పడిన ఇబ్బందులు వర్ణనాతీతం. ఇప్పటికీ చాలామంది కోలుకోలేదు. అనేక రంగాలు కుదేలైపోయి ఉన్నాయి. మళ్ళీ ఎప్పటికి పైకి లేస్తాయో చెప్పలేని దుస్థితిలోనే ఉన్నాయి. వ్యక్తులు, వ్యవస్థలు, ప్రైవేట్ రంగాలతో పాటు ప్రభుత్వాలు కూడా లాక్ డౌన్ కష్టాలను ఘోరంగా చవిచూశాయి. అందుకే లాక్ డౌన్ పేరు వింటేనే  జనం భయభ్రాంతులకు గురవుతున్నారు.అందుకే ప్రభుత్వాలు ఆచితూచి అడుగు వేస్తున్నాయి. ప్రధాని తాజాగా నిర్వహించిన సమావేశంలో వైరస్ కట్టడిపైన ప్రధానంగా చర్చ జరిగింది. వ్యాక్సిన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది ఆక్సిజన్, ఔషధాల నిల్వపైనా సమీక్ష జరిగింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధాని హెచ్చరికలు జారీచేశారు. దివ్యాంగులు, గర్భిణులకు ‘ వర్క్ ఫ్రం హోమ్’  వెసులుబాటును కల్పిస్తూ కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కంటైన్ మెంట్ జోన్లలోని ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి కూడా ‘వర్క్ ఫ్రం హోమ్’ సౌలభ్యం కల్పిస్తున్నట్లు సమాచారం. బూస్టర్ డోస్ తో ఒమిక్రాన్ నుంచి అధిక రక్షణ లభిస్తుందని నిపుణులు చెబుతున్న మాటలకు ప్రభుత్వాలు విలువనివ్వాలి. ఇప్పటి వరకూ తీసుకున్న వ్యాక్సిన్ల సామర్ధ్యం గరిష్ఠంగా 6 నెలలు మించడం లేదని సమాచారం.3 నెలలకు 25 శాతం, 6 నెలలకు 50 శాతం  సామర్ధ్యం పడిపోతున్నట్లు అధ్యాయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతో పాటు మిగిలినవారికి కూడా బూస్టర్ డోసులు ఇవ్వడం శ్రేయస్కరం. టీనేజ్ పిల్లలకు వ్యాక్సిన్ అందించే క్రమంలో వేగం పెరగాలి. చిన్నారులకు కరోనా దరిచేరకుండా చేపట్టాల్సిన చర్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి.కరోనా ముసురుకుంటున్న వేళ ఇంకా కొన్ని తరగతుల పిల్లలు స్కూల్స్ కు వెళ్లాల్సి వస్తోంది. ఇది ప్రమాదకరమైన ధోరణి. కరోనా ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా స్వయంక్రమశిక్షణను పాటించాలి. సంపూర్ణ లాక్ డౌన్ విధించే పరిస్థితులు తెచ్చుకోరాదు.

Also read: ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న తెలుగు మహోత్సవం

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles