Monday, June 5, 2023

మరో మాయదారి వేరియంట్

  • ఒమిక్రాన్ కంటే వేగంగా విస్తరిస్తుందట
  • అజాగ్రత్త అత్యీంత ప్రమాదం

దేశంలో మొట్టమొదటిసారిగా ఒమిక్రాన్ ‘ఎక్స్ ఈ ‘ వేరియంట్ కేసు మొన్న ముంబయిలో బయటపడింది. దీనితో అందరికంటే ముందుగా తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇంతవరకూ మిగిలిన రాష్ట్రాలలో ఎక్కడా ఈ వేరియంట్ తో కేసులు నమోదు కాలేదు. మహారాష్ట్రలో ఎలా ఉన్నా, తమిళనాడులోని జిల్లాల్లో కోవిడ్ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో ‘ఎక్స్ ఈ’ వేరియంట్ బయటపడినట్లు వార్తలు వస్తున్నా, కేంద్ర ప్రభుత్వం వాటిని ఖండించింది. ఏది ఏమైనా, వేరియంట్స్ విషయంలో అప్రమత్తమై తీరాల్సిందే. గతంలో వచ్చిన వివిధ వేరియంట్ల విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకొని ఉండి ఉంటే జరిగిన నష్టం కొంత తప్పి ఉండేది. ఒమిక్రాన్ ను కూడా చాలా వరకూ తేలికగానే తీసుకున్నారు. మౌనంగా తనపని తాను చేసుకొని పోయింది. వ్యాక్సినేషన్ పెరిగి, సామూహిక రోగ నిరోధక శక్తి ఆశించిన స్థాయిలో పెరిగి ఉండడం వల్ల, పెద్దగా నష్టం జరగలేదు.

Also read: అపూర్వ రాజకీయ విన్యాసం

ఒమిక్రాన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్

ఒమిక్రాన్ అంత ప్రమాదకారి కాదని డాక్టర్లు చెప్పుకుంటూ వచ్చినా,  సోకినవారిలో కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. దుష్ప్రభావాల విషయంలో చురుకుగా ఉండక తప్పదు. కరోనా సోకిన కొందరికి గుండెలో రక్తప్రసరణలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.కొన్నాళ్ల నుంచి కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. నిబంధనలను చాలా వరకూ సడలించారు. భౌతిక దూరం వహించచడం, మాస్క్ లు ధరించడం, శానిటైజేషన్ మొదలైన కనీస జాగ్రత్తలను  పాటించకుండా ఉండే దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ విమానాల రద్దీ కూడా బాగా పెరిగింది. విదేశీ ప్రయాణీకులు, ఇతర దేశాల నుంచి వచ్చే భారతీయులపైన కూడా విమానాశ్రయాల్లో నిఘా ముమ్మరం చెయ్యాలని ప్రభుత్వాలు సూచించాయి. అట్లే, దేశీయ ప్రయాణీకులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.కొన్ని నిబంధనలను ప్రయాణీకులు పాటిస్తున్నారు. కానీ, విమానయాన సంస్థలు భౌతిక దూరాన్ని గాలికి వదిలేశాయి. ఇప్పుడే కాదు. గతంలో లాక్ డౌన్ సడలించిన సమయాల్లోనూ ఇదే జరిగింది. కరోనా కట్టడిలో ఉన్నప్పటికీ ఇటువంటి ధోరణులు ఎంతో కొంత నష్టాన్ని కలిగిస్తాయి. బస్సులు, సినిమా ధియేటర్స్ లోనూ ఇదే తంతు నడుస్తోంది. కరోనా కాలంలో దాదాపు ప్రతిరంగం నష్టపోయింది. ఇప్పుడు స్వేచ్ఛా వాతావరణం ఏర్పడడంతో అందరూ గేట్లు ఎత్తేశారు. ఈ తీరు ఎటువంటి దుష్పరిణామాలను తీసుకొస్తుందో… అనే భయాన్ని కొందరు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. కాంటాక్ట్ ట్రేసింగ్ పెరగాల్సిన అవసరం ఉంది. విమానాశ్రయాల దగ్గర ఫీవర్ స్క్రీనింగ్ క్యాంప్స్ మరింత పెంచాలి.

Also read: యూట్యూబ్ చానెళ్ళ కట్టడి

పరిశోధనలు వేగవంతం

ఒమిక్రాన్ వేరియంట్ గా చెబుతున్న ‘ఎక్స్ ఈ ‘ ను గుర్తించిన బ్రిటన్ శాస్త్రవేత్తలు ఇప్పటికే పరిశోధనలను వేగవంతం చేశారు. ఇప్పటి వరకూ ఉన్న ఒమిక్రాన్ వేరియంట్స్ లో ఇది దాదాపు 10శాతం ఎక్కువ వ్యాపించే గుణం ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనాకు వచ్చారు. ఒమిక్రాన్ ప్రాణహాని కలిగించేంతటి ప్రమాదకారి కాకపోయినా, వేగంగా వ్యాప్తిస్తుందని అందరికీ అనుభవంలోకి వచ్చింది.’ ఎక్స్ ఈ ‘  వేరియంట్ వ్యాప్తి వేగం ఇంకా ఎక్కువగా ఉంటుందని బ్రిటన్ శాస్త్రవేత్తలు చెబుతున్న నేపథ్యంలో, అందరూ మరింత చురుకుగా వ్యవహరించాల్సి ఉంది.ఈ వేరియంట్ కేసులు థాయిలాండ్, న్యూజిలాండ్ లోనూ వెలుగు చూశాయి. కరోనాకు పుట్టినిల్లైన చైనాలో వైరస్ విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడంతో అక్కడ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇదంతా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణగానే చెబుతున్నారు. కరోనా వైరస్ వేరియంట్ల వ్యాప్తి విషయంలో ఆదమరచి ఉండరాదని నిపుణులు చేస్తున్న హెచ్చరికలను గౌరవిద్దాం.

Also read: యూట్యూబ్ చానెళ్ళ కట్టడి

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles