Saturday, July 13, 2024

వైజ్ఞానిక స్పృహకోసం ఒక రోజు – 20 ఆగస్టు

ప్రతి సంవత్సరం ఆగస్టు 20న మనదేశంలో ‘నేషనల్ సైంటిఫిక్ టెంపర్ డే’-ను జరుపుకుంటున్నాం. హేతువాది డాక్టర్ నరేంద్ర దబోల్కర్ ను సనాతనవాదులు అన్యాయంగా 20 ఆగస్టు 2013న హత్య చేసినందుకు గుర్తుగా ఆయన జ్ఞాపకార్థం జరుపుకుంటున్నాం. డాక్టర్ నరేంద్ర అచ్యుత్ దబోల్కర్ కేవలం ఒక ఫిజీషియన్ మాత్రమే కాదు. ఒక రచయిత, ఒక సామాజిక  కార్యకర్త కూడా! వైజ్ఞానిక దృక్పథాన్ని సమాజంలో వ్యాపింపజేయడానికి స్థిరచిత్తుడై మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితిని 1989లో ప్రారంభించి, నిరంతరం కృషి చేస్తూ వచ్చిన మహోన్నతుడు. సమాజంలో అంధ వశ్వాసాల్ని తొలగించడానికి, జనంలో తిరుగుతూ జనాన్ని చైతన్యపరచడం నచ్చనివారు ఒక పథకం ప్రకారం ఆయనను మార్నింగ్ వాక్ లో మట్టుబెట్టారు. అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలని ఆయన చాలా కాలం పట్టుబడుతూ వచ్చారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. అది కొన్ని రాజకీయ పార్టీలకు నచ్చలేదు. భారతీయ జనతా పార్టీ, శివసేన పార్టీలు తీవ్రంగా ఆయన డిమాండ్ ను వ్యతిరేకించాయి. ఎందుకంటే దాని వల్ల తమ సంస్కృతీ సంప్రదాయాలు దెబ్బతింటాయని వారు భావించారు. సంస్కృతి, సంప్రదాయాల పేర గత కాలపు అవివేకాన్ని, అజ్ఞానాన్ని బతికించాలని చూసేవారికి వైజ్ఞానిక అవగాహన ఎలా ఉంటుందీ? ఎదుటివారికి ఇంకింత జ్ఞానం ఉంటే బాగుంటుందని మనం అనుకుంటూ ఉంటాం గానీ, వారికి ఇంగిత జ్ఞానమే ఉండదు – అలాంటప్పుడు, ఏం చేయగలం? పైగా పేరుకుపోయిన మూర్ఖత్వంతో రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించడాన్ని ఎవరు హర్షిస్తారూ?

Also read: నెహ్రూ ఆత్మకథ చదివి పొంగిపోయిన రవీంద్రుడు

వైజ్ఞానిక స్పృహతో, మానవీయ విలువలు నిలుపుకుంటూ మసలుకోవడం ప్రతి భారతీయుడి కర్తవ్యమని రాజ్యాంగంలోని ప్రకరణ 15ఎ(హెచ్) ఉంది కదా? దానికి తగినట్టుగానే  ఏ సైన్సు కార్యకర్త అయినా వ్యవహరిస్తాడు. మరి, ఇలా దుర్మార్గంగా చంపివేయడమేమిటి? 2013 నుండి ఈ రోజు వరకు దబోల్కర్ హంతకులెవరో ప్రభుత్వాలు పసిగట్టలేకపోయాయి. అంటే ఏమిటీ? ఏలినవారి అండదండలతోనే దుండగులు ఆ పని చేశారని ఎంత తెలివిలేని వాడికైనా అర్థమౌతుంది! పైగా మరో గొప్ప విషయమేమంటే, దబోల్కర్ మరణం తర్వాత ఆయన పోరాడిన అంధవిశ్వాసాల వ్యతిరేక ఆర్డినెన్స్ (ANTI SUPERSTITION & BLACK MAGIC ORDINANCE) 29 సవరణలతో చివరికి 18 డిసెంబర్ 2013న మహారాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. అయితే అది చట్టం కావాలంటే పార్లమెంట్ ఆమోదించాలి. డా. నరేంద్ర దబోల్కర్ చనిపోక ముందు 6 ఆగస్టు 2014న – ‘ప్రగతిశీల భావాలు గల వారికి గడ్డుకాలం వచ్చిందని, అధికారంలో ఉన్న మంత్రులు సరిగా వ్యవహరించడం లేదని, అందుకే అంధ విశ్వాస వ్యతిరేక చట్టంపై అసెంబ్లీ చర్చ జరగడం లేదని’ – ఆయన తన అసంతృప్తిని మీడియా ముందు వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన హత్య చేయబడ్డారు. హత్య జరిగిన మరునాడే మహారాష్ట్ర కేబినెట్ సమావేశమై ఆర్డినెన్స్ పై ఆమోదముద్ర వేసింది. అంతే- అది అక్కడే, అలాగే ఉంది.

Also read: ప్రభుత్వాన్ని ఎదిరించిన ఒంటరి వీరుడు సోల్జినిత్సిన్

ఎడమ నుంచి కుడికి- గోవింద్ పన్సారే, గౌరీ అంకేశ్, ఎంఎం కుల్బుర్గీ

ప్రజాబలం గొప్పది

డాక్టర్ నరేంద్ర దబోల్కర్, తర్వాత గోవింద్ పన్సారే, ప్రొఫెసర్ యం.యం. కల్బుర్గి, జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ లు వరుసగా హత్యలకు గురయ్యారు. అంటే ఏమిటి? ఎదిరించేవాళ్ళని బెదిరించే వాళ్ళు చంపేస్తూ రాజ్యాలేలుతుంటారనా? ఇన్ని హత్యల తర్వాత కూడా భావప్రకటనా స్వేచ్ఛ ఈ దేశంలో ఇంకా ఘోరంగా హత్య చేయబడుతోంది. మరి సామాన్యులేం చేయాలి? మరింత ధైర్యంగా ఉండాలి. మరింత హేతుబద్ధంగా ఆలోచించడం ప్రారంభించాలి. రాజ్యాంగ వ్యతిరేక చర్యలు ఎవరు చేసినా ఎత్తి చూపుతూనే ఉండాలి. ఎందుకంటే అధికారంలో ఉన్నవారి బలం కంటే ఎప్పుడైనా ప్రజాబలమే గొప్పది – అనే విషయం గుర్తుంచుకోవాలి. ఈ అత్యాధునిక సమాజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ పాత రాతి యుగంలోకి పోనివ్వద్దు.

Also read: జాతి భక్షకులు నరభక్షకులకన్నా ప్రమాదం!

పన్నెండేళ్ళు డాక్టర్ గా ప్రజలకు సేవ చేసి దబోల్కర్ 1980లో సామాజిక సేవ వైపు దృష్టి మరల్చారు. అఖిల భారత అంధ శ్రద్ధ నిర్మూలన సమితి (ఏబీఏఎన్ఎస్)కు అనుబంధంగా మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితి (ఎంఏఎన్ఎస్)కార్యక్రమాలు రూపొందించారు. తమకు తాము దేవుళ్ళమని ప్రకటించుకునే దొంగ బాబాల భరతం పట్టారు. సతార జిల్లాలో ‘పరివర్తన్’ అనే సేవా సంస్థను ప్రారంభించారు. మరాఠీ పత్రిక ‘సాధన’కు సంపాదకత్వం వహించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రేషనలిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 1990-2010 మధ్య కాలంలో దళితుల పట్ల వివక్ష ఉండకూడదని కుల నిర్మూలన సంఘాలతో కలిసి పని చేశారు. సామాజిక న్యాయం దొరకని వారి పక్షాన ఎప్పుడూ నిలబడ్డారు. అంధ విశ్వాసాల నిర్మూలనలో భాగంగా జనంలో మమేకమై మూడు వేలకు పైగా ఉపన్యాసాలిచ్చారు. ఆయన ఉపన్యాసం జనానికి కొత్త ఊపిర్లు ఊదేది. వినాలనుకునే వారికి ఆయన ఉపన్యాసాలు కొన్ని యూట్యూబ్ లో దొరుకుతాయి.

Also read: ‘హకూన మటాటా’: బాధలూ, ఒత్తిళ్లూ లేకుండా ఉండండి!

మార్నింగ్ వాక్ లో మట్టుబెట్టారు

ఆయన నిస్వార్థ సేవను గుర్తించాల్సింది పోయి, నేరుగా మనిషినే మాయం చేశారు. దబోల్కర్ స్వంత పట్టణమైన ఫుణెలోఆయన మార్నింగ్ వాక్ లో ఉండగా ఇద్దరు దుండగులు మోటర్ సైకిల్ పై వచ్చి కాల్పులు జరిపారు. ఒకటి తలలో, మరొకటి ఛాతిలో బుల్లెట్లు దూసుకుపోయి, ఆయన అక్కడికక్కడే కన్నుమూశారు. దగ్గర్లో పార్క్ చేసి ఉంచిన మోటర్ సైకిల్ తీసుకొని, దుండగులు నింపాదిగా పారిపొయ్యారు. సి.సి. కెమెరాల్లో కొన్ని దృశ్యాలు నమోదయ్యాయి. హత్య జరిగిన తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులకు దబోల్కర్ జేబులోని ఐడెంటిటీ (గుర్తింపు) కార్డు దొరికింది. అందువల్ల ఆయనను వెంటనే గుర్తించడం జరిగింది. శక్తివంతమైన మారణాయుధాలు సమకూర్చుకొని ఇరుగుపొరుగు దేశాల్ని భయపెట్టగల మన ప్రభుత్వం ఒక హత్య చేసిన ఇద్దరు దుండగుల్ని మాత్రం ఏళ్ళు గడిచినా పట్టుకోలేకపోతోంది! అంటే ఏమిటీ? దేశంలో స్వేచ్ఛాలోచన ఇలాగే పట్టపగలు హత్య చేయబడుతుంది – అని చెప్పడానికి సంకేతమా?

Also read: ట్రావెన్ కోర్ లో రొమ్ము పన్ను

భారత కబాడీ జట్టు కెప్టెన్

01 నవంబర్ 1945న పుణెలో జన్మించిన నరేంద్ర దబోల్కర్ చదువుకునే రోజుల్లో మంచి కబాడీ ఆటగాడు. బంగ్లాదేశ్ తో పోటీ పడినప్పుడు భాతర కబాడి జట్టుకు కెప్టెన్. మిరాజ్ లోని ప్రభుత్వ వైద్యకళాశాల నుండి యం.బి.బి.యస్ డిగ్రీ తీసుకుని పేదలకు వైద్యసేవలందించారు. ఒక హేతువాదిగా అతి సాధారణ జీవితం గడిపారు. తన పిల్లలకు కూడా ముహూర్తాలు, సంప్రదాయాలు లేని పెళ్ళిళ్లు చేశారు. ఏ సమయంలోనైనా, ఏ విషయంలోనైనా ముహుర్తాలు చూడకుండా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. మరణానంతరం భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ ప్రకటించింది. ఆ పద్మా అవార్డు వల్ల ప్రభుత్వానికే ఏమైనా మేలు జరిగిందేమో కానీ నరేంద్ర దబోల్కర్ కు ఒరిగిందేమీ లేదు. ఎందుకంటే ఆయన అంతకు ముందే – అంతకు వెయ్యిరెట్టు మించి…జనం గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆయన ప్రాణత్యాగం వృధాపోలేదు. 1983లోనే ఆయనకు బెదిరింపులు వచ్చాయి. చిన్నపాటి దాడులు జరిగాయి. పోలీసు రక్షణ కోరమని చాలామంది స్నేహితులు, అభిమానులు సూచించారు. కానీ ఆయన వారి సూచనను స్వీకరించలేదు. పైగా ‘‘నా ప్రజల మధ్య నాకు సెక్యూరిటీ ఎందుకూ?’’ అని ప్రశ్నించారు. తన చుట్టూ ఉన్న ప్రజల మీద ఆయనకు అంత విశ్వాసం – ‘‘అయినా నేను ఎవరికో కొమ్ము కాయడం లేదు కదా? రాజ్యాంగబద్దంగా నడుచుకుంటూ … మొత్తం సమాజం ప్రగతి పథాన నడవడాని కృషి చేస్తున్నాను – ఇందులో ఎవరికీ అభ్యంతరాలు ఉండాల్సిన పని లేదు’’ అని ప్రకటించారు.

Also read: అస్తమించిన భారతీయ వెండితెర వెలుగు దిలీప్ కుమార్

జాతీయ వైజ్ఞానిక స్పృహ దినం

దబోల్కర్ హత్య తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో చురుకుగా పని చేస్తున్న నలభై  సైన్స్ సంఘాలు ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్ వర్క్ (ఏఐపీఎస్ఎన్) కింద ఏకమై పని చేస్తున్నాయి. నరేంద్ర దబోల్కర్ స్మృతిలో 20 ఆగస్టు ప్రతి సంవత్సరం ‘‘జాతీయ వైజ్ఞానిక స్పృహ దినం’’గా జరుపుకోవాలని నిర్ణయించాయి. అందుకే గత ఐదేళ్ళుగా దేశవ్యాప్తంగా ఈ రోజును జరుపుకుంటున్నాం. అందరం కలిసికట్టుగా ఎలా పని చేయాలి? జనంలో గడ్డకట్టుకుని ఉన్న మూఢత్వాన్ని ఎలా ఛేదించాలి? – అని ఆలోచించుకోవడానికి ఇది ఒక అవకాశం. భవిష్యత్ పథకాలు, ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి, ముఖ్యంగా భావస్వేచ్ఛకోసం, అంధవిశ్వాసాల నిర్మూలనకోసం ప్రాణాలు వదిలిన  అమర వీరుల త్యాగాల్ని మననం చేసుకోవడానికి ఈ రోజు జరుపుకుంటున్నాం. ప్రజల ఆలోచనల్లో ఆరోగ్యకరమైనమార్పు తీసుకురావడానికి, అంధ విశ్వాసాల్ని అంతం చేయడానికి ఇలాంటి రోజులు ఉండాలి. వీటి ప్రాధాన్యతను జనానికకి విడమరిచి చెప్పాలి. ఆచారాల పేరిట మూఢనమ్మకాల వెంట పరుగులు పెడుతున్న జనాన్ని ఆపి, మనిషి కేంద్రంగా మానవీయ విలువలకు ప్రాధాన్యమిస్తూ జీవించడం నేర్పాలి!

Also read: హృదయంలో మేధస్సు

నెహ్రూ స్మరణీయుడు

ఒకరకంగా తొలి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూని కూడా ఈ రోజు స్మరించుకోవాలి. ఎందుకంటే, ‘సైంటిఫిక్ టెంపర్’ అనే పదాన్ని మొదటగా ఉపయోగించింది ఆయనే! తన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ అనే గ్రంథంలో ‘సైంటిఫిక్ టెంపర్ ’ అంటే ఏమిటో వివరించారు. ఏదైనాగాని, పరీక్షకకు నిలువనిదానిని, రుజువుకాని దానిని నమ్మకుండా ఉంగగలగడమే సైంటిఫిక్ టెంపర్ (వైజ్ఞానిక స్పృహ) అని ఆయన చెప్పారు. గత కాలపు మెట్టవేదాంతం మీద, అల్లుకున్న కథలమీద నమ్మకం ఉంచుకోవడం కాదనీ, కార్యకారణ సంబంధాన్ని తెలుసుకోవడమే సైంటిఫిక్ టెంపర్ అని తేల్చి చెప్పారు. ఒక రకంగా ఈ పదం, ఆ ఆలోచన భారతదేశానిదే. ఈ దేశంలో విలసిల్లిన చార్వాక దర్శనం, బుద్దదర్శనాల సారాంశాల్ని ఆధునీకరించి పండిట్ నెహ్రూ నిర్వచించి ఉంటారు. కానీ ప్రస్తుత ప్రభుత్వానికి నెహ్రూజీ అంటే పడదు. ఆయన చెప్పిన సైంటిఫిక్ టెంపర్ అంటే ఏమిటో తెలియదు. దేశవ్యాప్తంగా ఆయన నెలకొల్పిన వైజ్ఞానిక సంస్థలకు ప్రతియేటా విడుదల చేయాల్సిన నిధులు కూడా విడుదల చేయరు. ఇలాంటి సమయంలో దేశంలోని 136 కోట్ల జనం ఏం చేయాలి? చేతులు ముడుచుకుని కూర్చోవాలా? లేక వైజ్ఞానిక స్పృహ గలవారికి అధికారం కట్టబెట్టాలా?

Also read: శాస్త్రజ్ఞులూ, నాస్తికులూ మానవతావాదులే!

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles