Monday, January 30, 2023

నిజాం దుష్టపాలన అంతమైన రోజు

హైదరాబాదు సంస్థానాన్ని పరిపాలించిన చివరి నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్  అవి కట్టించాడు, ఇవి కట్టించాడు – అని గొప్పలు చెప్పుకోవడం బాగానే ఉంటుంది. కానీ అతని నిరంకుశ, నియంతృత్వ పాలన మాటేమిటీ? ఏ రాజైనా తన రాజ్యాన్ని వల్లకాడుగా ఉంచుకోలేడు. తన రాజ్యానికి ఏవో కొన్ని అందాలు అద్దుకుని, ఎంతో కొంత అభివృద్ధి జరిగినట్టుగా చూపించుకుంటాడు. నిజాం రాజు చేసింది కూడా అదే. అలాంటివాటిని భూతద్దంలో చూపించి ‘‘నిజాం రాజు మంచోడు, గొప్పోడు’’ అని సర్టిఫికేట్లు ఇవ్వడం సమంజసం కాదు. చరిత్ర తెలుసుకోనివారు, సామాజిక బాధ్యత లేక, విషయాన్ని విశ్లేషించుకోలేనివారు చేసే పని అది! నిజాం రాజు అంత మంచోడే అయితే గిరిజన నాయకుడు కొమురం భీం ఎందుకు ఆయన మీద తిరగబడ్డాడు? ఎందుకు పోరాడాడు? మనం ఆలోచించాలి.  నిజాం గొప్పోడే అయితే, నిజాంపై, రజాకార్లపై షోయబుల్లా ఖాన్ ఎందుకు అక్షరాయుధాలు సంధించాడు? ఎందుకు హత్యచేయబడ్డాడు? నిజాం గొప్పోడే అయితే మరి చాకలి ఐలమ్మ ఎందుకు నవాబు పాలన మీద తిరబడిందీ? నిజాం రాజు గొప్పోడే అయితే, కమ్యూనిస్ట్ లు, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఆయనకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. నిజాం రాజు గొప్పోడే అయినతే ‘మా నిజాము రాజు తరతరాల బూజు’ అని ఎందుకు మహాకవి దాశరథి ఎద్దేవా చేశారు? నిజాం నవాబుకు గోల్కొండ ఖిల్లా కింద గోరి కడతామని – ఎందుకు యాదగిరి పాటెత్తుకున్నాడు? ఆబీద్ రోడ్డులో నారాయణరావు పవార్ ఎందుకు నిజాం మీద బాంబు విసిరాడు? నిజాం నవాబు మంచోడు, గొప్పోడు సెక్యులరన్నది ఎవరు బాబూ?

Also read: వైజ్ఞానిక స్పృహకోసం ఒక రోజు – 20 ఆగస్టు

మై ఖుదా పర్షాద్

ఏడో నిజాం నవాబు – ఉస్మాన్ అలీ ఖాన్ అధికారంలోకి రాగానే తన తండ్రి కాలం నుండి ప్రధానమంత్రి పదవిలో ఉన్న రాజా కిషన్ పర్షాద్ ను ఎందుకు అధికారంలోంచి తొలగించాడు?  ఒక హిందువుకు అత్యున్నత పదవిలో అర్హత లేదనే కదా? ‘తూ కిషన్ పర్షాద్ హై తో మై ఖుదా పర్ షాద్’ అని ఎందుకు ఈసడించాడు? పర్షాద్ – అంటే ప్రసాదం. నువ్వు కృష్ణుడి ప్రసాదమైనే, నేను ఖుదా ప్రసాదాన్ని – అని చెప్పుకోవడం ఎందుకూ? పైగా హిందువుల గుర్తులపై, బొట్లపై తన మతద్వేషాన్ని వెళ్ళగక్కడమెందుకూ? అవన్నీఆరోజుల్లో రహబరే దక్కన్ – అనే పత్రికలో అచ్చయ్యాయి కూడా!

నెహ్రూ, నిజాం

చరిత్ర నుంచి విశ్లేషించి అర్థం చేసుకునేవారు ఇలాంటి ఎన్నో బలిదానాల గూర్చి ఆలోచించాలి. వీరందరినీ మనమెందుకు గౌరవభావంతో స్మరించుకుంటున్నాం? అనేది లోచిస్తే విషయాలు బయటపడతాయి. ఏడవ ఆసిఫ్ జా నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ గొప్పోడయితే తన ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడేందకు, ఇక్కడి ప్రజలను ఊచకోత కోసేందుకు లాతూర్ నుంచి ఓ పరమ కిరాతకుణ్ణి ఎందుకు రప్పించాడు? ఆ కిరాతకుడి పేరు ఖాసిం రజ్వీ. అతని ఆధ్వర్యంలో తన అనధికార సైన్యాన్ని, అంటే రజాకార్లను, ఎందుకు విచ్చలవిడిగా చెలరేగనిచ్చాడు? రజాకార్ల నీచమైన దౌర్జన్యాలు ఎంత హీనాతిహీనంగా ఉండేవో ఇప్పుడు మనం ఊహించుకోలేం కూడా! నిజాం విధించే  సిస్తు (పన్ను) ఎన్ని రెట్లు అధికంగా ఉండేదంటే రైతుల రాబడిని మించి ఉండేది. ప్రపంచ ధనికుల్లో ఒకడిగా నిజాం గుర్తింపబడ్డాడంటే కారణం ఇదే. పేదరైతుల పొట్టలు కొట్టి సంపాదించిందే  అంతా – వ్యక్తిగతంగా నిజాం మాత్రం పరమ పిసినారి. ఎంతటి ముఖ్యమైన పెద్ద అతిథి వచ్చినా, లోపలి నుండి ఒక చాయ్, రెండు ఉస్మానియా బిస్కట్లు మాత్రమే తెప్పించేవాడు.

also read: నెహ్రూ ఆత్మకథ చదివి పొంగిపోయిన రవీంద్రుడు

ఖాసిం రజ్వీ రాక్షసక్రీడ

నిజాం కనుసన్నల్లో ఖాసిం రజ్వీ ఆధ్వర్యంలో రజాకార్లు బలవంతంగా పన్నులు వసూలు చేసేవారు. పన్నులు చెల్లించనివారి గోర్ల కింద మాంసం కత్తిరించి, గోర్లు ఊడబెరికేవాళ్ళు. భర్తల ముందే భార్యపై అత్యాచారం చేయడం మామూలు విషయమే.  ఈ బాధలు పడలేక పారిపోయినవారెవరైనా ఉంటే, వారి ఆచూకీ చెప్పమని భార్యల్ని – ఇతర కుటుంబ సభ్యుల్ని హింసించేవారు. వారు గనక ఆచూకీ చెప్పలేకపోతే, ఇంట్లో ఉన్న పిల్లలను ఎగరేసి కత్తికి గుచ్చి చంపేసేవారు. ఆ రోజుల్లో రజాకార్లను చూసిన వాళ్ళెవరూ బతికిన దాఖలాలు లేవు. రజాకార్లు గుర్రాల మీద ఊళ్ళలోంచి పోతూ ఉంటే, ప్రజలు ఇళ్ళలోకి వెళ్ళి తలుపులేసుకునేవారు. చిన్నచిన్న సందుల్లోంచి భయంభయంగా చూసేవారు. రజాకార్ల దండు వెళుతూ ఉన్నప్పుడు ఎవరైనా పొరపాటున దారిలో కనిపిస్తే, వారిని గుర్రాలకు కట్టి పాశవికంగా చచ్చేదాకా ఈడ్చుకెళ్ళేవారు. ఇప్పుడు ఆలోచిస్తే, అసలు వీళ్ళు మనుషులేనా అని అనిపిస్తుంది. వీళ్ళను ఇలా దేశంమీద వదిలేసిన నిజాం రాజు మనిషేనా అని అనుమానపడాల్సి వస్తోంది. పైగా ఈయన మంచోడు, గొప్పోడు, సెక్యులర్ రాజు అని కితాబులిచ్చేవారి బుద్ధికుశలతను శంకించాల్సి వస్తోంది. రజాకార్ల దుర్మర్గాన్ని హైదరాబాద్ సంస్థానం 13 సెప్టెంబర్ 1948 వరకు భరించక తప్పలేదు. భారత ప్రభుత్వానికి ఎవరైనా సహకరిస్తే వారందరి ప్రాణాలు తీస్తామని ఇక్కడి ప్రజల్ని రజాకార్లు బెదిరించారు. ఆ సమయంలో సుమారు ముప్పయ్ రెండు వేల మంది స్థానికులు సికింద్రాబాదు మిలట్రీకంటోన్మెంట్ లో తలదాచుకున్నారు.

ఖాసిం రజ్వీ

బెడిసికొట్టిన రజ్వీ దౌత్యం

రజాకార్ల అండదండలతో పరిపాలన వెలగబెట్టిన చివరి నిజాం ఉస్మాన్ అలీ స్వతంత్ర రాజ్యంగా ఉండిపోవాలని గట్టి ప్రయత్నమే చేశాడు. భారత యూనియన్ ప్రభుత్వం అందుకు ససేమిరా అనడంతో, దూరంలో ఉన్నదైనా సరే – పాకిస్తాన్ లో భాగంగా ఉండడానికి ప్రయత్నించాడు. (బంగ్లాదేశ్ ఏర్పడక పూర్వం అది పాకిస్థాన్ లోని భాగంగా ఉండేది. అలాగే తన హైదరాబాదు సంస్థానం కూడా పాకిస్తాన్ లో ఉండాలనుకున్నాడు.) భారత ప్రభుత్వం, ముఖ్యంగా సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అందుకు ఒప్పుకోలేదు. లొంగిపోక తప్పదని ఒత్తిడి తెచ్చారు. నిజాం ఖాసింను తన ప్రతినిధిగా ఢిల్లీకి పంపించాడు. ఖాసిం తన తెలివితేటలు అక్కడ ప్రదర్శించబోయాడు. ‘హైదరాబాద్ ను ఇండియన్ యూనియన్ లో కలపడానికి ప్రయత్నిస్తే మేం ఊరుకోం. అక్కడ ఉన్న కోటి మందిని ఊచకోత కోసి చంపేస్తాం!’ అని బెదిరించాడు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్  బెదరలేదు. ప్రశాంతంగా జవాబిచ్చాడు. దాంతోఖాసిం ఖంగు తన్ని తోకముడవాల్సి వచ్చింది. ‘‘నీకు ఇద్దరు భార్యలు. ఆరుగురు పిల్లలు మాత్రమే ఉన్నారు. కాని మీ నిజాం రాజుకు పదుల సంఖ్యలో భార్యలు, వందల సంఖ్యలో పిల్లలూ ఉన్నారు. వారంతా భద్రంగా, క్షేమంగా ఉండాలన్నదే మా కోరిక!’’ – ఖాసిం మరేమీ మాట్లాడలేకపోయాడు. తన దౌత్యం బెడిసికొట్టిందని గ్రహించి అక్కణ్ణించి మెల్లగా జారుకున్నాడు.

Also read: ప్రభుత్వాన్ని ఎదిరించిన ఒంటరి వీరుడు సోల్జినిత్సిన్

17 సెప్టెబర్ 1948న భారత ప్రభుత్వం, హైదరాబాద్ నిజాం సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేసుకుంది. నాటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చలవ వల్ల నిజాంమీర్ ఉస్మాన్ అలీఖాన్ కు రాజ్ ప్రముఖ్ హోదా దక్కింది. అంటే గవర్నర్ హోదాలాంటిది. నాటి హైదరాబాద్ లోని మిగతా ప్రముఖులంతా దయనీయమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. నిజాం ప్రభుత్వ దివాన్ మీర్ లాయక్ అలీ ఖాన్ తెలివిగా ముందే మేల్కొని , అందరికంటే ముందు పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. హైదరాబాద్ సంస్థానానికి మేజర్ జనరల్ అయిన సయ్యద్ అహ్మద్ అల్ ఇద్రూస్ జీవితం చాలా కాలం జైలులో గడిచింది. విడుదలైన తర్వాత అనామకుడిగా బతికాడు. హైదరాబాదులో ఇండియా ఏజెంట్ జనరల్ వచ్చి, లోపాయకారిగా నిజాంతో కలిసి, ఇక్కడి అరాచకాల్ని భారత ప్రభుత్వానికి తెలియజేయకుండా చేసిన కె.ఎ.మున్షీ అనామకుడిగా కాలగర్భంలో కలిసిపోయాడు. చివరి నిముషంలో రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వి విషయం అర్థం చేసుకున్నాడు. ఇక్కడే ఉంటే జనం నిలువునా చీల్చిచంపుతారని భయపడ్డాడు. అతను పాకిస్తాన్ పారిపోక ముందేభారత ప్రభుత్వం పట్టుకొని జైల్లో పెట్టింది.  జైలు నుంచి విడుదలైన తర్వాత 1957లో మళ్ళీ అదేసెప్టెంబర్ 17న పాకిస్తాన్ వెళ్ళిపోయాడు.  అక్కడ కరాచీలో ఎవ్వరూ పట్టించుకోకపోవడం వల్ల, హీనాతి హీనమైన పరిస్థితుల్లో చచ్చిపోయాడు. ఇక్కడి హైదరాబాదులో రజాకార్లను దొరికినవారిని దొరికినట్టుగా భారత సైన్యం చంపేసింది.  కొంతమంది తెలివిగా తప్పించుకుని ముందే పాకిస్తాన్ పారిపొయ్యారు. పాకిస్తాన్ పోలేని రజాకార్లు కొందరు, వెంటనే గడ్డాలు గీయించుకుని మామూలు పౌరుల్లో కలిసిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు.

Also read: జాతి భక్షకులు నరభక్షకులకన్నా ప్రమాదం!

తెలుగుపై నిషేధం

చివరి నిజాం ఉస్మాన్ (న్మాద్) అలీ తన పాలనలో మెజారిటీ ప్రజల భాష అయిన తెలుగును నిషేధించాడు. తెలుగు పత్రికలు దొంగతనంగా చదువుకోవాల్సివచ్చేది. హిందువులు తమ పండుగలు బహిరంగంగా జరుపుకునే వీలుండేది కాదు. ఊరేగింపులపైనా, సభలపైనా నిషేధం ఉండేది. నాటి కవులు, రచయితలు, పాత్రికేయులు ఎన్నో కష్టాలు పడ్డారు. మెజారిటీ ప్రజలైన హిందువులకు హైదరాబాద్ సంస్థానంలో ప్రభుత్వోద్యోగాలలో ప్రాధాన్యముండేది కాదు. ఇవన్నీ కాకుండా మత మార్పిడిలు విరివిగా జరిగేవి. హిందువుల బొట్లను రజాకార్లు నాలుకతో నాకేసేవారు. మత మార్పిడుల కోసం ‘తబ్లిగ్’ పేరిట ఒక ప్రభుత్వ సంస్థ పని చేసేది. విద్యావంతులైన హిందువులు కూడా రూమీటోపీ, షేర్వాణీలతో పరాయీకరణ చెంది, ముస్లిం రాజవంశీకులవలె తిరుగుతూ ఉండేవారు. ఉస్మానియా యూనివర్శిటీకి సంబంధించిన పాత ఫోటోలు చూస్తే ఈ విషయం తెలుస్తుంది. నాటి నిజాం నియంతృత్వ పాలనను, మత మార్పిడులను ప్రశ్నించిన కాంగ్రెస్ కార్యకర్తల్ని, భాషోద్యమకారుల్ని, పాత్రికేయుల్ని, ఆర్య సమాజ్ వారిని నిర్దాక్షిణ్యంగా హత్యచేసేవారు. వట్టికొండ అళ్వారు స్వామిని, దాశరథి కృష్ణమాచార్యను జైల్లో పెట్టింది ఆ నాటి ప్రభుత్వమే కదా? ప్రత్యక్షంగా తుపాకి పట్టుకొని పోరు సల్పిన యోధుడు దాశరథి. అంతటి ఘనచరిత్ర ప్రపంచంలో మరో కవికి లేదు.

Also read: ‘హకూన మటాటా’: బాధలూ, ఒత్తిళ్లూ లేకుండా ఉండండి!

ఎవరు బాబూ అన్నది నిజాం రాజు సెక్యులర్ అనీ?

నిజాం రాజు ప్రజల మీద మూడు రకాల బలగాలను ఉపయోగించాడు. 1.ఖాసిం రజ్వీ నాయకత్వంలో రజకార్ల దండు. 2. నిజాం సైన్యం. 3. పోలీసులు. వీరంతా కలిసి విచ్చలవిడిగా చేసిన దోపిళ్ళు, హత్యలు, అత్యాచారాల గురించి తెలంగాణలో ఇంకా బతికే ఉన్న పెద్దవాళ్ళు ఇప్పటికీ చెపుతారు. మహిళల్ని నగ్నంగా బతుకమ్మలాడించిన గంగతులు, మగవాళ్ళను ఎక్కడికక్కడే కాల్చి చంపిన సంగతులు ఎన్నెన్నో చెపుతారు. ప్రత్యక్షంగా ఎంతో మంది నోట నేనూ విన్నాను. ఇక్కడి అరాచకాలు భరించలేక, తలదాచుకోవడానికి తాత్కాలికంగా ఎంతోమంది బెజవాడకు తరలిపోయ్యారు. అమాయకుల రక్తంతో తడిసిన నాటి హైదరాబాద్ సంస్థానపు చరిత్ర పుటలు ఇప్పటికీ తడితడిగానే ఉన్నాయి. నాటి జ్ఞాపకాలతో భయకంపితులవుతున్న సీనియర్  సిటిజన్లు ఇంకా కొందరు మన మధ్యనే ఉన్నారు. ఎవరు బాబూ అన్నది నిజాం రాజు సెక్యులర్ అనీ?

Also read: ట్రావెన్ కోర్ లో రొమ్ము పన్ను

Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles