Saturday, May 4, 2024

స్వామి వివేకానంద సంఘపరివార్ హితైషి కాదు, ఆయనను కాజేయడానికి పరివార్ కు ఉదారవాదులు తోడ్పడ్డారు

వివేకానంద వారసత్వాన్ని కాజేయడం సంఘ్ పరివార్ కు సులువై పోయింది. సగటు భారతీయుడు ఆయనను కాషాయవస్త్రాలు ధరించిన సన్యాసి అని అనుకుంటాడు. ఆయన గురించి అంత మాత్రమే ప్రజలకు తెలియాలని సంఘ్ పరివార్ భావిస్తున్నది.

మన రిపబ్లిక్ ను తిరిగి సాధించేందుకు జరుగుతున్న పోరాటంలో స్వామి వివేకానంద దోహదకారిగా ఉన్నారా? లేక హిందూ ఆధిక్య భావజాలాన్ని వ్యాప్తి చేసే మేధావిగా, ఆర్ఎస్ఎస్ కు పూర్వీకుడిగా, హిందూత్వపేరు మీద ఈ రోజు అమలు జరుగుతున్న రాజకీయాలకు ఆద్యుడుగా వివేకానందను భావించాలా?

వివేకానందపై పుస్తకం, రచయిత గోవింద్ కృష్ణన్

ఇటీవల వచ్చిన ఒక పుస్తకం ఈ చర్చను తిరిగి ప్రారంభించింది. గోవింద్ కృష్ణన్  రాసిన  ‘వివేకానంద: ద ఫిలాసఫర్ ఆప్ ఫ్రీడం(వివేకానంద, స్వేచ్ఛాస్వాతంత్ర్యాల తత్వవేత్త)’ పుస్తకం కవర్ పేజీ పైన ‘హౌ ద సంఘ్ పరివార్ గ్రేటెస్ట్ ఐకాన్ ఈజ్ ఇట్స్ నెమిసిస్ (సంఘ్ పరివార్ అతిపెద్ద ఆరాధకుడు దాని విధ్వంసకుడు ఎట్లా అవుతాడు?)’ అని ధైర్యంగా ప్రకటించారు. ఈ 485 పేజీల పుస్తకంలో హిందూత్వ మౌలిక సూత్రాలకు, హిందూయిజం ఒంటెత్తు విధానాలకు, అభేద్యమైన జాతీయవాదానికీ, సాంస్కృతిక మితవాదానికి, సామూహిక నియంతృత్వవాదానికీ, మేధోవిరోధ వైఖరికీ వివేకానంద పూర్తి విరుద్ధమనే సిద్ధాంతాన్ని నిరూపించారు.

Also read: రాబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎటైనా కావచ్చు

ఇది కేవలం మేధావులకు మాత్రమే ఆసక్తి కలిగించే, చరిత్రకారులకు వర్తించే గ్రంథం మాత్రమే కాదు.  భారత దేశం వర్తమానానికీ, భవిష్యత్తుకూ సంబంధించిన రాజకీయ వివాదం వివేకానందుడు అనే అంశంపైన అన్వయపోటీకి కాలుదువ్వే రచన. నేను వివేకానందపైన పరిశోధన చేసిన మేధావిని కాకపోయినప్పటికీ ఈ వివాదం కారణంగా అందులో నాకు ఆసక్తి ఉంది. వివేకానంద ఆధ్యాత్మికతత్త్వాన్ని లోతుగా అధ్యయనం చేయడమే కాకుండా జాతీయవాదానికి పూర్వపు భారత దేశంలోనూ, విక్టోరియన్ కాలంలో పాశ్చాత్యదేశాలలోనూ కనిపించిన భావజాలాల సందర్భంలో వివేకానంద ఆలోచనా విధానాన్ని నిలపడం ద్వారా గోవింద్ కృష్ణన్ తన వాదన బలంగా వినిపించారు.

సాంస్కృతికంగా పోషకాహారలోపం  

మన ఎదుట ఉన్న అత్యంత ప్రధానమైన రాజకీయ కర్తవ్యానికి (ముప్పేట దాడి జరుగుతున్నప్పుడు రిపబ్లిక్ ను కాపాడుకోవడానికి సంబంధించిన పోరాటానికి) బలం చేకూర్చేవిధంగా వివేకానందను నిలబెట్టడంలో రచయిత సఫలీకృతుడైనారు. సవాలు ఎదురైనప్పుడు లౌకిక రాజకీయాలు కుప్పకూలిపోవడం విషాదం. కొత్త ఆలోచనలు చేయడం, కొత్త ధోరణులను కనిపెట్టడం, కొత్తవారితో స్నేహం చేయడానికి బదులు ఉదారవాద-లౌకికవాద వర్గం సాంస్కృతిక పరీవాహక ప్రాంతాన్ని కుదించింది. దీన్ని ఆర్ఎస్ఎస్-బీజేపీతో పోల్చి చూడండి. సర్దార్ పటేల్, సుభాష్ చంద్ర బోస్, జయప్రకాష్ నారాయణ్, రాంమనోహర్ లోహియా, భగత్ సింగ్ వంటివారితో ఎన్నడూ సంబంధబాంధవ్యాలు బొత్తిగా లేకపోయినప్పటికీ వారిని తమ వర్గంలో కలిపేసుకున్నారు. తమ నాయకులుగా ప్రకటించుకున్నారు.

వివేకానంద భావజాల వారసత్వాన్ని సొంతం చేసుకోవడం సంఘ్ పరివారానికి చాలా సులువు. చికాగోలో జరిగిన ప్రపంచ ఆధ్యాత్మిక మహాసభలలో అద్భుతంగా ప్రసంగించి భారతీయ చింతనను అంతర్జాతీయ సమాజానికి ఎరుకపరిచారనే సంగతి మినహా సగటు భారతీయులకు వివేకానంద గురించి పెద్దగా తెలియదు. భారతీయుడిగా, హిందువుగా ఉండటంలోని ఆత్మగౌరవాన్ని అస్పష్టంగానైనా చాటిన కాషాయాంబరధారి అయిన హిందూ సన్యాసిగా వివేకానందను అర్థం చేసుకుంటారు. అంతవరకే ప్రజల తెలుసుకోవాలని ఆర్ఎస్ఎస్ కోరుకుంటుంది.

Also read: వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎక్కడ దృష్టి పెట్టాలో కర్ణాటక ఎన్నికలు చెప్పాయి

ఉదారవాద ప్రగతివాదులు వివేకానంద పట్ల అంటీముట్టనట్టు ఉండడం లేదా ఆయనను అనుమానించడం ద్వారా ఆయనను సంఘ్ పరివార్ కాజేయడానికి దోహదం చేశారు. వివేకానంద ప్రస్తావన వచ్చినప్పుడు ఉదారవాదులు నిశ్శబ్దంగా ఉండటం లేదా పరిమితంగా పొగడటం చేస్తారు. లౌకికవాదులు వివేకానందను వదిలించుకోవాలనే సంకల్పంతో ఉండటంతో ఆయనను సొంతం చేసుకోవాలనే  సంఘ్ పరివార్ కోరిక బలోపేతమైంది. హిందూ మతపరమైన ఉద్యమానికి అవసరమైన భావజాలపరమైన వేదికను అందజేశారంటూ వివేకానందపైన ఆరోపణ చేస్తూ 1975లో ప్రభాదీక్షిత్ రాసిన వ్యాసంతో మొదలుకొని జ్యోతిర్మయ్ శర్మ రాసిన ‘‘ఎ స్టేట్ మెంట్ ఆఫ్ రెలిజియన్: స్వామీ వివేకానంద అండ్ ది మేకింగ్ ఆఫ్ హిందూ నేషనలిజం (మతపరమైన ప్రకటన, స్వామీ వివేకానంద, హిందూజాతీయత నిర్మాణం)’’ అనే గ్రంథం వరకూ వివేకానందను హిందూమతత్త్వవాదిగా, సామాజిక సంప్రదాయవాదిగా అభివర్ణించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. ఈ వ్యాఖ్యలను ఇదివరకు కూడా సవాలు చేశారు. ఖండించారు. 1998లో తపన్ రాయ్ చౌధురి, 2003లో జి. బెకర్ లెగ్, 2020లో స్వామీ మేధానంద్ (ఉరఫ్ అయోన్ మహరాజ్)లు అటువంటి కళ్ళు తెరిపించే రచనలు చేశారు. అపోహలకు స్వస్తి పలకడానికి గోవింద్ కృష్ణన్ పుస్తకం మరింత దోహదం చేస్తుంది.

హిందువే, కానీ ఆధిక్యవాది కాదు

స్వామీ వివేకానంద హిందూమతాన్ని విశ్వసించిన, ఆచరించిన వ్యక్తి.  మానవాళికి ఇచ్చేందుకు కొంత ప్రత్యేకమైన ధార్మికశక్తి హిందూమతానికి ఉన్నదనే నమ్మకంతో సగర్వంగా వ్యవహరించిన హిందువు. తన కాలంలో హిందూమతాన్నిఅపహాస్యం చేసే చదువుకున్న భారతీయులు, వలసవాదులలో కనిపించిన ధోరణిని వ్యతిరేకించిన మహానుభావుడు. నిజానికి ‘ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ (క్రీస్తును అనుకరించడం)’ అనే పుస్తకం వివేకానంద వెంట ఉండేది. క్రీస్తును ఆరాధించినట్టు కనిపించేవారు. భారతీయ సమాజం క్షీణదశకు ఆ సమాజంలో ఉన్న అసమానతలూ, వేరేవారిని దరిచేరనీయకపోవడం అనే అవలక్షణాలే కారణం కానీ ముస్లిం ఆక్రమణదారులను నిందించి ప్రయోజనం లేదని వివేకానంద స్పష్టం చేశారు. సమానత్వం, సోదరభావం పెంపొందించి, అద్వైతాన్ని ఆచరిస్తున్నందుకు ఇస్లామ్ ను వివేకానంద ప్రశంసించారు.

వివేకానంద, సహచరులు

ఇతర మతాలన్నింటికంటే వేదాంత తత్త్వం గొప్పదనే విషయంలో వివేకానంద అభిప్రాయం ఏమిటి? ద్వైతం ఆధారంగా విశిష్టాద్వైత (షరతులతో కూడిన ద్వైతం), అద్వైతంగా పరిణమించడం (ద్వైదీభావం లేనటువంటిది), అదే హిందూమత సారాంశమని వివేకానందుని అభిప్రాయం. వివేకానంద మేధోపరంగా ఎదుగుతున్న క్రమంలో అది ఒక దశ మాత్రమేనని మేధానంద వంటి పండితులు అంటారు. అన్ని మతాలు వివిధ మార్గాలలో సత్యాన్ని చేరడానికి దోహదం చేసేవనీ, ప్రతిమతం నాలుగు యోగాలలో ఏదో ఒక యోగానికి చెందినదనీ వ్యాఖ్యానిస్తారు.

Also read: కర్ణాటక ఎన్నికలలో 4 నిర్ణాయక అంశాలు

ఈ అభిప్రాయాన్ని తిరస్కరించినప్పటికీ ఒక హిందువు కానీ, ముస్లిం కానీ, క్రైస్తవుడు కానీ తాను విశ్వసించే మతం మాత్రమే ప్రత్యేకమైదనిగా, సర్వోన్నతమైనదిగా భావిస్తారని నిందించడం సమంజసం కాదు. వలసపాలకుల ఆధిపత్యం ఉన్న రోజులలో ఒక హిందువు అటువంటి ప్రకటన చేయడం తన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. అన్ని మతాలను సమానంగా గుర్తించి గౌరవించడమే హిందూమతంలోని ఔన్నత్యం. దాన్ని మతాధిక్యభావనగా పరిగణించడం సరికాదు.

మహాత్మాగాంధీ హిందూ మతాన్ని, మౌలానా ఆజాద్ ఇస్లాం మతాన్ని ఆచరించినట్టు వివేకానంద హిందూ మతం గురించి ప్రచారం చేయడానికీ, మతానికి రాజ్యం దూరంగా ఉండాలనీ, అన్ని మతాలకూ సూత్రబద్ధంగా సమదూరం పాటించాలనీ, ఆధిక్యప్రదర్శన కూడదనీ స్పష్టం చేసే లౌకికవాదానికీ మధ్య వైరుధ్యం లేదు. అన్ని మతాలనూ సహించడం మాత్రమే కాదు, మత వైవిధ్యాన్ని ఉత్సవ సదృశంగా పరిగణించడం అనే విశ్వాసానికి వివేకానంద అందించిన పటిష్ఠమైన తాత్త్విక వేదిక ఆయన ప్రతిపాదించిన విశ్వమతానికి సరిపోతుంది.

కుల అసమానతల విమర్శకుడు

కుల వ్యవస్థనూ, బ్రాహ్మణ ఆధిక్యాన్ని వివేకానంద సమర్థించారన్నది మరో అపోహ. ఆరోపణ. ఇది ఎవరో కావాలని చేసిన వక్రీకరణ కాకపోవచ్చు. అటువంటి ఆరోపణలను సాధికారికంగా ఖండించేందుకు గోవింద్ కృష్ణన్ పెద్ద అధ్యాయాన్నే కేటాయించారు. కులం గురించి వివేకానంద చేసిన వ్యాఖ్యలను గమనిస్తే ఆయన కులాన్ని ఒక జాతిగానూ, సమాజంలోని నిచ్చెనమెట్ల వ్యవస్థలో భాగంగానూ పరిగణించారు. జాతిని ఒక సామూహిక వ్యక్తీకరణలో భాగంగా సమర్థించారు. నిచ్చెనమెట్లను రద్దు కావలసిన, అసమంజసమైన, నిర్హేతుకమైన, అసమానమైన, అన్యాయమైన వ్యవస్థగా ఖండించారు. ‘‘ఆధునిక యుగంలో  కుల విభేదాలు ప్రగతికి నిరోధకాలు. ఈ విభేదాల వల్ల కుంచించుకుపోతాం, పరిమితం అవుతాం, విడిపోతాం. కొత్త ఆలోచనలు పురోగమించినప్పుడు ఆ (కుల)వ్యవస్థ కూలిపోతుంది’’ అని ఆయన అన్నారు.

Also read: బీజేపీ సామాజిక న్యాయం రాజకీయాన్ని రాహుల్ మండల్ -3 తో ఎదుర్కోవచ్చు

అదే విధంగా ‘బ్రాహ్మణిజం’ అనే మాటను రెండు అర్థాలలో ఉపయోగించారు. ఈ రెండు అర్థాలూ భారత మేధోప్రపంచంలో సుపరిచితమైనవే. మేధోపరమైన ప్రతిభను కనిపించినవారు బ్రాహ్మలని ఒక అర్థం. పుట్టుక కారణంగా బ్రాహ్మలని పిలిచేవారని మరో  అర్థం. మొదటి రకాన్ని ప్రశంసిస్తూ, రెండవ రకాన్ని వారి నుంచి సమాజం ఆశించిన స్థాయికి ఎదగనందుకు నిందించారు. బ్రాహ్మణకులం తన చేతులతోనే తన సమాధిని నిర్మించుకుంటున్నది.  ఇది జరగవలసిన పనే. ఉన్నత స్థాయికి చెందిన ప్రతి కులం తన చితిని తానే పేర్చుకోవడం ప్రధాన బాధ్యతగా పరిగణించడం స్వాగతించవలసిన అంశం’’ అని కూడా వివేకానంద అన్నారు.

వివేకానంద సామాజికశాస్త్రజ్ఞుడు కాదు. ఈ విషయంలో ఆయన అభిప్రాయాలలో అస్పష్టత, దాటవేత, అస్థిరత  కనిపిస్తాయి. ఆయనకు దురుద్దేశాలు ఆపాదించడం కొంటెతనం అవుతుంది. సామ్యవాదం గురించి మాట్లాడిన తొలి భారతీయుడు కాకపోవచ్చును కానీ ఆ పని చేసిన తొలి భారతీయులలో వివేకానంద ఒకరు.  లండన్ లో బ్రిటిష్ సామాజికతత్త్వవేత్త, కవి ఎడ్వర్డ్ కార్పెంటర్ తోనూ, పారిస్ లో అరాచక మేధావి పీలర్ క్రొపోట్కిన్ తోనూ సంపర్కంలో ఉండేవారు. వివేకానంద రచనలు చదివినవారికి బలమైన సమతావాద ధోరణి కనిపించకమానదు. లింగ సమానత్వం, మహిళల విద్య, అందరికీ ఓటు హక్కు విషయంలో రాజీలేని పోరాటం చేసిన వ్యక్తి. మతం, సంప్రదాయం పేరు మీద మహిళల పట్ల వివక్ష ప్రదర్శించడాన్ని గట్టిగా వ్యతిరేకించారు.

పదాడంబరం పక్కన పెడితే, వివేకానంద పుట్టుక కారణంగానో, కులం కారణంగానో మనుషుల పట్ల వివక్ష ప్రదర్శించడాన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. ఆయనకు సంబంధించినంత వరకూ కులం అనేది సామాజికాంశమే కానీ మతంతో ప్రమేయం ఉన్న విషయం కాదు కనుక హిందూధర్మానికీ కులానికి సంబంధం లేదు. డాక్టర్ అంబేడ్కర్ అవగాహనకు ఇది వ్యతిరేకంగా కనిపిస్తుంది. నారాయణగురు తర్కానికి దగ్గర. అంతమాత్రాన కులం ప్రాతిపదికపైన జరుగుతున్న అన్యాయాన్ని ఆయన పరోక్షంగానైనా సమర్థిస్తున్నారని అనుకోకూడదు. అంబేడ్కర్ యుగం తర్వాత మనం కులం గురించి మాట్లాడుకునే తీరులో వివేకానంద మాట్లాడి ఉండరు. ఆయన కాలంలో అది సాధ్యం కాదు.

వివిధ రూపాల్లో వివేకానంద

భావజాల ఆయుధం, మార్గదర్శి

అపవాదులూ, అపోహలూ, చారిత్రక వక్రీకరణలూ అధిగమించి చూసినట్లయితే స్వామి వివేకానందను అర్థం చేసుకోవడం మన ముందు ఉన్న పెనుసవాలు. తీర్పు చెప్పడం, వర్తమాన ఉదారవాద రాజకీయ ప్రమాణాలకూ, సామాజిక న్యాయానికీ, ఆధునికతకూ అనుగుణంగా ఆయనను అంచనావేయడం పెద్ద కష్టం కాదు. అప్పటికీ ఆయనను ప్రశంసిస్తాం. ఆయన మతపరమైన భావాలు కలిగిన వ్యక్తి అయినప్పటికీ హేతుబద్ధంగా ఆలోచించేవాడుగా కనిపిస్తాడు. రాజీలేని హిందువు అయినప్పటికీ లౌకికవాది. మన వారసత్వాన్ని పరిరక్షించాలని గట్టిగా కోరుకుంటున్నప్పటికీ ఆధునికుడు. ఇక్కడే మౌలికమైన అసంబద్ధత ఉన్నది. మనం ఆయనను అంచనా వేయడానికి ఉపయోగిస్తున్న ప్రమాణాలు ఆయన కాలంలో లేవు. మనం మన వైఖరులను సిద్ధం చేసుకోవడానికి ఆయన వంటి ఆలోచనాపరులు సహాయం చేశారని గమనించాలి. మనం ఉపయోగిస్తున్న విలువలు విశ్వాన్ని అంచనావేయడానికి తగినవనీ, అందువల్ల మనం కీలకమైన స్థాయిలో ఉన్నామని మనం ఊహించుకుంటున్నాం. మన ఊహలు సరైనవా, కావా అనే విషయంలో తిరిగి ఆలోచించడానికి వివేకానంద మనలను కర్తవ్యోన్ముఖుల్ని చేస్తాడు. లౌకిక ప్రపంచంలో ఖాళీగా ఉన్న ఆధ్యాత్మికతను గుర్తించవలసిందిగా ఒత్తిడి చేస్తాడు. మత మౌఢ్యాన్ని అధిగమించవలసిందిగా ప్రోత్సహిస్తాడు. పాశ్చాత్య ప్రపంచపు ఆధునికతకన్నా మన ఆధునికత ఎట్లా భిన్నంగా ఉండాలో ఆలోచించమని చెబుతాడు. హిందూమతం (ఇతర మతాల) తో మనకున్న సంబంధాన్ని పునరాలోచించమని అంటాడు. పూర్తిగా ఆధ్యాత్మికభావంతో నిండి ఉండటం, పూర్తిగా లౌకికవాదానికి కట్టుబడటం అంటే ఎట్లా ఉంటుందో అనుభవించి చూడమంటాడు.

Also read: లౌకికవాదులు నా వెంట పడటం- భారత దేశంలో దాడికి గురి అవుతున్నామనే మనస్తత్వానికి నిదర్శనం

సంఘ్ పరివార్ పైన దాడి చేయడానికి వివేకానంద బలమైన భావజాలపు ప్రతీక. ఆయన వారసత్వం మనలను అంతర్గతంగా, బహిర్గతంగా పరీక్షించుకోవడానికి పనికి వచ్చే టార్చిలైటులాగా ఉపయోగిస్తుంది కానీ ఎప్పుడో ఒకప్పుడు అవసరానికి ఉపయోగించుకోవడానికి కాదు. మన రిపబ్లిక్ ను తిరిగి పొందడానికి వివేకానంద మనకు సహాయం చేయగలడు. అందుకు మనం మన రిపబ్లిక్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక పార్శ్వాలను సవ్యంగా అర్థం చేసుకోవడం అవసరం. సరికొత్త భారత రిపబ్లిక్ నిర్మాణంలో ఇది ఒకానొక వేదాంత మార్గం కావచ్చునేమో!

Also read: భారత ప్రజలు రాహుల్ గాంధీని గుండెకు హత్తుకున్న వేళ!  

Yogendra Yadav
Yogendra Yadav
యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు. స్వరాజ్ అభియాన్, జైకిసాన్ ఆందోళన్ సంస్థల సభ్యుడు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకై శ్రమిస్తున్న బుద్ధిజీవులలో ఒకరు. దిల్లీ నివాసి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles