Saturday, April 27, 2024

బెయిల్ ఇవ్వకూడని నేరం సెతల్వాడ్ చేయలేదు: సుప్రీంకోర్టు

‘ఈ కేసులో బెయిలు నిరాకరించదగిన నేరం ఏమీ లేదు‘ అని టీస్తా సెతల్వాడ్ కేసులో సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. ఆమెను రెండు నెలలకు పైగా గుజరాత్ లో కస్టడీలో ఉంచారు. ఆరు వారాల తర్వాత సమాధానం ఇవ్వాలంటూ గుజరాత్ హైకోర్టు నోటీసులు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు బెంచి తప్పుపట్టింది. ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్ నాయకత్వంలోని సుప్రీం బెంచ్ రెండు నెలలకు పైగా జైలులో ఉన్నప్పటికీ సెతల్వాడ్ పైన చార్జిషీటు దాఖలు చేయలేదని ఆక్షేపించింది. సెతల్వాడ్ బెయిలు దరఖాస్తుపైన గుజరాత్ హైకోర్టు వైఖరిని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. సెతల్వాడ్ కు ఆగస్టు 3న నోటీసులు ఇచ్చిన హైకోర్టు కేసును చాలా రోజులకు వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తితో పాటు జస్టిస్ ఎస్ రవీంద్రభట్, జస్టిస్ సుధాంశు ధూలియాలు కూడా బెంచిలో ఉన్నారు.

‘‘ఆమె ఒక మహిళ. ఆరు వారాల తర్వాత తిరిగి పంపే నోటీసును హైకోర్టు ఎట్లా ఇచ్చింది? గుజరాత్ హైకోర్టులో ఈ పద్ధతి ప్రామాణికమా? ఇటువంటి కేసులో ఒక మహిళ ఉండి ఆరు వారాల తర్వాత సమాధానం పంపవలసిందిగా గుజరాత్ హైకోర్టు నోటీసు ఇచ్చిన సందర్భం మరేదైనా ఉంటే తెలియజేయండి’’ అంటూ ప్రధాన న్యాయమూర్తి అడిగారు.

2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి కేసులు వేయడానికి దొంగ పత్రాలను సృష్టించారనే ఆరోపణపైన జూన్ 25న సెతల్వాడ్ ను అరెస్టు చేశారు. ఉపా (అన్ లాఫుల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్ట్ కింద బెయిలును నిరాకరించే విధంగా ఈ కేసులో సైతం  ‘బెయిలు జారీ చేయరాదనే షరతుతో ఎటువంటి నేర ప్రస్తావనా లేదు. ఇది మామూలు నేరానికి సంబంధించిన ఆరోపణ. ఒక మహిళకు అనుకూలంగా న్యాయస్థానాలు వ్యవహరించాలి,’’అని చీఫ్ జస్టిస్ అన్నారు.

ఈ కేసులో వాదనలను వినిపించవలసింది హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అంటూ సుప్రీంకోర్టు ఈ కేసును విచారించకుండా వాయిదా వేయాలని కోరారు. సెతల్ వాడ్ తరఫు న్యాయవాది కపిల్ శిబ్బల్ మాట్లాడుతూ, ‘‘నేను ప్రాథమిక సమాచార నివేదికను (ఎఫ్ఐఆర్) సవాలు చేస్తున్నాను. ఈ కేసులోఎఫ్ ఐఆర్ ప్రస్తావన లేదు. ఆమె ఏ పత్రాలను ఫోర్జ్ చేశారో ఎఫ్ఐఆర్ వెల్లడించలేదు’’ అన్నారు.

గుజరాత్ అల్లర్లలో నాటి ముఖ్యమంత్రి నరేంద్రమోదీకి పరోక్ష ప్రమేయం కూడా లేదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ జాకియా జాఫ్రీ పిటిషన్ ను కొట్టివేసిన మరునాడు సెతల్వాడ్ ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ పోలీసులు ముంబయ్ వెళ్ళి అరెస్టు చేశారు. జాకియా జాఫ్రీ భర్త పార్లమెంటు సభ్యుడిగా పని చేశాడు. అతడిని అల్లరి మూక నరికి చంపారు. జాకియా జాఫ్రీకి న్యాయస్థానంలో పోరాడటంలో  సెతల్ వాడ్ సహాయం చేశారు. సెతల్వాడ్ బెయిల్ పిటిషన్ ను శుక్రవారం మధ్యాహ్నం సుప్రీంకోర్టు పరిశీలిస్తుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles