Friday, February 3, 2023

ఇక జార్ఖండ్ పై ఖడ్గప్రహారం?

  • ఎలాగైనా హేమంత్ సర్కార్ ను కూల్చేందుకు బీజేపీ పన్నాగం
  • చత్తీస్ గఢ్ రాజధాని రాయపూర్ కు యూపీఏ ఎంఎల్ఏలు
  • హేమంత్ శాసనసభ్యత్వం ఊడిపోయే అవకాశం

జార్ఖండ్ రాజకీయ సంక్షోభంతో కుత కుత లాడుతోంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పదవీగండం నుంచి తప్పించుకోవడం కష్టంగానే ఉంది. జె ఎం ఎం, కాంగ్రెస్, ఆర్జేడి సంకీర్ణం బద్ధలవ్వడానికి సిద్ధంగా ఉంది. బిజెపి ఆకర్ష్ నుంచి వాళ్ళను కాపాడుకోడానికి సోరెన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలను మరో రాష్ట్రానికి తరలించిన నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి. ‘ఆఫీస్ అఫ్ ప్రాఫిట్’ కేసుతో ముఖ్యమంత్రి చుట్టూ ఉచ్చుబిగించి,  రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవాలనే కుట్రతో బిజెపి పెద్దలు పన్నుతున్న రాజకీయ హై డ్రామాలో భాగమే ఇదంతా అనే మాటలు ఎక్కువ వినపడుతున్నాయి. మహారాష్ట్రలో శివసేన సంకీర్ణం చీలిపోయి, బిజెపి కనుసన్నల్లోకి కొత్త ప్రభుత్వం వచ్చింది. అటువంటిదే తనకూ జరుగుతుందనే భయంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బిజెపి కూటమి నుంచి బయటకు వచ్చేశారు. కాంగ్రెస్ వగైరా పార్టీలను కలుపుకొని కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరచి తన ముఖ్యమంత్రి కుర్చీని తెలివిగా కాపాడుకున్నారు.

Also read: ‘హరికథా పితామహుడు’ ఆదిభట్ల

మహారాష్ట్రలో సఫలం, బిహార్ లో విఫలం

ఆ విధంగా, మహారాష్ట్రలో లాభపడిన ఎన్డీఏ.. బీహార్ లో నష్టపోయింది. దీనికి ప్రతిగా ఇప్పుడు జార్ఖండ్ లో అధికారం దక్కించుకొని ఆత్మానందం, రాజకీయ లాభం రెండూ పొందాలని బిజెపి ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్ధం చేసుకోవాలి. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రతి రాష్ట్రంలో తమ జెండానే ఎగరేసి, దిల్లీ పీఠాన్ని ముచ్చటగా మూడోసారి దక్కించు కోవాలన్నది బిజెపి ప్రధాన సంకల్పం. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నినాద సాధనతో పాటు వరుసగా ఒక్కొక్క ప్రాంతీయ పార్టీని నిర్వీర్యం చేసే వ్యూహంలో భాగమే ఇదంతా అని భావించాలి. అన్ని రాష్ట్రాల్లో సాధ్యం కాకపోయినా, ఎక్కువ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు దెబ్బతగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బిజెపి పాలనపై దేశంలో పెద్దఎత్తున ప్రజావ్యతిరేకత వస్తుందా లేదా అన్న దానిపై 2024 ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పటి వరకూ బిజెపి బలంగానే ఉంది. జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ బలహీనంగానే ఉంది. కీలకమైన ఉత్తరప్రదేశ్ లోనూ బిజెపి బలంగానే ఉంది. నేటి జార్ఖండ్ విషయానికి వస్తే, బిజెపి కంటే ఝార్ఖండ్ ముక్తి మోర్చా కాస్త బలంగా ఉంది. కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతుతో హేమంత్ సోరెన్ ఇప్పటి దాకా నెట్టుకొచ్చారు.

Also read: వాయువేగంగా రామమందిరం

క్లైమాక్స్ కు చేరిన కథ

ఇప్పుడు కథ క్లెమాక్స్ కు వచ్చింది. 81మంది సభ్యులు కలిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీలో అధికార యూపీఏ పక్షంలో మొత్తం 49మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఝార్ఖండ్ ముక్తి మోర్చా -30, కాంగ్రెస్ -18, ఆర్జేడీ – 1 గా సభ్యుల సంఖ్య ఉంది. బిజెపి వైపు 26 మంది ఉన్నారు. ఝార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ నుంచి కొందరిని బిజెపి బయటకు లాగేస్తే సోరెన్ ప్రభుత్వం కూలిపోయినట్లే. ఈ ఆట జోరుగానే సాగుతోంది. ముఖ్యమంత్రి శాసన సభ సభ్యత్వంపై కూడా వేటు పడే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్ గడ్ కు తమ సభ్యులను తరలిస్తే రక్షణ ఉంటుందనే నమ్మకంతో రిసార్ట్ రాజకీయాలకు యూపీఏ తెరతీసింది. ఏదో విధంగా ఎరవేసి తెరచించేయాలని ఎన్డీఏ / బిజెపి చూస్తోందన్నది ప్రముఖంగా వినిపించే మాట. స్టోన్  చిప్స్ గనుల లీజు వ్యవహారం సోరెన్ కొంపముంచుతోంది. దట్టమైన అటవీ సంపదతో పాటు ఆ రాష్ట్రంలో ఖనిజ సంపద కూడా అపారంగా ఉంది. సంపద చుట్టూ ఆర్ధిక కోణాలు, దాని చుట్టూ రాజకీయ, అధికార పార్శ్వాలు ఎలాగూ ఉంటాయి. వీటికి జతగా కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాల వైరుధ్యాలు ఉండనే ఉన్నాయి.పేద ప్రజలున్న ధనిక రాష్ట్రంగా దీనికి పేరు. ఎన్నో భారీ పరిశ్రమలు కూడా అక్కడ వున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న భారీ డ్రామాకు కొన్ని గంటల్లోనే తెరపడవచ్చు. ఈ వాతావరణం, పరిణామాలు ఇటు ప్రాంతీయ పార్టీలకు- అటు జాతీయ కాంగ్రెస్ పార్టీకి పెద్ద గుణపాఠాలు. అధికార బిజెపికి అచ్చొచ్చిన ఆట. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో దేశ ప్రజల ఆట ఎలా ఉంటుందో చూద్దాం.

Also read: ఆజాద్ నిష్క్రమణ

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles