Saturday, July 13, 2024

ఈసారి రామోజీ ఫిలిం సిటీపై ఉండవల్లి గురి!

వోలేటి దివాకర్

మీడియా మొఘల్ రామోజీరావుకు చెందిన మార్గదర్శిపై అలుపెరగని న్యాయపోరాటం చేస్తున్న మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా తన గురిని రామోజీ ఫిలిం సిటీ ఫై పెట్టారు. త్వరలో రామోజీరావుకు చెందిన హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ పై న్యాయపోరాటాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. బుధవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ సుమారు 2లక్షల కోట్ల విలువైన రామోజీ ఫిలింసిటీని భూగరిష్ట పరిమితి చట్టాన్ని ఉల్లంఘించి నిర్మించారన్నారు.  ఫిలింసిటీకి చెందిన 1600 ఎకరాలు అక్రమంగా సేకరించారని, వాటిని స్వాధీనం చేసుకోవాలని న్యాయపోరాటం చేస్తానన్నారు.

Also read: ఈపదేళ్లలో ఎపికి బ్రిటీష్ పాలనలో కన్నా తీవ్ర అన్యాయం!

చట్టం ముందు రామోజీ వేరు

మార్గదర్శిపై జరుగుతున్న న్యాయ విచారణ చూస్తుంటే చట్టం ముందు అందరూ సమానం కాదన్న విషయం తేటతెల్లమవుతోందన్నారు. డబ్బు, పలుకుబడి ఉన్నవారికే న్యాయం జరుగుతున్నట్లు కనిపిస్తోందని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా ఈవిషయంలో ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ కేసులో నిజాలను రాబట్టేందుకు తనకు సహకరించాలని  విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కక్ష కట్టి రామోజీరావును సంస్థలను వేధిస్తోందని ఆరోపిస్తున్నారని, తాము చేసేది తప్పో కాదో తేల్చడం లేదని ఉండవల్లి అసహనం వ్యక్తం చేశారు. రామోజీరావు తలుచుకుంటే ఎవరికైనా శిక్షలు వేయించగలరని, కేసులను సాగదీయగలరన్నారు. ప్రముఖ పాత్రికేయుడు ఎబికె ప్రసాద్ పురావస్తుశాఖ నివేదిక మేరకు 1996లో అపురూప కళాఖండాలను తరలిస్తున్న కళాంజలి పేరుతో వార్త రాస్తే ఆయనపై కేసు వేసి, జరిమానా కట్టించారన్నారు. మార్గదర్శి కేసులో ఫిర్యాదు లేకుంటే చర్యలు తీసుకోరాదని, ప్రభుత్వ వ్యతిరేకులు కేసులు పెట్టరాదన్న ఆర్డర్ ఇస్తే ఇకపై మార్గదర్శి కేసు గురించి మాట్లాడనన్నారు. అలాగే మార్గదర్శి వ్యవహారంలో రామోజీరావు తప్పులేదని చెప్పాలని టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు సవాల్ విసిరారు. రామోజీరావు తన చేతిలో ఉన్న ‘ఈనాడు’ పత్రికతో అన్ని వ్యవస్థలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఒక కేసులో రామోజీరావు మార్గదర్శి సంస్థ సిఎండిగా మరో కేసులో మార్గదర్శితో రామోజీరావుకు సంబంధం లేదని ఎలా వాదిస్తారని, ఈ విషయాన్ని న్యాయస్థానాలు ఎలా పరిగణనలోకి తీసుకుంటున్నాయో తనకు అర్థం కావడం లేదన్నారు. మార్గదర్శి వ్యవహారాలు ఆంధ్రాలో జరిగితే తెలంగాణా హైకోర్టులో విచారించాలని వాదించడం విడ్డూరంగా ఉందని ఉండవల్లి వ్యాఖ్యానించారు.

Also read: రామోజీ ఆదాయం రోజుకు రూ. 10కోట్లు: ఉండవల్లి

నేను బతికుండగా పోలవరం పూర్తి కాదేమో?!

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి నిర్వేదం వ్యక్తం చేశారు. తాను బతికుండగా పోలవరం పూర్తి అవుతుందన్న నమ్మకం లేదన్నారు. టిడిపి, వైసిపి ప్రభుత్వాలు ఇప్పటికీ పునాది దశను కూడా దాటలేదనీ. ఈనాడు ఈవిషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదనీ ఎద్దేవా చేశారు.

‘బ్రో’ సినిమా వివాదంలో పిచ్చుక పై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నారన్న చిరంజీవి వ్యాఖ్యలపై ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందిస్తూ చిరంజీవి పిచ్చుక కాదని, సొంత పార్టీని ఏర్పాటు చేసి 18శాతం ఓట్లు సాధించారని, రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని పార్లమెంట్ లో చిరంజీవి గట్టిగా గళమెత్తారని చెప్పారు.

Also read: అవును, నాకు పని లేదు!

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles