Wednesday, April 17, 2024

గోరంట్ల తగ్గేదేలే….

వోలేటి దివాకర్‌

జనసేనాని పవన్‌ కల్యాణ్‌ రాజమహేంద్రవరం పర్యటన ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌కు స్వీటును పంచగా…సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి గుండెలో మంట పుట్టించింది. జనసేనాని రాజమహేంద్రవరం రూరల్‌ సీటును కందుల దుర్గేష్‌కు ఖరారు చేసి, తద్వారా గోరంట్ల రాజకీయ భవిష్యత్‌పై నీళ్లు చల్లారు. అయితే, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోరంట్ల అంత త్వరగా లొంగేరకం కాదన్న విషయం ప్రజలందరికీ తెలుసు. 2014 బిజెపి పొత్తు కుదిరినపుడు, 2019 ఎన్నికల సమయంలో కూడా గోరంట్ల భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. బిజెపితో పొత్తులో భాగంగా సిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న గోరంట్లను రూరల్‌కు వెళ్లాలని అధిష్టానం సూచించింది. చివరి వరకు మంకుపట్టుపట్టిన గోరంట్ల రూరల్‌ నుంచి పోటీ చేసి గెలిచారు. గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు భవానీకి సిటీ సీటును కేటాయించాలని నిర్ణయించడంతో మరోసారి గోరంట్ల రాజకీయ భవిష్యత్‌ సందిగ్ధంలో పడింది. చివరి వరకు సిటీ కోసం పట్టువీడని గోరంట్ల సిటీ, రూరల్‌ బి ఫారాలు తెచ్చుకోవడం గమనార్హం. అధిష్టానం ఆదేశాల మేరకు మరోసారి రూరల్‌ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది.

Also read: భారత చరిత్రలో ఈ’దుర్దినానికి’ నేటితో పదేళ్ళు!

 2024 ఎన్నికలు జనసేన పొత్తు రూపంలో గోరంట్ల రాజకీయ భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసేలా కనిపిస్తున్నాయి. సుమారు 75సంవత్సరాల గోరంట్ల రాజకీయ భవిష్యత్‌ చరమాంకంలో ఉంది. చివరిసారిగా రూరల్‌ నుంచి పోటీ చేయాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. ఇదే సీటును జనసేనలోని కీలకనేత కందుల దుర్గేష్‌ ఆశిస్తుండటంతో గోరంట్ల రాజకీయంగా ఇబ్బందుల్లో పడ్డారు. గత ఎన్నికల్లో దుర్గేష్‌ జనసేన తరుపున ఇక్కడి నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ నియోజకవర్గంలో దుర్గేష్‌ సామాజిక ఎక్కువగా  ఉన్నారు. కాంగ్రెస్  ఎమ్మెల్సీగా ఉన్నపుడు కూడా రూరల్ కు ప్రాధాన్యతనిచ్చారు. అందుకే దుర్గేష్‌ రూరల్‌ సీటుపై ప్రత్యేక దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలైన టిడిపి-జనసేన మధ్య రూరల్‌ సీటుపై పేచీ నెలకొంది. పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక చొరవతో రూరల్‌ సీటును దుర్గేష్‌కు ప్రకటించారు. అయితే, ఈవిషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. స్వయంగా దుర్గేష్‌ తనకు సీటు ప్రకటించిన విషయాన్ని మీడియాకు వెల్లడించారు.

Also read: కాపుల ఆవేదన…కమ్మవారి ఆందోళన!

మరోవైపు స్వయంగా పవన్‌ కల్యాణ్‌ రూరల్‌ సీటును ప్రకటించినట్లు చెప్పినా గోరంట్ల మాత్రం తగ్గేదేలే అంటూ రూరల్‌ సీటు ఇంకా అధికారికంగా ప్రకటించలేదని, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉమ్మడిగా సీట్ల ప్రకటన చేస్తారని అప్పటి వరకు రూరల్‌ సీటుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సిట్టింగ్‌ సీట్లను స్థానిక ఎమ్మెల్యేలకే గతంలోనే  ఖరారు చేశారని కూడా గోరంట్ల గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో  అధికారిక ప్రకటన వచ్చేవరకు గోరంట్ల రూరల్‌ సీటు కోసం గట్టిగా పట్టుబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్‌ రాజకీయ అవసరాల కోసం గోరంట్లకు ఏదైనా పదవిని ఆఫర్‌ చేస్తారా? గోరంట్ల ఒత్తిళ్లకు తలొగ్గి దుర్గేష్‌ను పక్కకు తప్పిస్తారా అన్నది వేచి చూడాలి. గోరంట్లను ఖాళీగా ఉంచడం కూడా అటు రాజమహేంద్రవరం, రూరల్ అభ్యర్థులకు కాస్త ప్రమాదమే అన్న విషయాన్ని గుర్తించాలి.

Also read: రానున్న ఎన్నికలపై ఉండవల్లి జోస్యం!

సీటు గల్లంతైతే…?

రూరల్‌ సీటు కోసం అటు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఇటు కందుల దుర్గేష్‌ చివరి వరకు పట్టుబడుతున్న పరిస్థితుల్లో పన్నికల్లో ఇరుపక్షాలు మనస్ఫూర్తిగా సహకరించుకుంటారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే టిడిపి, జనసేన కేడర్ల మధ్య సయోధ్య ఉంటుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా పార్టీలు నాయకులు, కేడర్‌ను ఒప్పించడంతో పాటు, ప్రజలకు కూడా సహేతుక కారణాలు చెప్పాల్సి ఉంటుంది.

ఇక రూరల్‌ నియోజకవర్గం నుంచి పవరు గెలిచినా వారికి మంత్రి పదవి తప్పకపోవచ్చు. టిడిపి, జనసేన కూటమి అధికారంలోకి వస్తే జనసేనలో కీలకనేత, పమ్మెల్సీగా అనుభవం ఉన్న దుర్గేష్‌కు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ గోరంట్ల పోటీ చేసి గెలిస్తే  సీనియర్‌, మాజీ మంత్రిగా అనుభవం ఉన్న ఆయనకు మంత్రి పదవి దక్కవచ్చు. ఈఇద్దరూ కాకుండా  బదిలీపై రూరల్‌కు వచ్చిన సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుతో పాటు వైఎస్సార్‌సిపి  గెలిస్తే మరోసారి వేణును మంత్రి పదవి వరించవచ్చు.

Also read: వారు పోటీ చేస్తే…మరి వీరేం చేస్తారు?!

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles