Wednesday, February 1, 2023

గుక్క తిప్పుకోనివ్వని ఆ రెండేళ్లు!

ఆకాశవాణిలో నాగసూరీయం – 5

డబ్బును మంచి సేవకుడు, అంతే కాదు చెడ్డ యజమాని అని కూడా  అనడం మనకు తెల్సిందే!  టెక్నాలజీ కూడా అలాంటిదే!!  జాగ్రత్తగా వినియోగించుకుంటే ఎన్నో లాభాలు… అయితే అప్రమత్తంగా లేకపోతే ఎన్నో అనర్థాలు!!!

‘ఆకాశవాణిలో నాగసూరీయం’లో ఏమిరాయాలి?  – అని ఆలోచిస్తున్నప్పుడు ఫేస్ బుక్ మెమొరీ ఒక విషయాన్ని గుర్తుచేసింది. అది  2017 ఆగస్టు 19 …  తిరుపతి ఆకాశవాణి కేంద్ర నిర్దేశకులుగా  నేను చేరి ఒక సంవత్సరం అయిన సందర్భంగా ఉద్యోగపరంగా,  ఆ  కాలవ్యవధిలో నా పర్యవేక్షణలో జరిగిన ముఖ్యమైన విశేషాల జాబితా వంటిదే!  దాంతోపాటు ఓ ముప్పయి ఫోటోలు!!  నా వరకు ఓ పదినిమిషాల్లో ఒక సంవత్సరపు ఉద్యోగ జీవితం ఒక మాంటేజ్ లా కదలిపోయింది. మరి నా అనుభూతిని ఈసారి మీతో పంచుకుంటాను – ఈ కాలమ్ వ్యాసంగా! 

భూమిపూజ సందర్భంగా డీజీతో నాగసూరి వేణుగోపాల్

మద్రాసు ఆకాశవాణిలో 2016 ఆగస్టులో ఒకేసారి తొమ్మిదిమందికి (నాతో సహా) పదోన్నతి లభించింది. నిజానికి చాలా మంది అక్కడే ఉండేలా ప్రయత్నిస్తున్నారు కూడా. మేమిద్దరం (నేను, మా శ్రీమతి) లడఖ్ కు ఎల్ టీ సీ మీద వెళ్ళి తిరిగి వచ్చిన రోజున ఆ బదిలీ ఆర్డరు వచ్చింది.  దాదావు అదే తేదీలలో మా అమ్మ గౌరమ్మ కాలం చేసిన రోజు కూడా వచ్చింది. హిందూపురం వెళ్ళి , తిరిగి వచ్చిన పిమ్మట తిరుపతిలో చేరిపోవాలని నిశ్చయించుకున్నాను.  ట్రాన్స్ ఫర్ అలవెన్స్ ఇస్తే రెండురోజుల్లో ప్రయాణం కాగలనని చెప్పి 2016 ఆగస్టు 18న రిలీవ్ అయ్యాను. మిగతా మిత్రులలో కొద్దిగా చలనం మొదలైంది.

Also read: మేళత్తూరు భాగవత మేళ నాట్యనాటకాలు

మద్రాసు నుంచి నేరుగా తిరుపతి కేంద్రానికి… 

బదిలీకి లభించే సెలవులు సైతం వినియోగించుకోకుండా  ఉదయం రైలులో మద్రాసు నుండి బయలుదేరి పదిన్నరకు తిరుపతి ఆకాశవాణిలో చేరిపోయాను. నిజానికి  త్వరగా నన్ను తిరుపతి పంపాలని ఢిల్లీ అధికారులు చూస్తున్నారు. కారణం ఏమిటంటే, హిందీ అధికార భాష అమలు గురించి ఒక పార్లమెంటరీ బృందం తిరుపతిలో ఆకాశవాణితో సహా కొన్ని కేంద్రప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేయబోవడం. కనుక అర్జంటుగా తిరుపతికే ఆకాశవాణి డైరెక్టరుగా ఓ వ్యక్తి వెళ్ళాలి. అలా మొదలైన హడావుడి రెండేళ్ళపాటు ఒక జాతరలా నడిచింది!

కార్యక్రమాలను ప్రణాళిక చేయడం, రూపొందించడం, శ్రోతల అవసరాలకు తగ్గట్టు మార్పులు చేయడం,  వాటికి ప్రచారం, గుర్తింపు కల్పించి, వీలైతే కొంత ఆదాయం రాబట్టడం నా ప్రధాన స్రవంతి బాధ్యతలు.  రికార్డు చేయడం, ప్రసారం చేయడం, ఇతర కేంద్రాలతో  అనుసంధానించడం వంటి  విషయాల్లో ఇంజనీరింగు విభాగం తోడ్పాటు చాలా కీలకం. ఈ రెండు విభాగాలకు ప్రోగ్రాం హెడ్, ఇంజనీరింగ్ హెడ్ అంటారు.  వీరిలో ఒకరు సీనియర్ కేంద్రం అధిపతిగా కూడా ఉంటారు. తిరుపతిలో ఉన్న రెండేళ్ళు నేను ప్రోగ్రాం హెడ్ గానూ, హెడ్ ఆఫ్ ఆఫీస్ గానూ విధులు నిర్వర్తించాను. తొలి బాధ్యత శ్రోతలకు ఫలితాలు యిస్తే, రెండవది పాలనాపరమైన దోహదంగా ఉంటుంది.  ఇంతకు ముందు పేర్కొన్న పార్లమెంటరీ కమిటీ పర్యటన రెండవ బాధ్యత కింద వస్తుంది.

సరే సంవత్సర కాలంలో ముఖ్యమైన విజయాలు సుమారు పాతిక దాకా ఉన్నట్లున్నాయి ఆ ఫేస్ బుక్ మెసేజ్ లో. వివరంగా కాకుండా విహంగ వీక్షణంగా పరికిద్దాం. 

కతల సండగ సందర్భంగా సభాకార్యక్రమంలో నాగసూరి వేణుగోపాల్ , తదితరులు

నిత్యం 3 గంటల సుప్రభాతం

• తిరుపతి వంటి లోకల్ రేడియోస్టేషన్ లో మధ్యాహ్నం పూట బొంబాయి నుంచి హిందీ కార్యక్రమాలను వివిధభారతి నుంచి రిలే చేసేవారు. అయితే, తిరుపతి కేంద్రంలో సుప్రభాతం కారణంగా ఒక మూడు గంటలపాటు అనౌన్సర్ సేవలు అదనంగా పొందే వీలు గమనించి మధ్యాహ్నం పూట తెలుగు కార్యక్రమాల నిడివి పెంచాం. అదనపు ఖర్చు పెరగకుండా చూసుకున్నాం. తర్వాత సంవత్సరాలలో మిగతా కేంద్రాలు ఇదే విధానం ఒక పాలసీ గా  అనుసరించడం ఒక తృప్తి. 

• తిరుపతి ఆకాశవాణిలో తెల్లవారుజాము 3 గం. నుంచి మూడు గంటలపాటు తిరుమల గుడి నుండి సుప్రభాతం ప్రత్యక్షప్రసారం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఇతర జిల్లాలతో పాటు మద్రాసులో సైతం ఎంతోమంది వింటారు. కానీ ఫీడ్ బ్యాక్ లేదు. వివరమైన , సాధికారికమైన  అభిప్రాయాలు అవసరమయ్యాయి. ఈ కార్యక్రమం శ్రోతలను రేడియో పిలుపు ద్వారా ఆహ్వానించాం. మా ప్రాంగణంలో నిర్వహించిన ఈ ముఖాముఖి కార్యక్రమానికి చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల నుంచి ఒక యాభై, అరవై మంది దాకా శ్రోతలు స్వచ్ఛందంగా రావడం, అభిప్రాయాలు చెప్పడం విశేషం. 

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్

• 1983 తర్వాత 2017లో తిరుపతిలో జనవరి 3-7 తేదీలతో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి. ఇది సైన్స్ సంబంధించిన ప్రతి ఏటా వేర్వేరు నగరాల్లో జరిగే సంఘటన. ఈ  అతి పెద్ద విశేష సమావేశాలు ఆధారంగా దేశవ్యాప్తంగా అన్ని ఆకాశవాణి కేంద్రాలకు కార్యక్రమం రూపొందించి తిరుపతి కేంద్రం ఇవ్వాల్సిఉంది. విజయవాడ, హైదరాబాదు నుంచి వచ్చిన సహోద్యోగుల తోడ్పాటుతో విజయవంతంగా నిర్వహించాం.

Also read: ఆంధ్రా ‘యూనివర్సిటీ యువత’ గా మారిన సందర్భం! 

• నవంబరు 14న వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తోడ్పాటుతో స్థానిక గోవిందరాజస్వామి డిగ్రీ కళాశాల ఆవరణలో వాకర్స్ క్లబ్ సహకారంతో మెడికల్ క్యాంప్ ను ఆకాశవాణి నిర్వహించింది. దీనికి డా. కృష్ణ ప్రశాంతి ఇచ్చిన సహకారం చాలా విలువైంది. అలాగే ఇంజనీరింగ్ మిత్రుడు నిరంజన్ రెడ్డి తోడ్పాటు కూడా ముఖ్యమైనదే. 

• తిరుమల బ్రహ్మోత్సవాల రన్నింగ్ కామెంటరీ వ్యవధిని పెంచడం, ఆ కామెంటరీ కార్యక్రమం కేంద్రాల ద్వారా ప్రసారమయ్యేట్టు కూడా చూశాం.

• శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ‘వరల్డ్ రేడియో డే,’ ‘ ప్రపంచ మహిళా వారోత్సవాలు’  సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాం. వాటి నిర్వహణలో ప్రొఫెసర్ బి.ఎన్.నీలిమ, ప్రొఫెసర్ పి. విజయలక్ష్మి గార్ల తోడ్పాటు కీలకమైంది. 

• 2017 ఆగస్టు 15న అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తిరుపతిలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ ఉత్సవంపై తిరుపతి ఆకాశవాణి అన్ని తెలుగు కేంద్రాలకు ప్రత్యక్ష ప్రసారాన్ని ఇచ్చింది.  మిత్రులు  నందివెలుగు ముక్తేశ్వరరావు, పి.వి.రంగనాయకులు ఆ రోజు ఆకాశవాణి కామెంటేటర్లు. 

వార్షికోత్సవం సందర్భంగా వేణుగోపాల్, తదితరులు

చూసొద్దాం తారామండలం

• ప్రతి నెలా ‘రండి చూసొద్దాం తారామండలం!’ అనే స్టార్ గేజింగ్ కార్యక్రమాన్ని ఆకాశవాణి తిరుపతి కేంద్రం రీజనల్ సైన్స్ సెంటర్ లో ప్రత్యక్ష ప్రసారంగా నిర్వహించింది. దీనికి మణిగండన్, అతని సిబ్బంది తోడ్పాటు విశేషమైంది. ఆసక్తి ఉన్న శ్రోతలు పిల్లలతో వచ్చారు. ఈ విభిన్నమైన కార్యక్రమం చాలా విలువైనది. ఎంతో మంది అభినందించారు.ఇలాంటి ప్రయత్నాల్లో తెలుగు రేడియోలో జరగడం ఇదే ప్రథమమని డా. పి ఎస్ గోపాలకృష్ణ గారు శ్లాఘించారు. దీనికి ఆ విశేష గౌరవం దక్కింది.

Also read: రాయదుర్గానికి కథాతోరణం

• ఉన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు మాండలికంలో కథలు వినిపించే ‘పిల్లల చెంత కతల పండుగ’ ను 2017 మార్చి 10వ తేదీన బెరాగి పట్టెడ లోని  మహాత్మాగాంధీ మున్సిపల్ స్కూలులో ఆకాశవాణి నిర్వహించింది. నలుగురు కథకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పిల్లలు స్పందించిన తీరు శ్లాఘనీయం.

శివకవుల కొలువు

• శివరాత్రి సందర్భంగా తెలుగులో ప్రఖ్యాతులైన శివకవులు కొంత మంది శివుడు, వృషభేశ్వరుడి సమక్షంలో కొలువు దీరితే – అనే ఆలోచనతో పద్యసాహిత్య కార్యక్రమం గా ఆరేడుమంది పండితులతో గంట కార్యక్రమాన్ని తిరుపతి కేంద్రం అన్ని కేంద్రాల కొరకు రూపొందించింది. 

• వెటరినరీ కళాశాలలో ‘కవితాసేద్యం’ పేరున ఆకాశవాణి కవిసమ్మేళనాన్ని విజయవంతంగా, విలక్షణంగా నిర్వహించింది. 

• జి ఎస్ టి విధానాన్ని అపుడపుడే ప్రారంభించారు. అవగాహన కల్గించడానికి మంచి కార్యక్రమాలను తిరుపతి కేంద్రం రూపొందించింది. కమీషనర్ స్వామినాథన్ ఇచ్చిన తోడ్పాటు దొడ్డది.  తద్వారా మా ఆకాశవాణికి మంచి ఆదాయం కూడా లభించింది.

శివరాత్రి ప్రత్యేక రికార్డింగ్ ప్రోగ్రాం

ప్రసారభారతి చైర్మన్ తిరుపతి పర్యటన

 ఇవే కాకుండా ప్రసారభారతి ఛైర్మన్ డా. ఏ. సూర్యప్రకాష్ తిరుపతి పర్యటన;  నెల్లూరు ఆకాశవాణికి భూమిపూజ;  డి జి   ప్రోగ్రాం ఇన్స్ పెక్షన్; పత్రికలలో, ఫేస్ బుక్ లో ఆకాశవాణి ప్రసార వివరాలు ఇవ్వడం; కడప ఆకాశవాణి కేంద్రపు   అదనపు బాధ్యతలు; కో -ఆర్డినేషన్ మీటింగ్ ను చాలా సంవత్సరాల తర్వాత కూడా  అన్ని కేంద్రాల అధిపతులతో నిర్వహించడం, తిరుపతి ఆకాశవాణిలో  ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో భాగంగా తోటను బాగా వృద్ధిచేయడం, ఆకాశవాణి భవనంలో చారిత్రక విలువ గలిగిన కోటల చిత్రాలు ఏర్పాటు చేయడం వంటి ఎన్నో  ఇతర పనులు 2016-2017 లోనే జరిగాయి. ఎంతో సంతృప్తి మిగిలింది. 

Also read: అనంత వారసత్వ కళా విజ్ఞాన వాహిని!

ఇక్కడ ప్రస్తావించిన ఈ పనులన్నీ రొటీన్ గా చేసేవాటికి పూర్తిగా అదనం. ఇలాంటి పనులు అన్నీ కేంద్రాలలో, అన్ని వేళలా ఉంటాయని గానీ, అదే కేంద్రంలో వేరే సమయంలో సంభవిస్తాయని గానీ చెప్పలేం. కొన్ని  ఆ ప్రాంతపు ప్రాధాన్యతను బట్టి అదనంగా వస్తాయి; కొన్ని ఆసక్తి, అభిరుచి బట్టి ఎవరికి వారు  నిర్వహించుకోవడం వల్ల సాధ్యమవుతాయి. (నాలుగు వారాల క్రితం మనం ‘ఆకాశవాణి లోనాగసూరీయం’ లో చదువుకున్న  – చంద్రగిరి కోటలో శ్రోతల ముఖాముఖిగా ఏర్పాటు చేసిన ‘వారసత్వ కళా విజ్ఞానవాహిని’ కార్యక్రమం కూడా ఇదే కాలంలోనే జరిగింది.)

థాంక్స్ టు ఫేస్ బుక్ పోస్ట్

ఈ విషయాలు ఇంత వివరంగా ఎలా చెప్పగలిగానంటే దానికి 2017 ఆగస్టు 19న ఫేస్ బుక్ పోస్ట్ లో రాసినదే ఆధారం.  నేను ఉద్యోగంలో చేరిన తొలిదశలో అంటే 1988లో టెలిఫోన్ గానీ, స్కూటర్ గానీ ఎన్నో నెలలు,  సంవత్సరాలు వేచి వుంటే తప్ప దొరకని కాలం. అలాగే ఫోటోలు తీసుకోవడం, దాచుకోవడం ఓ ఖరీదైన వ్యవహారం. 

అయితే నేడు టెక్నాలజీ మన వేళ్ళ కొసకు రావడం అద్భుతమని చెప్పడమే ఉద్దేశం. ముప్పయి ఏళ్ళ క్రితం డబ్బులు  పెట్టినా ఎఫ్.ఎమ్. రేడియోలు దొరికేవి కాదు;  కానీ నేడు స్మార్ట్ ఫోన్ లోనే ఒకే యాప్ ద్వారా మన దేశంలో ప్రసారమయ్యే అన్ని అకాశవాణి కేంద్రాలను వినే అవకాశం  ఉంది. కనుకనే టెక్నాలజీ అనేది డబ్బులాగా మంచి సామర్థ్యం గల సేవకుడు! 

–డా. నాగసూరి వేణుగోపాల్, 

ఆకాశవాణి పూర్వ సంచాలకులు, 

మొబైల్: 9440732392 

Dr. Nagasuri Venugopal
A broadcaster by profession, media researcher by training, a staunch Gandhian in thought, and a science writer by passion, Dr. Nagasuri Venugopal writes prolifically on contemporary issues. He penned over 60 books and two thousand newspaper articles so far. He is a PhD in journalism.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles