Thursday, November 14, 2024

జల జగడం

రాజకీయాలలో కెసిఆర్ తీరే వేరు. అతనెంత ఫక్తు రాజకీయ నాయకుడో ఈ దేశంలో అందరికంటే ఎక్కువ సోనియాగాంధీకే తెలుసు. చల్లారిన తెలంగాణ ఉద్యమాన్ని అదును చూసి పదునెక్కించిన ఘనత సమకాలీన చరిత్రలో కెసిఆర్‌దేనని చరిత్ర రికార్డు చేసిన సత్యం. వైఎస్ఆర్ హఠాత్ మరణాన్ని ఒక అందివచ్చిన అవకాశంగా తీసుకుని ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా, నిర్దిష్ట విధానంలో ఉద్యమాన్ని ముందుకు నడిపి తెలంగాణ కలను సాకారం చేసిన గొప్ప ఉద్యమకారుడిగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయారు. కొన్ని పదుల సంఖ్యలో యువకుల ఆత్మార్పణం వంటి దురదృష్టకర సంఘటనలతో పాటు, ట్యాంక్ బండ్ విగ్రహాల విధ్వంసం మినహా ఉవ్వెత్తున ఎగిసిన ఆ ఉద్యమంలో అహింసకు తావులేకుండా రాష్ట్ర సాధన సాకారమవడంలో కెసిఆర్ లాంటి మాటల మాంత్రికుడి అపురూప చతురతను తక్కువ అంచనా వేయకూడదు.

Also read: సిక్కోలు రైతుకు బాసట


కుటిలతే రాజకీయ చతురత

తెలంగాణ ఉద్యమం సాకారమవగానే రాష్ట్ర సాధన ధ్యేయమనుకున్న పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేయడమో, తోకపార్టీగా మార్చడమో చేయకుండా, చివరిక్షణం వరకూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని గొప్ప ఉత్కంఠలో ముంచి, చివరకు ఏరు దాటాక బోడి మల్లన్న అన్న మాదిరిగా ఎంచక్కా తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. నూతనంగా ఏర్పాటైన రాష్ట్రంలో కొన్ని మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. అందులో విద్య, వ్యవసాయం, పర్యావరణం, రెవిన్యూ రంగాలలో ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా ఆయా రంగాలలో చేసిన కీలకమైన కృషివల్ల భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం గుర్తించదగిన స్థాయికి చేరుకోగలిగింది. విద్యారంగంలో సాంఘిక, గిరిజన సంక్షేమ కళాశాలలను విస్తృతంగా ఏర్పాటుచేయడం వల్ల ప్రభుత్వ విద్యారంగాన్ని బలపరిచి, ప్రజాధనాన్ని స్వాహా చేస్తున్న కార్పొరేట్ విద్యకు కీలెరిగి వాత పెట్టారు. వ్యవసాయానికి తగిన సాయం చేయడం కోసం నీటి పారుదల రంగంలో కీలక సంస్కరణలు చేపట్టారు. నాలుగేళ్లు తిరిగేసరికే ఫలితాలు రావడం మొదలుపెట్టాయి. సంతోషంగా ఉన్న రైతాంగం, దిగువ మధ్యతరగతి వర్గాలు రెండోసారి కెసిఆర్‌కు పట్టం కట్టారు.

స్నేహమేరా జీవితం అని భావించిన రోజుల్లో జగన్ మోహన్ రెడ్డికి కేసీఆర్ సన్మానం


ప్రత్యర్థిని మట్టి కరిపించడంలో కూడా అంతే గడుగ్గాయితనం ప్రదర్శించగలరు కెసిఆర్. రెండు పడవల్లో ప్రయాణిస్తున్న చంద్రబాబును కట్టడి చేయడానికి స్టీఫెన్సన్ ఉదంతంతో చెక్ చెప్పారు. రేవంత్ రెడ్డి ద్వారా ఓటుకు కోట్లు ఇవ్వడాన్ని ఆడియో వీడియో సాక్ష్యంతో ప్రజలకు పట్టివ్వడంతో నాకూ పోలీసులున్నారు, నాకూ సీఐడీ వుంది అంటూ చంద్రబాబు రాత్రికి రాత్రే హైదరాబాదు విడిచిపెట్టి అమరావతికి పలాయనం చిత్తగించారు. అప్పటికి అమరావతిలో సొంతగూడు కూడా ఏర్పాటుచేసుకోలేని చంద్రబాబు తన కుటుంబంతో చాలా రాత్రులు బస్సులోనే పడుకోవలసి రావడం రాష్ట్ర ప్రజలకు తాజా జ్ఞాపకమే. తెలంగాణలో ప్రతిపక్షమే కాదు, తన పార్టీలో సైతం నిరసన స్వరం నీరసంగానైనా వినిపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కెసిఆర్ గత ఎన్నికలలో వైకాపాకు గట్టి మద్దతిచ్చినట్టే కొన్ని తెలుగు పత్రికలు నమ్మబలికాయి. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా కెసిఆర్ తన సంతోషాన్ని దాచుకోలేదు. అంతేకాకుండా, నిమ్మగడ్డ రమేష్ రూపంలో తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నికలలో జగన్ ను నిద్రపట్టకుండా చేసినప్పుడు పార్క్ హోటల్ లో నిమ్మగడ్డ మరో ఇద్దరు ప్రముఖ నేతలతో సాగించిన మంతనాల వీడియో ఫుటేజి లీక్ చేసి రాష్ట్ర ప్రజలకు విస్పష్ట సందేశం అందించింది ఎవరో ఇప్పటికి చిదంబర రహస్యమే.

Also read: స్వదేశీ అంటే..?


రెండు కళ్ల సిద్ధాంతమే అందరిదీ

అలా స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అన్న డ్యూయెట్ కు మధ్యలో పెద్ద కుదుపుతో బ్రేక్ పడినట్టు అకస్మాత్తుగా రెండు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదం ముసురుకుంది. వ్యాపారం చేయడం అలవాటైన పనైనప్పటికీ రాజకీయాల్లో ఎత్తుజిత్తులు వేయడం మన ముఖ్యమంత్రి జగన్ కు కొత్త. ఒకవైపు సోదరి షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టడం అనే పరమ-దృగ్గోచర-మార్మిక-రహస్య-బహిరంగ ప్రజా కార్యక్రమాన్ని పార్టీ కార్యకర్తలే కాదు ప్రతిపక్షాలు సైతం విశ్లేషించలేకపోతున్నాయి. అలాంటిది తెలంగాణ నేతలు ఎంత కవ్వించినా జగన్ నోరు విప్పకుండా (నోరిప్పలేదనే తెలుగు మాటనుంచే నో రిప్లై అనే ఇంగ్లీషు మాట పుట్టిందని జగన్ ప్రతిస్పందన ద్వారా తెలుగు ప్రజలు తెలుసుకున్న చారిత్రక సందర్భం ఇది) లేఖలు రాసుకుంటూ ఉండడంలో గల పరమార్థాన్ని ఎవరు బోధించగలరు గనక!

Also read: మూతపడనున్న ఇంటర్ బోర్డు?

వీటిని మించిన గమ్మత్తు ఏమిటంటే ఇరు రాష్ట్రాలలోనూ ఉన్నాయో లేవోనన్నట్టు ఊగిసలాడే ప్రతిపక్షాలు సైతం తమతమ రాష్ట్రాలలో ఏం జరుగుతుందో తమ ప్రజలకు వివరించడం లేదు. జరుగుతున్న జలజగడం గురించి తమ వాదనలు వినిపించడం లేదు. అందరిదీ రెండు కళ్ల సిద్ధాంతమే. దీనివల్ల రెండు రాష్ట్రాల ప్రజల మధ్య వైషమ్యాలు పెరగడం మినహా మరే ప్రయోజనం లేదన్నది అందరికీ తెలిసిందే. అంతర రాష్ట్ర నదీ జలాల వాటాల పంపకానికి మన దేశంలో ఇప్పటికే సరిపడినన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయి. బచావత్ ట్రిబ్యునల్ వీటిని స్పష్టంగా నిర్వచించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ఇటు కోర్టులు, అటు కేంద్ర ప్రభుత్వం ఉండనే ఉంది.

Also read: పలుకే బంగారమాయే!


నీళ్లపై పోరాటం

కెసిఆర్ తో వ్యవహారం సవ్యంగా ఉంటే గొప్ప సొగసుగానే ఉంటుంది. తేడాలొస్తే ఏం జరుగుతుందో ఊహించలేం. దాదాపుగా జగన్ మొండితనం గురించి కూడా ప్రజలు ఇదేవిధంగా ఊహించుకుంటారు. అనుకున్న పని సాధించడానికి ఏ కొసకైనా ప్రయాణిస్తారు. పొరుగు రాష్ట్రాలతో సంబంధాల విషయాలలో ఇలాంటి అరుదైన సందర్భం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే తొలిసారి. బచావత్ ట్రైబ్యునల్ సూచనలలో ముఖ్యమైన నియమం సాగునీటి అవసరాలకు వాడుకునే జలాలనుంచే విద్యుదుత్పాదన చేయాలి. ఈ నియమాన్ని ఉ ల్లంఘిస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేపడుతున్నట్టు అక్కడి పత్రికలు సైతం రాస్తున్నాయి. ఆయా ప్రాజెక్టుల వద్దకు చేరుకుంటున్న నాయకులను సైతం పోలీసులు అనుమతించడం లేదని ఇక్కడి పత్రికలు ఫోటోలతో ప్రచురిస్తున్నాయి. వీటికి తోడు కృష్ణా బోర్డు విధివిధానాలు సష్టం చేయకుండా, కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేయడం కూడా ఈ వివాదాలకు, అనవసర మనస్పర్ధలకు కారణమవుతున్నాయి. నదీ జలాల పరీవాహక ప్రాంతాలలో జలవిద్యుదుత్పత్తి చేసే అధికారాన్ని కేంద్రం తీసుకోవడం ద్వారా ఇలాంటి గొడవలే రాకుండా చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన సూచన కూడా పరిగణించవలసిందే. ఇప్పుడున్న ప్రతిపక్షాల వైఖరిని బట్టి అఖిలపక్ష సమావేశం ఆలోచనను అపహాస్యమాడవచ్చునేమో కాని, అదే ప్రజాస్వామిక స్ఫూర్తి. అందరినీ కలుపుకొని వెళ్తేనే ప్రజల సందేహాలు నివృత్తి కాగలవు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఎడముఖం పెడముఖం చేసుకోకుండా ఈ విషయాల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకోవడం తక్షణావసరం.

Also read: రైట్.. రైట్.. ప్రైవేట్..

(రచయిత మొబైల్: 9989265444)

రవికుమార్ దుప్పల
రవికుమార్ దుప్పల
దుప్పల రవికుమార్ సిక్కోలు బుక్ ట్రస్ట్ ప్రధాన సంపాదకులు. ఆంగ్ల అధ్యాపకులు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. మొబైల్ : 99892 65444

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles