Monday, November 28, 2022

స్వదేశీ అంటే..?

గడుస్తోన్న కాలాన్ని తలుచుకుంటేనే ఎదలో ముసురు పట్టినట్టు బాధ. సోషల్ మీడియా తెరుద్దామంటే, ఏ చావు కబురు చూడాల్సి వస్తుందోనని గుండెలు గుబగుబలాడిన రోజులు నెమ్మదిగా కదిలిపోతున్నాయి. ముసురుకున్న మబ్బులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. ముందున్నది కరువు కాలంగానే తెలుస్తోంది. అయినా గుండె చిక్కబట్టుకుని మంచి రోజుల కోసం చూస్తున్నాం. ఆశాజీవులం కదా..

ఈ కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం మనుషులను వారి కర్మకు వారిని విడిచిపెట్టేసింది. అప్పటికే నోట్ల రద్దుతో కుదేలయిన భారత ఆర్థిక వ్యవస్థ మీద గోరుచుట్టుపై రోకలిపోటులాగా కరోనా రెండు పెను తరంగాలుగా విరుచుకుపడి ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసింది. తన ఏభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ మీడియా ప్రశ్నలు ఎదుర్కోవడానికి ఇష్టపడని మన ప్రధాని, ఉపన్యాసాలు దంచడంలో మాత్రం ఘనాపాటి. నడుస్తూ పోయి వేల సంఖ్యలో తనువులు చాలించిన వలస భారతపు విషాదాన్ని నామమాత్రంగా ఉచ్చరించడానికి ఇష్టపడని పెద్దమనిషి చిన్న పిల్లలకు పరీక్షలు ఎలా రాయాలో సుద్దులు చెప్పడం పెద్ద ఐరనీ. ఎప్పటికప్పుడు ఒక సరికొత్త నినాదంతో నిద్రకు దూరమైన ప్రజలను నిద్రనుంచి లేపడానికి ప్రయత్నం చేయడం ఈయనకే చెల్లింది.

Also read: మూతపడనున్న ఇంటర్ బోర్డు?


ఈసారి తన ప్రజలకు కానుకగా, అరిగిపోయిన రికార్డులాంటి స్వదేశీ నినాదం మన ప్రధాని అందించారు. అన్ని వస్తువులూ ఇకపై ప్రజలందరూ స్వదేశంలో తయారు చేసినవే వాడాలని పిలుపునిచ్చారు. బయటకు అందంగా కనిపిస్తున్న నినాదం ఇది. మనల్ని దేశభక్తి మత్తుమందుతో నిద్రపుచ్చే నినాదం ఇది. జాగ్రత్తగా పరిశీలించకపోతే ఒక గొప్ప మార్పును తీసుకొస్తుందని భ్రమ కల్పించే నినాదమిది. నిజానికి ఒక డొల్ల నినాదమిది. మన ప్రధాని మాటలకు చేతలకు పొంతన లేదని బయటపెట్టే నినాదం ఇది..


దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత మన దేశ ప్రధానులలో ఎవరూ చేయనంత విదేశీ ప్రయాణాల ఖర్చు నరేంద్ర మోడీ చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత సంవత్సరం అంటే 2015లో 517.82 కోట్ల రూపాయలు కేవలం వివిధ దేశాలు తిరగడానికి ఖర్చు చేశారు. మొదటి టర్మ్ పాలన ముగిసేసరికి అక్షరాలా 2500 కోట్ల రూపాయలతో 55 నెలల్లో 92 దేశాల పర్యటనకు దిగారు. ఇంత ఖర్చు పెట్టింది దేనికట? ఆ విదేశాలలోని పారిశ్రామిక వేత్తలంతా మన దేశంలో పెట్టుబడులు పెట్టి, ఇక్కడ కంపెనీలు స్థాపించి, వస్తువుల ఉత్పత్తి చేసుకోమనడానికే కదా. మరి ఇప్పుడు చేస్తున్న స్వదేశీ నినాదం డొల్లేనని విదేశీయులకు అర్థం కాదంటారా? విదేశీ మంత్రాన్ని ఆ స్థాయిలో జపించిన నోటితోనే స్వదేశీ అనడం ఈ దేశ ప్రజల్ని మోసపుచ్చడానికే కాదంటారా? విదేశీ పెట్టుబడులకు అన్ని రంగాలలోను తలుపులు బార్లా తెరిచిన ఘనత కూడా మోడీదే. ప్రజలందరూ వద్దని మొత్తుకున్నా వినకుండా రక్షణ రంగం మొదలుకొని బ్యాంకులు, పత్రికలు, మీడియా, నౌకాశ్రయాలూ, గనులు.. ఇలా అన్ని రంగాలలోనూ విదేశీ పారిశ్రామికవేత్తలను రారమ్మని ఆహ్వానించి, పెట్టుబడులు పెట్టమని అభ్యర్థనలు చేయడమే కాదు, వారికి కావలసిన పన్ను రాయితీలు కల్పించింది ఈయనగారే. అయా రంగాల్లోని 49 శాతమున్న పెట్టుబడుల షేర్ హోల్డింగును 51 శాతానికి పెంచి, వారిని ఇంకా ప్రసన్నం చేసుకోవడానికి దానిని శతశాతం చేసింది ఈయనే. అలాంటి మనిషే తిరిగి స్వదేశీ నామం జపించడం కేవలం మనల్ని మోసం చెయ్యడానికే కదా.

Also read: పలుకే బంగారమాయే!


మోడీ ప్రభుత్వం ఆడే దుర్మార్గమైన నాటకం అర్ధం కావాలంటే మన సైనికులు తొడుక్కునే దుస్తుల తయారు చేసే కంపెనీ ఏ దేశానిదో తెలుసుకోవాలి. మనం నమ్మలేకపోయినా సైనిక దుస్తులు చైనా కంపెనీవే కావడం దురదృష్టకరం. ఏ దేశపు దాడినుండి సరిహద్దుల్లో మన దేశాన్ని కాపాడుకోవడానికి సైనికుల్ని యుద్ధానికి దించామో, అదే సైనికుల వంటిమీది యూనిఫాం కూడా ఆక్రమణకు దిగిన శత్రు దేశానిదే కావడం ఎంత దౌర్భాగ్యం కదా? సైనికుల సంగతి సరే, కనీసం మన దేశవాళీ దోమల నుండి రక్షించు కోవడానికి కూడా మనం చైనా నుండి దిగుమతి చేసుకునే దోమల బ్యాట్లను వాడుకుంటున్నాం. మనం జపించే స్వదేశీ మంత్రం ఎవరిని మోసం చేయడానికి?

Also read: రైట్.. రైట్.. ప్రైవేట్..


ఈ సందర్భంలో మనకు మనం వేసుకోవలసిన అత్యవసరమైన ప్రశ్న, అసలు స్వదేశీ అంటే ఏమిటి? మన దేశంలోని ప్రజలు ఏర్పాటుచేసిన పరిశ్రమలు, సంస్థలు ఉత్పత్తి చేసిన వస్తువులు స్వదేశీ అని అర్ధం కదా. ప్రజల సంస్థలైన, అసలు సిసలు భారతీయ కంపెనీలైన భారతీయ రైల్వే, జీవిత బీమా సంస్థ (ఎల్ ఐ సి), టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్, భెల్, కోల్ ఇండియా లాంటి ఎన్నో సంస్థల ఉసురు నెమ్మదినెమ్మదిగా ఈ ప్రభుత్వమే తీసేసింది. పబ్లిక్ సెక్టార్ అండర్‌ టేకింగ్ (పిఎస్ యు) కంపెనీలైన ఇండియన్ ఆయిల్, ఎన్ టిపిసి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, గెయిల్, నాల్కో, బియిఎల్, బిపిసిల్ లాంటి 28 సంస్థలను గుర్తించి క్రమక్రమంగా తన పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి (డిజిన్వెస్ట్మెంట్) నిర్ణయించుకుని ఆగమేఘాల మీద పనులు జరుపుతున్నది ఈ ప్రభుత్వమే. ఈ సంస్థల ఉత్పత్తులను, సేవలను ప్రజలు వాడేలా ప్రోత్సహించడం మానేసి నెమ్మదిగా దివాళా తీసినట్టు చేసింది చాలక అందులో ఉన్న ఉద్యోగులను రకరకాల పథకాలతో పొగబెట్టి పంపేసింది మన ప్రభుత్వమే. అలాంటి బలమైన దేశీయ సంస్థలలో పనిచేస్తున్న నిపుణులను, శ్రామికులను, కార్మికులను గంపగుత్తగా కుటుంబాలతో సహా రోడ్డుమీద పడేసింది మన ఏలికలే. ప్రపంచంలోనే పేరు తెచ్చుకున్న దేశీయ సంస్థలను బహిరంగ మార్కెట్లో అమ్మకానికి పెట్టేసి స్వదేశీ నినాదం ఇవ్వడాన్ని నంగనాచితనం అనక ఇంకేమంటారు!

Also read: వన్ సైడెడ్ లవ్!

నిజానికి మోడీ ప్రవచిస్తున్న ఈ నినాదం హిందూ ఆర్థిక విధానంలో ఒక భాగంగా చెప్పుకోవాలి. ఇదంతా 1995లో ప్రచురించబడిన “ది థర్డ్ వేవ్” పుస్తకం లోనిదే. దీని రచయిత దత్తోపాంత్ తెంగాడి. ఈయన ఆరెస్సెస్ వాణిజ్య, కార్మిక, రైతు విభాగాలైన స్వదేశీ జాగరణ్ మంచ్, భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సభ సంస్థలు స్థాపించిన వ్యక్తి. ఈయన 2004లో మరణించారు. ఒకవైపు రష్యా మొదలుకొని అన్ని దేశాలలో కమ్యూనిజం బలహీనం కావడం, మరోవైపు పెట్టుబడిదారి వ్యవస్థ ఆటుపోట్లు ఎదురుకుంటూ ఉండడంతో ఏర్పడిన భావజాల ఖాళీలో “హిందూ వైఖరి” మాత్రమే మానవాళిని రక్షించగలదని తెంగాడి అభిప్రాయం. దానిని అనుసరించే ప్రయత్నమే నరేంద్రమోడీ లాక్ డౌన్ సమయంలో ‘ఆత్మనిర్బర భారత్’ అని ఊదరగొట్టడం, ‘మేక్ ఇన్ ఇండియా’ అని ప్రచారం చేయడం.

Also read: తెలుగు కథా దీపధారి అస్తమయం


ఆలోచనకు ఆచరణకు మధ్య అగాధమంత లోతు ఉండడమంటేనే మోడీ కాబట్టి, ఆలోచన గొప్పదైనా ఆచరణలో ఆయన చేసిన ప్రతి పని గుజరాతీ కార్పొరేట్లకు దేశాన్ని అప్పనంగా దోచిపెట్టడమే. ఇప్పుడు స్వదేశీ నినాదానికి అర్థం దేశీయ పెట్టుబడిదారులైన పతంజలి రాందేవ్ బాబా, అంబానీ, అదానీల వస్తువులు కొనమని ప్రోత్సహించడం. పెట్టుబడిదారుడికి డబ్బు ముఖ్యం గానీ, ప్రాంతమూ ప్రజలూ కాదు. తన వస్తువు లేదా సేవను ఎవరికి అమ్మైనా నాలుగు రూపాయలు సంపాదించడమే వారి లక్ష్యం. ఇలాంటి వాళ్లకు దేశంలోని ప్రతి సంస్థను, దేశంలోని సహజ వనరులను, దేశంలో పండే పంటను, దేశంలో ఉత్పత్తి కులాలు శ్రమచేసి ఉత్పత్తి చేసే ప్రతి వస్తువును అప్పనంగా అందిస్తుంటే అవి తిరిగి సామాన్య ప్రజానీకానికి చేరేటప్పటికి వాటి ధరలు వందల రెట్లు పెరిగిపోతున్నాయి. ఇలా వాళ్లను మేపితే, వాళ్లు ఈ దేశంలోని రైళ్లు, విద్యుత్తు, విమానాలు, రోడ్లు, పోర్టులు, భూములు కొనేసి కొన్నాళ్లకు ఈ దేశంలోని గాలి, నీరు కూడా స్వాధీనం చేసుకోగలరు.

Also read: అతనికెందుకు పగ!

రూపంలో వీరితో పోలిస్తే విదేశీ వ్యాపారులే నయమనిపిస్తుంది. వారు కేవలం వస్తువులు, సేవలు అమ్మడానికి మాత్రమే పరిమితమవుతున్నారు. మన స్వదేశీ వ్యాపారులు బ్రిటీష్ పాలకుల కంటే ప్రమాదకరంగా కనిపిస్తున్నారు. స్వదేశీ నినాదంతో ప్రజల సొమ్మునంతా బ్యాంకుల్లో వేయించి, చిన్నచిన్న బ్యాంకులను విలీనంచేసి, ఆ డబ్బంతా స్వదేశీ వ్యాపారులైన నీరవ్ మోడీ, అదానీ, అంబానీలకు అప్పులుగా ఇప్పించి, ఆస్ట్రేలియా బొగ్గు గనుల నుండి బ్రిటన్ కార్ల కంపెనీల వరకూ కొనుగోలు చేసుకోనిచ్చి, ఆ రుణాలను కొన్నాళ్లకు పారుబాకీల కింద ప్రకటించి, మరి కొన్నాళ్లకు వాటిని రాని బాకీలుగా రద్దు చేసి, ఆ లోటుభారం సామాన్య జనమ్మీద విధించిన పన్నుల నుండి పూర్తి చేయడమే సారంలో స్వదేశీ నినాదంగా గత ఆరేళ్ల మోడీ పాలనలో మనకు కనిపించింది.

Also read: హ్యాష్ టాగ్ మోదీ


ఈ గొప్ప స్వదేశీ వ్యాపారులకు పోటీగా నిలబడే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలని మూసేసి లేదా మూసేయించి, ఈ స్వదేశీ వ్యాపారస్తుల ఉత్పత్తులకు, సేవలకు మాత్రమే వ్యాపారావకాశాలు కల్పించేదే “స్వదేశీ నినాదం’ అయితే ఆ స్వదేశీ వినాశకరమైనది. చాలా ప్రమాదకరమైనది.

(వ్యాసరచయిత మొబైల్:  9989265444)

రవికుమార్ దుప్పల
దుప్పల రవికుమార్ సిక్కోలు బుక్ ట్రస్ట్ ప్రధాన సంపాదకులు. ఆంగ్ల అధ్యాపకులు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. మొబైల్ : 99892 65444

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles