Friday, June 9, 2023

సిక్కోలు రైతుకు బాసట

నేరడి జలాశయం

బంతిలా ఉండే భూమిమీద ఏ ప్రాంతమూ ఏదో ఒక మూలలో ఉండకపోయినప్పటికీ పెద్ద పెద్ద పట్టణాలలో నివశించేవారు తమకు దూరంగా ఉండే పల్లె ప్రజలను మారుమూల గ్రామాలలో ఉంటారని భావిస్తుంటారు. వారికది తమకు తెలియకుండానే ఏర్పడిన ఆధిపత్య భావన కావచ్చు. కాని దానికి పూర్తి భిన్నంగా గ్రామాలలో నివశించే ప్రజలు కూడా తాము మారుమూల బతుకుతున్నామని భావిస్తుండడమే వింత. ఆ ఆధిపత్య భావన స్థిరీకరణకు మూలమిదే. ఈ దృష్టితో చూడకపోతే మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే అత్యంత వెనుకబడిన మారుమూల ప్రాంతంగా శ్రీకాకుళం జిల్లాను గుర్తించడం పెద్ద కష్టమేమీ కాదు. నిజానికి ఒక ప్రాంతం వెనుకబడి ఉండడం ఆ ప్రాంతమో, అక్కడి ప్రజలో చేసుకున్న పాపం కాదు. అది ఆయా పాలకులు వారికి అందించిన శాపం మాత్రమే. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకూ సమానంగా విస్తరింపజేయని ఫలితమే ఒక ప్రాంతం వెనుకబాటుతనం. శరీరంలో అన్ని భాగాలూ సమానంగా అభివృద్ధి చెందక, కొన్ని భాగాలు బలహీనపడితే అది అంగవైకల్యమే అవుతుంది.

Also read: స్వదేశీ అంటే..?


నదులు ఎక్కువ నీరు తక్కువ

మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ ప్రాంతానికి లేనన్ని నదీపాయల ప్రవాహాలు కళింగాంధ్ర అని పిలవబడే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో అగుపిస్తాయి. నదులు, నదీపాయలు, వాగులు, వంకలూ కలిసి సుమారు పదిహేను ప్రధాన నీటిధారలు కళింగాంధ్ర నేలను ఒరుసుకుని పారుతూ సముద్రంలో కలిసిపోతాయి. వాటిలో శ్రీకాకుళం జిల్లా పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేవి వంశధార, నాగావళి నదులే. ఈ రెండు నదులూ పుట్టడం ఒరిస్సాలోనే పుట్టినా ఈ జిల్లా అంతటా ప్రవహించి ఇక్కడే సముద్రంలో సంగమిస్తాయి. జిల్లానిండా ఈ నదులు పాయలు పాయలుగా చీలికలు చీలికలుగా ప్రవహిస్తున్నప్పటికీ నీటి యాజమాన్య పద్ధతులు తెలియక, అరకొరగా తెలిసినా కొద్దిపాటి నీటి వనరులను సరిగ్గా వినియోగించుకోక, వీటిని మించి ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత వైఖరివల్ల రైతులకు నీటికి కటకట. జిల్లావాసులకు తాగునీటికి, సాగునీటికి తీవ్రమైన ఎద్దడి.

Also read: మూతపడనున్న ఇంటర్ బోర్డు?


1889లో ఒక పర్యాయం, 1896లో రెండు పర్యాయాలు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడి జిల్లా ప్రజలు కరువుతో అల్లల్లాడిపోయినపుడు ఆ క్షామాన్ని ఎదుర్కోవడానికి బ్రిటిష్ వారు 1908లో నాగావళి నదిపై తోటపల్లి రెగ్యులేటర్‌ను ఏర్పాటుచేశారు. అంతే, ఆ తర్వాత ఆరేడు దశాబ్దాల వరకు ఈ నేలను పట్టించుకున్న నాధుడే లేడు. స్వాతంత్య్రం రాకమునుపే ఈ రెండు నదులపైనున్న ఓపెన్ హెడ్ చానెల్స్ ద్వారా వంశధార 56వేల ఎకరాలకు, నాగావళి 42వేల ఎకరాలకు సాగునీరు అందించేవి. వీటితోపాటు అప్పటికి ఉన్న 9వేల చిన్నా పెద్దా చెరువులు, బావుల ద్వారా మరో లక్షన్నర ఎకరాల నేల కనాకష్టంగా సాగయ్యేది. అంటే స్వతంత్రం వచ్చేనాటికి 14,423 లక్షల ఎకరాల శ్రీకాకుళం జిల్లాలో 9.22 లక్షల ఎకరాల సాగుయోగ్యమైన భూమిలో కేవలం 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. మిగిలిన ఆరున్నర లక్షల ఎకరాల భూమి నిరుపయోగంగా పడుండేదన్న మాట. వెనకబాటుతనానికి కారణాలు అన్వేషించవలసింది ఈ మార్గంలో అయితేనే, దానిని అధిగమించే ఆలోచనలు చేయగలుగుతాం.

Also read: పలుకే బంగారమాయే!


జీవధార వంశధార

ఒక నది పుట్టినచోటు నుంచి ఎన్నో మలుపులు తిరుగుతూ, హెయలుపోతూ, చిన్నచిన్న పాయలుగా పారుతూ అనేక గ్రామాలను తడుపుతూ పోతూ ప్రవహించేది సముద్రుడిని చేరి ఉప్పునీటి పాలవ్వడానికి కాదు. తాను పారే చోటల్లా నేలను సస్యశ్యామలం చేసి, వేసిన విత్తునల్లా బంగారంలా పండించి, రైతన్న కళ్లల్లో ఆనందం చూడాలని ప్రతి నదీ తహతహలాడుతుంది. ప్రవాహప్రాంతాలలో నీటిని ఒడిసి పట్టుకుని వ్యవసాయానికి వినియోగించుకోవడం మనిషి బాధ్యత. అందుకు తగిన నిధులు కేటాయించి, ప్రాజెక్టుల పనులను సుసాధ్యం చేయడం పాలకుల బాధ్యత.

Also read: రైట్.. రైట్.. ప్రైవేట్..


ఒడిషా రాష్ట్రంలో కోరాపుట్ జిల్లాలో బిస్సమ్ కటక్ ప్రాంతానికి ఉత్తరాన గల బిలమల గ్రామానికి 1.60 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమల సానువుల్లో పుట్టిన వంశధార నదీమతల్లి ఆ రాష్ట్రంలో 154 కిలోమీటర్లు ప్రయాణించి, అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో మరో 29 కిలోమీటర్లు తిరుగాడి అక్కడనుంచి గొట్లభద్ర గ్రామం వద్ద శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశించి 82 కిలోమీటర్లు ప్రయాణించి కళింగపట్నం వద్ద బంగాళాఖాతం అనబడే తూరుపు తీరంలో సంగమిస్తుంది. ఈ నదికి పొడుగునా 10,774.36 చదరపు కిలోమీటర్ల పరిధిలో వర్షపునీటిని అందించే క్యాచ్మెంట్ ఏరియా ఉండగా, అందులో 9 వేల చదరపు కిలోమీటర్లు ఒడిషా రాష్ట్రంలోనే ఉంది కనుక రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య 1962లో జరిగిన ఒప్పందంలో వంశధార పరీవాహక ప్రాంతపు నీటిని చెరి సగం పంచుకోవాలని తీర్మానించుకున్నాయి. అలా 1962లో మొదలైన వంశధార ఎడమ ప్రధాన కాలువ రైతుకు పూర్తిగా వినియోగంలోకి వచ్చింది 2004లో అని గుర్తించాలి.

Also read: వన్ సైడెడ్ లవ్!


ఇంకా కుడికాలువ పనులు పూర్తి చేయవలిసే ఉంది. వంశధారలో ఉన్న 115 టిఎంసిల నీటిలో న్యాయంగా మనకు దక్కాల్సిన 57.5 టిఎంసిలలో కేవలం 17.5 టిఎంసిల నీటిని మాత్రమే మనం వినియోగించుకుని, లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించగలుగుతున్నాం. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రారంభించిన జలయజ్ఞంలో భాగంగా అప్పటి రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చొరవవల్ల కుడికాలువ పనులకు అంతా సిద్ధం చేసినప్పటికీ తమ 120 ఎకరాల ముంపుభూమి విషయం తేల్చమని ఒడిషా ప్రభుత్వం తగువు పెట్టింది. సమస్యను పరిష్కరించడానికి వైఎస్ సానుకూలంగా స్పందించి, ఒడిషా నదీతీరంలో 3.8 కిమీ మేర రక్షణ గోడ నిర్మిస్తామని, వరదనీటిని మళ్లించడానికి క్యాచ్ డ్రెయిన్ చేపడతామని, ముంపుభూముల్లో 106 ఎకరాలు కొనుగోలు చేస్తామని ముందుకొచ్చారు. దాంతో వంశధార మొదటి దశలో మొదటి, రెండవ స్థాయిల పనులు పూర్తయ్యా యి.

Also read: తెలుగు కథా దీపధారి అస్తమయం


రైతన్నకు భరోసా

ఈ దశలో వైఎస్ జగన్ ప్రభుత్వం మరో ముందడుగు వేసి ఒడిషా రాష్ట్ర ప్రజల భయాందోళనలను మరింతగా తొలగించడానికి కృషి చేసింది. వంశధార ట్రైబ్యునల్ కు తన వాదనలు వినిపించింది. వంశధార నీటిని జలాశయాలలో బంధించక పోవడం వల్ల సుమారు ముప్ఫై టిఎంసిల నీటిని ఎవరూ వినియోగించుకోక వృథా చేసుకుని సముద్రంలో విడిచిపెట్టాల్సివస్తోందని విన్నవించుకుంది. ఒడిషా ప్రభుత్వ ఆందోళనలను అనవసర భయాలుగా చెప్పడమే కాకుండా, ముంపు ప్రమాదాల నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టనున్న చర్యలు కూడా న్యాయమూర్తులకు ఇరిగేషన్ అధికారులు వివరించారు. దాంతో వంశధార ట్రైబ్యునల్ ఆంధ్రప్రదేశ్ కు అనుకూలంగా తీర్పునివ్వడం విశేషం. అంతేకాక ఒడిషా ప్రభుత్వానికి చెందిన 106 ఎకరాల భూమిని వెంటనే ఆంధ్రప్రదేశ్ కు స్వాధీనపరచాలని న్యాయమూర్తులు ఆదేశించారు. దీంతో దాదాపుగా నేరడి రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని అడ్డంకులు తొలగినట్టు భావించవచ్చు.

Also read: అతనికెందుకు పగ!


భామిని మండలం నేరడి గ్రామం వద్ద వంశధార నదిపై ఈ రిజర్వాయర్ నిర్మాణంవల్ల మరో 19 టిఎంసిల నీటిని అక్కడ నిల్వ చేయవచ్చని అంచనా. దీనివల్ల జిల్లాలోని సుమారు 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందివ్వగలుగుతాము. వంశధార జలవివాదాల ట్రైబ్యునల్ ఇచ్చిన తాజా తీర్పు మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం నేరడి జలాశయపు నిర్మాణపు పనులకు శ్రీకారం చుట్టవచ్చు. హిరమండలం వద్ద గొట్ట రిజర్వాయర్‌కు ఇది అదనంగా జిల్లాకు సాగునీటిని, తాగునీటిని అందించడానికి తోడ్పడుతుంది. దీంతోపాటు చెరువుల మరమ్మతులపై కూడా ప్రభుత్వం దృష్టి పెడితే వర్షాభావ పరిస్థితులను తట్టుకునే ధైర్యం రైతన్నకు లభిస్తుంది.

Also read: హ్యాష్ టాగ్ మోదీ

రవికుమార్ దుప్పల
దుప్పల రవికుమార్ సిక్కోలు బుక్ ట్రస్ట్ ప్రధాన సంపాదకులు. ఆంగ్ల అధ్యాపకులు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. మొబైల్ : 99892 65444

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles