Friday, April 26, 2024

ఆశావహంగా హిందీ బాల సాహిత్యం

బాలల హిందీ పుస్తకాలను హారీ పోర్టర్ ఓడించింది. కానీ ‘పిటారా’ ఆశాజనకంగా కనిపిస్తోంది

ఇంగ్లీషు వ్యామోహంలో పడి కొట్టుకుంటున్న మన ఉన్నతవర్గాలవారికి ఎప్పుడో ఒకప్పుడు తమ పిల్లలు అమెరికా వాచాలకుల కంటే తక్కువ స్థాయికి చెందినవారు కారాదని గ్రహించకపోరు.

Also read: అద్భుతమైన తెలివితేటలు కలిగిన మూర్ఖులు

చాలా సంవత్సరాల తర్వాత రూపాహాథీని కలుసుకున్నాను. తాను ఒక జంతుప్రదర్శనశాలలో నివసిస్తోంది. తనకు తానే అసహ్యంగా కనిపిస్తోంది. పులి చారలు, చిరుతపులి చుక్కలు ఏనుగుకు వచ్చాయి. తోకకు చిలుక తన రంగులు అద్దింది. నెమలి తన ఈక ముద్రను మన రూప తొండంపైన దించింది. విచిత్రంగా కనిపించే ఈ జంతువు జంతుప్రదర్శనశాలకు వచ్చే యువతకు అక్కరలేదు. వారికి తమ పాత ఏనుగు రూపానే కావాలి. రూపా తన శరీరంపైన ఉన్న అన్ని రంగులను కడిగివేసుకుంది. తన విచారాన్ని సైతం వదిలించుకుంది.

Children’s books in Delhi’s World Book Fair

ఇటీవల దిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శనలో నేషనల్ బుక్ ట్రస్ట్ వారి స్టాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ చక్కటి కథ నాకు గుర్తుకు వచ్చింది.

నా పిల్లలు చదువుతూ పెరిగిన అనేక పుస్తకాలలో రూపాహాథీ ఒకటి. మన భాషలను పిల్లలు నేర్చుకోవాలని నేనూ, మధూలికా గట్టిగా కోరుకున్నాం. వారికి హిందీ పుస్తకాలు సంపాదించడం నా పని. మన పిల్లలకు నాణ్యమైన పుస్తకాలు అందుబాటులో లేవని గ్రహించింది అప్పుడే. పాఠ్యపుస్తకాలూ, ఇతర విద్యాసంబంధమైన పుస్తకాలూ ఉన్నాయి. ప్రేరణ కలిగించే సాహిత్యం ఉంది కానీ అది విసుగుపుట్టించేది. పురాణాలకు సంబంధించిన కథల పుస్తకాలూ, నీతులు చెప్పే పంచతంత్ర కథలూ, విక్రమాదిత్య-బేతాళుడి కథలూ, అక్బర్-బీర్బల్ కథలూ కనిపిస్తాయి. తక్కినవాటి కంటే అమర్ చిత్ర కథ సంస్థ ప్రచురించే బొమ్మల పుస్తకాలు మెరుగ్గా ఉంటాయి. నేను చిన్నప్పుడు చదివిని బాలసాహిత్యం కంటే మెరుగైన హిందీ పుస్తకాలు ఇప్పుడు కూడా పిల్లలకు అందుబాటులో లేవు. చంపక్, పరాగ్, నందన్ వంటి హిందీ పత్రికలూ, లాట్ పోట్, ఫాంటమ్ కామిక్స్ ,సోవియెట్ ప్రచురణల నుంచి బాగా అందంగా ముద్రించిన పుస్తకాలు నా చిన్నతనంలోనూ అందుబాటులో ఉండేవి. నాణ్యమైన, అందమైన బొమ్మలతో కూడిన, మంచి ఆసక్తికరమైన కథలతో వస్తున్న ఇంగ్లీషు పుస్తకాలు ఈ తరం పిల్లలకు అందుబాటులో ఉన్నాయి. వారికి ఈ హిందీ పత్రికలూ, పుస్తకాలూ పెద్దగా నచ్చవు. ముఖ్యంగా టీవీలలో కార్టూన్ చానల్స్ వస్తున్న ఈ రోజుల్లో వాటితో పోటీ పడే స్థాయిలో హిందీ బాలల పుస్తకాలు లేవు.

Also read: భారత ప్రజలు రాహుల్ గాంధీని గుండెకు హత్తుకున్న వేళ!

కొన్ని మినహాయింపులు ఉన్నాయి. కానీ వాటికోసం పనికట్టుకొని వెతకాలి. చిల్డ్రన్ బుక్ ట్రస్ట్ (సీబీటీ)ప్రచురించే పుస్తకాల నాణ్యత పరవాలేదు. ఎన్ బీటీ కూడా రూపా హాథీ లాంటి నాణ్యమైన పుస్తకాలు లోగడ ప్రచురించేది. కరడీ కథలను గుల్జార్ పిల్లలకు చెబుతుండగా రాసి ప్రచురించిన పుస్తకాలు దొరకడం అమితానందం కలిగించింది. పిల్లలకు రాజాకపి కథలంటే చాలా ఇష్టం. నాకు కూడా. గుల్జార్ తన కుమార్తె బోస్కీకి బహుమతిగా ఇచ్చిన ‘బోస్కీకా పంచ్ తంత్ర్’ నాకు కనిపించింది. కమలాభాసిన్ రచించిన ‘మాలూ భాలూ’ కథలనూ, తులికాబుక్స్ నూ, దేశంలోనే ప్రముఖమైన విద్యాపరమైన ప్రభుత్వేతర సంస్థ (ఎన్ జీవో) ప్రచురించిన పుస్తకాలనూ మన పిల్లలకు ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. ఏకలవ్య సంస్థ అప్పుడప్పుడు కొన్ని కథల పుస్తకాలను ప్రచురిస్తూ ఉంటుంది. సైన్స్ విద్యపైన అధ్భుతమైన పుస్తకాలతో పాటు ‘భాలూ నే ఖేలీ ఫుట్ బాల్’ అనే పుస్తకం కూడా నాకు గుర్తున్నది.

హారీపోర్టర్ హిందీ బాలసాహిత్యాన్ని దెబ్బతీసింది

ఇతర భారతీయ భాషల గురించి నాకు పెద్దగా తెలియదు. కానీ హిందీలో వస్తున్న పిల్లల పుస్తకాలు మాత్రం ఇంగ్లీషు బాలల పుస్తకాల ముందు బలాదూరు. అత్తలు ప్రేమగా మన పిల్లలకు బహుమతిగా ఇచ్చే జూలియా డోనాల్డ్ సన్ అద్భుతమైన పుస్తకం గ్రఫలో, దాని తర్వాత విడుదలైన డొనాల్డ్ సన్-షెఫ్లెర్ పుస్తకాల ముందు హిందీ పుస్తకాలు తేలిపోతాయి (ఈ పుస్తకాలు ఇప్పటి దాకా చదవకపోతే ఇకనైనా చదవండి). ఈ పుస్తకాలలోని చిత్రాలు కానీ, కథలు ప్రతిభావంతంగా చెప్పిన విధానం కానీ మన హిందీ సాహిత్యంలో కనిపించదు. మన ప్రయత్నం సాగుతూనే ఉంది, అర్వింద్ గుప్తా నడిపిస్తున్న ఉన్నత ప్రమాణాలతో కూడిన వెబ్ సైట్ హిందీలో మేలిరత్నాల వంటి కథలను ప్రవేశపెట్టింది.

Also read: భారత రాజకీయాలలో ఇది ప్లాస్టిక్ యుగం, ఫ్లెక్సీలలో అర్థాలు వెతక్కండి!

రూపాహాధీ పైన హారీ పోర్టర్ ఆధిక్యం

మన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్న క్రమంలో బాలల సాహిత్యం విషయంలో కఠిన పరీక్ష ఎదుర్కొన్నారు. చాచా చౌధరీ కథల కంటే టిన్ టిన్ సాహసగాథలు చాలా ఆసక్తికరమైనవి. ఎడిన్ బ్లైటన్ ప్రచురించిన ఫేమస్ ఫైవ్ కు సమానమైన సాహిత్యం హిందీలో రాలేదు. జే.కే. రౌలింగ్ రాసిన హారీపోర్టర్ కథలు చివరిగా హిందీ బాలల సాహిత్యాన్ని చిత్తుగా ఓడించాయి.  వారి వయస్సులో ఉన్నప్పుడు నేను చదివిన రోమాంచిత సాహిత్యం హాగ్ వార్ట్ స్కూల్ నుంచి వస్తున్న క్షుద్రసాహిత్యం ముందు ఏమి నిలుస్తుంది? ఆ సాహిత్యం చూసినప్పుడు నాకు చాలా చిన్నతనం అనిపించేది.

కడచిన రెండు దశాబ్దాలలో మన పిల్లలకు మనం న్యాయం చేశామా? ప్రపంచ పుస్తక ప్రదర్శనలో బాలసాహిత్యం ప్రదర్శించిన హాలులో తిరుగాడినప్పుడు నన్ను వేధించిన ప్రశ్న ఇది. వ్యాపార ప్రచురణకర్తలు ఇదివరకటిలాగానే ఇప్పుడూ చెత్తగానే ఉన్నారు. వారు ఏమీ పట్టకుండా ఇంగ్లీషు పుస్తకాలు సంపాదించి వాటిని నాసిరకం హిందీలోకి అనువదించి ప్రచురిస్తున్నారు. ఇంగ్లీషు మీడియం స్కూళ్ళు తామరతంపరలాగా పుట్టుకొస్తున్నఈ రోజుల్లో ప్రైవేటు ప్రచురణకర్తల నుంచి హిందీలో  ఇంతకన్నామెరుగైన పుస్తకాలను ఏమి ఆశిస్తాం?  పుస్తకాలకోసం డబ్బు ఖర్చుచేయగలవారు ఇంగ్లీషు ప్రపంచంలోకి రవాణా అవుతారు. హిందీకి మాత్రమే పరిమితమైనవారికి పుస్తకాలు కొనే శక్తి లేదు.

రూపా హాధీ

అన్ని రంగాలలో వలెనే ప్రచురణరంగంలో కూడా ప్రభుత్వసంస్థలు కూడా వెనకబడ్డాయి. కొంతకాలంగా సీబీటీ బలహీనపడుతూ వచ్చింది. ఎన్ బీటీలో కూడా కొత్తపుస్తకాలు ఏమీ రావడంలేదు. అర్వింద్ గుప్తా రచించిన ‘గిజూభాయ్ కథల’ వంటి తన పాత ప్రచురణలపైన సైతం ఈ సంస్థకు శ్రద్ధాసక్తులు లేకపోవడం దారుణం. రూపాహాథీ మళ్ళీ విచారంగా ఉంది. పిల్లలు తనను గుర్తించేందుకు నిరీక్షిస్తోంది.

కొత్త హిందీ పుస్తకం ‘పిటారా’

ప్రభుత్వేతర, వ్యాపారేతర రంగం నుంచి చాలా ఆశావహమైన పరిణామం సంభవించింది. టాటాట్రస్ట్, నిలెకనీ ట్రస్ట్ వంటి దాతృత్వ సంస్థల నుంచి సహాయం అందుతోంది. ఈ మార్పునకు మధ్యప్రదేశ్ కు చెందిన ఎన్ జీవో ఏకలవ్య సారథ్యం వహించింది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పిల్లలు ఆసక్తికరంగా చదివే కథలను నాలుగు దశాబ్దాలుగా ఈ సంస్థ నడుపుతున్న ‘చక్మక్’ పత్రిక ప్రచురిస్తూ వచ్చింది. ఈ సంస్థవారు నిజంగానే ఒక పిటారా (బుట్ట)ను కల్పిత కథలు, వాస్తవికకథలు, విద్యాపరమైన పుస్తకాలు, విద్యాబోధకులకు పనికి వచ్చే పుస్తకాలతో అన్నిరకాల వయస్సులవారికి పనికి వచ్చే అసలుసిసలైన హిందీ పుస్తకాల సముదాయాన్ని అందిస్తున్నారు. హిందీలో బోర్డు పుస్తకాల మొదటి వరుసను ఈ సంస్థ విడుదల చేసింది. ప్రథమ్ అనే సంస్థ కొన్నేళ్ళుగా తన పుస్తకాల పరిధిని విస్తరించింది. నాణ్యతపైన దృష్టిపెట్టింది. చాలా చక్కగా ముద్రించిన ఈ పుస్తకాలను 22 జాతీయ భాషల్లో ప్రచురించి దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు.

ఈ ఏడాది నా నిజమైన ఆవిష్కరణ ఏక్ తారా. ఇది కూడా భోపాల్ కు చెందిన సంస్థ. యథాలాపంగా ఏక్ తారా స్టాల్ లోకి నడిచాను.  ‘సైకిల్’ అనే ద్వైమాసిక పత్రిక ద్వారా ఈ సంస్థ చేస్తున్న పనుల గురించి నాకు ఎంతోకొంత తెలుసు. కానీ ఈ సంస్థ ప్రచురించే పుస్తకాల పరిధి ఇంత విస్తృతమైనదని నాకు తెలియదు. నేను కోరుకునే, ఊహించుకునే హిందీ బాలల పుస్తకాలు నా కళ్ళ ఎదుట కనిపించాయి.  సర్వేశ్శర్ దయాళ్ శర్మ పిల్లలకోసం రచించిన పాటలు (బటూటా కా జూటా సహా)చిన్న పుస్తకాలలో  దర్శనమిచ్చాయి. నాకు ఎప్పటికీ ఇష్టమైన గుల్జార్ రాసిన బాలసాహిత్యం పుస్తకాల పరంపర అక్కడ ఉన్నది. ఆయన కథలకు కళ్ళు మిరుమిట్లు కొలిపే విధంగా ఎలెన్ షా వేసిన బొమ్మలు ఉన్నాయి. హిందీ సాహిత్యంలో బతికున్న మహానుభావుడు వినో కుమార్ శుక్ల్ పిల్లలకోసం మరో కథల పరంపర రచించారు. టకే థే దస్ వంటి చిన్న పుస్తకాల నుంచి పెద్ద పుస్తకాల దాకా అన్ని సైజులలోనూ, అన్ని డిజైన్లలోనూ ఏక్ తారా పుస్తకాలు ప్రచురించింది. బొమ్మలతో కూడిన నవలలు ఉన్నాయి. రంగురంగుల బొమ్మల కథల పుస్తకాలూ, పద్యాల, పాటల పుస్తకాలతో పాటు  బొమ్మల సహితంగా నవలలూ, బొమ్మలు  లేని నవలలు కూడా ఉన్నాయి. ఏక్ తారా పోస్టర్లూ, పోస్టర్ కార్డులూ నాకు బాగా నచ్చాయి. నా హిందీ అంటే నాకు సంతోషంగా, గర్వంగా ఉంది.

నవభారతం నాగరికతపరంగా విఫలమైన రంగాల గురించి చెప్పమని నన్ను అడిగితే  బాలల సాహిత్యాన్ని ప్రచురించడంలో మన వైఫల్యాన్ని ముందుగా చెబుతాను (పరిశుభ్రమైన మరుగుదొడ్లు లేకపోవడం రెండో వైఫల్యం. పర్యావరణ స్పృహ బొత్తిగా లేకపోవడం మరో దారుణమైన వైఫల్యం). ఆ వైఫల్యాన్ని హిందీ బాలలపాహిత్యంలో ఇప్పుడు కనిపిస్తున్న పురోగతి అధిగమిస్తుందా?  నేను ఈ విషయంలో జాగ్రత్త కలిగిన ఆశావాదిని. జాగ్రత్త ఎందుకంటే ఈ పురోగతికి మార్కెట్ మద్దతు లేదు. మార్కెట్ దృక్పథంలో మార్పు లేకపోతే ఈ పురోగతి కొనసాగడం కష్టం. ఆశావాదం ఎందుకంటే ఎప్పటికైనా ఇంగ్లీషు అంటే పడిచచ్చే మనవాళ్ళు తమ పిల్లలు అమెరికా వాగుడుకాయల కంటే తక్కువ స్థాయి గలవారు కారాదనే విషయాన్ని గ్రహిస్తారని. అప్పటికి చాలా జాప్యం జరగదనీ, పరిస్థితుల చేయిదాటి పోవనీ నా ఆశ.

Also read: భారత్ జోడో యాత్ర ప్రభావం గణనీయం

Yogendra Yadav
Yogendra Yadav
యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు. స్వరాజ్ అభియాన్, జైకిసాన్ ఆందోళన్ సంస్థల సభ్యుడు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకై శ్రమిస్తున్న బుద్ధిజీవులలో ఒకరు. దిల్లీ నివాసి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles