Friday, December 2, 2022

పవన్ ఆశ అడియాసేనా? టీడీపీతో వియ్యానికి బీజేపీ కలసిరాదా?!

వోలేటి దివాకర్

2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని భయపడుతున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులను జనసేన అధినేత పవన్ కల్యాణ్  ప్రకటన ఆనంద డోలికల్లో ముంచెత్తింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయన్న  ప్రచారం అధికార వైసీపీలో ఒక విధమైన ఆందోళన రేకెత్తించిందని చెప్పవచ్చు. అయితే తాజా పరిణామాలు అధికార పార్టీకి ఆనందం కలిగించే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో టీడీపీ కి నిరాశ కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి సమావేశమయ్యారు. ఏపీలో  రెండు కుటుంబ పార్టీలకు దూరంగా ఉంటూ ప్రజాఉద్యమాలు నిర్వహించాలని నిర్ణయించారు. అంటే టీడీపీ, వైసీపీలకు దూరంగా ఉండాలని అర్థం.

పవన్ కలలు కల్లేనా?

ఆమధ్య జరిగిన జనసేన ఆవిర్భావ సభపై టీడీపీ అనుకూల మీడియా కవరేజీ చూస్తే జనసేన , టిడిపి మధ్య అప్పుడే పొత్తు కుదిరిపోయిందన్న ఆనందం

కనిపించింది. ఈసభ జనసేనలో కన్నా తెలుగుదేశంలో ‘పవనోత్సాహం’ కలగజేసిందని చెప్పవచ్చు . ఈ సభలో పవన్ ప్రభుత్వంపై నిప్పులు చెరగడంతో పాటు,  వైసిపి వ్యతిరేక ఓట్లు చీలనివ్వబోమని, వైసిపి వ్యతిరేక శక్తులు ఏకమవ్వాలని పిలుపునివ్వడం ద్వారా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటామని పరోక్షంగానైనా స్పష్టంగానే సంకేతాలు ఇచ్చారు. వైసిపి వ్యతిరేక శక్తులతో కలిసి అధికారంలోకి వస్తే రాష్ట్ర బాధ్యతను జన సేన తీసుకుంటుందని జనసేనాని పవన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం పవన్ కల్యాణ్ కు అసంతృప్తిని కలిగించే అవకాశాలు ఉన్నాయి.

 పవన్ బీజేపీకీ బైబై చెబుతారా?

2014 ఎన్నికల తరువాత బిజెపి పట్ల టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వ్యవహరించిన తీరు, పొత్తు విచ్చిన్నం తరువాత ప్రధాని నరేంద్రమోడీని వ్యక్తిగతంగా దూషించిన విషయాన్ని ఇప్పటికీ నిజమైన బిజెపి కార్యకర్తలెవరూ మర్చిపోలేదు. ప్రధాని మోడీయే చంద్రబాబునాయుడు అవినీతిని, వ్యవహారశైలిని తీవ్రస్థాయిలో తూర్పారబట్టారు. భవిష్యత్లో టిడిపితో పొత్తు ప్రసక్తే లేదని గతంలో హోమ్ హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ ధియోధర్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పటికే పలుసార్లు స్పష్టం చేశారు. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో టిడిపికి బి జట్టుగా వ్యవహరిస్తున్న  కాంగ్రెస్, సిపిఐ పార్టీలు  సిద్ధాంతపరంగా బిజెపికి బద్ధవైరమన్న విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జనసేన , బిజెపి కూటమిలోకి టిడిపి కూటమి చేరికపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పవన్ బీజేపీ వెంట ఉంటారా…ఆపార్టీ తో తెగతెంపులు చేసుకొని టీడీపీ కూటమితో కలిసి వెళతారా అన్నది చర్చనీయాంశంగా మారింది.

Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles