Sunday, June 26, 2022

ఉక్రెయిన్ తో రష్యా ఉక్కిరిబిక్కిరి

మోదీ, మేక్రన్ ఆలింగనం

ఉక్రెయెన్ పైన దండయాత్ర తలపెట్టడంలో రష్యా అధినేత పుతిన్ లక్ష్యం ఏమిటి? ఉక్రెయిన్ ను నాటో కూటమిలో చేరకుండా అడ్డుకోవడం ఒకటి. ఉక్రెయిన్ దేశంలోని తూర్పు రాష్ట్రాలకు ఇతోధికంగా నిర్ణయాధికారాలు కట్టబెట్టడం రెండవది. ఈ రెండు లక్ష్యాలనూ సాధించడానికి యుద్ధం చేయనక్కరలేదు. దౌత్యమార్గంలో సాధించదగిన లక్ష్యాలే ఇవి. ఫిబ్రవరి 23న ఉక్రెయన్ పైన యుద్ధం ప్రకటించడానికి ముందు పుతిన్ బలవంతుడు. ఇప్పుడు అనవసరమైన యుద్ధం నుంచి బయటపడటం ఎట్లాగో తెలియకు ఉక్రోషం పట్టలేకి ఉక్రెయిన్ నగరాలను ధ్వంసాయమానం చేయిస్తున్న నేత. 56 లక్షల మంది పొరుగు దేశాలకు పలాయనం చిత్తగించి తలదాచుకున్నారు.

దండయాత్ర ఎందుకు?

ఉక్రెయిన్ ను ఓడించడం కొన్ని రోజుల్లో పూర్తవుతుందని పుతిన్ విశ్వసించాడు. ఒక హాస్యనటుడు దేశాధినేతగా ఉండగా, మరికొందరు నటులు మంత్రిమండలిలో ఉన్న దేశంపైన రష్యాసేనలు అవలీలగా విజయం సాధించగలవని పుతిన్ భావించాడు. పుతిన్ విజయం సాధించడం లేదు. కానీ ఆ వాస్తవాన్ని అంగీకరించి సమాధానపడే పరిస్థితిలో పుతిన్ లేడు. అందుకని పట్టలేని ఉక్రోషంతో దాడి తీవ్రత పెంచాడు. ఉక్రేన్ నగరాలు విధ్వంసానికి గురి అవుతున్నాయి. ఉక్రెయిన్ ను ధ్వంసం చేయాలనే కసితో పుతిన్ రగిలిపోతున్నాడు. ఈ విద్వేషం వల్ల రష్యా పౌరులే అత్యధికంగా నష్టపోతున్నారు. అమెరికా విధించిన ఆంక్షల వల్ల రష్యన్ల కష్టాలు పెరిగాయి. అయినా సరే వారు పెల్లెత్తు మాట అనరు. పుతిన్ పైన తిరుగుబాటు చేసే పరిస్థితులు లేవు. ప్రపంచయుద్ధం వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా రష్యా ఇప్పుడు ఏకాకి.  ఈ యుద్ధం తాలూకు విషఫలితాలను రష్యా, యూరోప్ చాలాకాలం అనుభవించవలసి ఉంటుంది.

తప్పు తెలుసుకున్న పుతిన్

ఉక్రెయిన్ పై దాడి ఘోరమైన తప్పిదమని ఇప్పుడు పుతిన్ సైతం గ్రహించాడు. ఉక్రెయిన్ అమితంగా నష్టపోతోంది. సైన్యాధికారులూ, సైనికులూ చాలామందిని రష్యా కోల్పోయింది. ఉక్రెయిన్ ఈ రకంగా రష్యాకు దీటుగా నిలబడి యుద్ధం ఇంతకాలం కొనసాగిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఉక్రెయిన్ కు అండగా అమెరికా, నాటో దేశాలు నిలిచాయి. భారీ ఆయుధ సాయం అందిస్తున్నాయి. రష్యాను ఉక్రెయిన్ ఇంతకాలం నిలువరించగలిగిందంటే నాటో ఆయుధ సహకారమే కారణం. రష్యాకు అనుకూలమైన ఉక్రెయిన్ రాష్ట్రాల సహకారంతో రష్యా సైనికులు రష్యా పట్టణాలలో విధ్వంసం సృష్టించగలుగుతున్నారు. యురేనియన్ యోధులు చిన్న చిన్ని బృందాలుగా తిరుగుతూ రష్యా సైనికుల పథకాలను వమ్ము చేస్తూ వచ్చాయి.

చారిత్రక దినం

మే 9 రష్యా చరిత్రలో చిరస్మరణీయమైన రోజు. ఏడున్నర దశాబ్దాల కిందట రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ సేనలపైన రష్యా విజయం సాధించింది ఆ రోజే. మే 9 కల్లా ఉక్రెయిన్ పైన పైచేయి సాధించాలని పుతిన్ విశ్వప్రయత్నం చేస్తున్నారు. సంక్షోభంలో కథానాయకులు పుడతారని అంటారు. ఉక్రెయిన్ సంక్షోభంలో ఆ దేశ అధ్యక్షుడు జెలన్ స్కీ ధోరోదాత్తుడుగా ఎదిగారు. జెలన్ స్కీని ఇంతకు ముందు ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ అతడు ఉక్రెయిన్ ప్రజలకు అసాధారణ నాయకత్వం అందించారు. ప్రపంచంలో అనేక పార్లమెంట్లు ఈ అంశాన్ని గుర్తించి జెలన్ స్కీని అభినందనలతో ముంచత్తాయి. ఉక్రెయిన్ ను సోదర దేశంగా అభివర్ణించే రష్యా దాడి చేయడం అనూహ్యపరిణామం కాకపోయినా అసాధారణ పరిణామం మాత్రం అవును. రాబోయే కొద్ది రోజుల అటు రష్యాకూ, ఇటు ఉక్రెయిన్ కీ కీలకమైనవి.

పాశ్చాత్య మిత్రులపై జెలన్ స్కీ ఆగ్రహం

జెలన్ స్కీ పశ్చాత్యదేశాలపైన ఆగ్రహంగా ఉన్నాడు. ఆయన కోరినన్ని విమానాలను నాటో దేశాలు అందించలేకపోతున్నాయి. రష్యా వైమానిక బలానికి తగిన సమాధానం చెప్పాలంటే తన వద్దకూడా తగినన్ని యుద్ధవిమానాలు ఉండాలి కదా అంటారు జెలన్ స్కీ. ఉక్రెయిన్ పొరుగు దేశాలలో అత్యధిక సంఖ్యలో ప్రజలకు ఆశ్రయం ఇచ్చిన దేశం పోలెండ్. పాత రష్యా ఆయుధాలను కూడా పోలెండ్ ఉక్రెయిన్ కు సరఫరా చేసింది. ఐరోపా దేశాలలో కెల్లా అత్యంత సంపన్న దేశం సమైక్యజర్మనీ. కానీ ఈ దేశానికి రష్యాతో చమురు సరఫరా విషయంలో ప్రత్యేకమైన ఒప్పందం ఉన్నది. అందుకని రష్యాకి నష్టదాయకమైన పని చేసి, ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేయడానికి జర్మనీ సంకోచిస్తున్నది.

మూడు దేశాలలో మోదీ పర్యటన

నరేంద్రమోదీ యూరప్ పర్యటనలో ముందుగా జర్మనీ వెళ్ళారు. తర్వాత డెన్మార్క్ సందర్శించారు. చివరలో ఫ్రాన్స్ లో పర్యటించారు. నౌకాయాన నిర్మాణ ఒప్పందం నుంచి ఫ్రాన్స్ తప్పుకున్నట్టు రెండు రోజుల మందుగానే ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రకటించింది. దానికేవో సాంకేతిక కారణాలు చూపించింది కానీ భారత్ తో సత్సంబంధాలు పెంచుకోవాలనే దృక్పథంతో ఉన్నట్టు ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల తిరిగి ఎన్నికైన ఫ్రెంచ్ అధ్యక్షుడు మార్కొన్ ను మోదీ గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. మరోసారి అధ్యక్ష పదవికి ఎన్నికైనందుకు మార్కొన్ ను మోదీ అభినందించారు. ట్వీట్ కూడా పెట్టారు. బుధవారంనాడు ఫ్రాన్స్ చేరుకోగానే ద్వైపాక్షిక, బహుపక్ష సంబంధాల గురించి చర్చించేందుకు మార్కొన్, మోదీ సమావేశమైనారు. ఫ్రాన్స్ పర్యటన అనంతరం మోదీ ఇండియాకు తిరిగి వస్తారు.

దేశాధినేతలకు మోదీ వివరణ

ఈ మూడు దేశాధినేతలకూ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పట్ల భారత్ వైఖరిని నరేంద్రమోదీ సాకల్యంగా వివరించారు. రష్యా-యుక్రెయిన్ యుద్ధం వారంలోగా సమసిపోతుందనీ,  ఉక్రెయిన్ రష్యాకు లొంగిపోతుందని భారత నాయకులు కూడా అంచనా వేశారు. వారి అంచనాలకు మించి ఉక్రెయిన్ ప్రజలు, ప్రభుత్వం, సైనికులు రాజీలేని పోరాటం సాగిస్తున్నారు. యుద్ధం ప్రారంభం కాగానే వేలాది మంది భారతీయ విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి ఖాళీ చేయవలసి వచ్చింది. అందుకోసం ఇటు రష్యాతోనూ, అటు ఉక్రెయిన్ తోనూ సామరస్యంగా మాట్లాడవలసి వచ్చింది. హంగరీ, పోలెండ్ వంటి ఉక్రెయిన్ పొరుగు దేశాలలో భారత రాయబార కార్యాలయాలు చాలా చురుకుగా పని చేశాయి. విద్యార్థులలో అత్యధికులను క్షేమంగా ఇండియాకు చేర్చాయి. ఒక బెంగుళూరు విద్యార్థి మాత్రం కాల్పులలో ఉక్రెయిన్ లోనే మరణించాడు. ఐక్య రాజ్య సమితిలో రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం ఓటింగ్ కు వచ్చిన ప్రతిసారీ ఇండియా ఓటింగ్ లో పాల్గొనకుండా ఉండేది. తటస్థ విధానం నెహ్రూ కాలం నుంచి ఇండియాకు అలవాటే. ఐక్యరాజ్యసమితిలో తటస్థంగా ఉండటం ద్వారా రష్యాకు తోడ్పడుతూనే రష్యన్ సైనికులు రెచ్చిపోయి ఉక్రెయిన్ లో జననష్టానికి దారితీసిన సందర్భాలలో రష్యాను విమర్శించడం విశేషం. మొన్న జర్మనీలో కూడా ఈ యుద్ధంలో విజేతలూ, పరాజితులూ అంటూ ఉండరని మోదీ వ్యాఖ్యానించారు.

కత్తి అంచుపైన నడక

ఒకరకంగా కత్తి అంచున నడవడం భారత్ చేస్తున్న పని. ఇది అమెరికాకు ఆమోదం కాదు. అమెరికాతో పాటే అంటకాగాలని ఆ దేశం అధ్యక్షుడు బైడెన్ అంటున్నారు. బైడెన్ తో మోదీ శిఖరాగ్ర సమావేశం తర్వాత భారత్ పైన అమెరికా విమర్శలు తగ్గుముఖం పట్టాయి. పరిస్థితి సోవియెట్ యూనియన్ ఉన్నప్పటిలాగా లేదు. అమెరికాతో, యూరప్ తో వ్యాపారసంబంధాలు బాగా పెరిగాయి. సాలీనా 160 బిలియన్ డాలర్ల విలువైన వ్యాపారం అమెరికాతో జరుగుతుంటే రష్యాతో వ్యాపారం విలువ 10 బిలియన్ డాలర్లు. రక్షణ అవసరాలకు మాత్రం రష్యాపైన ఆధారపడక తప్పడం లేదు. రక్షణ పరికరాలను ఇండియాలో ఉత్పత్తి చేయడానికి అమెరికా, యూరప్ దేశాలు సంసిద్ధత వెలిబుచ్చుతున్నాయి. అదే జరిగితే భారత్ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే అవుతుంది. ఏమవుతుందో చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles