Friday, April 26, 2024

సప్తఖండాలలో వద్దిపర్తి అవధానం

హైదరాబాద్, సెప్టెంబర్ 12 : ‘త్రిభాషా మహా సహస్రావధాని’ వద్దిపర్తి పద్మాకర్ అంతర్జాల వేదికగా శనివారం నిర్వహించిన ‘అష్టావధానం’ ఆద్యంతం అద్భుతంగా సాగింది.’సప్త ఖండ అవధాన సాహితీ ఝరి’ పేరుతో జరుగుతున్న అవధాన యజ్ఞానికి విశేష ఆదరణ లభిస్తోంది. ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉన్న తెలుగు సాహిత్యమూర్తులు, భాషాప్రియులు ఇందులో భాగస్వామ్యులవుతున్నారు. వరుసగా సప్తఖండాలలో అవధానాలు జరగడం ఇదే ప్రథమం. ఏ ఖండంలో అవధానం నిర్వహిస్తే,ఆ ఖండానికి చెందిన తెలుగు కవిపండితులు పృచ్ఛకులుగా ఈ అవధాన పరంపరలో పాలుపంచుకోవడం మరో విశేషం. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఆఫ్రికా,యూరప్ ఖండాలలో అవధాన యజ్ఞం పూర్తయింది. తాజాగా ఆసియా ఖండం అవధానానికి వేదికగా నిలిచింది. సుప్రసిధ్ధ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, ప్రముఖ రచయిత్రి జలంధర చంద్రమోహన్, కొప్పరపు కవుల మనుమడు మాశర్మ విశిష్ట అతిధులుగా పాల్గొన్నారు. ‘అమెరికా అవధాని’ పాలడుగు శ్రీ చరణ్ ఈ అవధానానికి అధ్యక్షత వహించారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి, జలంధర చంద్రమోహన్, మా శర్మ

భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కవిపండితులు..పృచ్ఛకులుగా పాల్గొన్నారు. చల్లా రామచంద్రమూర్తి (సమస్య)-ఉత్తరప్రదేశ్, మాడభూషి సంపత్ కుమార్ (దత్తపది)-తమిళనాడు, రాధిక మంగిపూడి (న్యస్తాక్షరి)-మహారాష్ట్ర, రాళ్ళపల్లి సుందరరావు (ఆశువు)-పశ్చిమ బెంగాల్, లక్ష్మి అయ్యర్ (పురాణ పఠనం)-రాజస్థాన్, ఫణి రాజమౌళి (అప్రస్తుతం)-కర్ణాటక, ముత్యంపేట గౌరీ శంకరశర్మ (నిషిద్ధాక్షరి)-తెలంగాణ, నిష్ఠల సూర్యకాంతి (వర్ణన)-ఆంధ్రప్రదేశ్ నుంచి పృచ్ఛకులుగా వ్యవహరించారు. అఫ్ఘానిస్థాన్ లో నేడు జరుగుతున్న అకృత్యాలు మొదలు అనేక విశేష,విచిత్ర అంశాలను ప్రాశ్నికులు సంధించారు.”రాముని పెండ్లియాడె నొక రక్కసి సీత సహాయమాయెగా”అనే సమస్య,”ముక్కు-చెవి-కన్ను-నోరు” పదాలతో ‘దత్తపది’ మొదలైన వాటన్నింటినీ అవధాని అలవోకగా ఎదుర్కొన్నారు. శరవేగంగా పద్యరూపాత్మకంగా సమాధానాలు చెప్పి,అందరినీ వద్దిపర్తి పద్మాకర్ ఆనందాశ్చర్యాలలో ముంచెత్తారు.

సంగీత, సాహిత్యాలలో సమప్రతిభ, తెలుగు,సంస్కృతం,హిందీ భాషలలో సమ పాండిత్యం కలిగిన వద్దిపర్తి పద్మాకర్ ఇప్పటి వరకూ 1255 అష్టావధానాలు, 11శతావధానాలు, 8 జంట అవధానాలు చేశారు. తెలుగు, సంస్కృతం,హిందీలో ఏకకాలంలో మహా సహస్రావధానం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ‘ప్రణవ పీఠం’ స్థాపించారు. ప్రవచనకర్తగానూ సుప్రసిద్ధులు. తెలుగు భాషకే చెందిన ‘అవధాన ప్రక్రియ’కు ఖండాంతర ఖ్యాతిని వ్యాప్తి చేయాలనే సంకల్పంతో పద్మాకర్ ముందుకు సాగుతున్నారు. భారతీయత, ఆర్షధర్మాన్ని విశేషంగా ప్రచారం చేయాలనే సంకల్పంతో సారస్వాత,ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్నారు. ఎన్నో బిరుదు సత్కారములు వారిని వరించాయి.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles