Tuesday, March 28, 2023

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఎం

ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా వుండాలని, స్వీయ నియంత్రణాచర్యలను చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో కరోనా పరిస్తితి వైద్యారోగ్యశాఖ అప్రమత్తతపై ప్రగతి భవన్ లో ఆదివారం సిఎం కెసిఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరోగ్యశాఖతో పాటు ఇదే సందర్భంలో రోడ్లు భవనాలు , ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆయా శాఖల్లో జరుగుతున్న పనుల పురోగతి పై సిఎం కెసిఆర్ సమీక్షించారు.

Also read: జర్నలిజాన్ని బతికించుకుంటేనే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోగలం

మంత్రులు, అధికారులు

ఈ సమీక్షా సమావేశంలో వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీష్ రావు, రోడ్లు భవనాల శాఖ మంత్ిద వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణా రావు, రజత్ కుమార్ , వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఎఎం రిజ్వీ తో పాటు సిఎంవో అధికారులు స్మితాసబర్వాల్, రాజశేఖర్ రెడ్డి,  వైద్యారోగ్య శాఖ అధికారులు, శ్రీనివాస రావు, రమేశ్ రెడ్డి, గంగాధర్, చంద్రశేఖర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ అధికారులు ఇఎన్సీ గణపతి రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ , ఇరిగేషన్ శాఖ అధికారులు ఈఎన్సీ మురళీధర్ రావు, ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ లు మురళీధర్, హరి రామ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్పాండే, ఎస్ ఇ  కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Also read: తెలంగాణ ప్రయోజనాలపై రాజీ లేదు: కేసీఆర్

భయాందోళనలు అనవసరం

 ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ…. కరోనా పట్ల భయాందోళనలు అక్కెరలేదని ప్రజలకు సిఎం తెలిపారు. అయితే అశ్రద్ధ చేయకుండా మాస్కులు ధరించడం, సానిటైజేషన్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి స్వీయ నియంత్రణ చర్యలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతి వొక్కరూ వాక్సినేషన్ విధిగా వేయించుకోవాలని సిఎం తెలిపారు. ఇప్పటికే 15 నుంచి 18 సంవత్సరాల వారికి వాక్సినేషన్ కార్యక్రమం నడుస్తున్నదని, తల్లిదండ్రులు అశ్రద్ద చేయకుండా తమ పిల్లలకు వాక్సిన్ వేయించాలన్నారు. సోమవారం నుంచి 60 సంవత్సరాలు పైబడిన వయో వృద్ధులకు, ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్లకు (మూడో డోసు) బూస్టర్ డోసును ప్రారంభించనున్నామని తెలిపారు.  అర్హులైన వారందరూ తప్పనిసరిగా వాక్సినేషన్ చేయించుకోవాలని సిఎం అన్నారు. వ్యాధి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలోని ప్రభుత్వ దవాఖానాకు వెల్లి చికిత్స చేయించుకోవాలన్నారు. రాబోయే సంక్రాంతి నేపథ్యంలో గుంపులుగా కాకుండా ఎవరిండ్లల్లో వారు  తగు జాగ్రత్తలు తీసుకుంటూ పండుగ జరుపుకోవాలని ప్రజలకు సిఎం సూచించారు.

ప్రభుత్వం సర్వత్రా సిద్ధం

ఎటువంటి పరిస్థితులు తలెత్తినా కరోనాను ఎదుర్కునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సంసిద్దంగా వుందని సిఎం పునరుద్ఘాటించారు. ఇందుకు సంబంధించి వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులను, రాష్ట్రంలోని వైద్యారోగ్య పరిస్థితులు సహా కరోనా పరిస్థితులను సిఎం అడిగి తెలుసుకున్నారు. గత రివ్యూ సందర్భంగా సిఎం చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటివరకు చేపట్టిన చర్యలను అధికారులు సిఎం కు నివేదించారు. ఆక్సీజన్, పడకలు, మందుల లభ్యత తదితర ఏర్పాట్లన్నీ సిద్దంగా వున్నాయని అధికారులు సిఎం కు వివరించారు.

Also read: కరోనా నేపథ్యంలో ఆరోగ్య వ్యవస్థ పటిష్టం: కేసీఆర్ ఆదేశం

సెక్రటేరియట్ పనులన్నీ సమాంతరంగా వేగంగా సాగాలి : సిఎం

నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్దమౌతున్న రాష్ట్ర సచివాలయ భవన సముదాయం నిర్మాణ పనుల పురోగతి పై సిఎం కెసిఆర్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమైన పనులతో పాటు, లాండ్ స్కేపింగ్, సచివాలయంలో ఏర్పాటు చేయాల్సిన రక్షణ వ్యవస్థ, తదితర అనుబంధ భవనాల నిర్మాణ పనుల వేగాన్ని కూడా సమాంతరంగా  పెంచాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి సిఎం సూచించారు. సచివాలయానికి పటిష్టమైన భధ్రతా చర్యలు తీసుకుంటున్ననేపథ్యంలో పోలీసు వారికి కావాల్సిన వసతులు తదితర అంశాల గురించి డిజిపి మహేందర్ రెడ్డి తో సంప్రదించి చర్యలు చేపట్టాలన్నారు. 24 గంటల నిఘా కోసం అధునాతన సాంకేతికతతో  పోలీసు కమాండ్ కంట్రోల్  భవన నిర్మాణ  పనులు వేగంగా పూర్తి చేయాలని సిఎం అన్నారు.

సాగునీటి ప్రాజెక్టుల పురోగతి పై సమీక్షించిన సిఎం

రాష్ట్రంలో నడుస్తున్న సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతి పై సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా సమీక్షించారు. ఇందుకు సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులకు సిఎం కెసిఆర్ పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్ ల అనుమతుల పురోగతిని సిఎం అడిగి తెలుసుకున్నారు. కేంద్ర జల సంఘం వారు కోరుతున్న అన్ని వివరాలను , అదనపు సమాచారాన్ని సమర్పించి త్వరితగతిన  అనుమతులు పొందాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సీతారామ, సమక్కసాగర్, ముక్తేశ్వర (చిన్నకాళేశ్వరం) ఎత్తిపోతలు, చెనాక కొరాట బ్యారేజీ, చౌటుపల్లి హన్మంత్ రెడ్డి ఎత్తిపోతలు, మోడికుంట వాగు ప్రాజెక్టుల డిపిఆర్ లు సమర్పించి 5 నెలలు గడిచినా కేంద్ర జల సంఘం నుంచి ఇంకా అనుమతులు రాకపోవడం పట్ల సిఎం కెసిఆర్ అసహనం వ్యక్తం చేశారు.  డా. బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు డిపిఆర్ ను త్వరితగతిన సిద్దం చేసి కేంద్ర జలసంఘానికి, గోదావరి బోర్డుకు సమర్పించాలని సిఎం కెసిఆర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. గోదావరి బోర్డు అధికారులతో కూడా నిరంతరం సంప్రదింపులు జరిపి 5 గోదావరి  ప్రాజెక్టులను గెజిట్ నోటిఫికేషన్ నుంచి తొలగించడానికి ప్రతిపాదనలు సిద్దం చేసి కేంద్ర జల సంఘం కు  పంపించాలని అధికారులను సిఎం ఆదేశించారు. సాగునీటి శాఖలో ప్రస్థుత సంవత్సరంలో ముఖ్యమైన ప్రాజెక్టుల టెండర్లు పిలవడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Also read: గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, కేసీఆర్ అభినందన

 నాగార్జునసాగర్ ఎడమ కాలువ పై నిర్మించ తలపెట్టిన లిఫ్టు పథకాలు., గట్టు ఎత్తిపోతల పథకం., కామారెడ్డి & ఎల్లారెడ్డి నియోజక వర్గాల్లో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాలెన్స్ పనులు., పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిపోయిన రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పనులు., డా. బి ఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా నిర్మించే బ్యారేజి.,  చెన్నూర్ ఎత్తిపోతల పథకం., కడెం నదిపై నిర్మించ తలపెట్టిన  కుప్టి ప్రాజెక్టులకు టెండర్లు పిలువాలని ఇరిగేషన్ అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ప్రతిపాదించిన ముఖ్యమైన ప్రాజెక్టుల నిర్మాణాలు సంపూర్ణమౌతాయన్నారు. సాగునీటిరంగంలో రాష్ట్ర ప్రభుత్వవం నిర్దేశించుకున్న ప్రతిపాదిత లక్ష్యాలను చేరుకుంటామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.

Also read: రైతులను గాలికి వదిలేసిన కేసీఆర్ : మధు యాష్కీ

సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles