Monday, May 27, 2024

సప్తప్రతిభాశాలి బాల సుబ్రహ్మణ్యం

పలుభాషల పలుకుతోడు – బాలునికో నూలుపోగు. ఈ బాలుడు…జీనియస్! సహజ ప్రతిభా సంపన్నుడు.  పదహారు అణాల ఆంధ్రుడు. పదునారు కళల పరిపూర్ణుడు. ఈయన మొదటి ప్రతిభ: గ్రహణశక్తి ( grasping power).  ఏ అంశాన్నైనా విన్న  వెంటనే, తెలుసుకున్న వెనువెంటనే అద్భుతంగా గ్రహించే లక్షణం. రెండవ ప్రతిభ: అసాధారణమైన ధారణ, అంటే: జ్ఞాపకశక్తి. మూడవ ప్రతిభ: నటనా కౌశల్యం. నాల్గవ ప్రతిభ: అనుకరణ. ఒక దృశ్యాన్ని, ఒక భావాన్ని, ఒక వ్యక్తిని అవలీలగా పునః ప్రతిష్ఠ చేయగలిగిన శక్తి. అది ధ్వని రూపంలో, వ్యక్తీకరణ రూపంలో, నటన రూపంలో. ఐదవ ప్రతిభ: గానం. ఆరవ ప్రతిభ: స్వర రచన. ఏడవ ప్రతిభ: అనేక సంగీత వాయిద్యములను అలవోకగా వాయించే లయాత్మక ప్రజ్న. ఇలా…  సప్త ప్రతిభలు సహజంగా ధరించిన ‘శక్తి’ స్వరూపుడు.

రసజ్ఞప్రజ్ఞామూర్తి

 ప్రతిభ+ వ్యుత్పత్తి+ అభ్యాసం = శక్తి. సహజ ప్రతిభతో,  అభ్యాసంతో వ్యుత్పత్తి (పాండిత్యం) సాధించిన రసజ్ఞ  ప్రజ్ఞామూర్తి. తండ్రి నుండి తల్లి నుండి అద్భుతమైన గాత్రాన్ని పంచుకొని జనియించాడు. గాత్రం= శరీరం అని కూడా అర్ధం. వీరి తండ్రిగారివాళ్ళ సొంతఊరు ప్రకాశం జిల్లా మాచవరం. అమ్మగారిది కోనేటంపేట. ఇది తెలుగువాళ్ళు, తమిళులు కలిసిమెలిసి ఉండే గ్రామం. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఈ ఊరు ఉంది. ఇది ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు ప్రాంతం. ఇక్కడే ఈ బాలుడు పుట్టాడు. తండ్రి శైవ ఆరాధ్యులు, తల్లి 6000 నియోగులు. నేను ‘ అర నియోగిని’…అని చమత్కరిస్తూ ఉంటారు. ఈ వైయుక్తిక అంశములు అలా ఉంచితే… వీరు నూటికి నూరు శాతం యోగి, ధ్యాని. ఒక యోగబలంచే ఇలా జన్మించి, తాను చేసే పనిపట్ల ఏకాగ్ర ధ్యానచిత్తంతో ఉంటారు. అదే యోగం. అదే ధ్యానం. అలా జీవించేవాడెవడైనా ‘యోగి’ అవుతాడు. ఇది ఒక తపస్సు. అదే  యశస్సును ప్రసాదిస్తుంది! మ్యాథమెటిక్స్ లో చాలా ప్రజ్ఞావంతుడు. సైన్స్ సబ్జక్ట్స్ లోనూ అదే ప్రతిభ కల్గినవాడు.అందుకే, Mathematical thinking, Scientific approach, Asthteic sense  సహజంగా ఉన్నాయి. ఇవ్వన్నీ తాను ఎంచుకున్న రంగంలో శిఖరసమానుడుగా  ఎదగడానికి అద్భుతమైన మార్గాలు వేశాయి.

రెండు దశాబ్దాల కిందట తొలి పరిచయం

ఈ వ్యక్తి/శక్తి యొక్క  ప్రతిభను ప్రత్యక్షంగా దర్శించే సౌభాగ్యం నాకు 20ఏళ్ళ క్రితం కల్గింది. రావి కొండలరావుగారి  దర్శకత్వంలో, గొల్లపూడి మారుతిరావుగారు గిరీశం పాత్రగా ” కన్యాశుల్కం” సీరియల్ నిర్మించే సందర్బంగా మా ఇద్దరికీ మొట్టమొదటగా వ్యక్తిగత పరిచయం ఏర్పడింది.(అది, తదాదిగా  వికసించి, క్షణక్షణప్రవర్ధమానమైంది.) ఆ సీరియల్ కు నేను పర్యవేక్షకుడను. అనుసంధానకర్తను. దీనికోసం ఒక శీర్షికా గీతం రాయించాలనుకున్నాం. మిత్రుడు రాంభట్ల నృసింహశర్మతో రాయించాం. మాధవపెద్ది సురేష్ గారు సంగీత దర్శకుడు. ఇది చాలా పెద్ద పాట. ” తెలుగు కథకు శ్రీకారం- మెరిసే ముత్యాలసరం- అక్షరాల అడుగుజాడ -అతనే మన గుఱజాడ”….. ఇలా సుదీర్ఘంగా ఈ పాట సాగుతుంది. పాడటానికి  ఆ బాలుడు వచ్చాడు. ట్రాక్ సింగర్ ఆ పాట  just రెండు సార్లు వినిపించాడు. అంతే!! అలవోకగా, అవలీలగా, పరమాద్భుతంగా ఆ పాట పాడేశాడు.ఆయన పాడుతూ ఉంటే నాకు   ఒళ్ళు గగుర్పొడిచింది. వెంట్రుకలు నిక్కబొడుచు కున్నాయి. కళ్ల నుండి ధారాపాతంగా ఆనందబాష్పాలు రాలాయి. అదీ ప్రతిభ. ఆయన పద్యసాహిత్య రంగంలోకి వచ్చి ఉంటే  అనంత సహస్రావధాని అయ్యిఉండేవాడు. అంతటి ధారణాబలం. అంతే స్థాయి భావప్రకటనా శక్తి. రసప్లావితంగా పాడే గానప్రజ్ఞ ఆయన సొంతం. ఆయనకే సొంతం.

బహుముఖీనుడు

ఇది నా ప్రత్యక్ష అనుభవం. నటుడుగా వచ్చి ఉంటే?  మనకొక మరో మహానటుడు సొంతమై ఉండేవాడు. ఆ చేతికి కవితామయ శక్తి కూడా ఉంది. అది అప్పుడప్పుడు  మనకు దర్శనమవుతూ ఉంటుంది. ప్రయోక్త ప్రతిభ. జ్ఞానపీఠాధిపతులు డాక్టర్ సి.నారాయణరెడ్డిగారు  ఇక నుండి.. నువ్వు ప్రయోక్తగా  ఉండు .. అంటూ ఈ బాలుడిని స్వాగతించారు. ఆ బాలుడు ప్రయోక్తగా మారినప్పుడు అది కని విని అనుభవించాల్సిందే. ‘ప్రతిభ’ నవ నవోన్మేషశాలిని  అంటారు కదా?  ఆ వాక్కులు  ప్రవహిస్తున్నప్పుడు, ప్రసరిస్తున్నప్పుడూ ఒక పదానికి మించిన పదం ఇంకొకటి వచ్చి చేరుతూ ఉంటుంది. ఇది వాగ్వవైఖరీ ప్రతిభ. ఇది దైవదత్తం. ఆ గానంలో హాస్య, శృంగార, వీర రసాలు  పరమోన్నతంగా ఆవిష్కారం అవుతాయి. స్నేహశీలం, ప్రేమతత్వం, కృతజ్ఞత  పితృదేవతల నుండి పొందిన వరాలు. ప్రేమతత్త్వం, దాతృత్వం  తల్లినుండి పేగుబంధంగా తెచ్చుకున్న సుగుణాలు.తోబుట్టినవారితో పాటు  స్నేహితులకు తన ప్రేమను,చేయూతను విరివిగా పంచాడు. సహనం సాధన చేశాడు. కోపం జయించాడు. కోట్లాది  హృదయాలు కొల్లగొట్టాడు. ఈ ప్రతిభా ‘మణి’కి, రసధునికి, ఎప్పటికీ బాలునికి, ఆబాలగోపాల’ బాలు’ నికి, గానానంద, జ్ఞానానంద స్వరూపునికి, పామర,పండితారాధ్యునికి  అభినందన వందన చందనములు.

(జూన్ 4 ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం జయంతి)

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles