Wednesday, May 1, 2024

ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా

  • బీజేపీకి కటీఫ్ చెప్పిన నితీశ్
  • రాజభవన్ నుంచి రబ్డీదేవి ఇంటికి వెళ్ళిన నితీశ్
  • మహాఘట్ బంధన్ ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు
  • ఒక్క రోజులోనే బిహార్ లో సంచలనాత్మక పరిణామాలు

బిహార్ లో అనుకున్న విధంగానే పరిణామాలు సంభవించాయి. మంగళవారంనాడు మధ్యాహ్నం నాలుగు  గంటల ప్రాంతంలో గవర్నర్ చౌహాన్ ను బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కలుసుకొని తన రాజీనామా లేఖను అందజేశారు. అంతకు ముందు ఆయన జేడీయూ శాసనసభ్యులతో ఇష్టాగోష్ఠి నిర్వహించి వారి అభిప్రాయాలు సేకరించారు. రాజ్ భవన్ నుంచి నితీశ్ కుమార్  నేరుగా మాజీ ముఖ్యమంత్రి, లాలూప్రసాద్ సతీమణి రబ్డీదేవి నివాస గృహానికి వెళ్ళారు. అక్కడ ప్రతిపక్ష నాయకుడు, ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ ను కలుసుకున్నారు. అక్కడి నుంచి వారు మహాఘట్ బంధన్ సమావేశం ఏర్పాటు చేసుకొని తిరిగి గవర్నర్ చౌహన్ దగ్గరికి వెడతారు. తమ మద్దతు లేఖను సమర్పిస్తారు.అసెంబ్లీలో తమకు మెజారిటీ ఉన్నది కనుక తమను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించవలసిందిగా కోరుతారు.

కొన్న మాసాలుగా నితీశ్ కుమార్ కూ, తేజస్వియాదవ్ కూ మధ్య సంబంధాలు మెరుగైనాయి. తేజశ్వి యాదవ్ రంజాన్ సందర్భంలో ఇఫ్తార్ పార్టీ ఇచ్చారు. ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ముఖ్యమంత్రి నాలుగు అడుగులు నడిచి తేజశ్వి ఇంటికి చేరుకున్నారు. మాటామంతీ జరిగాయి. ఆ తర్వాత నితీశ్ కుమార్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు తేజశ్వియాదవ్ హాజరైనారు. కుర్రవాడే అయినప్పటికీ (32 ఏళ్ళు) తేజశ్వికి గేలు వరకూ వచ్చి స్వాగతం చెప్పారు. చాలా ప్రాముఖ్యం ఇచ్చారు. సాదరంగా వీడ్కోలు చెప్పారు. ఆ తర్వాత లాలూ ప్రసాద్ ఆరోగ్యం క్షీణించిన సమయంలో నితీశ్ కుమార్ దగ్గర ఉండి మాజీ ముఖ్యమంత్రిని దిల్లీకి తీసుకొని వెళ్ళే ఏర్పాట్లు చేశారు. లాలూ ప్రసాద్ పైన బీజేపీ ప్రభుత్వం కొత్త అవినీతి కేసు బనాయించినప్పుడు ఆ చర్యను నితీశ్ కుమార్ సమర్థించలేదు. 74 సంవత్సరాల లాలూ ఇప్పటికే చాలా సంవత్సరాలు జైళ్ళలో గడిపారు. ఆయనను ఇంకా కేసులతో వేధించడం సరికాదనే అభిప్రాయం నితీశ్ ది. ఇటీలవ జరిగిన అసెంబ్లీ సమావేశంలో నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు తేజశ్వియాదవ్ నిరాకరించారు. ఆదివారంనాడు ఆర్జేడీ పెరిగిన ధరలపైన నిరసన కార్యక్రమం నిర్వహించినప్పుడు నితీశ్ కుమార్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పోలీసు బందోబస్తు చేసి శాంతిభద్రతలను పరిరక్షించింది.

తెలివైన నాయకుడు

భారత రాజీకీయాలలో అత్యంత తెలివైన నాయకుడిగా, స్వార్థ రాజకీయాలకోసం ఎవరినైనా త్యజించగలిగిన, ఎవరినైనా ఆలింగనం చేసుకోగలిగిన, ఎంతకైనా తెగించగలిగిన అనుభవజ్ఞుడైన నాయకుడుగా, ఎటొచ్చి ఎటుపోయినా తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడంలో బహునేర్పరిగా, ఇటు సోషలిజం నినాదంతో రాజకీయాలు చేస్తున్నవారితోనూ, అటు మతపరమైన రాజకీయాలు చేస్తున్నవారితోనూ కలిసి సనిచేసే చాకచక్యం ఉన్నవాడిగా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చరిత్రలో మిగిలిపోతారు.

ఇది రాస్తున్న సమయానికి నితీష్ మరోసారి బీజేపీతో విడాకులు పుచ్చుకొని లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని ఆర్ జేడీని తన పరిష్వంగంలోకి తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆయన బీజేపీతో చేస్తున్న కాపురం పెటాకులు కావడానికి కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉంది. దేశంలో మరే రాజకీయవేత్తా చేయనన్ని విన్యాసాలూ, వింత నిర్ణయాలూ, కూటమి రాజకీయాలూ చేస్తూ అంత అవినీతిపరుడు కాదనే పేరు తెచ్చుకున్న నితీష్ కుమార్ అరుదైన రాజకీయ నాయకుడు.

నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ లు ఒకప్పుడు మంచి మిత్రులు. జేపీ ఉద్యమానికి ప్రభావితులై పట్నాయూనివర్శిటీ ప్రాంగణం నుంచి ఒకేసారి బయటకు వచ్చి జనతా, జనతాదళ్ రాజకీయాలను శాసించిన నాయకులు. కాలక్రమేణా వారు విడిపోయి రెండు పార్టీలకు నాయకులైనారు. ముందు లాలూ ప్రసాద్ యాదవ్, తర్వాత ఆయన సతీమణి రబ్డీదేవి ముఖ్యమంత్రులైనారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన నితీశ్ కుమారు సుశాన్ బాబూగా పేరు తెచ్చుకొని ఈ రోజు వరకూ ఆ పదవిలో కొనసాగుతున్నారు. పెద్దగా అభివృద్ధి లేదు. అవినీతి కూడా మోతాదు మీరలేదు.

నరేంద్రమోదీ అన్నా, ఆయన విధానాలన్నా, ఆయన రాజకీయాలన్నా నితీశ్ కుమార్ కు మొదటినుంచీ సరిపడదు. నరేంద్రమోదీని ప్రధాని అభ్యర్థిగా బీజేపీ 2013లో నిర్ణయించినప్పుడే బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికలలో ఆర్జేడీతో చేతులు కలిపి ఎన్నికలలో పోటీ చేసి ఘనవిజయం సాధించారు. అధికారంలో కొనసాగారు. ఆ కూటమిని అలవోకగా, నిష్కారణంగా తోసిరాజని నితీష్ 2017లో బీజేపీతో చేతులు కలిపారు. కానీ ప్రధాని నరేంద్రమోదీకీ, నితీశ్ కుమార్ కీ మధ్య అనుబంధం అంతంతమాత్రంగా ఉన్నది. ఒకరిని ఒకరు నమ్మరు. 2019 లోక్ సభ ఎన్నికలలో ఎక్కువ మెజారిటీతో గెలిచిన బీజేపీ ప్రధాని మోదీ నితీశ్ కుమార్ ను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచారు. కేంద్ర కేబినెట్ లో ఒకే మంత్రిపదవి ఇచ్చారు. ఆ ఒక్క పదవి కూడా నితీశ్ కుమార్ కు అత్యంత సన్నిహితుడైన ఆర్ సిపి సింగ్ కు ఇచ్చారు. ఇచ్చి అతగాడిని మచ్చిక చేసుకున్నారు. బీజేపీ బంటుగా తయారు చేసుకున్నారు. నితీశ్ కుమార్ కు విరోధిగా రూపాంతరం చెందాడు. నితీశ్ కుమార్ ఆ అవమానాన్ని దిగమింగారు. సింగ్ రాజ్యసభ పదవీకాలం పూర్తయినప్పుడు మరోసారి ఆ పదవి ఇవ్వడానికి బిహార్ ముఖ్యమంత్రి నిరాకరించారు. ఈ లోగా 2020లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఆర్జేడీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ, జేడీకూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలకు గాను బీజేపీకి 77 స్థానాలు, నితీశ్ నాయకత్వంలోని జేడీయూకి 45స్థానాలూ ఉన్నాయి. ఆర్జేడీ 80 సీట్లతో. కాంగ్రెస్ పార్టీ కి 19 స్థానాలతో ప్రతిపక్షంలో ఉన్నాయి. వామపక్షాలకు 16 స్థానాలూ, ఇతర పక్షాలకు ఆరు స్థానాలూ ఉన్నాయి. మెజారిటీ కావాలంటే 122మంది సభ్యుల మద్దతు అవసరం. 2020లో జేడీయూ పోటీ చేసిన అన్ని స్థానాలలోనూ రాంవిలాస్ పశ్వాన్ కుమారుడు చిరాగ్ పశ్వాన్ తన అభ్యర్థులను నిలబెట్టారు. ఆ యువనాయకుడికి లోపాయకారీగా బీజేపీ మద్దతు ఉన్నది. ఎక్కువ సీట్లు గెలుచుకున్నటికీ బీజేపీ ముఖ్యమంత్రి పదవి కావాలని డిమాండ్ చేయలేదు. డిమాండ్ చేసి ఉంటే అప్పుడే ఆర్జేడీతో నితీశ్ కుమార్ చేతులు కలిపేవాడని కమలనాధులకు తెలుసు. అందుకని నితీశ్ నే ముఖ్యమంత్రిగా కొనసాగించారు. కానీ బిహార్ పైన బీజేపీ అధినాయత్వం ఒక కన్ను వేసే ఉంచింది. నితీశ్ ని పదవిలో అయిదేళ్ళపాటు ఉండనిచ్చే ఉద్దేశం బీజేపీ అగ్రనాయకత్వానికి ఉన్నట్టు లేదు. పైకి మాత్రం 2025 అసెంబ్లీ ఎన్నికలలో కూడా బీజేపీ-జేడీయూ కూటమే పోటీ చేస్తుందనీ, దానికి నితీశ్ కుమారే నాయకుడిగా ఉంటారని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఇట్లా మాట్లాడి మునగచెట్టు ఎక్కిస్తూనే తనకు గోతులు తవ్వుతున్నారని నితీశ్ కుమార్ అనుమానం.

బీహార్ మంత్రివర్గంలో కూడా బీజేపీ తరఫున మంత్రులుగా ఎవరిని తీసుకోవాలో నిర్ణయించే స్వేచ్ఛ నీతీశ్ కుమార్ కు లేదు. అమిత్ షా చెప్పినవారికి పదవులు ఇవ్వాల్సిందే. అమిత్ షా నీడలో నితీశ్ కుమార్ పని చేయవలసిన పరిస్థితులు దాపురించాయి. బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఇటీవల ఒక వ్యాఖ్యానం చేశారు. ప్రాంతీయ పార్టీలకు మనుగడ ఉండదనీ, జాతీయ పార్టీగా బీజేపీ వర్థిల్లుతుందనీ అన్నారు. అంతలోనే మహారాష్ట్రలో షిండేకుసంపూర్ణ మద్దతు ఇచ్చి, ఆయన చేత శివసేను చీల్చి, ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని ప్రభుత్వాన్నికూల్చి, షిండే ను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి ఉపముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను చేర్పించారు. బిహార్ లో కూడా షిండేను తయారు చేసే ఉద్దేశంతోనే ఆర్ సీపీ సింగ్ ను సిద్ధం చేస్తున్నారని తెలివితేటలు పుష్కలంగా ఉన్న నితీశ్ కుమార్ కనిపెట్టారు. తనకు ఉద్వాసన చెప్పడానికీ, బిహార్ లో మరో మహారాష్ట్ర నాటకం ఆడించడానికీ బీజేపీ తయారౌతున్నదని గ్రహించారు. ఆర్ సిపీ సింగ్ సమర్థుడు. అతడే బిహార్ షిండే కాబోతున్నాడని నితీశ్ తెలసుకున్నారు. సింగ్ అవినీతిపరుడంటూ నితీశ్ నిందించారు. సింగ్ ఆర్జేడీ నుంచి రాజీనామా చేశారు.

తనను అవినీతిపరుడంటూ దూషించి తనతో తెగతెంపులు చేసుకొని 2017లో కూటమి నుంచి బయటకు నడిచినప్పటికీ నితీశ్ కుమార్ కు మద్దతు ఇవ్వడానికి ఆర్జేడీ నాయకుడు తేజశ్వియాదవ్ (లాలూ చిన్నకొడుకు) సిద్ధంగా ఉన్నాడు. తేజశ్విలో అనూహ్యమైన పరిణితి వచ్చింది. పైగా నితీశ్ కుమార్ తో కలసి ప్రయాణం చేయడం అవసరమని లాలూయాదవ్ కూడా కొడుకుకి హితవు చెప్పారు.

నితీశ్ కుమార్ కి ప్రధాని పదవిపైన ఆశలు ఉన్నాయి. మమతా బెనర్జీ అవినీతి మంత్రుల కథతో దెబ్బతిన్నారు. కేసీఆర్ కంటే సీనియర్, పెద్దరాష్ట్రానికి రెండు దశాబ్దాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్ కు ప్రతిపక్షాల మద్దతు ఉంటుందని నితీశ్ ఆశాభావం. చూడాలి నితీశ్ ఆట ఎటు తిప్పుతారో. మిత్రపక్షంతో సంబంధాలు చెడిపోయినప్పుడల్లా నితీశ్ కు మద్దతు ఇవ్వడానికి శత్రుపక్షం సిద్ధంగా ఉండటం ఆయన ప్రత్యేకత. 2013లో బీజేపీని వదిలేసినప్పుడు ఆర్జేడీ మద్దతు ఉంది. 2017లో ఆర్జేడీ, కాంగ్రెస్ లకు నితీశ్ జెల్లకొట్టినప్పుడు బీజేపీ మద్దతు ఇచ్చేందుకు ఆనందంగా ముందుకు వచ్చింది. ఇప్పుడు బీజేపీతో సంబంధాలు చెడినప్పుడు బీజేపీని వదిలేస్తే తాము మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఆర్జేడీ నాయకులు సూచించారు. అది నితీశ్ కుమార్ అదృష్టం.   

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles