Monday, September 9, 2024

పవన్ మాటలు వినలేదు … గోదావరి గర్జన వినిపించలేదు!

సాధారణంగా సాగిపోయిన నడ్డా పర్యటన

రాజమహేంద్రవరం నుంచి పోటీ చేస్తానంటున్న జయప్రద

వోలేటి దివాకర్

పరవళ్లు తొక్కే గోదావరి చెంతన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సొంత గడ్డ రాజమహేంద్రవరంలో బీజేపీ నిర్వహించిన గోదావరి గర్జన కాషాయ నేతలు ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. కనీసం 10 వేల మందైనా హాజరవుతారని భావించినా అందులో సగం మంది కూడా బీజేపీ గర్జన సభకు హాజరుకాకపోవడం  విశేషం. సభకు తరలించిన వారైనా బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ప్రసంగాన్ని వినేందుకు  పెద్దగా ఆసక్తి చూపించలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఘన కార్యాలు, రాష్ట్రంలోని అధికార వైసిపి అవినీతిని ప్రస్తావించి సభికులను ఆకట్టుకోలేకపోయారు. అయితే, ముందు వరుసలో మాత్రం కాషాయ తలపాగా , కండువా ధరించిన కార్యకర్తలు సభకు కాస్త శోభను తెచ్చారు. పురంధరేశ్వరి అనువాదం కన్నా మాధవ్ అనువాదం కాస్త నయమనిపించింది.

Also read: రాష్ట్రంలో కుస్తీ…ఢిల్లీలో బీజేపీతో దోస్తీ!

ఆకట్టుకోని ప్రసంగాలూ, సమావేశాలూ

ఉదయం బిజెపి కార్యాలయంలో జరిగిన కేంద్రప్రభుత్వ పధకాల లబ్దిదారులతో నడ్డా సమావేశం కూడా ఏమంత ఆకట్టుకోలేదు. నడ్డా సమక్షంలో కొద్దిమంది పార్టీలో చేరినా వారంతా ప్రజాదరణ లేని రిటైర్డ్ డిఎస్పీ, మాజీ కాంగ్రెస్ నేత కుమారుడు వంటి వారు కావడం గమనార్హం. నడ్డా రాజమహేంద్రవరం సభ ప్రస్తుత రాజకీయా పరిణామాలకు అతీతంగా జరిగినట్లు కనిపించింది. మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ రానున్న ఎన్నికల్లో తమ పార్టీ ఇచ్చిన ఆప్షన్లపై గానీ …. బిజెపి , జనసేన ఉమ్మడి కార్యాచరణ, పొత్తులకు సంబంధించిన రోడ్డు మ్యాప్ పై గానీ నడ్డా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం ఆశ్చర్యపరుస్తోంది.

Also read: ఆత్మస్తుతి … పరనింద … ఇదే మహానాడు!

సభ చివరలో ‘జగన్ పోవాలి … బిజెపి రావాలి’ అన్న నడ్డా నినాదం మాత్రం కాస్త ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. అంటే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి ఒంటరిగా అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు భావించాల్సి ఉంటుంది. తద్వారా రాష్ట్రపతి ఎన్నికల్లో తమకు మద్దతు ఇచ్చే అధికార వైసిపికి పరోక్షంగా అనుకూలంగా ఉండాలని బిజెపి భావిస్తున్నట్లు కనిపిస్తున్నది.

Also read: సరిగ్గా వినిపించని సామాజిక న్యాయభేరి! ఎందుకంటే ….

రాంపూర్ నుంచి రాజమహేంద్రవరం

నడ్డా సభలో కాస్తోకూస్తో వెటరన్ సినీనటి జయప్రద సభికులను ఆకట్టుకున్నారు . అనివార్య కారణాల వల్ల పుట్టిన గడ్డ రాజమహేంద్రవరం నుంచి ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ కు వెళ్లాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి ఎంపి అభ్యర్థిగా పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు ఆమె అధిష్టానం ఇష్టం అంటూ పరోక్షంగా పోటీకి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. 2024 ఎన్నికల్లో జయప్రద రాజమహేంద్రవరం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేయవచ్చన్న ఊహాగానాలకు ఆమె వ్యాఖ్యలు ఊతమిస్తున్నాయి. ఇంతకీ జయప్రద బిజెపిలో ఎప్పుడు చేరారో ఇప్పటికీ ప్రజలకు అంతుబట్టడం లేదు.

Also read: సెంట్రల్ జైలు ప్రదేశంలో క్రికెట్ స్టేడియం నిర్మించండి

 పవన్ పయనం టిడిపితోనేనా?

ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పోటీకి తమ ముందు మూడు మార్గాలను ప్రకటించారు. బిజెపితో కలిసి, లేదా బిజెపి , టిడిపితో కలిసి, లేదా ఒంటరిగా పోటీ చేస్తామని వెల్లడించారు. అలాగే ‘తగ్గేదే లే’ అంటూ ముఖ్యమంత్రి పదవిపై పరోక్షంగా స్పష్టతనిచ్చారు. ఆవెంటనే సోము వీర్రాజు మొదటి ఆప్షన్ కి తమ ఓటు అని వ్యాఖ్యానించారు. అప్పుడే తాము అధికారంలోకి వచ్చినట్లు భావించుకున్న జన సేన, బిజెపి నేతలు తమ నాయకుడే ముఖ్యమంత్రి పదవిని చేపడతారని చెప్పుకొన్నారు. ఈనేపథ్యంలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా జనసేన, బిజెపి పొత్తులు, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కనీసం స్పందించకపోవడం వ్యూహాత్మకమని భావిస్తున్నారు. త్వరలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వై సిపి మద్దతు బిజెపికి అవసరం. ఈ తరుణంలో అధికార పార్టీకి ఇబ్బంది కలిగించే పొత్తుల జోలికి వెళ్లలేదని అంచనా వేస్తున్నారు. మరోవైపు నడ్డా టిడిపి బస్సు మిస్సయ్యిందని వ్యాఖ్యానించి, టిడిపితో పొత్తుకు సిద్ధంగా లేమని పరోక్ష సంకేతాలు ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో టిడిపితో కలిసి నడిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Also read: ప్రతిపక్ష పార్టీ కన్నా ఘోరమా? …. గడపదాటని వైసిపి శ్రేణులు!

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles