వోలేటి దివాకర్
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా చేపట్టిన గడపగడపకు వైసిపి ప్రభుత్వం కార్యక్రమాన్ని పరిశీలిస్తే …. వైఎస్సార్సిపి పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉందా …. ప్రతిపక్షంలో ఉందా అర్థంకాని పరిస్థితి . సార్వత్రిక ఎన్నికల నాటికి మూడుసార్లు ప్రతీ ఎమ్మెల్యే, నియోజకవర్గ కోఆర్డినేటర్లు రాష్ట్రంలోని ప్రతీ గడపకు వెళ్లి వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు, ప్రజాసమస్యలను తెలుసుకోవడమే ఈకార్యక్రమ ఉద్దేశం.
Also read: పవన్ పల్లకీని బాబు మోస్తారా?
ప్రజల స్పందన ఎలా ఉన్నా ఎంతో ఉత్సాహంగా, హంగామాతో జరగాల్సిన ‘గడపగడపకు’ కార్యక్రమం నిస్తేజంగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీ నాయకుల మధ్య సమన్వయ లోపం, నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. దీనికన్నా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలే ఎంతో నయంగా కనిపిస్తున్నాయి.
Also read: పవన్ ఆశ అడియాసేనా? టీడీపీతో వియ్యానికి బీజేపీ కలసిరాదా?!
నడిపించే నాయకుడే కరవు!
సాంస్కృతిక రాజధాని , ఉభయ గోదావరి జిల్లాల వాణిజ్య కేంద్రం రాజమహేంద్రవరంలో అధికార పార్టీని నడిపించే నాయకుడు కరవయ్యార. గత రెండేళ్లుగా పార్టీకి కోఆర్డినేటర్ లేకుండాపోయారు. అధికార పార్టీ ఎమ్మెల్యే లేని నియోజకవర్గంలో కోఆర్డినేటర్లు అధికార చక్రాన్ని తిప్పే అవకాశం ఉంది. అయినా కోఆర్డినేటర్ పదవిపై నాయకులకు ఆసక్తి కూడా సన్నగిల్లిపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో సీటును ఖాయం చేస్తే కోఆర్డినేటర్ పదవిని స్వీకరించేందుకు నాయకులు సిద్ధంగా ఉన్నారు. అయితే పార్టీ నుంచి ఆమేరకు భరోసా లభించే అవకాశాలు కనిపించడం లేదు.
Also read: వైద్యో నారాయణ శాస్త్రీ! పేదల వైద్యుడు పరమపదించి ఏడాది
పార్టీ శ్రేణులు ఎంపి మార్గాని భరత్ రామ్ , రాజానగరం ఎమ్మెల్యే , ఇటీవల వైసిపి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన జక్కంపూడి రాజా వర్గాలుగా విడిపోయాయి . ఇప్పుడు కలిసిపోయామని చెబుతున్నా … మొన్నటి వరకు ఎవరికి వారే యమునాతీరేలా అన్నట్లు వ్యవహరించారు . రాజమహేంద్రవరం సమన్వయకర్తలుగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఎపిఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం చెరోవర్గంలో ఇమిడిపోయారు . ఆ తరువాత కోఆర్డినేటర్ గా నియమితులైన మరో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ కొద్దిరోజులు హడావుడి చేసి, ఆతరువాత మాయమయ్యారు. దీంతో పార్టీని అధికారంలోకి తెచ్చే కీలకమైన ‘గడపగడపకు’ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరంలో నడిపించే నాధుడు లేకుండాపోయారు .
తొలి రోజున ఎంపి మార్గాని భరత్, రుడా చైర్పర్సన్ ఎం షర్మిలారెడ్డి, నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. వార్డు వలంటీర్లు, కిందిస్థాయి అధికారులు మినహా పార్టీ శ్రేణులు పెద్దగా కనిపించలేదు. వారిలో పెద్దగా ఉత్సాహం కూడా కనిపించలేదు.
Also read: జిల్లా అధ్యక్షుడినైతే నియమించారు ….కానీ.. నగర కోఆర్డినేటర్ ను నియమించలేకపోతున్నారు?
పార్టీలో తగిన గౌరవ , మర్యాదలు దక్కడం లేదని రౌతు సూర్యప్రకాశరావు, భవిష్యత్ రాజకీయాలపై భరోసా లభించక శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం వర్గాలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం గమనార్హం. మరోవైపు మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు వీలుగా రాజా తన రాజానగరం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు.
కలిసే ఉంటారా?
ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్తలు , ఎంపిలు మిథున్ రెడ్డి , పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజమహేంద్రవరం వచ్చే ముందు రోజున జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన రాజా పార్టీలో తనకు బద్ద విరోధిగా ఉన్న ఎంపి భరత్ ఇంటికి వెళ్లి స్నేహహస్తం చాచారు. పాత పగలు, కక్షలు పక్కన పెట్టి వారి స్నేహం ఎంతకాలం నిలుస్తుందన్నది కాలమే సమాధానం చెప్పాలి. రాజా ఎన్ని మాటలు చెప్పినా వారి మధ్య సఖ్యతపై పార్టీ శ్రేణుల్లో నమ్మకం కలగడం లేదు. అధికార పార్టీ ఇదే రీతిలో సాగితే మరోసారి రాజమహేంద్రవరం కార్పొరేషన్, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ఆశలు వెదులుకోవాల్సిందే.
Also read: అసంతృప్తులందరికీ పదవులు … మళ్లీ అధికారంలోకి తెస్తారా?!