Tuesday, June 25, 2024

రాజ్యాంగ వ్యవస్థల నైతిక పతనం దేనికి దారితీస్తోంది?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారశైలిపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే  ఆలోచన లేదని  అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం  చేసిన తీర్మానం పై ఎన్నికల కమిషనర్ గవర్నర్ కు లేఖ రాశారు. ఆ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొడాలి నాని కమిషనర్ ను వ్యక్తిగతంగా తూలనాడారు. మంత్రి వాడిన భాష పార్లమెంటరీ పరి భాషకు సరిపోదు కనుక ఇక్కడ రాయలేకపోతున్నాను. అలాగే ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మధ్య వాగ్వాదం లో స్పీకర్ అరుపులు వింటే సభను సమన్వయంతో నడపాల్సిన స్పీకర్ వ్యవహరించే తీరు ఇదేనా అనిపిస్తుంది. తెలంగాణలో ఇటీవల హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికలలో ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రవర్తించిన తీరు, ఎన్నికల నిర్వహణలో తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి.

న్యాయ వ్యవస్థ పై కూడా వస్తున్న విమర్శలు

సీనియారిటీ ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోయే న్యాయమూర్తి ఎల్.వి రమణ పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కి రాసిన ఉత్తరం సంచలనం రేపింది. ఇక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల పై వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిత్వ హననాలు చూస్తుంటే రాజ్యాంగ  వ్యవస్థల పట్ల ప్రజలకు, ప్రజల పట్ల రాజ్యాంగ వ్యవస్థల కు పరస్పర గౌరవం, మర్యాద లోపిస్తున్నట్లు  అర్థమవుతుంది. ఇవన్నీ చూస్తుంటే రాజ్యాంగ వ్యవస్థల పట్ల మన దేశంలోనే గతంలో ఎంత గౌరవం ఉండేది, ఆ గౌరవం ఇప్పుడు ఎందుకు పోతోందనేది చర్చించాల్సిన అంశంగా మారింది.

వ్యక్తులు అశాశ్వతం – ప్రజలు ప్రభుత్వాలు, రాజ్యాంగ వ్యవస్థలు శాశ్వతం

స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో ప్రభుత్వాలను ప్రజలు ప్రభుత్వాలు గా మాత్రమే పరిగణించేవారు. భారత ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – ఇలా పిలిచేవారు. కానీ రాను రాను ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత అది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది తెలుగుదేశం ప్రభుత్వం, ఇది డీఎంకే ప్రభుత్వం, అది అన్నాడీఎంకే ప్రభుత్వం, ఇలా ప్రభుత్వాలను పార్టీల పేరు పెట్టి పిలవడం మొదలయింది. ఇక ఆ తర్వాత ట్రెండ్ ఏమిటంటే అది వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం, ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, అది కేసీఆర్ ప్రభుత్వం, ఇది జగన్ ప్రభుత్వం – ఇలా పిలవడం మొదలయింది. మా ప్రధానమంత్రి అని ఆ పార్టీ వారు మా ముఖ్యమంత్రి అని ఈ పార్టీ వారు మాట్లాడుతుంటారు. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ప్రజలచే ఎన్నికైన ఇతర పదవులలో ఉన్నవారు ఆయా రాజకీయ పార్టీల కో కొంతమంది ఓటేసిన ప్రజలకు మాత్రమే పరిమితం కాదు. ప్రభుత్వాలు నడిపే ప్రధాన మంత్రులు ముఖ్యమంత్రులు ఓటు వేసినా వేయకపోయినా దేశంలోని ప్రజలందరికీ ప్రధాన ప్రధానమంత్రిగా ఉంటారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ  ముఖ్యమంత్రిగా ఉంటారు. ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తిని మర్చి పోవడం వల్లనే నేడు ప్రజాస్వామ్యం వ్యక్తి స్వామ్యం గా మారిపోయింది. కానీ పూర్వకాలంలో అలా కాదు. ప్రభుత్వం పార్టీలు ఏవైనా కూడా ప్రభుత్వం తన హుందాతనాన్ని కాపాడుకునేది. “పార్టీలు శాశ్వతం కాదు ప్రభుత్వాలు శాశ్వతం” అనే భావన ప్రజల్లో బలంగా ఉండేది.

చరిత్రలో ఏం జరిగింది?

స్వాతంత్ర్యానంతరం మనదేశంలో రెండు దశాబ్దాలపాటు జాతీయ స్ఫూర్తి కొనసాగింది. అప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షంగా కమ్యూనిస్టు పార్టీ కొనసాగింది. ఆ కాలంలో ప్రభుత్వాలు, ప్రతి పక్షాలు ఒక సామరస్యపూర్వక వాతావరణాన్ని కొనసాగించాయి. విధానాల పరంగా సిద్ధాంతపరంగా విభేదించేవి కానీ వ్యక్తిగతంగా విభేదించే వారు కాదు. రాజకీయ పార్టీల మధ్య విమర్శలు కూడా పరస్పరం హుందాగా ఉండేవి. కానీ 1958లో కేరళలో అప్పటి ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు నంబూద్రిపాద్ ఆధ్వర్యంలో  ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికైన మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య విలువలకు, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాజ్యాంగంలోని 356 అధికరణ ఉపయోగించి రద్దు చేశారు. విలువలను కాపాడే వ్యక్తి గా పేరున్న భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ హయాంలోనే కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని అర్ధాంతరంగా రద్దు చేయడంతో కాంగ్రెస్ ప్రతిష్ట ఆనాటినుండి మసకబారుతూ వచ్చింది. ఆ తర్వాత 1967 నుంచి దేశ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. కాంగ్రెసేతర ప్రభుత్వాలు రాష్ట్రాలలో ఎక్కువ సంఖ్యలో ఎన్నికయినాయి. వాటిని రద్దు చేయడానికి ఫెడరల్ స్ఫూర్తిని మరచిన కేంద్ర ప్రభుత్వాలు తమ రాజకీయ చాణక్యం ప్రదర్శించాయి. రాజ్యాంగంలోని 356 అధికరణ ఉపయోగించుకొని ప్రతిపక్ష పార్టీలు పాలించే చాలా రాష్ట్ర  ప్రభుత్వాలను రద్దు చేస్తూ వచ్చాయి. నెహ్రూ తర్వాత కొద్దికాలం పాటు మాత్రమే లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ తనకు ఎదురే లేనట్లు ప్రవర్తించడంతో రాజ్యాంగ వ్యవస్థల హననం  మొదలైంది. ఇలాంటి దుర్మార్గ సంస్కృతికి ఆనాడే బీజం పడింది. అప్పుడే రాజ్యాంగ వ్యవస్థలు భ్రష్టుపట్టడం మొదలైంది. దానికి కొనసాగింపే నేటి రాజ్యాంగ వ్యవస్థల పతనం, రాజకీయ పార్టీల నాయకుల ప్రవర్తన అని చెప్పవచ్చు.

అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు దేశంలో ఒక చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత ఆ ప్రభుత్వాన్ని రెండేళ్ళు నిండకుండానే అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రాంలాల్ రద్దు చేయడం అందరికీ తెలిసిందే. ఆ సందర్భంలోనే కేంద్రం మిధ్య, గవర్నర్ల వ్యవస్థ అంతకంటే మిధ్య అని ఎన్టీ రామారావు అన్నారు. అదే ఊపులో అసెంబ్లీని రద్దు చేసి  1985లో మరొకసారి సమరోత్సాహంతో ఎన్నికలకు వెళ్లి గెలుపొందడం మరొక చరిత్ర.

విలువల వలువలు ఊడితే ఏం జరుగుతుంది?

ఎప్పుడైతే రాజకీయాల్లో విలువలు పడిపోయాయో అప్పటినుండి రాజ్యాంగ వ్యవస్థలు కూడా బరితెగించి తమ విలువలకు తిలోదకాలు ఇచ్చాయి. దేశంలో చట్ట సభల స్పీకర్లు, అలాగే న్యాయ వ్యవస్థలో ఉన్న న్యాయమూర్తులు, ఎన్నికల కమిషన్ నుండి మొదలుకొని స్వతంత్ర వ్యవస్థలుగా నడవాల్సిన నేర పరిశోధన విభా గాలు ప్రభుత్వాల కు జీ హుజూర్ అంటూ  అధికారంలో ఉన్న పార్టీలకు తల ఒగ్గు ఉన్నాయి.

న్యాయ వ్యవస్థ కూడా అందులో భాగమేనా?

ఇక  ప్రజాస్వామ్యంలో  స్వతంత్రంగా ఉండాల్సిన న్యాయ వ్యవస్థ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. గతంలో న్యాయమూర్తులు ఏదైనా ఒక కేసులో తీర్పు ఇచ్చినప్పుడు వారి పేరు పత్రికలలో కానీ మీడియాలో కాని రాకపోయేది. సింగిల్ బెంచ్ తీర్పు,డబుల్ బెంచ్ తీర్పు, ఫుల్ బెంచ్ తీర్పు  ఇలా ఉండేది. కానీ ఆ తీర్పు ఇచ్చిన వారి పేర్లు పత్రికలలో ప్రచురించక పోయేవారు. కానీ ప్రస్తుతం వారి ఫొటోలతో సహా ప్రచురిస్తున్నారు. వాళ్ళ వాళ్ళ సామాజిక నేపథ్యం వారి సొంత అభిప్రాయాలు కూడా బహిరంగంగా చర్చించుకునే దుస్థితి ఏర్పడింది. న్యాయవ్యవస్థపై ప్రస్తుతం వస్తున్న విమర్శలకు కారణం ప్రస్తుత న్యాయ వ్యవస్థలోని న్యాయమూర్తుల ప్రవర్తన కూడా అని ఘంటాపదంగా చెప్పుకోవచ్చు. ఇలా వ్యవస్థలు వ్యక్తివాదం వైపు మొగ్గిన తర్వాత విమర్శించే ప్రజలను నిందించి లాభం లేదు.

గద్దలు గా మారుతున్న పెద్దలు

రాజ్యాంగ వ్యవస్థల లో ఉన్న పెద్దలే, ఆ వ్యవస్థల గౌరవాన్ని కాపాడాల్సిన పెద్దలే విలువలకు తిలోదకాలిచ్చి తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం  ప్రభుత్వాలకు పార్టీలకు దాసోహం అనడం వల్ల ఈ సమస్య వచ్చింది.  పెద్దలు గద్దలు గా మారుతున్నారు. రాజ్యాంగ వ్యవస్థల పట్ల ప్రజలకు గౌరవం పోయింది. అందుకే ఈ రోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద లేఖలు స్పందిస్తున్నారు. వాళ్ల కులాలను వాళ్ల వ్యక్తిగత విషయాలను బహిరంగంగా చర్చిస్తున్నారు.

ప్రజాస్వామ్య మూలస్థంభాలు పటిష్టంగా నిలబడాలి

భారత ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన చట్టసభలు, కార్యనిర్వాహకవర్గం, న్యాయ వ్యవస్థ లు పరస్పరం సహకరించుకుంటూ ఎవరి పని వారు  చేయాలి. కానీ ఒకరి విధులలో మరొకరు జోక్యం చేసుకుంటున్నారు. రాజ్యాంగ వ్యవస్థలో పదవుల్లో ఉన్నవారు వారి వారి వ్యక్తిగత ఆహాలను సంతృప్తి పరచు కుంటూ వ్యవస్థల విలువలను దిగజారుస్తున్నారు. దీనివల్ల ఈ వ్యవస్థలు ప్రజల్లో మరింత చులకన అయిపోతున్నాయి. దీనికి ఈ వ్యవస్థల స్వయంకృతాపరాధమే కారణం. రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1) లో నిర్వచించిన విధంగా వ్యక్తి భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రతీకగా నిలవాల్సిన మీడియా సంస్థలు, యాజమాన్యాలు కూడా తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసం కొందరి కొమ్ముకాస్తున్నారు. ప్రజాస్వామ్య మూలస్తంభాలు ఇప్పటికైనా ఈ రాజ్యాంగ వ్యవస్థలను చక్కదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలను నడుపుతున్న రాజకీయ పార్టీలది. అలాగే తమను తామే దైవాంశ సంభూతులుగా భావించుకునే రాజ్యాంగ వ్యవస్థలలోని పదవుల్లో ఉన్న పెద్దలది మాత్రమే. తమ పదవి శాశ్వతం కాదని రిటైర్మెంట్ తర్వాత తాము కూడా సామాన్య పౌరులలో ఒకరుగా మాత్రమే ఉండవలసి వస్తుందని నిజాన్ని వారు గ్రహించాలి. వ్యవస్థ హుందాతనాన్ని కాపాడాలి. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్య విలువలను పున ప్రతిష్ట చేసినట్లు అవుతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles