Tuesday, November 12, 2024

కొమర్రాజుకు కోటి దండాలు

  • బహుముఖ ప్రజ్ఞాశాలి
  • జాతీయ స్థాయి మేధావి
  • సృజనశీలి, త్యాగశీలి

కొమర్రాజు వేంకట లక్ష్మణరావు ‘శత వర్ధంతి ఉత్సవాలు’ నడిగూడెం రాజుగారి కోటలో నేడు (గురువారం) ఘనంగా జరుగుతున్నాయి. ఆ రాజుగారి కోసం ఈ రాజు సర్వస్వాన్ని త్యాగం చేశారు. వారిద్దరి బంధం పవిత్ర మిత్ర సుగంధం. కొమర్రాజువారు మరణించి 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ వేడుక జరుగుతోంది. సారస్వత రక్త సంబంధీకులు కుర్రా జితేంద్ర ఈ అద్భుత ఘట్టానికి తెరతీశారు. రెండు గొప్ప సంకలనాలు సంసిద్ధమయ్యాయి. ఈ పుణ్యమంతా జితేంద్రకే దక్కుతుంది. మునగాల రాజావారి కోటను కొనుక్కొని అద్భుతంగా ముస్తాబు చేశారు. రేపటి తరాలకు నిన్నటి తరాల సాంస్కృతిక వైభవ వికాసాలను పదిలం చేసి కానుకగా అందిస్తున్నారు. మహామహులెందరో ఈ సంబరాల్లో పాల్గొంటున్నారు. కొమర్రాజువారి దివ్యస్మృతికి నీరాజనాలు పలుకుతున్నారు. రససిద్ధుడైన కొమర్రాజు వంటివారికి అన్నీ జయంతులే. నిత్య వసంతులైన సారస్వత వతంసులు వర్ధిల్లుతూనే వుంటారు. ఆ వర్ధిల్లడమే వర్ధంతి. ఈ శుభ సంరంభంలో కొమర్రాజువారిని తలుచుకుంటూ కొలుచుకుందాం.

Also read: వలసల వలయంలో యూరప్!

కోటికొక్కరు

“నూటికో కోటికో ఒకరు” అంటారు కదా!  కొమర్రాజు వేంకటలక్ష్మణరావు ఆ కోవకు చెందినవాడు. వీరి వంశానికి మూలపురుషుడు కొమ్మరాజు. కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు గ్రామపాలకులు వీరే. వ్యావహారికంలో కొమ్మరాజు కొమర్రాజుగా మారింది. లక్ష్మణరావు గురించి  ఒక్కమాటలో చెప్పాలంటే ఆయనే ఒక విజ్ఞానసర్వస్వం. మునగాల,మద్రాస్, హైదరాబాద్ కార్యక్షేత్రాలుగా ఆయన ముట్టని విజ్ఞాన రంగమే లేదు. బహుభాషావేత్త, చరిత్రకారుడు, పరిశోధకుడు,  పాత్రికేయుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘసంస్కర్త, పరిపాలకుడు, సాహిత్యపోషకుడు ఇలా ఎన్నో రంగాలతో వారి జీవితం ముడిపడి సాగింది. తెలుగుజాతిని ఆధునిక యుగం వైపు నడిపించిన వైతాళికుడు. వారి కుటుంబమంతా ప్రతిభామూర్తులు, త్యాగకీర్తులే. కాకపోతే, లోకమే వారిని మరిచిపోయింది. ప్రభుత్వాలు వారిని తలవడం కూడా మరిచిపోయాయి. వారి స్మారకంగా ఒక్క విగ్రహం లేదు. ఒక్క ఉత్సవం లేదు. లక్ష్మణరావు సోదరి భండారు అచ్చమాంబ తొలి కథకురాలు. కూతురు అచ్చమాంబ తొలితరం మహిళా వైద్యురాలు. అల్లుడు డాక్టర్ కె.ఎల్.రావు సుప్రసిధ్ధ ఇంజనీర్. అనేక ప్రాజెక్టుల సృష్టికర్త. లక్ష్మణరావు కుమారుడు వినాయకరావు జర్నలిస్ట్. ఎంతో మంది విద్యావేత్తలు, దేశభక్తులు ఈ కుటుంబం నుంచి వచ్చారు. కొమర్రాజు లక్ష్మణరావు తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచెయ్యకుండా విజ్ఞానానికే జీవితం అంకితం చేశారు. అనారోగ్యం పాలై, నలభై ఆరేళ్లకే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు.

Also read: మెదడు పదిలం

బహుభాషావేత్త

గొప్ప విజ్ఞాన సంపదను జాతికి అందించారు. భారతీయ భాషల్లో మొట్టమొదటగా తెలుగులోనే ‘విజ్ఞానసర్వస్వం’ (ఎన్సైక్లోపీడియా) నిర్మించారు. దీని నిర్మాత నూరుపాళ్ళు కొమర్రాజు లక్ష్మణరావు. అయ్యదేవర కాళేశ్వరరావు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు వీరి శిష్యులే. ఆంధ్రవిశ్వవిద్యాలయానికి ఆంధ్ర విశ్వకళా పరిషత్ అని నామకరణం చేసింది వీరే. వీరు జీవించి ఉంటే, ఆంధ్రవిశ్వవిద్యాలయం మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ వీరే అయ్యి ఉండేవారని డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. తన మూడవ ఏటనే తండ్రి మరణించడంతో మహారాష్ట్ర (అప్పుడు మధ్యప్రదేశ్) లోని నాగపూర్ వెళ్ళి, అక్క భండారు అచ్చమాంబ ఇంట్లో ఉండి విద్యాభ్యాసం చేశారు. అక్కకు విద్యను కూడా బోధించారు. అక్కపై ఉండే కృతజ్ఞత, ప్రేమతో తన కుమార్తెకు అక్కపేరే పెట్టుకున్నారు. రెండు మాస్టర్ డిగ్రీలు పొందారు. తెలుగు, మరాఠీ, సంస్కృతం, బెంగాలీ, ఉర్దూ, హిందీ, పాళీ మొదలైన 14 భాషల్లో పాండిత్యాన్ని గడించారు. ఎన్ని భాషలు నేర్చినప్పటికీ, మాతృభాష తెలుగుపైనే వారికి తొలి మక్కువ. రెండవ భాష మరాఠీ. ఈ రెండూ నాకు మాతృభాషలే, అని వ్యాఖ్యానించేవారు. నాగపూర్ లో ఉన్నప్పుడు మరాఠీలోని కొన్ని పదాల అర్ధాలు, సాహిత్య అంశాల విషయంలో పెద్ద పెద్ద మరాఠీ పండితులతో వాదప్రతివాదాలు చేసేవారు. ఆ వాదాల్లో చివరకు ఆయనే గెలిచేవారు. విశ్వనాథ్ కాశీనాథ్ రాజ్ వాడే వంటి మహాపండితులతో తలపడేవారు. వీరి వాదనా పటిమకు ముగ్ధులై, వీరిని అపరిమితంగా అభిమానించేవారు. బాల గంగాధర్ తిలక్ తో కూడా వాదించి, గెలిచారు. రామాయణ గాథలోని పర్ణశాల నాసిక్ త్రయంబకంలో ఉందని తిలక్ వాదన, గోదావరీ ప్రాంతమని లక్ష్మణరావు వాదన. వాల్మీకి రామాయణం, చారిత్రక, భౌగోళిక మూలాలన్నీ చూపించి, తన వాదమే సత్యమని నిరూపించారు. అలా, తిలక్ అభిమానానికి పాత్రుడయ్యారు.ఈ సంఘటన జరిగినప్పటి నుంచీ బాలగంగాధర్ తిలక్, కొమర్రాజు  లక్ష్మణరావుల మధ్య  స్నేహం అజరామరంగా వెలిగింది.

Also read: మనది సంపన్నుల దేశం!

స్వామి  వివేకానందతో పరిచయం

కలకత్తాలో ఎం.ఎ ఫిలాసఫీ (ప్రైవేట్ గా ) చదువుతున్న సందర్భంలో స్వామి వివేకానందతోనూ కొమర్రాజుకు పరిచయం ఏర్పడింది. బిపిన్ చంద్రపాల్ ను రాజమండ్రి, మద్రాస్ లకు తీసుకురావడంలో ప్రధాన భూమిక లక్ష్మణరావే వహించారు. మద్రాస్ లో కొమర్రాజు నివాసం పేరు ‘వేదవిలాస్’. కందుకూరి వీరేశిలింగం చివరి దశలో కొమర్రాజుతోనే ఉండేవారు. కందుకూరి మరణించింది కూడా వీరింట్లోనే. చివరకు కొమర్రాజు కూడా వీరేశిలింగం ఏ కుర్చీలో కూర్చొని మరణించారో, అదే కుర్చీలో మరణించారు. ఇద్దరూ సంఘ సంస్కర్తలే. కానీ, కందుకూరికి  వచ్చినంత పేరు,అలాగే వీరి శిష్యులైన అయ్యదేవర కాళేశ్వరరావుకు వచ్చినంత పేరు ఎందుకో  కొమర్రాజుకు రాలేదు. వీరేమీ పేరు కోసం ప్రాకులాడినవారు కూడా  కారు. ఆ తరం నాయకులే అటువంటివారు కారు. నిరంతరం జ్ఞాన సముపార్జన చెయ్యడమే లక్ష్మణరావు దీక్ష. తాను చెయ్యడమేకాక, అందరినీ ఆయన వెంట నడిపించుకునేవారు. ఇంకొక వైపు, పరిపాలన, మంత్రిత్వంలోనూ చాలా ప్రతిభామూర్తిగా రాణకెక్కారు. మునగాల సంస్థానానికి కొమర్రాజు దివాన్ గా పనిచేశారు. దివాన్ అంటే ప్రధానమంత్రి. ఆ సంస్థానానికి సంబంధించిన అనేక ఆస్తి వివాదాలు కోర్టు తగువులు ఆన్నీ వీరే చూసేవారు. వీరు న్యాయశాస్త్రం చదువుకోకపోయినా, తర్కంతో గెలుచుకొని వచ్చేవారు. సంస్థానం ఆస్తులన్నింటినీ కాపాడారు.అందుకనే, మునగాల రాజావారు నాయని వేంకటరంగారావుకు కొమర్రాజు వారంటే చాలా అభిమానం. రాజు-మంత్రి వలె కాక, ఇద్దరూ ప్రాణ స్నేహితుల్లా ఉండేవారు.

Also read: భారతీయ ‘జనతా’ గ్యారేజ్

మంత్రులుగా, దివాన్లుగా…

జమిందారీ యుగం వరకు బ్రాహ్మణులలోని నియోగి శాఖీయులు మంత్రులుగా, ప్రధానమంత్రులుగా, దివాన్లుగా ఉండేవారు. వారందరూ ఆ పదవులకు వన్నెతెచ్చిన మనీషామూర్తులు. రాజు -మంత్రుల మధ్య ఉన్న ఆనాటి  బంధం ప్రభువు-ఉద్యోగిలా కాక, కుటుంబ సభ్యులుగా, గురు శిష్యుల బంధంగా సాగేది. శ్రీకృష్ణదేవరాయలు- మహామంత్రి తిమ్మరసు, మనుమసిద్ధి-తిక్కనామాత్య బంధాలు పూర్వ యుగంలో ఎలా ఉండేవో మునగాల రాజు నాయని వెంకట రంగారావు -కొమర్రాజు లక్ష్మణరావు బంధం అలాగే ఆదర్శప్రాయంగా సాగింది. అందుకే, కొమర్రాజు లక్ష్మణరావు చేసిన సాహిత్య, భాషాసాంస్కృతిక సేవలకు మునగాల రాజు అండగా నిలిచాడు. 1901లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, 1906లో విజ్ఞాన చంద్రికా మండలిని స్థాపించారు.తెలుగుభాషలో సంపూర్ణ విజ్ఞాన సర్వస్వం నిర్మించే బృహత్ కార్యానికి రూపకల్పనం చేశారు. ఈ మూడు కొమర్రాజు చేపట్టిన గొప్ప కార్యాలు. మద్రాస్, హైదరాబాద్ కార్యక్షేత్రాలుగా ఈ రెండూ నడిచాయి. నాయని వెంకటరంగారావు,రావిచెట్టు రంగారావు, ఆదిపూడి సోమనాథరావు, మైలవరపు నరసింహశాస్త్రి శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషా నిలయానికి మూల పురుషులు. వీరందరినీ కలుపుకొని హైదరాబాద్ లో ఆ సంస్థను స్థాపించారు. తెలుగునాడులో అధునాతన పద్ధతుల్లో ప్రారంభమైన మొట్టమొదటి గ్రంథాలయం ఇదే. ముఖ్యంగా, తెలంగాణా ప్రాంతంలో తెలుగుభాషా స్థితిని మెరుగుపరచడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. ఆదిరాజు వీరభద్రరావు వంటి మహితాత్ములు దీనికి కార్యదర్సులుగా పనిచేశారు.  సమాజానికి ఆధునిక విజ్ఞానం పరిచయం చెయ్యాలనే లక్ష్యంతో  వివిధ ఆధునిక శాస్త్రాలను ఈ సంస్థ ద్వారా ముద్రించి, జాతికి అందించారు. నాయని వెంకటరంగారావు, గాడిచర్ల హరి సర్వోత్తమరావు, అయ్యదేవర కాళేశ్వరరావు, రావిచెట్టు రంగారావు మొదలైన వారందరినీ ఈ యజ్ఞంలో భాగస్వామ్యులను చేశారు.

Also read: మహారాష్ట్రలో మరోసారి ఫిరాయింపుల రాజకీయం

పరిశోధనలకు పెద్దపీట

పరిశోధనలకు పెద్దపీట వేస్తూ, 1922లో ఆంధ్ర పరిశోధక మండలి స్థాపించారు. 1916లో కొవ్వూరులో స్థాపించిన ఆంధ్ర సారస్వత పరిషత్ లోనూ కొమర్రాజువారి భూమిక ప్రధానమైంది. ప్రపంచ విజ్ఞానమంతా తెలుగువారికి దగ్గర చెయ్యాలని బ్రిటిష్ ఎన్సైక్లోపీడియా తరహాలో తెలుగులో విజ్ఞాన సర్వస్వం తీసుకురావడం  ప్రధాన సంకల్పంగా 1912-13 ప్రాంతంలో  మహాయజ్ఞానికి కొమర్రాజు పూనుకున్నారు. మల్లంపల్లి సోమశేఖరశర్మ, ఆచంట లక్ష్మీపతి, రాయప్రోలు సుబ్బారావు మొదలైన మహాపండితులను ఇందులోకి తీసుకువచ్చారు. అవి ఇవి అనిలేదు, అధర్వణ వేదం నుంచి అలంకారాల వరకూ, ఖగోళ శాస్త్రం నుంచి అష్టాధ్యాయి వరకూ సర్వ శాస్త్రాలూ ఈ విజ్ఞాన సర్వస్వంలో భాగమే. వీటన్నింటికీ కొమర్రాజు లక్ష్మణరావు ప్రధాన సంపాదకులు. రాత్రి పవలు మర్చిపోయి చేసిన ఆ మహాకృషిలో లక్ష్మణరావు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఉబ్బసం వ్యాధి సంక్రమించింది. అయినా లెక్కపెట్టకుండా కృషి సాగించిన విజ్ఞాన కృషీవలుడు కొమర్రాజు. ఆంధ్రసంపుటానికి శాసనాలు పరిశీలిస్తూనే మరణించారు. సంఘ సంస్కర్తగా ఎన్నో అసమానతలపై పోరాడాడు. దళితుల విద్య కోసం పరితపించాడు. కందుకూరి వీరిశిలింగంతో సమానంగా సంఘసంస్కరణల కోసం ఉద్యమించాడు. దేశభాషలలోనే శాస్త్రపఠనం జరగాలని సూచించాడు.

Also read: శాంతి మంత్రం -రక్షణ తంత్రం

పాత్రికేయుడుగా గొప్ప ముద్ర

పాత్రికేయుడిగానూ కొమర్రాజు ముద్ర చాలా గొప్పది. మరాఠీ పత్రికలు ‘సమాచార్’,  ‘వివిధ విజ్ఞాన్ విస్తార్’ లకు సంపాదకుడిగా వ్యవహరించాడు. ‘కేసరి’, ‘మహారాష్ట్ర’ వంటి పత్రికలకు అనేక అంశాలపై ఎన్నో వ్యాసాలు రాశారు. నాగపూర్ లో ఉన్నప్పుడే తెలుగు పత్రికలకు కూడా ఎన్నో వ్యాసాలు అందించాడు. ‘తెలుగు జనాభా’ అనే పత్రికకు, అక్క అచ్చమాంబతో కలిసి వ్యాసాలు పంపేవాడు. ప్రాచీన మరాఠీకవి మోరో పంత్ రాసిన భారతాన్ని పరిశోధించాడు. తన సంపాదకత్వంలో సరికొత్త ప్రతిని తయారుచేసి, కర్ణపర్వాన్ని ప్రచురించాడు. ‘శివాజీ చరిత్రం’ కొమర్రాజువారి మొదటి తెలుగు గ్రంథం. హిందూ మహాయుగం, ముస్లిం మహాయుగం మొదలైనవి లక్ష్మణరాయ వ్యాసావళి పేరుతో ముద్రించారు. ఎందరో మహానీయులను  తెలుగువారికి పరిచయం చేశారు. కట్టమంచి రామలింగారెడ్డి ఆర్ధికశాస్త్రవేత్తగా విజ్ఞానచంద్రికా గ్రంథమండలి ద్వారానే తెలుగు పాఠకులకు పరిచయం అయ్యారు. ఆనాటి ఎందరో మహాకవులతో కొమర్రాజుకు సాహచర్యం, స్నేహం ఉండేది. ప్రఖ్యాత జంటకవులు కొప్పరపు కవులతో మద్రాస్ లో, హైదరాబాద్ లో ఎన్నో అవధాన, ఆశుకవిత్వ సభలు ఏర్పాటుచేశారు.1913లో తన అల్లుడు కానూరు వీరభద్రరావు ( డాక్టర్ కె.ఎల్ రావు అన్నగారు) వివాహం సందర్భంగా కొప్పరపు కవులను ఆహ్వానించి ఆశుకవిత్వ మహాసభ నిర్వహించి, వారికి 516 రూపాయలు సమర్పించారు. ఆ కాలంలో 516 లు అంటే, ఇప్పుడు కొన్ని లక్షల రూపాయిలతో సమానం. కొమర్రాజు మరణించినప్పుడు కొప్పరపు కవులు మంజరీద్విపదలో సుదీర్ఘమైన కవితా నివాళి సమర్పించారు. పోతన్న నివాసం వరంగల్లు దగ్గర అని వాదించి గెలిచారు. వీరి రచనలు చాలావరకూ అలభ్యం. కొన్ని రచనలు ముద్రణకు కూడా నోచుకోలేదు. ఎందరికో ప్రోత్సాహకుడు, ఎన్నింటికో స్ఫూర్తిప్రదాత, విజ్ఞాననిధి, పెన్నిధి కొమర్రాజు లక్ష్మణరావు.

Also read: ఎన్నికల బాగోతంలో ‘ఉత్తర’రామాయణం

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles