Friday, September 29, 2023

వేదవిద్యాపారంగతుడు మాణిక్య సోమయాజులు

  • వేదవిద్యా వికాసం కోసం జీవితం అంకితం
  • ‘వేదవిద్యానిధి’ బిరుదంతో సత్కరించిన కేసీఆర్

మాడుగుల (పట్లూరు) మాణిక్యసోమయాజులు తెలంగాణ ప్రాంతంలో వేద విద్యా వికాసం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు. ఆరు దశాబ్దాల పైగా అవిరళ కృషి చేసి దేశమంతా వాసికెక్కిన ఘనుడు. సన్యసించి ‘బ్రహ్మానందతీర్ధ’గా యతివరేణ్యుడుగా మారిన అదేరోజున శివసాయిజ్యం పొందిన ధన్యచరితుడు. నిరుక్త సర్వస్యం రసనాగ్రంపై నిలుపుకున్న వాజ్ఞయమూర్తి. గంభీరమైన వేద వాజ్ఞయాన్ని ఆపోసన పట్టిన గణ్యకీర్తి. వేదార్ధాలను సునాయసంగా వ్యాఖ్యానించ గలిగిన ప్రజ్ఞాదీప్తి. వేద, వేదాంత, శాస్త్ర,జ్యోతిష, అలంకార, శ్రౌత శాస్త్రాలలో అఖండ పండితుడు. యజ్ఞయాగాదుల నిర్వహణలో ధీమంతుడు. తెలంగాణలో జరిగిన అనేక యాగాలకు మాణిక్యసోమయాజులే పర్యవేక్షకుడు. లక్షరుద్ర మహాయాగం, లక్షమోదక గణపతి హోమం, మహా శ్రౌత యాగాల నిర్వహణలో దిట్ట. ఆయన చేతుల మీదుగా ఎన్నో ఆలయాల ప్రతిష్ఠలు జరిగాయి. గోదావరి పుష్కర క్రతువులలో సోమయాజి పాత్ర వెలకట్టలేనిది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ నిర్వహించిన ‘అయుత చండీయాగం’ శుభ వేళలలో మాణిక్యసోమయాజులను ముఖ్యమంత్రి ఘనంగా సత్కరించారు. స్వర్ణకంకణం తొడిగి ‘వేదవిద్యానిధి’ బిరుదును సమర్పించి కృతజ్ఞతను, భక్తిని చాటుకున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సన్మానిస్తున్న మాణిక్య సోమయాజి

సహస్ర చండీయాగం నిర్వాహకుడు

కెసీఆర్ ‘వ్యవసాయ క్షేత్రం’లో సహస్ర చండీయాగం నిర్వహించిన ఘనత కూడా సోమయాజిదే. కేవలం తెలంగాణ ప్రాంతంలోనే కాక, తెలుగునాట యావత్తూ ఆయన హస్తం, నేస్తం ప్రముఖంగా ఉండేవి. నేటికాలంలో తెలంగాణలో ఏకైక సోమయాజిగా పేరుతెచ్చుకున్న వీరి జీవితం వడ్డించిన విస్తరి కాదు. రెండేళ్ల చిరుప్రాయంలోనే తండ్రిని కోల్పోయాడు. నిరుపేద కుటుంబం. బిక్షాటన ద్వారా భోజనం చేస్తూ గడపాల్సిన పరిస్థితులను  గుండెనిబ్బరంతో అధిగమించారు. సోమయాజులు విద్యాభ్యాసం చేసిన విధానం ఆశ్చర్యకరం. కన్నతల్లి అన్నీ తానై తీర్చిదిద్దింది. మెదక్ జిల్లా పట్లూరులో 17 డిసెంబర్ 1941l  పురుషోత్తమ సోమయాజి, జనాబాయి దంపతులకు మాణిక్య సోమయాజులు జన్మించారు. పూర్వులంతా వేద విద్యాపారంగతులు, మీమాంస, వ్యాకరణాది శాస్త్రాలలో ఘనాఘనులు. నిజాం నిరంకుశ పాలనా కాలంలో తెలంగాణలో వైదిక సంప్రదాయానికి గడ్డురోజులు, వేద విద్యాసాధనకు  చీకటి రోజులవి. నాడు తెలంగాణలో, వేద గురువులు చాలా తక్కువమంది ఉండేవారు. రజాకార్ల అల్లర్లు శృతి మించి సాగుతున్న కటిక చీకటికాలమది. రైళ్ళల్లో ప్రయాణిస్తున్నవారిని లాగి తుపాకులతో కాల్చిచంపుతున్న ఘోరమైన రోజులవి. మాణిక్యాన్ని పూర్వుల వలె వేదవిద్యాప్రవీణుడ్ని చేయాలన్నది తల్లి జనాబాయి సంకల్పం. ఈ మహదాశయాన్ని నెరవేర్చుకోవడం కోసం సొంతగడ్డను వీడాల్సివచ్చింది.

Also read: శ్రీరమణ పెన్నుమూశారు

పలనాడులో విద్యాభ్యాసం

ఒంటరిగా ఆ మాతృమూర్తి తెలంగాణ ప్రాంతం నుంచి పలనాడుకు పిల్లవాడితో తరలి వెళ్ళింది. సత్తెనపల్లి దగ్గర చవటపాపయ్యపాలెం అగ్రహారంలో వేదవిద్య నేర్పుతున్నారని తెలిసి అక్కడకు వెళ్లారు. నిజాం ప్రాంతంవారిని చేర్చుకోవడం కుదరదని అక్కడి పండితులు కొందరు అభ్యంతరం పెట్టారు. కుటుంబ నేపథ్యం, పరిస్థితులు, తన సంకల్పాన్ని  జనాబాయి గొప్పగా వివరించారు. ఆవిడ వివరించిన తీరుకు ఆ విద్యాశాల ప్రధాన ఆచార్యుడు ముదిగొండ వెంకటరామశాస్త్రి ముగ్ధుడై, మాణిక్యసోమయాజిని ఆ విద్యాశ్రమంలో చేర్చుకున్నారు. మాణిక్య సోమయాజి సంహిత వరకూ అక్కడ నేర్చుకున్నారు. అదే సమయంలో అక్క మరణించడంతో చదువుకు అంతరాయం ఏర్పడింది. కొన్నాళ్లకు తేరుకొని మళ్ళీ విద్యాభ్యాసం మొదలుపెట్టారు. బాపట్లలో గొల్లపూడి మధుసూదన అవధాని దగ్గర మిగిలిన వేదభాగాన్ని నేర్చుకున్నారు. తెనాలి సమీపంలోని అనంతవరంలోనూ కొంత విద్యను అభ్యసించారు. రేపల్లెలో తూములూరి సుబ్బావధాని వద్ద పదం, క్రమం, బ్రాహ్మణ, అరణ్య భాగాలు, ఉపనిషత్తులు, వేదవిద్యలలో అభ్యాసాన్ని సాగించారు. అట్లా తెలంగాణ ప్రాంతం నుంచి గుంటూరుసీమకు వెళ్లి, వేదవిజ్ఞానాన్ని సుసంపన్నం చేసుకున్నారు. ఆ సమయంలోనే అన్న మరణం కూడా సంభవించింది. ఇటువంటి ఎన్నో లౌకికమైన ఇబ్బందులను ఎదుర్కొంటూనే వేదవిద్యను గడించారు. వేదజ్ఞాన సంపదను మూటగట్టుకొని తిరిగి స్వక్షేత్రమైన తెలంగాణకు చేరుకున్నాడు. కృష్ణ యజుర్వేద క్రమాంతం వేదవిద్యాభ్యాసంలోనూ ఆరితేరాడు. 17 ఏళ్ళ ప్రాయంలోనే వేదవిద్యా ప్రాచుర్యానికి నడుం కట్టుకున్నాడు.

మాణిక్య సోమయాజి పల్లకి మోసిన బీజేపీ నేత రాంమాదవ్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రమణాచారి

తెలంగాణలో ఏకైక సోమయాజి

1967 జూన్ 8-12 తేదీలలో పట్లూరులో సోమయాగం నిర్వహించి, తెలంగాణలో ఏకైక సోమయాజిగా గణుతికెక్కారు. ఇస్మాయిల్ ఖాన్ పేటలో శాస్త్రుల విశ్వనాథశాస్త్రి ప్రేరణతో వేదవిద్యాచార్యులుగా ప్రస్థానం ప్రారంభించారు. వేదం, శాస్త్రాదులు, యజ్ఞయాగాది విద్యలలో ఎందరెందరినో తీర్చిదిద్దారు. వేదాలకు భాష్యం చెప్పగలిగిన అతితక్కువమంది పండితులలో ఒకరిగా పెద్దపేరు తెచ్చుకున్నారు. 1971 నుంచి 1991 వరకూ శివంపేట ‘పురోహిత బ్రాహ్మణ వేద విద్యాపీఠం’ ఆధ్వర్యంలో కొన్ని వందలమంది పేద విద్యార్థులకు వేదబోధన చేశారు. ‘శిష్యవాత్సల్యంబు చెలువుతీరినమూర్తి’గా ప్రీతిపాత్రుడైన గురువర్యుడయ్యాడు. విద్యతో పాటు వినయం, నిష్ఠ, సత్యవ్రతం, సేవ, ప్రేమ, ప్రకృతి ఆరాధనలను ఎక్కువగా బోధించారు. ఆ తర్వాత, ధార్మిక ప్రవచనాలు చేస్తూ, వేదవేదాంతాలను బోధిస్తూ చాలాకాలం పాటు వారణాసిలో గడిపారు. కాశీ కేదార్ ఘాట్ సమీపంలోని సోనాపూర్ లో ‘ధార్మిక భవనం’ స్థాపనకు చందాలు పోగుచేసి, స్థలాన్ని ఏర్పరచారు. ప్రస్తుతం భవన నిర్మాణం జరుగుతోంది. సనాతన ధర్మానికి పట్టాభిషేకం’ చేయాలనే ధర్మదీక్షతో జీవనం సాగించిన ‘కర్మయోగి’ సోమయాజి. ధార్మికవరేణ్య, వేదచూడామణి, వైదిక శిరోమణి,వేదవిద్వన్మణి వంటి ఎన్నో బిరుదులు వరించాయి. ఘన సత్కార గౌరవాలు ఎన్నెన్నో లభించాయి. ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలంగాణ ప్రభుత్వంలోనూ విశిష్ట సేవాపురస్కారాలను ముఖ్యమంత్రులు, గవర్నర్ల చేతుల మీదుగా అందుకున్నారు. వేదమాతను అర్చించి, అమ్మ సంకల్పాన్ని నెరవేర్చి, వేద మాగాణంలో పసిడి పంటలు పండించిన మాడుగుల మాణిక్య సోమయాజులు పవిత్ర చరిత్రుడు. ఈ మహనీయుడు ఈ లోకాన్ని వీడి రెండేళ్లు పూర్తవుతున్న పుణ్యతిధి రేపే (శుక్రవారం).

Also read: అదృష్టవంతుడు

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles