మహాభారతం: శ్రీమద్విరాటపర్వం-8
‘‘ఏమిటిది సైరంధ్రీ! నీ ఒడలంతా ఈవిధంగా దుమ్ముకొట్టుకొని పోయింది?’’ ఏమీ తెలియని నంగనాచి వంగముల్లులాగ అడిగింది సుధేష్ణ.
అప్పుడు జరిగిన విషయాన్ని అంతా ఏకరువు పెట్టింది సైరంధ్రి. కీచకుడు బలాత్కారం చేయబోవటం, తాను విదిలించుకొని మహారాజ సభకు వచ్చినప్పుడు వాడు వెంటాడి తనను క్రింద పడవేసి తన్నటం అంతా పూసగుచ్చినట్లు చెప్పింది. `అతడిని పిలిపించి మందలిస్తానులే నేను` అని రాణి ఏవో పైపై మాటలు మాట్లాడింది.
ఇంతలో చీకటి పడింది. లోకమంతా మెల్లగా నిద్రలోకి జారుకుంది. అవమానభారంతో ద్రౌపదికి నిద్ర పట్టడంలేదు. ఎలా పడుతుంది? లేచి స్నానంచేసి శుభ్రమైన చీరకట్టుకొని, ఒక రాత్రి వేళ వంటశాలల వైపు నడువసాగింది…
Also read: ద్రౌపదిని జుట్టుపట్టి ఈడ్చిన కీచకుడు
ఎవరూ చూడటం లేదని నిర్ధారించుకొని భీమసేనుడి బసవైపు నడిచింది. ఆ సమయంలో భీమసేనుడు మంచి నిద్రలో ఉన్నాడు. అతని మీద చేయివేసి తట్టి నిద్రలేపింది. `ఏమిటి ఎందుకొచ్చావు ఇంత రాత్రివేళ?“ అని ఏమీ తెలియనట్లుగా అడిగాడు.
అంతే! ద్రౌపదికి దుఃఖం తన్నుకు వచ్చి ఎంతో నిష్ఠూరంగా పాండవులను దెప్పిపొడిచింది. దెప్పిపొడుస్తూనే `నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోలేనంత అసమర్ధులా నా పతులు` అంటూ వారి వీరాన్ని, వారి ఔన్నత్యాన్ని గురించి పొగిడింది.
అప్పుడు భీమసేనుడు ద్రౌపదితో ‘‘తొందరపడిచేస్తే కార్యాలు చెడిపోతవి. కావున సమయం, ప్రదేశం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’’ అని చెప్పాడు.
ఇద్దరూ ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. నర్తనశాలను తమ కార్యశాలగా చేసుకుందామని నిశ్చయించుకున్నారు. తరువాత రోజు రాత్రి అతని పట్ల వలపు ఉన్నట్లు నటించి మాయోపాయంతో నర్తనశాలకు కీచకుడు వచ్చేటట్లు చేసింది సైరంధ్రి. అక్కడ జరిగిన హోరాహోరీ ద్వంద్వయుద్ధంలో భీముడు కీచకుడిని మట్టుపెట్టాడు. ఆ తరువాత ప్రశాంతంగా తన బసకు వెళ్లిపోయాడు భీముడు.
Also read: సైరంధ్రి సందర్శనతో వివసుడైన కీచకుడు
కానీ ద్రౌపది అక్కడే వుండిపోయింది. ఆ నోట ఈనోటా ఈ వార్త తక్కిన ఉపకీచకుల చెవినపడి అన్న మరణానికి సైరంధ్రే కారణమని ఆగ్రహించి, రాజు అనుమతితో కీచకుడి శవానికి ద్రౌపదిని కట్టివేసి శ్మశానానికి తీసుకెళ్ళారు.
(చూడండి ఎంత దౌర్భాగ్య పరిస్థితో. వాడి శవానికి కట్టివేయబడ్డది ఎన్ని కష్టాలో చూడండి. సీతామాత, ద్రౌపదీదేవి, సావిత్రీదేవి పడ్డ కష్టాలు చూడండి. చిన్నచిన్నవాటికే చలించి ఆత్మహత్యలు చేసుకునే వారు ఎందరో!)
ఈ విషయం గాలిద్వారా, ధూళి ద్వారా భీముడి కి తెలిసింది ఆగ్రహోదగ్రుడై లేచాడు. శవం స్మశానవాటికకుచేరి పురజనులందరూ వెళ్ళిపోయి ఉపకీచకులు మాత్రమే మిగిలేటంతవరకూ ఆగి, శవదహనం చేయబోయే సమయానికి ఒక్కసారిగా విరుచుకుపడి నూర్గురు ఉపకీచకులను అన్నదగ్గరికి సాగనంపి, ద్రౌపదిని బంధ విముక్తురాలినిచేసి మరల రాణివాసానికి భద్రంగా సాగనంపాడు.
విరాటనగరమంతా శ్మశాననిశ్శబ్దం ఆవరించుకొన్నది. ద్రౌపదిని చూసి అప్పుడు అందరూ భయపడేవారే. అప్పటిదాకా లేని భయం అప్పుడే ఎందుకు వచ్చింది? అందుకు కారణం ఆవిడ గంధర్వపతులు. “దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాపస్ఫురద్గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగులని” అప్పడు రుజువయ్యింది.
గమనిక:
ఎంతపెద్ద మహావాక్యమో, ఎంతపెద్ద సమాసమో చూడండి. “తిక్కన్న శిల్పంపు తెలుగుతోట” అని విశ్వనాధవారు ఊరకే అన్నారా! ఆవాక్యం అర్ధం చూడండి….
దుర్వార-అణచలేనటువంటి, ఉద్యమ-ప్రయత్నంగల, బాహువిక్రమరస-భుజబలాతిశయసారం చేత, అస్తోక-తక్కువగాని, ప్రతాప-పరాక్రమంచేత, స్ఫురత్-ప్రకాశిస్తున్నటువంటి పాండవులు, గర్వ-గర్వంచేత, అంధ-కనులు మూతలుపడ్డ, ప్రతివీర-శత్రువులను, నిర్మధన-వధించటమనే, విద్యాపారగుల్-విద్యను ఆసాంతం చదివి సొంతం చేసుకొన్నవారు. ఇదీ తీయని తెలుగంటే.
కొండాకోన గాలించాము… ఊరూవాడా శోధించాము… చెట్టూపుట్ట కలియవెతికాము… కానీ కానరాలేదు ప్రభూ… దేశదేశాల నుండి పాండవులను వెతుకగబోయిన వేగులు దుర్యోధన మహారాజు సన్నిధిలో విన్నవించుకుంటున్న మాటలవి.
హతాశుడయినాడు దుర్యోధనుడు. `ద్వారకంతా వెదికారా!` అని అడగాడు నల్లనివాడు ఎక్కడో దాచి ఉంటాడనే అనుమానంతో. `అణువణువూ గాలించాం ప్రభూ అణుమాత్రం కూడా వారి వాసన తగలలేదు!`
ఎక్కడ ఉండి ఉంటారబ్బా అని బుర్రకు పదును పెడుతున్నాడు. ఎలాగైనాసరే వారి గుట్టు రట్టుచేసి, వారిని మరల అరణ్యవాసంలో పడేయాలనే దురాలోచన దుష్టచతుష్టయానిది.
రారాజు సమావేశ మందిరంలో భీష్మ, ద్రోణ, కర్ణ, శకుని, దుశ్శాసన, సుశర్మ (ఇతడు త్రిగర్త దేశాధిపతి, విరాటరాజ్యం ఆనుకొని ఈతడి రాజ్యం ఉంటుంది) వీరంతా సమాలోచనలు చేస్తున్నారు.
Also read: పశుపాలకుడుగా సహదేవుడు
అంతలో భీష్మపితామహుడందుకొని ఈ విధంగా అన్నాడు.
సజ్జన స్తవనీయ సౌజన్యములును ధర్మసంచిత బహు ధన ధాన్యములును
గలుగు నక్షీణపుణ్యదోహలుడు ధర్మసూనుడున్న దేశంబున మానవులకు!
మరియును నొక్కవిశేషంబెరిగించెద నతనియున్నయెడ గోధనముల్
మెరుగెక్కిపాడినేమిం గొరతవడక యుండజేపి కురియుచునుండున్!..
(తిక్కనగారి పదప్రయోగం చూడండి) ధర్మరాజును అక్షీణపుణ్యదోహలుడు అని సంబోధించాడు. అక్షీణమైన అంటే ఖర్చుకాని, పుణ్య అంటే పుణ్యము. దోహలుడు అంటే ఉత్సాహంకలవాడు. అంటే ఆయన ఖాతాలో పుణ్యము పెరుగుతూనే వుంటుంది (recurring deposit)లాగ దానికి తరుగు అనేది, తీసివాడుకోవటం అనేవి ఉండవట. అలాంటి వాడట ధర్మరాజు.
సరే! అలాంటి వాడున్న చోటు ధనధాన్యరాశులతో, పాడిపంటలతో సుభిక్షంగా ఉంటుందట ఈ విధంగా పితామహుడు చెప్పేసరికి.
వేగులవంక సాలోచనగా చూశాడు దుర్యోధనుడు. ‘‘ప్రభూ! మేము విరాటరాజ్యం ఆ విధంగా ఉండటాన్ని గమనించాం ప్రభూ. అంతే కాకుండా ఆ రాజ్యంలో ఒక వింత జరిగింది ప్రభూ. సింహబలుడు ఒక ఆడుదానిని కాక్షించి ఆమె క్రోధానికి గురైయ్యి ఆవిడ గంధర్వభర్తల చేతిలో హతుడయ్యాడు ప్రభూ.’’
ఈ వార్త వినీ వినటంతోనే దుర్యోధనుడి మానసం ఉల్లాసభరితమయ్యింది. అప్పటిదాక ఆలోచనలతో ముడిపడ్డ కనుబొమ్మలు సహజస్థితికి వచ్చిచేరాయి. దిగ్గున లేచి పాండవుల ఆచూకీ దొరికింది అని పెద్దపెట్టున అరిచాడు. ఆయన అలా అరవటానికి కారణం ఏమయి ఉంటుంది?
బలదేవశ్చ భీమశ్చ మద్రరాజశ్చ వీర్యవాన్
చతుర్ధః కీచక స్తేషాం పంచమం నాను శుశ్రుమః…..అని లోక ప్రసిద్ధి.
బలరాముడు, భీముడు, నకులసహదేవుల మేనమామ శల్యుడు. నాల్గవవాడు కీచకుడు. ఈ నలగురూ ఒకరినొకరు మల్లయుద్ధంలో గెలవాలని ఉత్సాహపడుతుంటారట. వారితో సమానమయిన అయిదవవాడు ఇంకా పుట్టలేదు. బలరాముడు, శల్యుడు వీరిరువురూ మత్స్యరాజ్యంవైపు ప్రయాణించిన దాఖలాలు లేవు, ఇక మిగిలింది భీమసేనుడే.
పైగా ఆ రాజ్యం మునుపెన్నడూ లేని విధంగా సుభిక్షంగా ఉన్నది. కాబట్టి అక్కడే పాండవులు ఎవరికంటా పడకుండా తలదాచుకున్నారు! (he arrived at a conclusion).
గమనిక:
దూరంగా కొండమీద పొగవస్తున్నది అంటే అక్కడ నిప్పు ఉన్నదనేగా అర్ధం. అంటే ప్రత్యక్షంగా నిప్పు కనపడకపోయినా పొగను బట్టి నిప్పు ఉన్నదని ఒక అంచనాకు రావచ్చును. దీనిని అనుమాన ప్రమాణం అంటారు.
Also read: బృహన్నల రంగప్రవేశం
(సశేషం)