Saturday, April 20, 2024

రాముని పెళ్లి ఒక సంస్కృతి, సంస్కార చరిత్ర

సముద్రాల అద్భుత ‘శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి’

రాముని పెళ్లి ఒక సంస్కృతి, సంస్కార చరిత్ర. రాముని కథ ఒక జీవన విధానం. భారతదేశం, నేపాల్, శ్రీలంక మరెన్నో దేశాల్లో రాముడి ఇల్పు వేల్పు. ఇంటి ముందు ముగ్గులు తీర్చి దిద్ది, పందిరి కట్టి, ఇద్దరు సీతారాములతో పెళ్లి జరిగే ఊరు లేదు. రాముని గుడి లేనిది లేదు. రామయ్యా ఇదిగో నయ్యా సీతమ్మా రా… పెళ్లి చేసుకొమ్మా అని పెద్దమ్మవారు కల్యాణం చేయిస్తారు. రాముడు పుట్టిన రోజే నవమి. రాముని నవమి నాడే పట్టాభిషేకం జరిగిందింటారు. భధ్రాచలం నవమి మరునాడు పట్టాభిషేకం నిర్వహిస్తారు.

పెళ్లి పత్రికలు సీతారాముల పేరు లేకుండా ఉండవు. ఈ కింది  శ్లోకం లేకుండా పెళ్లి లగ్నకుండలి జరగదు. ఇంట అద్భుతమైన, సుందరమైన, ఉదాత్తమైన భావం గల శ్లోకం కాబట్టే పెద్దలు దీనిని ప్రతి వివాహసమయం లోనూ స్మరించే ఉత్తమ సంప్రదాయం నెలకొల్పారు. అర్థం పూర్తిగా తెలిసినా, తెలియక పోయినా ఈనాటికీ ఈ సంప్రదాయం పాటిస్తున్నాం.

‘‘జానక్యాః కమలామలాంజలి పుటేయాః పద్మరాగాయితాః

న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్కుంద ప్రసూనాయితాః

స్రస్తాశ్యామల కాయకాంతి కలితాః యా ఇంద్రనీలాయితాః

ముక్తాస్తా శ్శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః’’

జానకి యొక్క కమలములవలె అమలములైన దోసిళ్లలో ఏవైతే పద్మరాగాలైనాయో, రాఘవుని మస్తకమునందు ఉంచబడినవై ఏవి కుందప్రసూనాలలాగ విలసిల్లాయో, తలపైనుండి జారి ఆ రాముని శ్యామలకాయకాంతితో కలిసినవై ఏవి ఇంద్రనీలాలయ్యాయో, ఆ శ్రీరామవైవాహికములైన ముత్యాలు మీకు శుభాలని ఇచ్చేవి అగుగాక.

(పద్యవిభజన: న్యస్తాః + రాఘవమస్తకే = న్యస్తా రాఘవమస్తకే: స్రస్తాః + శ్యామలకాయకాన్తికలితాః = స్రస్తాశ్శ్యామలకాయకాన్తికలితాఃకలితాః + యాః = కలితా యాః  యాః + ఇన్ద్రనీలాయితాః = యా ఇన్ద్రనీలాయితాః  ముక్తాః + తాః = ముక్తాస్తాఃతాః + శుభదాః = తాశ్శుభదాః శుభదాః + భవన్తు = శుభదా భవన్తు)

పెళ్లి కూతురుగా సీతామాత, శ్రీరాముడి తల మీద ముత్యాల తలంబ్రాలు పోస్తున్నదట. ఆ తలంబ్రాలు కమలాల వంటి నిర్మలమయిన ఆమె దోసిలిలో (కమల – అమల – అంజలి – పుటే) ఉన్నంత సేపు ఎర్రని పద్మరాగమణుల్లా ప్రకాశించాయట. ఆమె ఆ ముత్యాలను రాఘవ మస్తకం మీద ఉంచినప్పుడు ఆయన నల్లని కేశజాలం మీద అవి మల్లెపూల లాగా ఒప్పారాయట (కుంద ప్రసూనాయితాః). ఆ తర్వాత ఆయన తల మీది నుంచి జారి, ఆ నీలమేఘశ్యాముడి శరీరం మీద పడ్డప్పుడు, అవి ఆయన శరీరకాంతితో కలిసి ఇంద్రనీలమణుల లాగా భాసించాయట. అలాంటి శ్రీరామకళ్యాణ సందర్భపు ముత్యాల తలంబ్రాలు (శ్రీరామ వైవాహికాః) మీకందరికీ శుభం కలగ జేయు గాక (శుభధాః భవంతు భవతామ్), అని కవి ప్రార్థన.

సీతారామ పట్టాభిషేకం

            దానికి మరొక తాత్పర్యం: అది సీతారామకల్యాణంలో తలంబ్రాల ఘట్టం… జనక మహారాజు ముత్యాల తలంబ్రాలు తెప్పించాడు. సీతమ్మ మహదానందంతో రాముడి తలపైన తలంబ్రాలు పోస్తోంది. సీతమ్మ ఆనందంగా తలబ్రాలు అందుకోసం దోసిట నింపడానికి తెల్లని ముత్యాలు పట్టుకుంది. సీతమ్మ చేతులు ఎఱుపు తామరపు వంటి అఱచేతులతో నిండగానే సీతమ్మ ఆశ్చర్యపోయిందంట. ఎందుకంటే ఆ తెల్లని ముత్యాలు అంతలో ఆ ముత్యాలు మల్లెలైపోయి, యెఱ్ఱనై మారి కెంపులై దానిమ్మ గింజలైనాయట. ఆ ఆశ్చర్యంతో సీతమ్మ సిగ్గుతో తలవంచిదా దల్లి. తలబ్రాలు చేతి దోసిట లేన రామయ్య తలపైన బోయగా అవి నీలమేఘము రాఘవుని మేనిపై ఆ ముత్యాలు దొర్లుతూ ఉంటూ ఇంద్రనీలాలై కనిపిస్తున్నాయి. అవి పండిన నేరేళ్ల పళ్లుగా మారినాయట. సీతారాముడి పెళ్లికళతో ఒక్కటి రెండు క్షణాల్లో అన్ని రంగులు మారిపోతూ ఉంటే చిరునవ్వుతో సీతయ్య ఆశ్చర్యపోతున్నారట. ఇదీ ఆ పద్యానికి వివరణ.

ఈ పద్యానికి తెలుగు రూపు ఇది. దీన్ని మంజరీ ద్విపద అంటారు.

‘‘శ్రీరాము నానాడు సీతమ్మ తల్లి ఆనందముగ పెండ్లి ఆడేటి వేళ, తలబ్రాలు పోయంగ తనరి దోసిటను తెల్లన్ని ముత్యాలు తీపార గొనగ, ఎఱుపు తామరలట్టి అఱచేతులందు, ముదముతో జనులెల్ల ముగ్థులై చూడ, ముత్యాలు యెఱ్ఱనై  మురిపాలు జిమ్మె, కెంపులై దానిమ్మ గింజలో యనగ’’అని మొదటి చరణం.

‘సిగ్గుతో తలవంచి సీతమ్మ తలరి, తలబ్రాలు రామయ్య తలపైన బోయ, నిజవర్ణ భరితమై నెగడి ముత్యాలు, తెల్లగా కనుపట్టె మల్లెలో యనగ’అని రెండో చరణం.

‘‘నీలమేఘము వోలె నెనయు రాఘవుని, మేనిపై ముత్యాలు మెండుగా దొర్లి, ఇంద్రనీలాలట్లు ఇంపుగా మెఱసె, నిండార పండిన నేరేళ్ళ వలెను’’అని మూడో చరణం.

‘‘ఇన్నిరంగులు చూచి ఇంతి యుప్పొంగె, చిన్నగా నవ్వాడు శ్రీరాము డపుడు

ఆరీతి రంజిల్లు అపురూప యుగళి, దీవించుగావుత మా వధూవరుల’’అని నాలుగో చరణం శుభాకాంక్షలు దీవిస్తారు.

ఇది సరే. కాని ఒక సినిమా పాటలో అత్యద్భుతమైన గానాన్ని రచించారు సముద్రాల రాఘవాచార్య గారు. అది ఎందరో కవులు వివరాలు ఇచ్చినా, సముద్రాల మరిచిపోలేని పాట ఇది. ‘సీత రాముల కళ్యాణం చూతము రారండీ’’
సీతా రాముల కల్యాణం చూతము రారండీ
శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి
చూచు వరులకు చూడ ముచ్చటగా, పుణ్య పురుషులకు ధన్యభాగ్యమట
[
చూచు వరులకు చూడ ముచ్చటగా, పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట] — [ కోరస్ ]
భక్తి యుక్తులకి ముక్తి ప్రదమట..ఆ.ఆ.ఆ.ఆ…..
భక్తి యుక్తులకి ముక్తి ప్రదమట, సురులును మునులను చూడ వచ్చునట

కల్యాణం చూతము రారండీ

దుర్జనకోటిని దర్పమడంచగా ..సజ్జన కోటిని సంరక్షింపగా
[
దుర్జనకోటిని దర్పమడంచగా ..సజ్జన కోటిని సంరక్షింపగా] — [ కోరస్ ]
ధరణీ జాతిని స్థావన చేయగా..ఆ.ఆ.ఆ.ఆ…..
ధరణీ జాతిని స్థావన చేయగా… నరుడై పుట్టిన పురుషోత్తముని
కల్యాణం చూతము రారండి..
దశరథ రాజు సుతుడై వెలసి… కౌశికు యాగము రక్షణ చేసి..
[
దశరథ రాజు సుతుడై వెలసి…కౌశికు యాగము రక్షణ చేసి] — [ కోరస్ ]
జనకుని సభలో హరి విల్లుని విరిచి..ఆ.ఆ.ఆ.ఆ…..
జనకుని సభలో హరి విల్లుని విరిచి, జానకి మనసు గెలిచిన రాముని
కల్యాణం చూతము రారండి..శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి
సీతారాముల కల్యాణం చూతము రారండీ
శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి
సిరి కల్యాణపు బొట్టును పెట్టి…బొట్టును పెట్టి — [ కోరస్ ]
మణి బాసికమును నుదుటన గట్టినుదుటన గట్టి — [ కోరస్ ]
పారాణిని పాదాలకు పెట్టి..ఆ.ఆ.ఆ.ఆ…..
పారాణిని పాదాలకు పెట్టి..పెళ్లి కూతురై వెలసిన సీత..
కల్యాణం చూతము రారండి..శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి
సంపగి నూనెను కురులను దువ్వికురులను దువ్వి — [ కోరస్ ]
ఒంపుగ కాపురి నామము గీసినామము గీసి — [ కోరస్ ]
చంపగ వాసి చుక్కను పెట్టీ..ఆ.ఆ.ఆ.ఆ…..
చంపగ వాసి చుక్కను పెట్టీ…పెండ్లీ .. కొడుకై వెలసిన రాముని..

కల్యాణం చూతము రారండి..శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి

జానకి దోసిట కెంపుల ప్రోవైకెంపుల ప్రోవై — [ కోరస్ ]
రాముని దోసిట నీలపు రాసైనీలపు రాసై — [ కోరస్ ]
ఆణిముత్యములు తలంబ్రాలుగా..ఆ.ఆ.ఆ.ఆ…..
ఆణిముత్యములు తలంబ్రాలుగా…శిరమున వెలసిన సీతారాముల..
కల్యాణం చూతము రారండి..శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి (
https://www.youtube.com/watch?v=yCo1HMxDI9k)

సీతారామ కల్యాణం

“శ్రీరామ పత్నీ జనకస్య పుత్రీసీతాంగనా సుందర కోమలాంగీ

భూగర్భ జాతా భువనైక మాతావధూవరాభ్యాం వరదా భవంతు..

సుముహూర్తే సావధాన, సులగ్నే సావధాన

లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన”

అంటూ పెళ్ళిళ్ళలో మంగళ శ్లోకాలు మహాసంకల్పం చదువుతూంటారు.

ఇది వివాహాన్ని శుభ ఆత్మీయతకు బంధం ముడిని కలుపుతుంది. వివాహం ఇద్దరు మనుషులనే కాదు, రెండు కుటుంబాలను కూడా కలుపుతుంది. అంతుకుమునుపు పరిచయం లేని మనుషుల మధ్య ఆత్మీయతకు కారణమవుతుంది.  శ్రీ సీతా కల్యాణం ఎప్పుడో త్రేతా యుగంలో మాత్రమే జరిగిందనుకుంటారు.  కాని ప్రతిపెళ్లీ, కల్యాణం, కొత్త కొడుకు కొత్త కూతురు ప్రతి సీతారామకల్యాణ పెళ్లి వేడుకలవుతాయి.

ప్రియాతు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి ।
గుణాద్రూప గుణాచ్ఛాపి ప్రీతిః భూయోభివర్థత ।।(వాల్మీకి రామాయణం)

దశరథుడు, తన ముగ్గురు భార్యలు కోరుకున్న విధంగానే రాముడు, సీతమ్మతో పెళ్లి చేసుకున్నారు కనుకనే సీతమ్మను ఇద్దరూ ఇష్టపడ్డారు. సీతమ్మను దశరథుడు కూడా ఇష్టపడ్డారట. సీతారామ కల్యాణం ఉత్తర ఫల్గుణి నక్షత్ర యుక్త వైశాఖ శుద్ధ దశమి నాడు జరిగింది. కానీ ‘మహతాం జన్మనక్షత్రే వివాహం’ అంటుంది ఆగమ శాస్త్రం. మహాత్ములు, అవతారమూర్తుల జన్మతిథి నాడు ఆ నక్షత్రంలో భక్తులు కల్యాణం చేయాలని శాస్త్ర నియమని . చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో జన్మించాడు శ్రీరాముడు.తన కుమార్తెను కోడలిగా స్వీకరించమని దశరథుడిని కోరతాడు.

ప్రతిగృహో దాతృవశః శ్రుతం ఏతత్‌ మయా పురా।
యథా వక్ష్యసి ధర్మజఞ తత్‌ కరిష్యామహే వయం ।।

అంతకన్నా కావలసిందేమిటి అని జనకుడు అనుకున్నాడు. నలుగురు పెళ్లికుమారులు, నలుగురు పెళ్లికుమార్తెలు సిరికల్యాణ తిలకంతో, మణిమయ బాసికాలతో, సీతారాములు శోభిల్లుతున్నారు. సీతారాములు వధూవరులుగా కూర్చున్నారు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వంటి మహర్షుల ఆధ్వర్యంలో పురోహితులు పెళ్లిమంత్రాలు చదువుతున్నారు. ముహూర్త ఘడియలు సమీపించగానే జనకమహారాజు వేదికపైకి వచ్చి, సీతమ్మ చేతిని తన చేతితో పట్టుకుని….

ఇయం సీతా మమసుతా సహ ధర్మచరీ తవ ।

ప్రతీచ్ఛ చ ఏనాం భద్రం తే పాణి గృహ్ణీష్వ పాణినా ।
పతివ్రతా మహాభాగా ఛాయా ఇవ అనుగతా సదా ।।

రామయ్యా! ఇదిగో… నా కుమార్తె అయిన సీత. నీకు సహధర్మచారిణిగా స్వీకరించు. నీకు శుభాలు కలుగుతాయి. ఈమె పతివ్రతగా ఉండి, నిత్యం నిన్ను నీడలా అనుసరిస్తుంది అంటూ సీతమ్మ చేతిని రామయ్య చేతికి అందిస్తాడు.

దానికి రామచంద్రుడు ఈ విధంగా ప్రకటించినారు.

‘‘మాంగల్యం తంతునా అనేన మమ జీవన హేతునా

కంఠే బద్నామి సభగే త్వంజీవ శరద శ్శతం’’

రాముడు నీలాల ఆకాశం… రాముడు నీలమేఘశ్యాముడు. నీలవర్ణం ఆకాశ లక్షణం. అంటే రాముడు పంచభూతాల్లో ఒకటైన ఆకాశానికి ప్రతీక. సీతమ్మ ఆమె పుడమి! నాగేటి చాలు ద్వారా భూమి నుంచి జన్మించింది. భూమి పంచభూతాల్లో ఒకటి. పంచభూతాల్లో మొదటిదైన భూమికి సీతమ్మ, చివరిదైన ఆకాశానికి రామయ్య సంకేతాలుగా నిలుస్తున్నారు. ఎప్పుడైతే ఆకాశం భూమిని చేరుతుందో (వాన చినుకుగా మారి) అప్పుడు పుడమి (భూమి) పులకరిస్తుంది. సస్యాన్ని (పంటను) అందిస్తుంది. ఆ సస్యం జీవులకు ఆహారంగా మారి, వారికి శక్తిని ఇస్తుంది. అంటే, ఎప్పుడైతే రామయ్య సీతమ్మకు చేరుకుంటాడో అప్పుడు లోకానికి శక్తి వస్తుంది. ఈవిధంగా సీతారామకల్యాణం లోకకల్యాణానికి కారకంగా, ప్రకృతి పులకరింతకు ప్రతీకగా నిలుస్తుంది అని కవులు కీర్తిస్తున్నారు.

తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యులు కూడా తన సంకీర్తనల్లో అనేకసార్లు సీతారామ కల్యాణఘట్టాన్ని మనసారా కీర్తించారు. ‘రామం ఇందీవర శ్యామం పరాత్పర ధామం… సుర సార్వభౌమం భజే’;

పల్లవి:రామ మిందీవర శ్యామం పరాత్పర | ధామం సుర సార్వభౌమం భజే ||

చరణం: 1. సీతావనితా సమేతం | పీత (స్ఫీత) వానర బలవ్రాతం |

పూత కౌసల్యా సంజాతం | వీత భీత మౌని విద్యోతం ||

చరణం: 2. వీర రణరంగ ధీరం | సారకులోద్ధారం |
కౄర దానవ సంహారం | శూరాధారాచార సుగుణోదారం ||

చరణం: 3. పావనం భక్త సేవనం | దైవిక విహగపథావనం |
రావణానుజ సంజీవనం | శ్రీ వేంకట పరిచిత భావనం ||

మరో కీర్తన అన్నమయ్య

‘రాముడు రాఘవుడు రవికులుడితడు… భూమిజకు పతియైన పురుష నిధానము’ వంటి కీర్తనలెన్నో అన్నమయ్య వివరించారు. 

‘‘రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమిజకు పతియైన పురుష నిధానము,

1. అరయ పుత్రకామేష్టి యందు పరమాన్నమున, పరగ జనించిన పర బ్రహ్మము, సురుల రక్షింపగ నసురుల శిక్షింపగ, తిరమై ఉదయించిన దివ్య తేజము,

2. చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో, సతతము నిలిచిన సాకారము, వింతలుగా మునులెల్ల వెదకినయట్టి, కాంతుల చెన్ను మీరిన కైవల్య పదము

3. వేద వేదాంతముల యందు విజ్ఞాన శాస్త్రములందుపాదుకొన పలికేటి పరమార్థముపోదితో శ్రీ వేంకటాద్రి బొంచి విజయనగరానఆదికిననాదియైన అర్చావతారము’’ అని అద్భుత గీతం. (https://www.youtube.com/watch?v=327rxGhtc-I)

సీతారామకల్యాణ వైభోగాన్ని వివరించినారు.

సీతమ్మ మాయమ్మ శ్రీ రాముడు మా తండ్రి

సీతమ్మ మాయమ్మ శ్రీ రాముడు మా తండ్రి అని త్యాగరాజు ఆర్తంతో పాడుకున్న నాదోపాసనుడాయన.

1. ‘‘సీతమ్మ మాయమ్మ శ్రీ రాముడు మా తండ్రి వాతాత్మజ సౌమిత్రి వైనతేయరిపుమర్దన, ధాత భరతాదులు సోదరులు మాకు ఓ మనసా… సీతమ్మ మాయమ్మ…’’

2. ‘‘పరమేశ వశిష్ట పరాశర నారద శౌనక శుక సురపతి గౌతమ లంబోదర గుహ సనకాదులు ధర నిజ భాగవతాగ్రేసరులేవరో వారేల్లరు వర త్యాగరాజునికి పరమ బాంధవులు మనసా… సీతమ్మ మాయమ్మ’’

3. ‘‘ఓ మనసా ! ఈ త్యాగరాజునికి ఈప్రపంచంలో మాకు నిజమైన తల్లి ,తండ్రి ఏవరు అంటే శ్రీరాముడు,సీతమ్మమరి అన్నదమ్ములో హనుమంతుడు,లక్ష్మణుడు,భరతుడు,గరుత్మంతుడు,మొదలగువారు’’.

4.‘‘పరమేశ్వరుడు,వశిష్టుడు,పరాశరుడు,నారదుడు,శౌనకుడు,శుకుడు,ఇంద్రుడు,గౌతముడు,గణపతి,సుబ్రహ్మణ్యుడు,సనకాది మునులు,ఇంకా భూమిలో ఉన్న పరమ భాగవతంలందరూ నాకు దగ్గరి బందువులు’’.  ’(https://www.youtube.com/watch?v=CQCCRrMpK6E)

అంటూ వారితో చుట్టరికం కలుపుకుంటారు ‘సీతమ్మ మాయమ్మ.. .శ్రీరాముడు మా తండ్రి’ అని. పెద్దలు.శ్రీరాముడు విష్ణుస్వరూపుడని భావించి విష్ణుసహస్రనామం, శ్రీరామ అష్టోత్తరశతనామాలతో పారాయణం, చేస్తారు. రామకోటి రాయడం, రామనామం భజన చేస్తారు. శ్రీరామ జయ రామ జయజయ రామ అని నిరంతరం స్మరణ చేసుకునే వారు చాలా మంది.

మాడభూషి శ్రీధర్

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles