Friday, July 19, 2024

సైరంధ్రి సందర్శనతో వివశుడైన కీచకుడు

మహాభారతం: శ్రీమద్విరాటపర్వం-6

విరాట రాజ్యంలో బ్రహ్మానందభరితంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రజలంతా ఆనందోత్సాహాలతో పాలుపంచుకుంటున్నారు. ఎక్కడ చూసినా సాముగరిడీలు, యుద్ధవిద్యాప్రదర్శనలు. రాజ్యమంతా కోలాహలంగా ఉన్నది.

కొందరు మల్లయోధుల గుంపు రాజ్యంలోని ఉత్సవాలలో తమ బలప్రదర్శన కోసం దేశదేశాలు తిరిగి వచ్చారు. అందరూ  కొలువుకూటంలో ప్రవేశించి రాజుగారి ముందు నిలబడ్డారు. వారంతా కాకలుతీరిన యోధులు.

వారిలో ఒకడు దేవలోకంలోని తాడిచెట్టంత బలంగా దృఢంగా, నిశ్చలంగా ఉన్నవాడు  రాజు ముందునిలబడి భుజస్ఫాలనం చేశాడు. వాడిని చూడగనే విరటుడి గుండె గుభిల్లన్నది. వాడు మదించిన మత్తేభంలా ఉన్నాడు. వాడి పేరు జీమూతమల్లుడు (జీమూతము అంటే దేవలోకంలోని తాటిచెట్టు).

‘‘నాతొ తలపడి మల్లయుద్దంలో నన్నుగెలవగలిగిన మగవారెవరయినా మీరాజ్యంలో ఉన్నారా ప్రభూ’’ అని సవాలు విసిరాడు.

Also read: పశుపాలకుడుగా సహదేవుడు

పూలు, పండ్లతో కళకళలాడే చెట్టు ఒక్కసారిగా ఉన్నపళాన మోడువారితే ఎలా ఉంటుందో అలా కళావిహీనమైపోయింది రాజుగారి ముఖం. తత్తరపడిపోయి, బిత్తరచూపులు చూడటం మొదలుపెట్టాడు. అది గమనించిన కంకుభట్టు రాజా…

వీనికి మూర్కొనజాలెడు దానికి దగువాని ధర్మతనయుని పురిలో

నానానియుద్ధలంపటు నేనొక్కని గంటి నిపుణుడు ఇందులకు అతడున్!

‘‘వీడితో తలపడగలిగే వాడిని ధర్మరాజు దగ్గర నేను చూశాను. మనబానసీడు వలలుడు. నాకున్ తెల్లము… మన వద్ద వంటవాడుగా ఉన్నాడే వలలుడు!  అతడే’’ అని చెప్పగానే ప్రాణం లేచివచ్చినట్లయి వలలుని పిలువనంపాడు.

వలలుడు వచ్చి బెరుకు బెరుకుగా రాజుకు నమస్కరించాడు. సభాప్రాంగణంలోని మల్లయోధులను చూడగనే వలలుడికి ఒక్కసారిగా శరీరం ఉప్పొంగింది. బాగా ఆకలితో ఉన్నవాడికి పంచభక్ష్య పరమాన్నములతో విందుభోజనం అందిస్తే వాడి మనస్సు ఎలా ఉంటుందో అలా ఉంది వలలుడి మనస్సు.

రాజు అనుజ్ఞ ఇచ్చాడు జీమూతుడితో మల్లయుద్ధం చేయమని. బరిలోకి దిగిన యోధులిద్దరూ సాంప్రదాయాలు పాటించి క్రీడ మొదలు పెట్టారు.

Also read: బృహన్నల రంగప్రవేశం

జరాసంధ, జటాసుర, కిమ్మీర, బకాసుర, హిడింబాసురలను మట్టిగరిపించిన జగజ్జెట్టికి జీమూతుడొక చీపురుపుల్ల. రాజుకు వినోదం చూపాలనుకున్నాడు. రకరకాల పట్లు చూపించి  రసపట్టులో పడేశాడు సభాసదులందరినీ.

ధర్మజుడు క్రీగంట సైగ చేశాడు ఎక్కవసేపు సాగితే బయటపడతాం అన్నట్లుగా.  అంతే! వాడి శరీరంలోని బందాల పట్టు తప్పేటట్లుగా వాడిని మడిచివేసి చీపురుపుల్ల విరిచినట్లుగా విరిచి యముడికి అతిధిగా పంపించాడు.

 అప్పటికి పాండవులు విరటుకొల్వుచేరి నాలుగుమాసాలయ్యింది. అది మొదలు ఎన్నోరకాల క్రూరమృగాలతో పోటిపెట్టి వలలుడు వాటితో పోరాడుతుంటే వినోదం పొందేవాడు నృపతి.

రాణి వాస స్త్రీలతో ఆ క్రీడలు చూసి మనస్సులో తీవ్రవేదనకు గురి అయ్యేది ద్రౌపది…. అకటా “కుంజర యూధమ్ము దోమ కుత్తుక జొచ్చెన్”.. ద్రౌపదీ ప్రేక్ష్యతాన్ సర్వాన్… అవన్నీ చూసి… నిశ్వాసపరమాభవత్.. నిట్టూరుస్తూ ఉండేదట!

ఒక ధర్మంకోసం, ఒక మాటకోసం అన్నదమ్మలందరూ అంత నిబద్ధతతో ఇన్ని అవమానాలు, కష్టాలు సహిస్తూ అన్నగారిమాట జవదాటక అమృతమూర్తులైనారుకదా! అంతటి యోధులను ధర్మ మార్గాన నడిపిన ధర్మజుడెంతటి గొప్ప వాడు.

గమనిక:

ఇవ్వాళ్టి భాషలో చెప్పాలంటే …

What a great LEADER he was! Imagine his influence on them!.. No parallel in History!

`బ్రహ్మకైనా పుట్టు రిమ్మతెగులు` అని ఊరకే అనలేదు. స్త్రీ సౌందర్యం అనే అగ్నిలో పడి శలభంలాగ మాడిపోయాడు రావణుడు.

మొదట దృష్టి(చూపు) ప్రసరిస్తుంది. తదుపరి మనస్సు ప్రేరేపిస్తుంది. ఆపై శరీరం కాంక్షిస్తుంది.

పడతి దొరికెనా ప్రణయ పరిష్వంగమే. విదిలించి కొట్టెనా మృత్యు పరిష్వంగమే. మన్మధాయత్తుడైన ఏ మగవాడి స్థితి అయినా ఇదే.

వాడు ఐశ్వర్య మదాంధుడు. పైగా యవ్వన గర్వమొకటి. బలదర్పంతో కూడిన మిడిసిపాటు…ఇన్నికలగలిసినవాడు సింహబల బిరుదాంకితుడు కీచక ప్రధముడు. మహారాణి సుధేష్ణ అనుంగు సోదరుడు.

వాడు అక్కను చూసి పోదామని అంతఃపురానికి వెళ్ళాడు. అక్కడ ఒక అసమాన సౌందర్యవతిని చూసాడు. ఆమెను చూడగనే వాడు నిశ్చేష్టుడయ్యాడు (He swooned in her presence). వాడి దృష్టికి ఆవిడ రాశీకృత రసమయ జీవన రాగ చంద్రికలా శోభిల్లింది. పోతపోసిన సౌందర్యములా భాసిల్లింది.

సృష్టికర్త అత్యంత శ్రద్ధతో చెక్కిప్రాణం పోసిన అపురూప శిల్పమా అని తోచింది. ఆమె శరీరంనుండి వెలువడే వెలుగులు వాడిని ముంచివేసాయి. నిస్సిగ్గుగా తదేక దీక్షతో ఆవిడనే చూస్తూ ఉండిపోయాడు. ఆవిడకి అతని చూపులు రోత పుట్టించి మదిలో రోదన కలిగించాయి.

ఆమె ఎవ్వరో కాదు! కృష్ణప్రియ, కృష్ణసఖి, కృష్ణసోదరి, యాజ్ఞసేనికృష్ణ, సైరంధ్రీ వేషధారిణి పాండవపట్టపు రాణి ద్రౌపదీ దేవి.

కాసేపటికి వాడు తెప్పరిల్లి అక్కను సమీపించి. ఆ కాంత వివరాలడిగాడు. ఆవిడను పొందగోరి అందుకు అక్కను సహకరించమన్నాడు.

గమనిక:

శృంగారావస్థలలో మొదటిది దృక్సంగమమ్.  అనగా చూపులు కలవటం కోరిక జనించటం. రెండవది చింతనం. అంటే ఆలోచించడం. మూడవది మనస్సంకల్పం.

ఆ తరువాత జాగరం, నిద్రపట్టకపోవడం, కృశించిపోవడం, విలాపము, ఉన్మాదము, వ్యాధి, జడత్వము, మరణం. ఇలా పది రకాల అవస్థలని లాక్షణికులు చెపుతారు.

Also read: శ్రీమద్విరాటపర్వం-3

(సశేషం)

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles