Friday, June 14, 2024

అమ్మకు వందేళ్లు

లబ్థప్రతిష్టులు ఎందరో అమ్మ శిష్యులు

విశ్వజనని ట్రస్ట్ ఆధ్వర్యంలో 5 రోజుల పండుగ

‘అమ్మ’ అంటే జిల్లెళ్ళమూడి అమ్మ. అమ్మ పుట్టి నేటికి వందేళ్లు పూర్తయ్యాయి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లెళ్ళమూడి అమ్మ ట్రస్ట్ ఐదు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈ క్రతువు కొన్ని నెలల ముందే మొదలైంది. అమ్మ తలపుల్లో వివిధ వేదికలపై వేడుకలు జరిగాయి. అమ్మ నిలిచి వెలిగిన జిల్లెళ్ళమూడిలో మార్చి 28వ తేదీ నుంచి ఏప్రిల్ 1వరకూ సంబరాలు జరిగేలా విశ్వజనని ట్రస్ట్ ప్రణాళిక రచించింది. ఊరువాడతో పాటు ముఖ్య నగరాల్లో ఇప్పటి వరకూ నిర్వహించిన వేడుకల్లో ఘనా ఘనులు ఎందరో పాల్గొన్నారు. అమ్మ విశేషాల గురించి వారు చెబుతూ వుంటే ఎల్ల ప్రజలు పులకిత గమకిత గాత్రులయ్యారు. అమ్మతో వ్యక్తిగతంగా అనుబంధం వున్నవారు అమ్మజ్ఞాపకాల అమృత ధారాలలో తడిసి ముద్దయిపోయారు. సామాన్యులు,ధీమాన్యులు, రైతులు, నిరక్షరాస్యులు మొదలు కవిపండిత ప్రకాండులు, ఉన్నత అధికార దురంధరులు, పాలకులు, తర్వాత కాలంలో పీఠాధిపతులుగా, ఆధ్యాత్మిక గురుశ్రేష్ఠులుగా చలామణి అయినవారు, అవుతున్నవారు ఎందరో అమ్మకు పరమభక్తులు. ఈ జాబితా రాయాలంటే చాలా స్థలం కావాలి. మచ్చుకు కొన్ని పేర్లు చూద్దాం. మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య, సద్గురు కందుకూరి శివానందమూర్తి, కుర్తాళ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి, విశ్వంజీ, మిన్నికంటి గురునాథశర్మ, కరుణశ్రీ, జమ్మలమడక మాధవరామశర్మ, పుట్టపర్తి నారాయణాచార్యులు, పళ్లెపూర్ణ ప్రజ్ఞాచార్యులు, పొత్తూరి వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ ఎల్ ఎస్ ఆర్ కృష్ణశాస్త్రి, మహానటి సావిత్రి మొదలైన వారంతా అమ్మను అమేయంగా ఆరాధించినవారే.

Also read: హరికథకు తొలి పద్మశ్రీ

వారంతా ఆరాధ్యులుగా వాసికెక్కారు

కాలగమనంలో, వారివారి రంగాలు ఏవైనా ఆ రంగంలో వారూ ఆరాధ్యులుగా వాసికెక్కారు. ఇటీవల పలుచోట్ల జరిగిన శతజయంతి ఉత్సవాల్లో కుర్తాళస్వామి సిద్ధేశ్వరానందభారతి, గరికిపాటి నరసింహారావు, చాగంటి కోటేశ్వరరావు వంటివారు పాల్గొని అమ్మతత్త్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. మల్లాప్రగడ శ్రీమన్నారాయణ, విఎస్ ఆర్ మూర్తి, పొత్తూరి విజయలక్ష్మి వంటివారు వివిధ వేదికల్లో అక్షరరూపమైన అర్చన, వాగ్రూపమైన స్మరణ చేశారు. అద్భుత సాంకేతికత అందివచ్చిన ఈ ఆధునిక కాలంలో ‘అమ్మ’ ప్రపంచానికి మరింతగా పరిచయమవుతోంది. రవాణా అందుబాటులోకి వచ్చిన నేటి కాలంలో అమ్మ వేడుకలకు జిల్లెళ్ళమూడికి తండోపతండాలుగా భక్తజనం తరలివస్తున్నారు. జిల్లెళ్ళమూడి అమ్మగా పిలుచుకొనే అనసూయమ్మ భౌతికంగా ఈ లోకాన్ని వీడి కూడా నలభైఏళ్ళు అవుతోంది. అమ్మను నమ్మినవారిలో సుప్రసిద్ధ రచయిత, తత్త్వవేత్త గుడిపాటి వెంకటాచలం (చలం) వంటివారు వుండడం పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించదు. ఎందుకంటే అమ్మ మాట, ఆచరణ వేరు వేరు కాకపోవడం, అందరినీ సమానంగా చూసే అమ్మతనం పుష్కలంగా కలిగి వుండడం, లోకం పోకడలే కాదు, బిడ్డల ఆకలి ఎరిగివుండడం, ఆ ఆకలి తీర్చాలి, కన్నీళ్లు తుడవాలని నిరంతరం తపన పడుతూ వుండడం అమ్మను ఇందరికి దగ్గరకు చేర్చాయి. అమ్మ ఎప్పుడూ వాగాడంబరం చూపించలేదు.  పాండిత్య ప్రదర్శన చెయ్యలేదు. అర్ధంకాని విషయాలను చెప్పలేదు.

Also read: కోవిద్ మహమ్మారీ మళ్ళీ కళ్ళు తెరుస్తోంది

వేదవేదాంగాల సారాంశాన్ని భక్తులకు అందించిన అమ్మ

ఉపనిషత్తుల సారాన్ని, వేదవేదాంగాల సారాంశాన్ని, సర్వ పురాణ,ఇతిహాసాల రసాన్ని, అన్ని నీతిచంద్రికలను గోరుముద్దలతో లోకంలోని మానవాళికి అందించింది. సర్వ జీవరాసుల పట్ల సమప్రేమను చూపించింది. అమ్మకు అన్నీ దర్శనమవుతాయన్న విషయం అమ్మను దర్శించుకున్న వారందరికీ అనుభవమే. ప్రేమ, క్షమ, సేవ ప్రధానంగా అమ్మ ఆచరించి చూపించిన మార్గాలు. లక్షలమందికి అన్నం పెట్టింది. వేలాదిమందికి చదువు,సంస్కారం నేర్పింది. రోగ పీడితులకు ఆసరాగా నిలిచింది. అమ్మ భౌతికంగా నేడు మన మధ్య లేకపోయినా,అమ్మ పేరున వెలసిన ‘విశ్వ జనని ట్రస్టు’ ద్వారా నిరాఘాటంగా అన్ని సేవలు కొనసాగుతూనే ఉండడమే కాక, దినదిన ప్రవర్ధమానమవుతున్నాయి. అమ్మ నిర్దేశించిన సేవకు సంబంధించి అప్పటికప్పుడు అన్నీ అమరుతాయి. ఇంతవరకూ లోటన్నదే లేదు. అమ్మ పేరుతో నడుస్తున్న ట్రస్టుకే కాదు, వ్యవస్థలకే కాదు, అమ్మను నమ్ముకొని నడుస్తున్న వారందరికీ అదే ఆశీర్వాద ఫలం అందుతోంది.

Also read: మండలి ఎన్నికల హెచ్చరికలు

పాకల్లో మొదలైన ప్రస్థానం

ఎక్కడో గుంటూరు జిల్లాలో బాపట్ల దగ్గర చిన్న పల్లె జిల్లెళ్ళమూడి. ఆ విశ్వజనని వల్ల ఈ పుడమి నేడు విశ్వజన వ్యాప్తమైంది. పాకల్లో మొదలైన ఆ ప్రస్థానం నేడు పక్కా భవనాల్లోకి విస్తరించింది. ప్రతి రోజూ కొన్ని వేలమంది ఉచితంగా అన్నం తింటున్నారు, ఎందరో విద్యాబుద్ధులు పొందుతున్నారు, వైద్య సేవలు అందుకుంటున్నారు. కరణంగారి అమ్మాయిగా, మరో కరణంగారి అర్ధాంగిగా కొంతకాలం లౌకిక జీవితం గడిపినా, ఆమె మామూలు వ్యక్తి కాదు, ఒక శక్తిస్వరూపం.ఒక్కమాటలో చెప్పాలంటే ఆమె కరణంబిడ్డ కాదు, కారణజన్మురాలు. ఎందరో అభివృద్ధికి కారణభూతమైన శక్తిస్వరూపిణి. ‘ప్రపంచమంతా ఒక్కటే -దేవుడు ఒక్కడే’ అన్నది అమ్మ వేదాంతం. దీని కోసం రాద్ధాంతం చేసుకోవద్దన్నది అమ్మ సిద్ధాంతం. అమ్మకు ప్రేమ ఉంటుంది తప్ప అసూయ ఎందుకు ఉంటుంది? అమ్మంటేనే ‘అనసూయ’, అమ్మంటే అన్నపూర్ణ.

Also read: దర్యాప్తు సంస్థల దుర్వినియోగం

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles