Thursday, April 18, 2024

భావోద్యమ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డు! పేరలింగం గారికి హేతువాద ప్రచార అవార్డు!

(క్షేత్రస్థాయి నిబద్దతకి దక్కిన విశిష్ట గౌరవం)

శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హేతువాద ప్రచారానికి గానూ దేవగుప్తపు పేరలింగం గారికి మహనీయుడు త్రిపురనేని రామస్వామి పురస్కారం ప్రకటించింది. దానిని ఆయన స్వీకరించాలా? తిరస్కరించాలా? అనే మీమాంస చాలా మంది భావోద్యమకారుల్లో నెలకొంది. ఇటువంటి పురస్కారాల్ని భావోద్యమ కారులు తీసుకోరాదు అనే ఒక ఆదర్శం ఉంది. చాలామంది ఆలోచనా పరులు, సామాజిక కార్యకర్తలు దీనిని అమలు చేశారు కూడా. కానీ, ఒక వ్యక్తి చేసిన కృషిని గుర్తిస్తూ, గౌరవిస్తూ ఇచ్చే అవార్డులను స్వీకరించడంలో తప్పులేదనీ, అవి మరింత మందిని ఆ మార్గం లో ప్రోత్సహించ డానికేననే వాదన కూడా ఒకటుంది. ఐతే, ఒక పక్క మూఢత్వాన్ని వ్యాపింపజేసే జాతకాలు, వాస్తుకి సంబంధించిన కోర్సుల్ని ప్రవేశపెడుతూ మరో వైపు, హేతువాద ప్రచారానికి కూడా స్థానం కల్పిస్తామనే ద్వంద్వ వైఖరితో ఉన్నటువంటి యూనివర్సిటీలు ఇచ్చే అవార్డును అంగీక రించడం ఎలా సరైనదనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది!

Also read: ‘చౌరీచౌరా’ ఘటనకి వందేళ్ళ సందర్భం!

పేరలింగం గారి వయసు ఇప్పుడు 80 ఏళ్ళు. బహుశా భవిష్యత్తులో ఇక మీదట ఇలాంటి పురస్కారాలు ఆయన అందుకోలేకపోవచ్చు. అలానే ఆయన స్పందన మీద ఆధారపడి విశ్వవిద్యాలయాలు ఇకపై భావోద్యమకారుల కృషిని గుర్తిస్తాయనే నిజాన్ని కూడా పరిగణన లోకి తీసుకోవాలి. ఆయన క్షేత్రస్థాయి ఉద్యమ కారుడు. పెద్దగా చదూకోకుండానే స్వశక్తితోనూ, డిగ్రీలకి అతీతమైన ఆసక్తితోనూ హేతువాద మానవవాద ప్రచారకుడిగా ఎదిగిన మనిషి. మరి, గతంలో అగ్రకులాల నుండి వచ్చిన కొద్దిమంది హేతువాదులు మౌనంగా ఇలాటి పురస్కారాలు స్వయంగా స్థాపించి ఇవ్వడం, తీసుకోవడం జరగగా లేనిది ఒక అట్టడుగు వర్గం నుండి వచ్చిన పేరలింగం గారికి వృద్దాప్యంలో, ఇంత కాలానికి ఇలా వరించిన విశిష్ట పురస్కారాన్ని వద్దనే విధంగా, మన  భావాల్ని ఆయన మీద రుద్దడం కూడా సమంజసం కాదేమో హేతువాదులు ఆలోచించడం అవసరం. ఎంతో కష్టపడితే కానీ ఈ దేశంలో దళిత బహుజన ఆదివాసీ మహిళా సమూహాల కృషికి సరైన గుర్తింపు రాదు. అలాంటప్పుడు ఆదర్శాల పేరిట పేరలింగం గారి  ఇష్టాయిష్టాల్ని శాసించే హక్కు ఎవరికీ లేదనే నిజం గ్రహించాలి!

నిజానికి, పేరలింగంగారి హేతువాద ప్రచార కృషిని విశ్వవిద్యా లయం గుర్తించడం ఆయనకే కాదు, భావోద్యమకారులందరికీ సంతోషకరం. అలా క్షేత్రస్థాయిలో పనిచేసే వ్యక్తి విశిష్టతను నలుదిక్కులా వ్యాపింప జేసేందుకు ఇది ఒక మంచి తరుణం. ఐతే, అత్యంత గౌరవనీయమైన ఈ అవార్డు దేశంలో ఏ పరిస్థితులు నెలకొని వుండగా ఇస్తున్నారనే విషయం కూడా పరిగణనలోకి తీసుకున్నప్పుడే ఈ మొత్తం చర్చకి అర్దముం టుందనేది నా అభిప్రాయం. ఎందుకంటే, పేరలింగంగారి ఔన్నత్యానికి ప్రతీకగా నిలిచే ఈ శుభ సందర్భాన్ని పురస్కరించు కొని, తెలుగు నేల మీద భావోద్యమాల స్థాయి ఇనుమడింపజేసేలా సమన్వయంతో హేతువా దులు ప్రవర్తించాలే  కానీ ఏదో దుందుడుకు నిర్ణయం తీసుకుని, అహంకారంతో వ్యవహరి స్తున్నారనే  తప్పుడు సంకేతాన్ని సమాజానికి ఇవ్వకూడదు!

Also read: భావోద్యమాల లక్ష్యం దూషణ కారాదు!

మతతత్వ శక్తులు లౌకికవాద ప్రజాతంత్ర స్పూర్తిని పూర్తిగా కాలరాస్తూ, నరేంద్ర దభోల్కర్, గోవింద పన్సారే, కల్బుర్గి, గౌరీలంకేష్ వంటి భావోద్యమకారుల్ని హత్య చేశారు.  చరిత్రను తిరగరాసి మూఢత్వాన్ని పెంపొందించేలా సిలబస్ మారుస్తున్నారు. విశ్వవిద్యాలయాలు సైతం విద్వేషాన్ని ప్రేరేపిస్తూ ఎంతో మంది దళిత బహుజన విద్యార్ధుల బలవన్మరణాలకి కారణమౌ తున్నాయి. ఈ నేపథ్యంలో  పేరలింగం గారికి అవార్డును ప్రకటించిన విశ్వవిద్యా లయానికి హార్ధికంగా అభినందనలు చెబుతూనే, మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని అమలు చేసేలా విశ్వవిద్యాలయం స్థాయిలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెడుతూ, మూఢత్వాన్ని పెంపొందించే పాఠ్యాంశాల్ని తొలగించి నప్పుడు మాత్రమే పేరలింగం వంటి వారికి ఇచ్చే ఈ అవార్డులకు నిజమైన గౌరవం ఉంటుందనే విషయాన్ని బలంగా చాటడమే పురస్కార గ్రహీత ప్రధాన ఉద్దేశం కావాలనేది నా భావన!

అందులో భాగంగా, అట్టడుగు వర్గ సమూహానికి చెంది అనూహ్యమైన భావోద్యమ శీలిగా ఎదిగిన ఆయన కృషి ఎంతటి అసాధారణమైనదో యూనివర్సిటీ స్థాయిలో తెలయజేయడం ఒకెత్తయితే, ఈ వయసులో ఆయన్ని వరించిన ఈ అవార్డును సగౌరవంగా స్వీకరిస్తూనే, మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం తీర్మానం చేయడంతో పాటు,అందుకు దోహదం చేసే వైజ్ఞానిక గ్రంథాల్ని కూడా తెలుగు విశ్వవిద్యా లయం స్వచ్చందంగా ప్రచురించి ప్రచారం చేయడానికి ముందుకు వచ్చినప్పుడే ఇలాంటి అవార్డులకి మరింత హుందాతనం వస్తుందనే సందేశాన్ని సహేతుకంగా ఇస్తూ, అది జరిగిన రోజునే తనకు నిజమైన పురస్కార మని ఆయన ప్రకటించగల గడం మరొకెత్తు. మొత్తంగా మూఢ నమ్మకాల నిరోధక చట్టం యొక్క అవసరాన్ని పౌర సమాజంలో పెంపొందించేలా ఈ సందర్భాన్ని భావోద్యమాలు దార్శనికంగా రూపొందించే దిశగా ప్రయత్నం చేయలనేదే నా అభిప్రాయం!

Also read: జ్ఞాపకం గతం కాదు, ఆగతం!

నచ్చినా, నచ్చకపోయినా కొన్ని రకాల అభినివేశాలకీ, ఆడంబరాలకీ ఉద్యమ శ్రేణులు కూడా అలవాటు పడ్డారు. ఎంతోమంది పేరున్న ఉద్యమ కారులు కూడా ఒకింత ముఖ స్తుతి, గుర్తింపు కోరుకునే స్థితిలో ఈరోజు ఉన్నారు. ఆ కారణంతోనే భిన్నాభిప్రా యాల్ని గౌరవిస్తూ నిబద్దతతో కృషి చేసిన వారి శ్రమని నలుగురు గుర్తించడం అనేది ఒక మంచి ఆరోగ్యకర వాతావరణం వ్యవస్థలో నెలకొల్పడానికి దోహదపడే సాధనం అనే స్పృహతో అడపాదడపా మనం కూడా అటువంటి కార్యక్రమాల్లో భాగమౌతున్నాం. అలాంటప్పుడు పేరలింగం వంటి పేద ప్రజ్ఞాశాలికి వచ్చిన అవార్డును ఆయన, నిజాయితీ, నిబద్దతలకి దక్కిన ప్రోత్సాహం గా భావించాలే కానీ, అంతమంది చేసిన ఎంపికను అవహేళన చేస్తూ, అవార్డు తిరస్కరిస్తేనే నిజమైన ఉద్యమ కారుడనే అర్ధం వచ్చేలా ఆయన్ని కించపరచడం సభ్యత కాదు. సమిష్టిగా ఈ పురస్కారానికి ఆయన్ని ఎన్నిక చేసేందుకు కృషి చేసిన మొత్తం కమిటీకి మనం ఇచ్చే కనీస గౌరవం ఇదేనా అనే ప్రశ్న వస్తుంది. అంతేగాక, మనం మాత్రం ఆడంబరంగా సభలూ, సత్కారాలు చేయడం, చేయించు కోవడం చేస్తూ, అదే అభ్యుదయమనే ప్రచారం చేసుకుంటూ, వేరే వాళ్ళు ఇచ్చిన అవార్డును పుచ్చుకోవడం మాత్రం ఉద్యమ ద్రోహమనే వైఖరి మనలోని సంకుచితత్వానికి పరాకాష్టగా కనిపిస్తుంది !

స్వార్ధ ప్రయోజనాల కోసం ఎన్నో జేబు సంఘాలు, డాబు సంస్థలు కీర్తి పురస్కారాల పేరిట హడావుడి చేస్తుంటాయ్. పౌడరు రాసుకుని, సెంట్లు పూసుకుని, ఫొటోలకి అలవాటు పడిన పెద్దమనుషులు వేలు, లక్షలు ఖర్చు చేసి ఇలాంటి ఎన్నో తతంగాలు అట్టహాసంగా నడుపుతున్నారు. ఇక్కడ మిగిలిన వారి సంగతి తెలీదు కానీ, పేరలింగం మట్టుకు అలాంటి అక్రమ మార్గాల్ని ఆశ్రయించే వ్యక్తి కాదు. ఆయన కంత సౌలభ్యం కూడా లేదు. మరి, ఆ విధంగా చూసినప్పుడు ఏ రకమైన లాబీయింగ్ లు, రికమండేషన్ లు లేకుండా పేరలింగం వంటి సీనియర్ కార్యకర్తకి లభించిన పురస్కారాన్ని ఈ వయసులో ఆయన చేసిన కృషికి తగిన స్థాయిలో వచ్చిన గుర్తింపుగా భావించాలే కానీ, భావోద్యమాలన్నింటి సారాన్నీ గంపగుత్తగా ఆయన మీదకి నెట్టి, మన అభిప్రాయాలకి కార్యరూపం కల్పించే శ్రమను మొత్తంగా ఈ వయసులో ఆయన నెత్తి మీద పెట్టడం భావ్యం కాదు. వయసు మీద పడిన పెద్దవారికి ప్రశాంతమైన జీవితాన్ని కల్పించడం నాగరిక వ్యవస్థ యొక్క కనీస బాధ్యత. సాయుధ పోరాటాల్లో సైతం ఒక దశ దాటిన పెద్దవారికి భరోసాతో కూడిన బ్రతుకును ఏర్పర్చడానికే మొగ్గుచూపుతారు. అలాంటిది హేతువాదం పేరిట మనకున్న  వికారాల్నీ, భావోద్రేకాలన్నింటినీ పేరలింగం గారు పాటించాలనీ, అప్పుడే ఆయన నిఖార్సైన ఉద్యమకారుడవుతాడనే అల్టిమేటం ఇవ్వడం మనలోని అజ్ఞానానికి, అహంభావానికి చిహ్నమౌతుందే కానీ అర్ధవంతమైన సంస్కారానికి కాదు!

Also read: కరపత్రాల ఊసులు – కార్యాచరణ బాసలు

చివరగా, పేరలింగం గారు పురస్కారాన్ని స్వీకరించి తన భావాల్ని కుండ బద్దలు కొట్టినట్లు స్పష్టంగా చెప్పి అర్ధవంతమైన రీతిలో  హుందాగా వ్యవహరించి మూఢ నమ్మకాల నిరోధక బిల్లును గురించిన పురోగతిని ప్రస్తావించాలనీ, అనేక సంక్షోభాల సుడిగుండాల్లో రోజురోజుకు బలహీన పడుతున్న భావోద్యమాల ఉనికిని  ఆయన నిర్ణయం తలెత్తి గర్వపడేలా బలోపేతం చేయాలని, ఆ దిశగా ఆయనేం నిర్ణయం తీసుకున్నా సరే, శ్రేయోభిలాషులుగా మద్దతు ఇస్తామనే భరోసాను ఇస్తూ, ఇక ఈ విషయం లో ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చే యత్నం మిత్రులు, హితులు దయచేసి చేయొద్దని సూచిస్తూ, తెలుగు భావోద్యమ చరిత్రలో భావితరాలకి తిరుగులేని ప్రేరణగా నిలిచి పోనున్న మా పేరలింగం గారికి ఇవే మా  ప్రేమపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు !

(అనేక అశక్తతల వల్లా, సుదీర్ఘ ప్రయాణం చేసి నిన్ననే వచ్చినందువల్లా, ఇంకా వ్యక్తిగత కారణాల వల్ల నేను వెళ్ళడం కుదరడం లేదు కాన ఇతర భావోద్యమ మిత్రులు ముందు కొచ్చి పేరలింగం గారిని హైదరాబాద్ తీసుకువెళ్ళి, జాగ్రత్తగా తీసుకువచ్చే బాధ్యత తీసుకున్నారు.వారికి ధన్యవాదాలు. అలాగే పురస్కారం అందుకున్న పేరలింగం గారికి రాజమహేం ద్రవరం భావోద్యమ మిత్రులు పూనుకుని వివాదాలకి అతీతంగా, నిర్వహణా దక్షతతో మూఢనమ్మకాల చట్ట సాధనకు ఉపకరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే దిశగా,  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న  భిన్న భావోద్యమ మిత్రుల్ని, సంస్థల్నీ సాదరంగా ఆహ్వానించీ, ఘనంగా  మరో అభినందన సమావేశం ఏర్పాటు చేయడం బావుంటుందనే  అభిప్రాయం వెలిబుచ్చుతూ ఇలా ఈ చిన్న రైటప్.)

Also read: ఏకవ్యక్తి సైన్యం: మేకా సత్యనారాయణశాస్త్రి

– గౌరవ్

Gourav
Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles