Sunday, December 3, 2023

ఐటీ ఉద్యోగుల ఇక్కట్లు

  • ఉద్యోగాలు పోయినవాళ్ళలో మనవాళ్ళు 40 శాతంమంది
  • రెండు మాసాలలో కొత్త  ఉద్యోగం, లేకుంటే ఇంటిదారి
  • వీసా సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భారతీయులు

ఆర్ధిక మాంద్యం చుట్టుముడుతున్న వేళ అగ్రరాజ్యంలో అస్మదీయులు కూడా ఎన్నో కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు. అందునా ఐటీ రంగంలో పనిచేసేవారు నానా బాధలు పడుతున్నారు. అమెరికాలో భారతీయ ఐటీ నిపుణులు పెద్దఎత్తున ఉద్యోగాలు కోల్పోతున్నారు. వీసా సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉన్న ఉద్యోగాలు పోగొట్టుకొని, ఉన్నపళంగా కొత్త ఉద్యోగాలు రాక పడే అవస్థలు వర్ణనాతీతం! గూగుల్, మైక్రోసాఫ్ట్, పేస్ బుక్, అమెజాన్ వంటి అనేక దిగ్గజ సంస్థలు ఉద్యోగాల కోతలు మొదలుపెట్టాయన్న విషయం తెలిసిందే. వాషింగ్ టన్ పోస్ట్ మొదలైన మీడియా వేదికలు ఇదే అంశంపై కథనాలు గుప్పిస్తున్నాయి. పోయిన ఏడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకూ సుమారు 2లక్షల మంది ఐటీ రంగంలో ఉద్యోగాలు పోగొట్టుకున్నట్లు సమాచారం. వారిలో దాదాపు 40శాతం మంది భారతీయలే ఉన్నట్లుగా తెలుస్తోంది. వీళ్ళందరూ హెచ్ -1బీ, ఎల్-1 వీసాలతో అమెరికాలో ఉంటున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన 60 రోజుల్లోపు కొత్త ఉద్యోగాలను సంపాదించాలి. లేదా వీసాను మార్చుకోవాలి. ఆ గడువు దాటిన 10 రోజులోగా అమెరికా నుంచి వెళ్లిపోవాలి. ప్రస్తుతం ఆమెరికా ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యల నేపథ్యంలో జాబ్ మార్కెట్ దెబ్బతిని ఉంది. ఈ పరిస్థితుల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు ఎండమావిగా మారిపోయాయి. హెచ్ -1బీ వీసా నిబంధనల విషయంలో మార్పులు రావాలని మనవాళ్ళు కోరుకుంటున్నారు.

Also read: తగ్గుతున్న సంతానోత్పత్తి

ఐటీ రంగానికి మినహాయింపు ఇవ్వాలి

ఐటీ రంగానికి మినహాయింపులు ఇవ్వడం, తొలగింపు విధానాలను కనీసం కొన్ని రోజులు పాటు పొడిగించడం తప్ప వేరు మార్గాలు లేవు. అమెరికాలోని ఐటీ పరిశ్రమలో ఎక్కువమంది పరాయి దేశస్తులే కావడంతో ఈ వేటు ఎక్కువై పోయింది. అంతర్జాతీయంగా ఆర్ధిక దుస్థితుల నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకొనే పనిలో అన్ని దేశాలు పడిపోయాయి. ఐటీ కంపెనీల ఖర్చులో 60-65 శాతం జీతాలకే ఉంది అందుకని ఈ కోతలు మొదలయ్యాయి. మారుతున్న సాంకేతిక సమాజాల నేపథ్యంలో అనేక సంస్థలు డిజిటలైజేషన్ బాట పట్టాయి. దీనితో సోషల్ మీడియా వినియోగం ఎన్నోరెట్లు పెరిగిపోయింది. అన్నింటికీ టెక్నాలజీని వాడే సంస్కృతి పెద్దపీట వేసింది. ఈ ప్రభావంతో ఐటీ రంగంలో కొత్త ఉద్యోగాల నియమకాలు బాగా పెరిగాయి. ఆర్ధిక సమస్యల నేపథ్యంలో ప్రాజెక్టులు కూడా తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా కోతలపై ఎక్కువ ప్రభావం పడింది. అమెరికాతో పాటు యూరప్ దేశాల్లోనూ మనవాళ్లే ఎక్కువమంది ఉన్నారు. కాంపస్ రిక్రూట్ మెంట్ చేసుకున్న విప్రో వంటి సంస్థలు కూడా శిక్షణ పూర్తయిన తర్వాత కొత్త ఉద్యోగుల్లో చాలామందిని తొలగించినట్లు కూడా సమాచారం. అదీ ఇదని లేదు. దాదాపుగా అన్ని సంస్థలదీ అదే తీరు.

Also read: నిరుద్యోగిత భయపెడుతోంది

మీడియా రంగంలోనూ అదే పరిస్థితి

ఐటీ రంగమే కాదు మిగిలిన రంగాలు, మీడియా రంగంలోనూ అమెరికా, యూరప్ లో కోతలు మొదలయ్యాయి. వాషింగ్ టన్ పోస్ట్ వంటి మీడియా సంస్థలు కూడా అదే బాట పట్టాయని వినపడుతోంది. ఈ తరుణంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారు ( ఫ్రెషర్స్) కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇది ఇలా ఉండగా, మన దేశం నుంచి అమెరికా వెళ్లే వారి వీసాల మంజూరు విషయంలో అమెరికా జోరు పెంచిందని చెబుతున్నారు. ‘ఇంటర్వ్యూ డేస్’ పేరుతో హైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్ పరిధిలో మొన్న శనివారం ఒక్కరోజులోనే 500 వీసాలు జారీ చేశారు. ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్ కతా లోనూ ఇదే జోరు నడుస్తోంది. మొత్తం మీద ఆర్ధిక సంక్షోభం తగ్గితే కానీ అన్ని పరిశ్రమల్లో ఉద్యోగాల ఊపు పెరగదు, సగటు వేతన జీవి కష్టాలు తగ్గవు. ప్రత్యామ్నాయంగా స్వయంకృషి వైపు, వ్యవసాయం వంటి రంగాల వైపు మొగ్గుచూపడం కొంత నయం. ప్రభుత్వాలు, కార్పొరేట్ రంగాలు ఉద్యోగభారత ప్రగతి పట్ల శ్రద్ధ పెంచాలి.

Also read: నిరుద్యోగిత భయపెడుతోంది

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles