Monday, April 22, 2024

మండలి ఎన్నికల హెచ్చరికలు

  • అన్ని పార్టీలూ నేర్చుకోవాలి గుణపాఠాలు
  • ఎన్నికల ఫలితాలను తప్పుగా అర్థం చేసుకుంటే భవిష్యత్తులో అనర్థం
  • పొరబాట్లను సవరించుకోవడానికి అధికార పక్షానికి అవకాశం
  • మితిమీరిన విశ్వాసం ప్రతిపక్షానికి నష్టదాయకం

 ఆంధ్రప్రదేశ్ లో మండలి ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా పట్టభద్రుల ఫలితాలు అధికార పార్టీ వైసీపీకి ప్రతికూలంగా, ప్రధాన ప్రతిపక్షం టిడిపికి అనుకూలంగా నమోదుకావడం ప్రధానంగా చర్చనీయాంశమైంది. ఇరు పక్షాలు ఎవరికి అనుకూలమైన వ్యాఖ్యలు వాళ్ళు చేసుకుంటున్నారు. అది సహజమైన విషయం కూడా. మరో సంవత్సర కాలంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు అప్రమత్తం కావాల్సిన తరుణం వచ్చేసింది. క్షేత్ర వాస్తవాలను గమనించకుండా ముందుకు సాగినా, అతి విశ్వాసం ప్రదర్శించినా, భజంత్రీపరుల మాటల మాయలో పడిపోయినా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఈ అనుభవాలు గతంలో ప్రతి పార్టీ రుచి చూసింది. అయినా మారకుండా, గుణపాఠాలు నేర్చుకోకుండా ముందుకు సాగాయి. సదరు పార్టీలు బొక్కబోర్లా పడ్డాయి కూడా. నేటి ఫలితాల అంశానికి వస్తే ఇది కొందరికి కనువిప్పు, కొందరికి ఉత్సాహాన్ని నింపే గుళికలు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాన్ని ఏ మాత్రం ప్రతిబింబించవని అనుకున్నా తప్పే, ఈ ఎన్నికల్లో గెలుపుతో రేపటి సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేదని, ప్రజలంతా తమవైపే ఉన్నారని భ్రమసినా తప్పే. ఈసారి పట్టభద్ర, ఉపాధ్యాయ ఎన్నికల తీరు గతంలో కంటే భిన్నంగా జరిగింది. గతంలో వామపక్షాలు, పీడీఎఫ్, ఉపాధ్యాయ సంఘాల యూనియన్లు, మిగిలిన యూనియన్లు పోటీ చేసేవి. రాజకీయ పార్టీలు మద్దతు పలికేవి. ఈసారి అధికార వైఎస్సార్ సీపీ తమ అభ్యర్థులను ఎన్నికల క్షేత్రంలో నిలిపింది.

Also read: దర్యాప్తు సంస్థల దుర్వినియోగం

పట్టభద్రుల తీర్పు గమనార్హం

ఉపాధ్యాయ ఫలితాలు అనుకూలంగా వచ్చినా, పట్టభద్రుల్లో మాత్రం పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సంక్షేమాభివృద్ధి ఫలాలు దక్కిన ఓటర్లలో పట్టభద్రులు తక్కువగా ఉన్నారని, వారికి సందేశాన్ని పంపడంలో కొంత ఇబ్బంది ఏర్పడిందని వైసీపీ పెద్దలే ఒప్పుకున్నారు. ఎన్నికల్లో అక్రమాలు మీవంటే మీవంటూ ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. అధికారాలు, అవకాశాలు ఎవరు అధికారంలో ఉంటే వారికే ఎక్కువగా ఉంటాయనేది అధికవాస్తవం. అదే సమయంలో, పాలనలో ఉన్న పార్టీపై ఎంతోకొంత ప్రజావ్యతిరేకత  ఏర్పడడం కూడా సహజం. ఇక బోగస్ ఓట్లు, అనర్హుల శాతం ఎక్కువగా నమోదైందని విపక్ష తెలుగుదేశం మండిపడుతోంది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రక్రియ పెద్దఎత్తున జరిగిందని, కుప్పం వంటి కేంద్రాలు దానికి ఉదాహరణగా నిలుస్తాయని వైసీపీ వర్గీయులు కూడా విమర్శలు చేస్తున్నారు. 108 అసెంబ్లీ నియోజక వర్గాలకు విస్తరించిన శాసనమండలి ఎన్నికలలో దాదాపు 65శాతం ఓటర్లు అధికార వైసీపీకి వ్యతిరేకంగా ఓటువేశారన్న విషయాన్ని పాలకపక్షం తేలికగా తీసుకోరాదు. దీనిపై క్షేత్ర స్థాయిలో పునఃసమీక్షలు నిర్వహించాలి, ఆత్మపరీక్షలు చేసుకోవాలి. మామూలుగా పట్టభద్రుల స్థానాల ఎన్నికలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. కానీ, సుమారు 108 శాసనసభా స్థానాలకు విస్తరించిన ఈ ఎన్నికలో వందమందికి పైగా వైకాపా ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ తరుణంలో ఎమ్మెల్యేల పనితీరుపై నిశితమైన సమీక్ష జరపాలి. గడపగడప కార్యక్రమం తెస్తున్న ఫలితాలు, ఇస్తున్న నివేదికలను కూలంకషంగా పరిశీలించాలి. 2024లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఇవన్నీ ఉపయోగపడతాయి.

Also read: ‘నాటునాటు’ బృందానికి అభినందనలు

ఏ పక్షం గెలిచినా ఓడేది ప్రజలే

ప్రజాభిప్రాయాన్ని అంచనా వేయడం అంత సులువు కాదు.ప్రజల నాడిని పట్టుకొని వ్యవహరించడం కీలకం. నిఘా విభాగాల పాత్ర అంతే కీలకం. యువత, ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకోవడం ఎంతో కీలకం. వారిని ఆకర్షించడం అంతే ముఖ్యం. ఈసారి  మండలి ఎన్నికల్లో ఓటుకు వేల రూపాయలు ఇచ్చారనే మాటలు విస్మయం కొలుపుతున్నాయి. ఏ విలువలకీ ప్రస్థానం? అని సభ్య సమాజం ఆవేదనపడే కాలం వచ్చి కూడా చాలాకాలమైంది. మొత్తంగా చూస్తే ఈ ఎన్నికల నుంచి పాఠాలు, గుణపాఠాలు ఎవరి పరిధిలో వారు నేర్చుకోవాల్సిందే. మంచివారిని ఎంపిక చేసుకొనే స్వాతంత్య్రం, హక్కు, అవకాశం, చెడ్డవారిని తిప్పికొట్టే శక్తి ఓటర్లకు ఎప్పుడూ ఉంటాయి. మంచివైపు మారాల్సింది ఓటర్లే. లేకపోతే ఎవరు గెలిచినా శాశ్వతంగా ఓడిపోయేది ప్రజలే. అందునా సగటుజీవులే.

Also read: గుంటడికి గుండెపోటా?

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles