Friday, April 26, 2024

‘జైహింద్’ ఆలోచన మన హైదరాబాదువాడిదే!

ఫొటో రైటప్: ఆబిద్ హసన్ సఫ్రానీ, సుభాస్ చంద్రబోస్

 ‘జైహింద్’ అనే నినాదాన్ని ఆరెస్సెస్, జనసంఘ్, బీజేపీ వారెవరూ సృష్టించలేదు. దేశభక్తి, దేశభక్తి – అని గొంతులు ఎండిపోయే విధంగా అరచి గీ పెడుతున్న వారికి ఎవరికీ ఆ ఆలోచనే రాలేదు. దేశం గర్వించదగ్గ ఏ చిన్న పనీ వారు చేసింది లేదు. అయితే, మరి ఆ పని ఎవరు చేశారూ? జైహింద్ – అనే మాటను ఎవరు వాడుకలోకి తెచ్చారూ? అవి స్వాతంత్ర్య పోరాటం సాగుతున్న రోజులు! సుభాస్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీని రూపొందించుకున్న రోజులు.  ఈ ఆర్మీలో దేశంలోని భిన్నప్రాంతాల వారు ఉండేవారు.  పరిచయస్తులు, మిత్రులు ఎవరైనా కలిస్తే వారు వేరు వేరు రకాలుగా అభివాదం చేసుకునేవారు. కొందరు ‘నమస్కార్’ అని, మరికొందరు ‘రామ్ రామ్’ అనీ, ఇంకొందరు ‘అస్సలాము అలేకుం’ అనీ సంబోధించుకునేవారు. సుభాస్ చంద్ర బోస్ సెక్యులర్ భావాలు కలిగినవాడు గనక, తన ఆజాద్ హింద్ ఫౌజ్ (ఆర్మీ)లో ఇన్ని రకాల పలకరింపులు (Wishing, greeting) ఉండటం ఆయన ఇష్టపడలేదు. దేశభక్తి ఉట్టిపడేలా, దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా అందరూ ఒకే రకంగా పలకరించుకోవాలని ఆయన కోరుకున్నారు. అందుకు ఒక మాటను, లేదా నినాదాన్ని రూపొందించమని మిత్రులకు, తన ఆర్మీలో ఉన్న ముఖ్యులకు సూచించారు.

సఫ్రాని, సుభాస్ చంద్ర బోస్

అలా ఎందరో ఎన్నెన్నో రకాలైన మాటలు సూచించారు. తన నేషనల్ ఆర్మీలో మేజర్ గా పని చేసే ఒక వ్యక్తి ఒక రోజు వచ్చి-ఒకరికొకరు ఎదురుపట్టప్పుడు ‘హలో’ అని పలకరించుకోవాలని సూచించాడు. సుభాస్ చంద్రబోస్ కు అది నచ్చలేదు. ఎందుకంటే అది మన దేశానికి సంబంధించిన పలకరింపు కాదు. ఆ మాట ఇతర దేశాలలో కూడా ఉంది. ఒకరికొకరు అభివాదం చేసుకోవడానికి ఎలాంటి మాట కావాలో బోస్ అతనికి మరొకసారి వివరించాడు. అంతే. ఆ మేజర్ మరో రెండు మాటలు చెప్పాడు- ఒకటి – ‘జైహిందుస్థాన్’ అని! మరొకటి ‘జైహింద్’ అని!! వినగానే ‘జైహింద్!’ అన్నది బోస్ కు బాగా నచ్చింది. చిన్న మాటయినా అది బలంగా ఉందనిపించింది. జైహింద్ – అంటే భారత దేశానికి జయము  కలుగుగాక అని అర్థం. అప్పటి స్వాతంత్ర్యోద్యమ కాలానికి అది బాగా సరిపోతుందని అనుకున్నారు బోస్. అదే జైహింద్ అనే మాటను తన నేషనల్ ఆర్మీలో ప్రవేశపెట్టాడు. ఆ మాటలో స్వాతంత్ర్యం సంపాదిస్తామన్న ఆత్మవిశ్వాసం ఉంది. దేశభక్తి ఉంది. పలకడానికి సులువుగా ఉంటూనే, మనోబలాన్ని పెంచే బలం కూడా ఆ  మాటలో ఉంది. సుభాస్ చంద్రబోస్ అన్నీ బాగా ఆలోచించి తన ఉపన్యాసాలలో కూడా ఆ మాట తరచూ ఉపయోగించేవారు. ఆ విధంగా ‘జైహింద్’ అనతి కాలంలో ఒక జాతీయ నినాదం అయ్యింది.

Also read: గుర్తిస్తే, మానవవాదులు మన‘లోనే’ ఉన్నారు!

ఇంతకూ –  ‘జైహింద్’కు రూపకల్పన చేసిన ఆ నేషనల్ ఆర్మీ మేజర్ ఎవరూ? అంటే – ఆయన మన తెలంగాణ – హైదరాబాదువాడే. పేరు ఆబిద్ హసన్ సఫ్రానీ. చిన్నప్పుడు పేరు జైనుల్ అబిదీన్ హసన్. చిన్నప్పుడే ఆ నాటి శాసనోల్లంఘన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. దానితో చదువు ఆగిపోయింది. కొంత కాలం తర్వాత ఇంజనీరింగ్ చదువుదామని జర్మనీ వెళ్ళాడు. అక్కడే నేతాజీని కలుసుకున్నాడు. అప్పుడు బోస్ జర్మనీలోనే ఉన్నారు. అప్పుడే అబిన్ జీవితం మలుపు తిరిగింది. చివరి దశలో ఉన్న ఇంజనీరింగ్ కోర్సు వదిలేసి, బోస్ కు వ్యక్తిగత కార్యదర్శిగా చేరాడు. అప్పటికే జర్మన్ భాషపై కొంత పట్టు సాధించడం వల్ల  జర్మన్ భాష అనువాదకుడిగా కూడా నేతాజీకి సహాయపడ్డాడు. ఇండియాకు తిరిగి వచ్చాక ఇక్కడ ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఆజాద్ హింద్ ఫౌజ్)లో 1942-45 మధ్య ఆబిద్ హసన్ మేజర్ గా పని చేశాడు. ఆ తర్వాత ఐ.ఎఫ్.ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీసు) సాధించాడు. 1948-1969 మధ్య కాలంలో డెన్మార్క్ కు , ఆ తర్వాత ఈజిప్టుకు భారత రాయబారిగా సేవలు అందించాడు. 5 ఏప్రిల్ 1984న హైదరాబాదులోనే తన డెబ్బయ్ రెండవ యేట కన్నుమూశాడు. జీవితాన్ని దేశభక్తికి అర్పించిన మహోన్నతుడిగా నిలిచిపోయాడు.

సుభాస్ చంద్రబోస్, అబిద్ హసన్ సఫ్రానీ సమీప బంధువులు

‘జైహింద్’ నినాదాన్ని రూపకల్పన చేయడమే కాదు, ఆయన గొప్పతనాన్ని శ్లాఘించడానికి మరో విశేషం కూడా ఉంది. ఆజాద్ హింద్ ఫౌజ్ లో ఉన్నప్పుడే ఆబిద్ హసన్ తన పేరుకు ‘‘సఫ్రానీ’’ – అని తగిలించుకున్నాడు. సాఫ్రాన్ అంటే కాషాయరంగు. దాన్ని హిందువులు పవిత్రమైనదిగా భావిస్తారు గనక, దాన్ని ఆయన స్వీకరించి తన పేరుకు చివర ‘సఫ్రానీ’ అని చేర్చుకున్నాడు. మత సామరస్యానికి గుర్తుగా, హిందువుల పట్ల తన సోదరభావాన్ని ప్రకటించుకోవడానికి ఒక ముస్లిం యువకుడు ఆ నిర్ణయం తీసుకున్నాడు. మధ్యలో కొంత కాలం కాంగ్రెస్ సభ్యుడుగా ఉన్నా అందులో ఎక్కువకాలం ఉండలేదు. దేశవిభజన జరిగి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఐఎఫ్ఎస్ పూర్తి చేయడానికి తన పూర్తి సమయం కేటాయించాడు. నేతాజీ సుభాస్ చంద్రబోస్ కు కార్యదర్శగా ఉన్న రోజుల్లో ఆబిద్ ఆయన వెన్నంటే ఉండేవారు. ఆయన నౌకలో ఏ దేశం వెళ్ళినా, వెంట వెళుతూ ఆయనను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకునేవాడు. తర్వాత కాలంలో నేతాజీకి అబిద్ హసన్ కు చుట్టరికం కూడా కలిసింది. నేతాజీ మేనల్లుడు అరబిందో బోస్- ఆబిద్ హసన్ అన్నకూతురు సురయా హసన్ ను పెండ్లి చేసుకున్నాడు. ఆబిద్ హసన్ అన్న  బద్రల్ హసన్ గాంధీజీతో కలిసి పని చేసేవాడు. ఇక్కడ సురయా హసన్ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పుకోవాలి. 1928లో పుట్టిన సురయా ఆ రోజుల్లో కేంబ్రిడ్జి యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ టెక్స్ టైల్ డిజైనింగ్ లో పట్టాతీసుకొని వచ్చింది. హైదరాబాద్ లోనే స్థిరపడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తన వ్యాపారం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించుకుంది. అంతరించిపోతున్న ఒక నాటి చేనేత కళని పునరుద్ధరించింది. బిద్రి, హిమ్రు, ముష్రు, ఇక్కల్, కలంకారీ వంటి వాటిని గద్వాల్ ఉప్పాడ వంటి వస్త్రాల్ని ఇక్కడి నుంచే ఖండాంతరాలకు అందించింది. కాంగ్రెస్ కార్యకర్తగా, ఖాదీ ఉద్యమకారిణిగా జీవితాంతం కృషి చేసిన ఆమె, ఇటీవల, 2021లో, హైదరాబాద్ లోనే తుది శ్వాస వదిలింది.

సురయా హసన్

సైన్యంలో మేజర్ గానూ, విదేశాలలో భారత రాయబారిగానూ పని చేయడమే గాక, అబిద్ హసిన్ కు ఉరుదూ, పర్షియన్ కవిత్వమంటే చాలా చాలా ఇష్టంగా ఉండేది. విశ్వకవి ‘జనగణమన అధినాయక జయహే’ గీతాన్ని ఆయన హిందుస్థానీలోకి అనువదించాడు. హిందీ-ఉరుదూలు కలిసి ఏర్పడిందే హిందుస్థానీ భాష. ‘‘శుభ్ సుఖ్ చైన్ కి బర్ ఖా బర్ సే’’గా అది చాలా ప్రాచుర్యం పొందింది. దానికి కెప్టెన్ రామ్ సింగ్ ఠాకూరి సంగీతం సమకూర్చాడు. అయితే అది మిలట్రీ మార్చింగ్ సాంగ్ లా ఉంటుంది. దీనికి కూడా మళ్ళీ  ఒక ప్రాధాన్యత ఉంది. 15 ఆగస్టు 1947న దేశానికి స్వాతంత్ర్యం లభించిన మరునాడే నాటి తొలిప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఎర్రకోట మీద మన మువ్వన్నెల జెండాను ఎగరేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సందర్భంలో ఆ కార్యక్రమానికి కెప్టెన్ ఠాకూరినీ, ఆయన మ్యూజిక్ బ్యాండ్ నీ నెహ్రూ ఆహ్వానించారు. స్వతంత్ర భారత దేశంలో తొలిసారి ఎర్రకోట దగ్గర ఆబిద్ హసన్ గీతం, కెప్టెన్ ఠూకూరి సంగీత సారథ్యంలో ప్రపంచానికి వినిపించడం జరిగింది.

Also read: తొలి భారతీయులు ఎవరు?-1

ఆబిద్ హసన్ సఫ్రానీ ‘జనగణమన’ గీతాన్ని హిందుస్థానీలోకి ఈ విధంగా అనువదించాడు. భావం, లయ ఏ మాత్రం చెడకుండా అద్భుతంగా ఆవిష్కరించాడు –

శుభ్ సుఖ్ చైన్ కి బర్ ఖా బర్ సే

భారత్ భాగ్ హై జాగా

పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ్ ఉత్కళ్ వంగా

చంచల్ సాగర్ వింధ్య మిమాలయ్ నీలా యమునా గంగా,

తెరేనిత్ గుణ్ గాయే తుఝ్ సే జీవన్ సాయె- సబ్ తన పాయే ఆశా!

సూరజ్ బన్ కర్ జగ్ పర్ చమ్ కే భారత్ నామ్ సుభాగా

జయహో! జయహో! జయహో! జయ జయ జయహో!!

సబ్ కే దిల్ మే ప్రీత్ బసాయె తెరీ మీఠీ వాణీ

హర్ సుబే కే రహనే వాలే, హర్ మహజబ్ కె ప్రాణి

సబ్ ఖేద్ ఔర్ ఫరక్ మిటాకె సబ్ గోద్ మె తెరీ ఆకే,

 గూంథే ప్రేమ్ కి మాలా

సూరజ్ బన్ కర్ జగ్ పర్ జమ్ కి భారత్ నామ్ సుభాగా

జయహో! జయహో! జయహో! జయ జయ జయహో!! – భారత్ నామ్ సుభాగా

శుభ్ సవేరే ఫంఖ్  పఖేరే- తేరే హీ గుణ్ గాయె

బాస్ భరీ సుగంథ్  భర్ పూర్ హవాయే జీవన్ మె రుత్ లాయే

సబ్ మిల్ కర్ హింద్ పుకారే జయ్ ఆజాద్ హింద్ కె నారే!

 ప్యారా దేశ్ హమారా!

సూరజ్ బన్ కర్ జగ్ పర్ చమ్ కే భారత్ నామ్ సుభాగా

 జయహో! జయహో!  జయహో! జయ జయ జయ జయహో!!

(శుభం, సుఖం, ప్రశాంతత వర్షాలై  కురవనీ, భారత దేశపు భాగ్యం మేలుకుంది. పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగా – వింధ్య హిమాలయాల ఒడిలో యమునా గంగలు ఉవ్వెత్తున ప్రవహిస్తూ నీ గుణగణాల్ని కీర్తించనీ, ప్రతి ఉదయం అన్ని మతాల, అన్ని ధర్మాలవారు, వారివారి హృదయాల్లో నీ తీయటి మాటలే నింపుకోనియ్. భేదాభిప్రాయాలు, తేడాలు అంతమొందించుకున్న వారందరి ఒడిలో ప్రేమతో అల్లిన నీ పూలమాలలే ఉన్నాయి. భారతదేశం సూర్యుడిలా ప్రపంచానికి వెలుగులు పంచనీ. ఉషోదయాల రెక్కలు నీ గుణగణాల్ని కీర్తిస్తున్నట్టు , వీస్తున్న గాలులు సమయానికి చక్కని రుతువులు తెస్తున్నట్టుగా ఉన్నాయి. అందరం కలిసి భారతావనికి విజయం కలగాలని జైహింద్ – అని జయ జయ హింద్ అని నినదిద్దాం! – సంక్షిప్త భావం.)

గత చరిత్రలోంచి ఎలుగెత్తి సగర్వంగా చెప్పుకోవాల్సిన ఇలాంటి ఘట్టాలు మనం చెప్పుకోం! అనవరసరమైన వాటికి ప్రాధాన్యమిస్తుంటాం!! ఇక సమకాలీనంలోనైతే అవివేకమైన అంశాలే ఎంతో ప్రాధాన్యమైనవిగా ప్రభుత్వ పెద్దలు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. నిజాయతీగా ఆలోచించగలవారికి మాత్రమే ఈ విషయం బోధపడుతుంది.

Also read: తొలి భారతీయులు ఎవరు? -2

(రచయిత కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles