Tuesday, April 30, 2024

అహేతుక జ్ఞానమే విశ్వాసం

 My Confession

                        ————————–

                                            By Leo Tolstoy

                          నా సంజాయిషీ

                          ———————

                                              లియో టాల్స్టాయ్

  తెలుగు అనువాదం:

డా. సి. బి. చంద్ర మోహన్

డా. బి. సత్యవతీ దేవి

                              చాప్టర్ 8

నేనిప్పుడు ఒక క్రమ పద్ధతిలో వ్యక్తపరచగలిగే ఈ సందేహాలన్నీ, ఇంతకు పూర్వం వ్యక్తపరచలేకపోయేవాడిని. గొప్ప ఆలోచనా పరులైన మేధావుల చేత నిర్ధారించబడిన — వ్యర్థ జీవితం గురించిన నా సారాంశం (తార్కికంగా అనివార్యమైనా గానీ) ఎక్కడో — సవ్యంగా లేదని నాకనిపించింది. అది హేతుబద్ధతలోనా లేక ప్రశ్నలోనా — అనేది నాకు తెలియదు. సారాంశం —

తార్కికంగా ఆమోదయోగ్యమే — కానీ అది మాత్రమే చాలదు అనిపించేది. ఈ ముగింపులన్నీ (నా హేతు బుద్ధితో వచ్చిన) నా ఆత్మహత్య ప్రయత్నాన్ని ప్రోత్సహించలేకపోయాయి. హేతువు నన్నీస్థితికి తీసుకువచ్చిందని (నేను ఆత్మహత్య చేసుకోకుండా) నేను చెబితే అది అబద్దమే అవుతుంది. హేతువు లేక తర్కం పనిచేస్తోంది. అది కాక మరేదో కూడా —

‘ జీవితం యొక్క స్పృహ ‘ — పనిచేస్తోంది. ఏదో ఒక శక్తి నా దృష్టిని అటువైపు గాక ఇటువైపు ప్రసరించేటట్లు చేస్తోంది. అదే శక్తి నన్ను నా నిరాశమయ పరిస్థితి నుంచి బయటికి లాగి, నా మనసును ఇంకోవైపుకు త్రిప్పింది. ఆ శక్తి — ‘ నేను, నాలాంటి కొద్ది వందల మంది మాత్రమే. మొత్తం మానవ కోటి కాదు; నాకు మానవాళి జీవితం — ఇంకా తెలియదు ‘ అనే నిజం వైపు నా దృష్టి సారించేలా నన్ను బలవంతం చేసింది.

Also read: ఎంతకీ అర్థం కాని జీవితం!

నాతో సమానులైన వారి యొక్క సన్నిహితమైన గ్రూపులో చూస్తే —

— ప్రశ్నని అర్థం చేసుకోని ప్రజలూ,

 — అర్థం చేసుకుని కూడా జీవితం అనే మత్తులో ఆ ప్రశ్నని ముంచేసినవారూ,

 — అర్థం చేసుకుని వారి జీవితాన్ని పరిసమాప్తి         

చేసుకున్న వారూ,

— అర్థం చేసుకొని కూడా దుర్బలత్వంతో నిరాశమయ జీవితం కొనసాగించేవారూ —-

మాత్రమే కనబడ్డారు. ఇంకెవరూ  కనపడలేదు. నాతో సమానులు (నాతో ఆ చిన్న సర్కిల్లో ఉన్న) — ధనికులు, చదువుకున్న వారు, తీరుబడిగా ఉన్నవారు మాత్రమే మానవ కోటి అనీ, మిగిలిన కోట్లాదిమంది — ఇంత క్రితం జీవించిన వారూ, ఇంకా జీవించేవారూ — అంతా ఒక రకమైన పశువులు (నిజం మనుషులు కారు)– అని నాకు అనిపించేది.

ఒక విచిత్రమైన నమ్మశక్యంగాని అసాధారణ విషయం ఏమిటంటే — జీవితం గురించి విశ్లేషిస్తూ ఉంటే — నా చుట్టూ ఉన్న మానవాళి యొక్క జీవితాలు నేను పట్టించుకోలేదనేది; నా జీవితం, సాల్మన్ , స్కోపేన్ హాయర్ ల జీవితాలు — మాత్రమే నిజమైన సాధారణ జీవితాలని, మిగిలిన లక్షలాది ప్రజల జీవితాలు పట్టించుకోదగ్గవి కావని — అసంబద్ధంగా అనుకోవడం. మేధావిననే గర్వంతో, ఒక రకమైన మతిభ్రంశంతో — నేను, సాల్మన్, స్కోపెన్ హాయర్ మాత్రమే నిస్సంశయంగా జీవిత ప్రశ్నను సరైన విధంగా చెప్పామని, మిగిలిన లక్షలాది ప్రజలు దాని గాఢతను అర్థం చేసుకోలేదని అనుకున్నాను. కానీ లక్షలాదిమంది ప్రజల జీవితాలకు (ఇప్పుడు బ్రతుకుతున్న, ఇంతకు పూర్వం బ్రతికిన) ఏమి అర్థం ఇవ్వబడింది — అని ఒక్కసారి కూడా నాకనిపించకుండా నేను జీవితానికి అర్థం వెతికాను.

Also read: ‘నేనేమిటి?,’ ‘ఈ విశ్వం ఏమిటి?’

 నేను ఈ పిచ్చి స్థితిలో చాలా కాలం బ్రతికాను. ఇది ఒక రకంగా మాలాంటి చదువుకున్న, లిబరల్ మనుషుల లక్షణం. మనమనుకున్నంత అమాయకులు కాని నిజమైన శ్రమజీవులను అర్థం చేసుకుంటానికి తోడ్పడిన — వారి మీద నాకున్న భౌతిక ప్రేమకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి (లేదా) నేను ఉరి తీసుకోవడం అనేది ఉత్తమమని తప్ప ఇంకేమీ తెలియని నా నమ్మకం పైనున్న  నిజాయితీకైనా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నేను సహజంగానే నాలో ఇలా అనుకున్నాను: నేను జీవించాలని కోరుకుంటే, ఇంకా జీవితం అర్థం చేసుకోవాలనుకుంటే, ఆత్మహత్యకు సిద్ధపడిన వారి దగ్గర కాకుండా కోట్లాదిమంది శ్రామిక ప్రజల నుండి — ఎవరైతే వారి జీవనానికి శ్రమ పడటమే కాక, మన జీవితాల కోసం కూడా శ్రమిస్తున్నారో — వారి నుండి జీవితాన్ని అర్థం చేసుకుంటాను. ఆ, అతి సామాన్యమైన చదువు లేని లక్షలాది పేద జనాలను (ఇంతకుముందు బ్రతికిన, ఇంకా బ్రతుకుతున్న) పరిగణనలోకి తీసుకుంటాను. నేను వారిలో వేరే ప్రత్యేకతలు చూశాను. ఆ లక్షలాదిమంది ప్రజలు నా వర్గీకరణలోకి రారు. నా జీవిత ప్రశ్న అర్థం చేసుకోలేదని నేను వారి గురించి అనలేను. ఎందుకంటే అది వారే చెబుతారు. అసాధారణ స్పష్టతతో వారు దానికి జవాబిస్తారు. వారిని ఎపిక్యూరియన్స్ గా కూడా పరిగణించలేను. ఎందుకంటే వారి జీవితాలలో ఆనందం కంటే లేమి, బాధలు ఎక్కువుంటాయి. అర్థం లేని జీవితం కొనసాగిస్తున్నారని పరిగణించం. ఎందుకంటే — జీవితంలోని ప్రతీ పనీ, (మరణంతో సహా) వారు వివరించి చెప్పగలరు. ఆత్మహత్య చేసుకోవడం మహా పాపంగా పరిగణిస్తారు. జీవిత పరమార్ధం గురించిన జ్ఞానము (నాచే గుర్తింపబడని, అలక్ష్యం చేయబడిన) మానవాళి అందరికీ ఉంటుందని అనిపిస్తుంది. సహేతుక జ్ఞానం జీవితానికి ఒక అర్ధాన్నిస్తుందని అనిపించదు; కానీ జీవితాన్ని మినహాయిస్తుంది: అశేష ప్రజానీకం చేత చెప్పబడిన జీవితార్థం ఒక తృణీకరించబడిన నకిలీ జ్ఞానం మీద నిలబడి ఉంటుంది.

Also read: శాక్యముని అడిగిన మౌలిక ప్రశ్నలు

చదువుకున్న, జ్ఞానులైన వారిచేత చెప్పబడిన సహేతుక జ్ఞానం జీవితం యొక్క అర్ధాన్ని నిరాకరిస్తుంది. కానీ సమస్త మానవాళి.  అహేతుక జ్ఞానం నుంచి జీవితం యొక్క అర్థాన్ని పొందుతారు.

ఆహేతుకజ్ఞానమే ‘విశ్వాసం.’  దాన్ని త్రోసిపుచ్చకుండా ఉండలేను. అది ‘దేవుడు.’ మూడింటిలో ఒకటి;  రెండవది :ఆరు రోజుల్లో విశ్వం సృష్టించబడటం; మూడోది : దేవతలు, దెయ్యాలు, ఇంకా మిగిలినవారు (దీన్ని నా హేతువు ఉన్నంతవరకు నేను అంగీకరించలేను)

నా పరిస్థితి భయంకరంగా ఉంది. సహేతుక జ్ఞానమార్గంలో జీవితాన్ని త్రోసి పుచ్చడం మినహాయించి నేనేమీ కనిపెట్టలేకపోయానని నాకు తెలుసు; అక్కడ — విశ్వాసంలో నిరాకరించడం తప్ప ఇంకేమీ లేదు (జీవితాన్ని త్రోసి పుచ్చడం కన్నా ఇది మరీ అసాధ్యం). సహేతుకజ్ఞానంలో జీవితం చెడుగా కనిపిస్తుంది. ప్రజలకు అది తెలుసు. వారికి జీవితం అంతం చేసుకునే శక్తి ఉంది; అయినా గాని వారు పూర్వం జీవించారు, ఇంకా జీవిస్తున్నారు. జీవితం అర్థంలేనిదీ, దుఃఖమయం అని నాకు ఎప్పటినుండో తెలిసినా గాని, నేనూ జీవిస్తున్నాను. ‘విశ్వాసం’ లో జీవితం అర్థం చేసుకోవడానికి నేను నా హేతువుని త్యజించాలని అనిపిస్తుంది (ఈ ఒక్క దాని కోసమైనా ఒక అర్థం అవసరం).

              ———–   ————–    ———-

Dr. C. B. Chandra Mohan
Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles