Friday, September 20, 2024

బ్రతకడానికి విశ్వాసం అవసరం

My Confession

                        ————————-

                                             By Leo Tolstoy

                                             ————————-

                          నా సంజాయిషీ

                         ———————-

                                             లియో టాల్స్టాయ్

                                              ————————-

తెలుగు అనువాదం:

డా. సి. బి. చంద్ర మోహన్

డా. బి. సత్యవతీ దేవి

                             చాప్టర్ – 14

                             ————–

                       బ్రతకడానికి విశ్వాసం నాకు చాలా అవసరం అని తెలిసింది. నాకు తెలియకుండానే వేదాంతంలోని వైరుధ్యాలను, అస్పష్టతలను నా నుంచి నేనే దాచేశాను. కానీ మతకర్మలలోని మాటలకు అర్థాలు వివరించడానికి పరిమితులు ఉన్నాయి. జార్, అతని బంధువులు, ప్రలోభాలకు ఎక్కువ గురవుతారు కాబట్టి వారి గురించి ఎక్కువ ప్రార్థనలు అవసరమవుతాయి కనుక   వారి గురించిన ప్రార్థనలు ఎక్కువగా చేయడం (మన సార్వభౌమిక ,దేవుని యొక్క పవిత్ర మాత మరియు అందరు సాధువులు మనము ఒకరికొకరు, మనందరి  జీవితాలు దేవునికి సమర్పించుకుంటున్నాం) అనే మాటలకు నేనర్థం చెప్పుకుంటే — చక్రవర్తి గురించిన ప్రార్థనలోని మాటలు నాకు అర్థం అయ్యాయి; కానీ మన శత్రువులను, చెడుని లొంగ తీసుకొని  మన పాదాల కింద ఉంచడం(మనం ‘ పాపం ‘ అనే శత్రువు గురించి ప్రార్థిస్తున్నామని ఎవరైనా చెప్పడానికి ప్రయత్నించినా) ఇవి — ఇంకా మిగిలిన ప్రార్థనలు, అందమైన దేవదూతలు పాడే పాట మరియు అర్పించుకునే మతకర్మలు లేదా ఎన్నుకోబడిన యోధులు మొదలైన మాటలు — సర్వీసుల్లో మూడింట రెండు వంతులు — పూర్తిగా అర్థం కానివిగా అయినా ఉన్నాయి లేదా — నేను అబద్ధం ఆడుతున్నాను అనే భావన కలుగుతుంది. దానితో దేవునితో నా సంబంధం ధ్వంసం అవడమే కాక నాకు విశ్వాసం లేకుండా చేస్తుంది.

Also read: జీవిత అవగాహన అసత్యం కాదు

                        ముఖ్యమైన పండుగల, ఉత్సవాల గురించి కూడా నేను అలాగే భావించాను. దేవుని కోసం ఒక రోజు కేటాయించి, సబ్బాత్ ని గుర్తు చేసుకోవడం అనేది నేను కొంచెం అర్థం చేసుకోగలను. కానీ పునరుత్థానం యొక్క స్మారకోత్సవం ముఖ్య పండుగగా జరుపుకోవడం నేను ఊహించలేకపోయాను, అర్థం కూడా చేసుకోలేకపోయాను. ఇంకా పునరుత్థానం పేరు మీద వారానికోసారి సెలవు ఇవ్వబడింది. ఆ రోజుల్లో మతకర్మలలోని ‘మహాప్రసాదం’  పంచబడింది. అది నాకు అర్థం చేసుకోలేనిదిగా అనిపించింది.  క్రిస్మస్ కాక మిగిలిన 12 పెద్ద సెలవులు (ఆరోహణ, పెంటకోస్ట్, ఎపిఫెని, పవిత్ర కన్య యొక్క మధ్యవర్తిత్వం గురించిన విందు మొదలైనవి) అద్భుతాల గురించి స్మారకోత్సవాలు. వాటిని త్రోసిపుచ్చకుండా ఉండటానికి నేను వాటి గురించి ఆలోచించదలచుకోలేదు. ఈ సెలవుల ఉత్సవాలలో, నాకు ప్రతికూలంగా కనిపించే విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వబడుతోందని భావించాను. వాటికి — నాకు ప్రశాంతత నిచ్చే వివరణలు ఇచ్చుకోవడానికి ప్రయత్నించాను లేదా అవి నన్ను ప్రలోభ పెట్టకుండా దృష్టి మరల్చుకున్నాను.

                     అతి పెద్ద మత కర్మలైన బాప్టిజము కమ్యూనియన్ల విషయంలో నేను పాల్గొన్నప్పుడు ఇదంతా జరిగింది. అక్కడ నాకు పూర్తిగా అర్థమయ్యే పనులు ఎదురుపడ్డాయి. అవి నన్ను ప్రలోభాలకు గురిచేస్తాయేమో అనుకున్నాను. అబద్ధం ఆడటమా, వాటిని తిరస్కరించడమా — అనే సందిగ్ధతలో పడ్డాను.

Also read: అనర్థం, అరిష్టం మనిషి జీవితం!

                       చాలా సంవత్సరాల తర్వాత మహా ప్రసాదాన్ని నేను అందుకున్న రోజు — బాధాకరమైన భావనతో కూడిన అనుభవం కలిగిన ఆరోజు- నేను ఎన్నటికీ మర్చిపోలేను. చర్చి సర్వీసులు, ఒప్పుకోలు ప్రకటనలు, ప్రార్థనలు పూర్తిగా అర్థమయ్యేవి. నాలో జీవితానికి అర్థం నాకు తెలియజేయబడుతోందన్న ఆనందం కలిగింది. కమ్యూనియన్ అంటే నాకు నేను ఇలా వివరణ ఇచ్చుకున్నాను — క్రీస్తుని జ్ఞప్తికి తెచ్చుకోవడం, పాపం నుండి శుద్ధి పొందడం, క్రీస్తు బోధనలకు పూర్తి అంగీకారం తెలపడం. పై వివరణ కృత్రిమము అనుకుంటే, నేను దాన్ని గమనించలేదు: ఒక సాధారణ, భయస్తుడైన మతాచార్యుని ముందు వినయ పూర్వకంగా అణకువతో నా ఆత్మను పరిశుద్ధం చేసుకుంటానికి, నా నేర ప్రకటనకు చాలా ఆనందించాను; ప్రార్థనలు రాసిన వినయ వంతులైన ఫాదర్ల ఆలోచనలతో కలిసిపోవడం నాకు ఆనందంగా ఉంది; నా వివరణలోని కృత్రిమత్వం గమనించలేదని — ఇంతకుముందు నమ్మిన, ఇప్పుడు నమ్ముతున్న వారందరితోనూ  కూటమి కట్టినందుకు నేను చాలా సంతోషించాను. కానీ నేను బలిపీఠ ద్వారాల వద్దకు వచ్చినప్పుడు — మత గురువు నాతో “నిజంగా నేను మింగేది రక్త మాంసాలు అని నమ్ముతున్నాను” — అని చెప్పించినప్పుడు నా గుండెల్లో నొప్పి కలిగింది: అది మోసపూరితమైనదే కాక, విశ్వాసం అంటే ఏమిటో ఎరుగని వారు చేసే క్రూరమైన డిమాండ్ గా అనిపించింది.

                   అది క్రూరమైన డిమాండ్ అని ఇప్పుడు చెప్పడానికి ఒప్పుకుంటున్నాను. అప్పుడు నేను అలా అనుకోలేదు: చెప్పలేనంత బాధ కలిగింది  ‘జీవితంలో అంతా స్పష్టంగా ఉంది’ — అని నా యుక్త  వయసులో అనుకున్న స్థితిలో నేను ఇప్పుడు లేను. నేను విశ్వాసం లోనికి ఎందుకు వచ్చానంటే — విశ్వాసం కాకుండా — విధ్వంసం, వినాశనము తప్ప నాకు ఇంకేమీ కనబడలేదు; అందుచేత ఆ విశ్వాసం త్రోసి పుచ్చడం అనేది అసాధ్యం. కనుక లొంగిపోయాను. నా అంతరాత్మలో ఒక భావన ఇది సహించడానికి తోడ్పడిందని నేను కనుగొన్నాను. అది ఒక రకంగా స్వీయ అవమానము మరియు వినయం అని చెప్పుకోవచ్చు. నేను వినమృడిని అయ్యాను. ఎలాంటి దైవదూషణ భావాలు లేకుండా రక్త మాంసాలు మింగాను. విశ్వాసం కావాలని కోరుకున్నాను. కానీ ఇప్పుడు ఒక దెబ్బ తగిలింది. నాకోసం ఏది వేచి ఉందో తెలిసి రెండోసారి వెళ్లలేకపోయాను.

Also read: దైవంకోసం వెతుకులాట

                         నేను చర్చి కర్మలు పూర్తి చేయసాగాను. నేను అనుసరించే సిద్ధాంతం సత్యాన్ని కలిగి ఉందని ఇంకా నమ్మాను. కానీ — అప్పుడు వింతగా ఉన్నా  ఇప్పుడు అర్థమైన ఒక విషయం జరిగింది.

                        దేవుని గురించి, విశ్వాసం, జీవితం, మోక్షం గురించి ఒక చదువు లేని రైతు యాత్రికుడు చేసే సంభాషణ నేను విన్నాను. అప్పుడు విశ్వాసం యొక్క జ్ఞానము నాకు తేటతెల్లమైంది. నేను ప్రజల వైపుకు  తీసుకురాబడ్డాను; జీవితం , విశ్వాసాల గురించి వారి అభిప్రాయాలు వింటూ — ఇంకా ఎక్కువ సత్యాన్ని అర్థం చేసుకున్నాను. అలాగే నాకు ఇష్టమైన ‘ పావన చరితుల ‘ జీవితాల గురించి పుస్తకాలు చదివినప్పుడు కూడా సత్యం బోధపడింది. మహిమలను — ఆలోచింపజేసే కల్పిత కథలుగా పక్కనపెట్టినా — ఈ పుస్తక పఠనం నాకు

జీవితం యొక్క అర్ధాన్ని బహిర్గతపరిచింది. మెకారస్ ది గ్రేట్, బుద్ధుని కథలు (వారి జీవితాలు), సెయింట్ జాన్ క్రిసోస్టోమ్ పలుకులు, ఓ పాదచారుని నూతిలో అనుభవం గురించిన కథ, బంగారం కనుగొన్న మునియొక్క కథ, పీటర్ ది పబ్లికన్ కథ; ఇవేగాక అమరవీరుల కథలు — జీవితానికి మరణం నుండి మినహాయింపు లేదు అని చెబుతాయి. అవేగాక అజ్ఞానులు, తెలివి తక్కువ వారు, చర్చి బోధనల గురించి ఏమీ తెలియని వారు — తెలియకపోయినా వారు కూడా రక్షింపబడ్డారు అని చాటి చెప్పే కథలు

— ఈ పై పుస్తక పఠనం అంతా నాకు జీవితం యొక్క అర్ధాన్ని బాగా తెలియ చెప్పింది.

                         కానీ ఎప్పుడైతే పండితులైన విశ్వాసులని కలిశానో, వారి పుస్తకాలు చదివానో, నా మీద నాకు సందేహము, అసంతృప్తి, ఆగ్రహంతో తర్కించడం — ఇవన్నీ నాలో తలెత్తాయి. వీరి ప్రసంగాల యొక్క నిజమైన అర్థం ఎప్పుడైతే నాకు తెలిసిందో — నేను సత్యం నుండి దారి తప్పి ఒక అగాధంలో  పడిపోయిన భావన కలిగింది.

Also read: శ్రమజీవుల జీవితాలే సార్థకం

                 ————-  —————–

Dr. C. B. Chandra Mohan
Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles