Thursday, December 8, 2022

సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కుల (STPI) ఏర్పాటులో అన్యాయంపైన కేంద్రానికి కేటీఆర్ లేఖ

 • కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు మంత్రి కేటీఆర్ లేఖ
 • కేంద్రం ప్రకటించిన 22 నూతన సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ అప్ ఇండియా (STPI) లో తెలంగాణకు ఒక్కటి కేటాయించకపోవడం పట్ల కేటీఆర్ ఆవేదన
 • కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తెలంగాణ యువత ఉపాధి అవకాశాలకు తీవ్ర విఘాతం
 • ఇప్పటికే హైదరాబాద్ ఐటీఐఆర్ రద్దు చేసి ఇక్కడి యువత మరియు ఐటీ రంగానికి అన్యాయం చేసిందన్న కేటీఆర్
 • ఐటీ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న తెలంగాణపై కేంద్రం వివక్ష
 • ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్,గుజరాత్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా, బీహార్, పంజాబ్, జార్ఖండ్, కేరళ లకు 22 ఎస్టిపిఐలను కేటాయించిన కేంద్రం
 • తెలంగాణ ఇప్పటికే ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించేందుకు చేపట్టిన కార్యాచరణను తన లేఖలో వివరించిన కేటీఆర్
 • ఐటీ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి ఎస్టిపిఐలను కేటాయించాలని కోరిన కేటిఅర్
 • కేంద్రం ప్రకటించిన సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కుల కేటాయింపులో సంపూర్ణంగా తెలంగాణకు అన్యాయం చేయడం కేంద్ర వివక్షపూరిత వైఖరికి నిదర్శనమన్నారు.
 • దేశంలో అంతర్భాగమైన తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధిస్తే, అది దేశ హితానికి, పురోగతికి తోడ్పడుతుందన్న ఆలోచనను, విశాల దృక్పథాన్ని కేంద్రం అంగీకరించాలి
 • తెలంగాణ రాష్ట్రానికి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులను కేటాయించే విషయాన్ని పునఃపరిశీలించాలని కోరారు.

 సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ అఫ్ ఇండియా కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని మంత్రి కె. తారకరామారావు అన్నారు. కేంద్రం తాజాగా ప్రకటించిన సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కుల్లో (ఎస్టిపిఐ) ఒక్కటంటే ఒక్క దాన్ని తెలంగాణకు కేటాయించక పోవడం పట్ల మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్,గుజరాత్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా, బీహార్, పంజాబ్, జార్ఖండ్, కేరళలకు 22 ఎస్టిపిఐలను కేటాయించిన కేంద్రం తెలంగాణకు ఒక్కటంటే ఒక్కదాన్ని కేటాయించకపోవడం తీవ్రమైన అన్యాయమన్నారు. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.

తెలంగాణ రాష్ట్రం, దేశ ఐటి పరిశ్రమలో అద్భుతంగా రాణిస్తున్న రాష్ట్రాలలో ఒకటని, జాతీయ సగటు కన్నా ఎక్కువ వృద్ధిరేటును గత కొన్ని సంవత్సరాలుగా నమోదు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. 2014-15 వ సంవత్సరానికి 57,258 కోట్ల రూపాయలున్న  ఐటీ ఎగుమతులు తాజాగా 1,45,522 కోట్ల రూపాయలకు పెరిగాయని, ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య కూడా రెట్టింపై 6,28,000 పైగా పెరిగిందని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. దీంతోపాటు భవిష్యత్తు వృద్ధిని చాటే కమర్షియల్ ఆఫీస్ స్పేస్ విషయంలోనూ తెలంగాణ బెంగళూరును పదే పదే దాటుతున్న విషయాన్ని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఐటీ పరిశ్రమ అభివృద్ధి కోసం అనేక పాలసీ పరమైన నిర్ణయాలు తీసుకుందని, ఎలక్ట్రానిక్, రూరల్ టెక్నాలజీ, ఇమేజ్, డేటా సెంటర్ వంటి వివిధ రంగాలకు ప్రత్యేకమైన పాలసీలతో ఐటీ రంగ అభివృద్ధిని సాధిస్తున్న విషయాన్ని, అయా పాలసీలకు దేశవ్యాప్తంగా దక్కుతున్న ప్రశంశలను మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తన లేఖలో ప్రస్తావించారు. 

అంతర్జాతీయ ఐటీ హబ్ గా హైదరాబాద్

హైదరాబాద్ దేశ ఐటీ రంగం లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఒక ప్రముఖమైన ఐటీ హబ్ గా మారిందని, హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీలు అనేకం పెద్ద ఎత్తున కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంతోపాటు ద్వితీయ శ్రేణి మరియు తృతీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం పాలసీ పరమైన నిర్ణయాలతో పాటు మౌళిక వసతుల కల్పనకు కూడా చేస్తున్న విషయాన్ని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం ఆయా పట్టణాలు ఏర్పాటు చేసిన ప్లగ్ అండ్ ప్లే మౌలిక వసతులను వినియోగించుకొని వివిధ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించిన విషయాన్ని కేంద్ర మంత్రికి తెలియజేశారు.

ఇప్పటికే ఐటీఐఆర్ రద్దు చేసి తీరని అన్యాయం

 ఇంత పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమతో, పాటు ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ పరిశ్రమ విస్తరిస్తున్న నేపథ్యాన్ని పట్టించుకోకుండా, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కుల కేటాయింపుల్లో తెలంగాణను పరిగణలోకి తీసుకోకపోవడం, ఇక్కడి యువత ఉపాధి అవకాశాలను కేంద్ర ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసిందన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ -ఐటీఐఆర్ రద్దు చేసి, తెలంగాణ ఐటీ రంగానికి, యువతకి తీరని ద్రోహం చేసిన విషయాన్ని తన లేఖలో మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. ఈ ఐటీఐఆర్ పునరుద్ధరణ కోసం గౌరవ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గారు స్వయంగా ప్రధాని మోడీని కలిసినా,  ఐటీ మంత్రిగా తాను, తమ ఎంపీల బృందం పదేపదే కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తులు చేసినా, ఇప్పటిదాకా ఎలాంటి స్పందన లేదన్నారు. పైగా ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కుల కేటాయింపులో సంపూర్ణంగా తెలంగాణకు అన్యాయం చేయడం కేంద్ర వివక్షపూరిత వైఖరికి నిదర్శనమన్నారు.

తెలంగాణ ప్రగతి దేశహితమే కదా!

 దేశంలో అంతర్భాగమైన తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధిస్తే, అది దేశ హితానికి, పురోగతికి తోడ్పడుతుందన్న ఆలోచనను, విశాల దృక్పథాన్ని కేంద్రం అంగీకరించి, తెలంగాణ రాష్ట్రానికి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులను కేటాయించే విషయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ పట్టణాలకు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులను కేటాయించాలని కేంద్ర మంత్రిని కేటీఆర్ కోరారు.

సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles