Monday, February 26, 2024

కేసీఆర్ నామస్మరణతో ముగిసిన బిజెపి జాతీయ కార్యవర్గం

చలసాని నరేంద్ర 

కరోనా మహమ్మారి కారణంగా పూర్తిస్థాయిలో రెండేళ్లకు పైగా సమావేశం కాలేకపోయినా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో జులై 2, 3 తేదీలలో జరిగిన తీరు గమనిస్తే కేంద్రంలోనే కాకుండా, దేశంలో మూడింట రెండు వంతుల మేరకు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రపంచంలోనే పెద్దదైన ఓ రాజకీయ పార్టీ సభలవలె కనిపించలేదు. 

Also read: ఎమర్జెన్సీ నాటి కన్నా ప్రమాదంలో ప్రజాస్వామ్యం… లోపించిన నైతిక నాయకత్వం

హైదరాబాద్ లో జరుగుతూ ఉండడం, వచ్చే ఏడాది  ఇక్కడ అసెంబ్లీ  ఎన్నికలు జరుగుతూ ఉండడంతో సహజంగా తెలంగాణలోని రాజకీయ పరిస్థితులను ప్రస్తావించి, ఇక్కడ అధికారంలోకి వచ్చే మార్గాలపై దృష్టి సారింప వచ్చు. కానీ మొత్తం సమావేశాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నామస్మరణతో జరిపినట్లు వివిధ నాయకుల ప్రసంగాల తీరు స్పష్టం చేసింది. 

సమావేశాలకు ముందుగా మూడు రోజులపాటు తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాలలో ఒక్కక్క చోటకు ఒక్కరు చొప్పున జాతీయ నాయకులు జరిపిన పర్యటనలో సహితం అదే ధోరణి కనిపించింది. కేసీఆర్ ను  నిందించడంలో సహితం అమిత్ షా నుండి అందరి ప్రసంగాలు ఒకే మూసలో ఉండడం గమనిస్తే పెద్దగా `హోమ్ వర్క్’ చేసినట్లు కనిపించదు. 

కేవలం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రమే కేసీఆర్ పేరు గాని, తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావన గాని ఎక్కడా తేకుండా తెలంగాణలో కేంద్రం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను మాత్రమే  బహిరంగ సభలో ప్రస్తావించారు. కార్యవర్గ సమావేశాలలో కూడా సంస్థాగతంగా పార్టీని పోలింగ్ బూత్ స్థాయి  కార్యకర్తలపై దృష్టి సారించి పటిష్ఠపరచు కోవాలని, హిందువేతరులలో అట్టడుగున ఉన్న ప్రజలకు చేరుకోవాలని అంటూ హితబోధ చేశారు.

Also read: హార్దిక్ పటేల్ గుజరాత్ లో బీజేపీని గట్టెక్కిస్తారా? 

ఈ సందర్భంగా  తెలంగాణపై ఓ భారీ ప్రకటన చేశారు. దానిని కార్యవర్గం తీర్మానంగా కాకుండా,  కనీసం కార్యవర్గం ఆమోదించిన పరంగా కూడా కాకుండా, ఓ ప్రకటన అంటూ విడుదల చేశారు. అందులో సహితం నిర్దుష్టమైన అంశాలను ఏవీ లేవు. తమ భవిష్యత్ ప్రణాళికలు గాని, తెలంగాణ ప్రజలకు నిర్దుష్టమైన హామీలు గాని లేకుండా కేసీఆర్ ప్రభుత్వాన్ని దూషించడంలో మాత్రమే  మునిగిపోయారు. 

కేసీఆర్ పై దూషణలపై ప్రధానంగా ఫోకస్ పెట్టడంతో కార్యవర్గం సమకూడించిన రాజకీయ తీర్మానం అసలు ప్రజల దృష్టికి రాకుండా మరుగున పడిపోయింది. కేసీఆర్, ఆయన ప్రభుత్వం అవినీతి పరుడని గత కొన్నేళ్లుగా రాష్ట్ర, కేంద్ర బిజెపి నాయకులు విమర్శలు కురిపిస్తున్నారు. కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. 

అయితే, కేంద్రంలో ఉన్న అధికార పక్షంగా అవినీతిపై ఎటువంటి చర్యలు తీసుకొంటున్నారు? ఈ అంశంపై బిజెపి నాయకులు ఎవ్వరూ సమాధానం  చెప్పే సాహసం చేయకపోవడం గమనార్హం. కొద్ది నెలల క్రితం వరకు కేసీఆర్ అవినీతి చిట్టా కేంద్రం వద్ద ఉన్నదనీ, కేంద్ర ఏజెన్సీల వద్ద ఉన్న పత్రాలు చూశాననీ, నేడో- రేపో కేసీఆర్, ఆయన కుటుంభం సభ్యులు జైళ్లకు వెళ్లడం ఖాయం అంటూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చెబుతూ వచ్చారు. 

అయితే ఈ మధ్య ఆయన జైలు విషయం అసలు ప్రస్తావించడం లేదు. కొద్దీ నెలల క్రితం దమ్ముంటే తనను జైలులో పెట్టమని కేసీఆర్ ఢిల్లీ నుండే సవాల్ చేశారు. బీజేపీ నాయకులు ఎవ్వరు సమాధానం చెప్పే ప్రయత్నం చేయలేదు. 

కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలోనే అక్కడ విద్యుత్ ఉత్పత్తి లేకుండా, కేంద్ర పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి ఋణం తీసుకున్నారని, వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవచ్చని, ఈ విషయం ఆధారాలతో సహా స్వయంగా ప్రధానికి అందజేశానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్దీ రోజుల క్రితం చెప్పారు. ప్రధాని ఆసక్తిగా విని, మరిన్ని వివరాలు అడిగారు గాని ఎటువంటి చర్య  లేదని ఆయన వాపోయారు. 

Also read: ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ సరే…. ఇదంతా నడిపించింది ఎవ్వరు?

ఓ దేశ ప్రధాని ఓ బహిరంగ సభలో మాట్లాడుతున్నారంటే దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యలను,  తాజా పరిణామాలను ప్రస్తావించి తమ ప్రభుత్వం తీసుకోబోయే చర్యలను వివరిస్తారని ఎవరైనా ఆశిస్తారు. కానీ ఎప్పటివలెనే కీలక అంశాలపై ఆయన మౌనమే వహించారు. 

ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తుందని బిజెపి అగ్రనేతలంతా ధీమా వ్యక్తం చేశారు. అయితే,  తాము అధికారంలోకి వస్తే తమ ప్రాధాన్యత అంశాలు ఏమిటో వివరించే ప్రయత్నం చేస్తారని చూస్తాము. అటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. 

సమావేశాల ముందు కొద్దీ రోజుల నుండి కేసీఆర్, కేటీఆర్  కీలకమైన పలు అంశాలను ప్రశ్నల రూపంలో లేవనెత్తారు. సంజయ్ వంటి నాయకులు సహితం ఎదురు దాడులతో నోరుమూయించే ప్రయత్నం తప్పా తార్కికంగా లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పిన దాఖలాలు లేవు. 

కేసీఆర్ మాటల మాంత్రికుడిని పేరు. తన వాదనలతో ఎంతటివారినైనా ఆకట్టుకొంటారని చెబుతుంటారు. ఆ విధంగా ప్రధాని మోదీపై, బిజెపిపై గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్యకాలంలో మాటల దాడులు చేస్తూ వ్యూహాత్మకంగా కీలక రాజకీయ అంశాల నుండి ప్రజల దృష్టి  మళ్లించే ప్రయత్నం చేస్తున్నారా? ఈ ఉచ్చులో బిజెపి నాయకులు చిక్కుకొంటున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

కార్యవర్గ సమావేశాలలో రాజకీయ తీర్మానం ప్రవేశపెడుతూ కేవలం అమిత్ షా మాత్రమే బిజెపి రాజకీయ లక్ష్యాలను సవివరంగా వివరించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణ,  ఒడిశా, పశ్చిమ బెంగాల్ లలో అధికారంలోకి రావడం; కేరళ, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో బలపడేందుకు ప్రయత్నించడం అని వివరించారు. 

నాయకులందరూ కేసీఆర్ నామస్మరణతో మునిగిపోవడంతో ఇటువంటి కీలకమైన రాజకీయ లక్ష్యాలకు తగినంత ప్రాధాన్యత ప్రజల దృష్టిలో చేరేటట్లు చేయలేక పోయిన్నట్లు కనిపిస్తున్నది. సాధారణంగా ఓ పార్టీ జాతీయ స్థాయి నాయకులు ఒకే వేదికకి వస్తే ఒకొక్కరు ఒకొక్క నిర్ధుష్టమైన అంశంపై ప్రసంగిస్తుంటారు. 

కానీ బిజెపి బహిరంగసభలో యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా, జెపి నడ్డల నుండి రాష్ట్రస్థాయి నాయకుల వరకు అందరు కేసీఆర్ గురించే మాట్లాడారు. ఇతర ప్రాధాన్యత కలిగిన అంశాలను ఎవ్వరు ప్రస్తావించలేదు. కనీసం రాజకీయ,  ఆర్ధిక తీర్మానాలను చదివినా కనీసం బిజెపి శ్రేణులకు అయినా మంచి సమాచారం ఇచ్చిన్నట్లు ఉండెడిది. 

Also read: ఏళ్లయినా మిస్టరీగా మిగిలిన రాజీవ్ గాంధీ హత్య

Narendra Chalasani
Narendra Chalasani
రచయిత సీనియర్ జర్నలిస్టు, మానవ హక్కుల కార్యక్రమాలలో క్రియాశీలక భాగస్వామి. ప్రజాస్వామ్య, ఉదారవాద విలువల పట్ల ప్రగాఢమైన విశ్వాసం కలవారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles