Friday, April 26, 2024

కొంతమంది సమకాలీన భారతీయ ఆంగ్లకవుల కవితల పర్యావలోకనం

రామానుజన్, అరుంధతీ సుబ్రమణియన్

కళ దేశ కాలాలకు అతీతమైoది. ఆందులో ఓ ముఖ్య భాగమైన కవిత్వం కూడా అవధులు లేనిది. ఆంగ్లం మాతృభాషగా కలిగిన వారేకాక మరెందరో ఆ భాషలో ప్రావీణ్యం సంపాదించి చక్కటి రచనలు చేశారు. అలాంటి వారిలో భారతీయ కవులు ఎవరికీ తీసిపోని ప్రత్యెక స్థానం సంపాదించుకున్నారు. రవీoద్రనాద్ ఠాకూర్ నుండి నేటి వరకు అనేక మంది భారతీయులు తమ రచనలతో ఆంగ్ల కవిత్వాన్ని సంపన్నం చేశారు. సృజనాత్మకత, వాసితో పాటు రాశి, భాషా పాటవం మనవారి ఆంగ్ల కవిత్వాన్ని ప్రత్యేక సాహిత్యంగా ప్రపంచం ముందు నిలబెట్టింది. అరవింద ఘోష్, పార్థ సారధి, డోమ్ మొరెస్ , కమలా దాస్, మైఖేల్ మధుసూదన్ దత్, తోరు దత్, సరోజినీ నాయుడు, మీనా కందసామి లాంటి లబ్ధ ప్రతిష్టులైన అనేకమంది ప్రముఖ కవులను వదలి కొందరిని మాత్రమె ఈ చిన్ని విహంగ వీక్షణ వ్యాస పరిధిలో పొందుపరచడం జరిగింది. 

ఏకె రామానుజన్

మైసూరు వాసి ఎ కె రామానుజం “ఎ రివర్” అనే కవితలో మధురైలోని నది గురించి వర్ణించారు. ఆ దేవాలయాల నగరoలో జీవనదిగా భావించబడే నదీ తీరాన వేసవి కాలంలో ఇసుక తిన్నెలు బయట పడినపుడు కవులెవరూ దానిని పట్టించుకోరు. కాని వరదలతో నది నిండినపుడు పాత, కొత్త కవులందరూ నది అందాన్ని వర్ణిస్తూ కవిత్వం రాస్తారు. వరదలో కొట్టుకు పోయిన మూడు ఇళ్ళ గురించి, ఒక గర్భిణి గురించి, గోపి, బ్రింద అనే పేర్లు కలిగిన రెండు ఆవుల గురించి ఎవరూ పట్టించుకోరు. అది అక్కడ ప్రతి సంవత్సరం జరిగేదే అనేస్తారు. విశేషమేమిటంటే ఆవుల పేర్లు తెలుసు వారికి. కాని చనిపోయిన గర్భిణి పేరు మాత్రం తెలియదు. మానవత్వం, సాంఘీక బాధ్యత లేని కవుల నిర్దయను ఎండగట్టారు రామానుజం ఈ కవితలో.

నిస్సిం ఏజేకియల్

 నిస్సిం ఎజేకియల్ “నైట్ అఫ్ ది స్కార్పియన్” అనే కవితలో భారతీయ జీవితాన్ని ప్రతిబింబించే దృశ్యాన్ని ఆవిష్కరిస్తారు. ఒక వర్షం రాత్రి తేలు ఓ ఇంట్లోదూరి, తల్లిని కుట్టి భయంతో బయటకు పారిపోతుంది. పొరుగు వారందరూ వచ్చేస్తారు. ఆ తేలు కదిలితే తల్లి శరీరంలో విషం ఎక్కుతుందని వారి భావన. ఈ జన్మలో ఆవిడ బాధ పూర్వ జన్మల పాప ఫలితo అనుకుంటారు. కాకపోతే భవిష్యత్తులో ఆవిడ చెయ్య బోయే పాపాలకు ఇప్పుడే పరిహారం చెల్లిస్తుందనుకుంటున్నారు. పునర్జన్మ మీద నమ్మకం కలిగిన వారి దృష్టిలో పుట్టుక ముందు, చావు తర్వాత కూడా జీవితం ఉంది. కాబట్టి వారు ప్రశాoతంగా అక్కడ కుర్చుంటారు. కాని హేతువాదిగా భావించబడే అమె భర్త మంత్ర తంత్రాలన్నీవాడి అవి పనిచేయక చివరకు ఆవిడ కాలిమీద మైనం పోసి అగ్గిపుల్లతొ వెలిగిస్తాడు. సగటు భారతీయుడిలా అతనికి నిజంగా హేతువాదం కాని మరొకటిగాని పూర్తిగా నమ్మకం లేదన్న విషయం నిరూపిత మవుతుంది. చాలా గంటల తర్వాత తల్లి నొప్పితగ్గినపుడు ఆమె అంటుంది, ‘దేవుడి దయవల్ల ఆ తేలు నా బిడ్డలను కుట్ట లేదు’ అని. ఈ కొస మెరుపుతో ఈ కవిత భారతీయుల నమ్మకాల గురించా లేక తల్లి ప్రేమ గురించా అనే ఆలోచనలో పడేస్తాడు కవి మనల్ని.   

జయంత్ మహాపాత్ర

ఒరిస్సాకు చెందిన అధ్యాపకులు,సాహిత్య అకాడమి బహుమతి పొందిన జయంత్ మహాపాత్ర కవిగా పేరెన్నికగన్నవారు. అతను రాసిన “హంగర్” అనే కవితలో మనిషి విలువలు కోల్పోయి ఆకలి కారణంగా ఎలా పతన మవుతాడో వివరించారు. కవి సముద్ర తీరాన ఒక చేపలు పట్టేవాడిని కలుస్తాడు. అతడి వల ఖాళీగా వుంటుంది. చేపలు పట్టేవాడి బక్క పలచని పదిహేనేళ్ళ కూతురు అక్కడే వుంటుంది. తమ ఆకలి తీర్చుకోడానికి తన బిడ్డను కవి కామ దాహానికి వాడుకోమని చెప్పి అవతలికి పోతాడు ఆ తండ్రి. తన గుడిసె తీరు వాళ్లకు ఈ విషయం కొత్త కాదని తెలియజేస్తుంది. వారి దీనావస్థను చూసి కూడా తన కోరికను ఆపుకోలేక గుడిసెలోకి పోతాడు కవి. ఒక వైపు ఆకలిని, మరొకవైపు కామ దాహాన్ని మేళవించి మనషి విలువలు పోగొట్టుకునే సందర్భాలను చూపారు మహాపాత్ర.

కేకి దారూవాలా

పెద్ద పోలీసు అధికారి అయిన కేకి దారువాలా ప్రసిద్ధ కవి. “మైగ్రేషన్స్” అనే కవితలో వలస పోవడం ఎంత కష్టమో వివరిస్తారు. వలసలకు కారణాలు కరువు, అంటూ రోగాలు, యుద్ధం లాంటివి. కాలక్రమేణా స్వంత ప్రాంతాలకు పరాయి వాళ్ళమైపోతాము. అది మనసును బాధించే విషయం. అలాగే గతం గురించిన ఆలోచన మనల్ని విచారంలో ముంచేస్తుంది. చిన్నతనంలో అమమ్మతో ఎంతో సంతోషంగా ఉన్నా, ఆవిడ ఇప్పుడు గుర్తు లేదు. అలాగే ఇప్పుడున్న అమ్మ మరికొంత కాలానికి గుర్తు లేకుండా పోతుంది. ఏ మనిషీ కాలాన్ని వెనక్కి తీసుకెళ్ళలేడు. ఒక ప్రాంతంనుండి మరొక ప్రాంతానికి కదలి వెళ్ళడం, ఒక కాలం నుండి మరొక కాలానికి కదలకుండానే వెళ్ళడం, శారీరక, మానసిక వలసలు. ఈ రెండు రకాల వలసలను, బాదాకరమైనవి అయినా, తప్పనివంటూ వివరిస్తాడు కవి.

శివ్ కె కుమార్

గొప్ప గురువుల విద్యార్ధి, ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలలో ఆచార్యులైన శివ్ కె కుమార్ ప్రముఖ సాహితీవేత్త. “ఇండియన్ విమెన్” అనే కవితలో నిన్నటి గ్రామీణ భారతంలో స్త్రీ స్థానం గురించి వివరిస్తారు. ఆమె మూడు రకాలుగా బాధ అనుభవిస్తుంది. మొదటిది దరిద్రం. తను మట్టి గోడల ఇంట్లో ఉంటుంది. భర్తపై ఆధార పడిన తనకు ఏ విషయం గురించి కోప్పడే అర్హత లేదు. పురుషాధిక్యానికి లొంగి ఉండాల్సిందే. రెండవది ఎంతో దూరం వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవలసి రావడం. తన చర్మం మాడుతున్నా బావి దగ్గర ఖాళీ కుండలా తనవంతు వచ్చే వరకు ఆగి నీళ్ళు చేదుకోవడం, చికటిపడే వరకు భర్త కోసం ఎదురు చూడడం తప్పదు. మూడవది తన తోడమీది పచ్చబొట్టు. తాను ఎవరికీ స్వంతమో తెలియచేసే పశువుల మీద వేసే ముద్ర లాంటిది. కిమ్మనకుండా భర్త కోరిక తీర్చడానికే తను అంకితం. చదువు, ఆర్ధిక స్వాతంత్ర్యం లేని స్త్రీ మనసు, మెదడులేని ఓటికుండలా సమాజంలో చూడబడిన విషయాన్ని చక్కగా వివరించారు కవి.

జీత్ తాయిల్

కేరళ వాసి జీత్ తాయిల్ కవి, నవలాకారుడే కాక సంగీతకారుడు కూడా. సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు అనేక ఇతర అవార్డులు పొందారు. రెండు కవితా సంకలనాలను వేలువరించారు. “పెనిటెంట్” అనే కవితలో ఆధునిక జీవనంలో మనుషుల మధ్య సయోధ్య లేక ఎంత సతమత మవుతున్నారో వివరించారు. ఈ  కవితలో ఒక మనషి తన గదిలోని వస్తువులతో మాట్లాడుతుంటాడు. తను తన భార్య నుండి దూరమై ఒంటరి బ్రతుకు బ్రతకలేక ఈ స్థితి వస్తుంది. తను సంతోషంగా ఉన్నట్లు తనకు తనే చెప్పుకునే విఫల ప్రయత్నం చేస్తాడు ఆతను. స్వార్ధం పెరిగి ప్రక్క మనిషిని పట్టించుకోని, స్త్రీని గౌరవ భావంతో చూడని మనస్తత్వంతో నేటి మనషి పడే అవస్థను వివరిస్తాడు కవి. మానవ సంబంధాలు విచిన్న మవుతున్న నిత్య నిజ జీవితానికి అద్దం పడతాడు.  స్త్రీ స్వాతంత్ర్యోద్యమాన్ని బలంగా ముందుకు నెట్టే ప్రయత్నం కనిపిస్తుందిక్కడ. 

అరుంధతీ సుబ్రహ్మణ్యం

అరుంధతి సుబ్రహ్మణ్యం ప్రసిద్ధ కవయిత్రి. తను రాసిన పుస్తకాలు అనేక భాషల్లోకి అనువదించ బడ్డాయి. జాన్ కీట్స్ కవిత్వంలో కనిపించే ‘అస్థిరరతతో మనగలగడం’  (నెగటివ్ కేపబిలిటి) ఈవిడ కవిత్వంలోనూ కనిపిస్తుంది. జవాబు లేని ప్రశ్నలతో ఇబ్బంది పడకుండా ఉండగలగడం అపురూపమైన విషయం. దానికి ఎంతో ఆత్మ సంయమనం కావాలి. తను ఈ లోకంనుండి పోయేటప్పుడు తన ఉనికిని సూచించే ఏ జాడలు కోరుకోకపోవడం నిజమైన భక్తి లక్షణం అంటుందీ కవయిత్రి. అంటే నిజమయిన భక్తుడు ఏ కోరిక లేకుండా ఉంటాడు. చివరికి దేవుడికి దగ్గరవ్వాలనే కోరిక కూడా ఉండదు. సద్గురు ఆత్మకధను రాసిన ఈవిడ పరిపక్వత మనకు ఈ కవితలో కనిపిస్తుంది. “స్ట్రాటజిస్ట్” అనే మరో కవితలో మన శరీరానికే కాక మనసుకు కూడా శ్రమ ఉండాలి, లేకపోతే అవి జబ్బు పడతాయంటారు. భయం, అసూయ లాంటి వాటినుండి మనం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండి మనల్ని మనం రక్షించు కోవాలంటారు.

త్రిషాని దోషి

త్రిషాని దోషి చెన్నైకి చెందిన ప్రఖ్యాత కవయిత్రి. తన కవిత్వంలో ఆధునిక పోకడైన ప్రతీకాత్మకత కనిపిస్తుంది. వాటిద్వారా మామూలు పదాల్లో సూటిగా చెప్పలేని అనేక విషయాలు చెప్ప గలుగుతారు. “రైన్ ఎట్ త్రి” అనే కవితలో వర్షం వచ్చి పరుపు దిండు తడిశాయంటారు. ‘నిన్న తీసిన కలుపు’ అంటే గతంలోని చేదు జ్ఞాపకాలు మనసులోనుండి తొలగించే ప్రయత్నం. కాల గమనంలో అవి మరుగున పడతాయి. కాని అంత వరకు వాటిని మోయకుండా పయత్న పూర్వకంగా వాటిని వదిలించుకోవడం మంచిది. మన శరీరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకున్నట్లుగా మనసులోని అనుభూతులను  తొలగించు కోవాలి. కాని మన శరీరం చెక్కది కానట్లుగానే మనసు కూడా ఏ అనుభూతులు లేని చెక్క కాదు. కాబట్టి అంతర్ముఖులమై పూరేకుల్లాంటి అనేక సద్భావనలను ఏరుకోవాలి. జీవితచక్రంలో మొదట విడదీసి చూసు కోవడం ఆ తరువాత కలుపేసుకోవడం, వియోగం తరువాత సంయోగం సహజo. ఆధ్యాత్మిక మార్గంలో ఇలాగే ముందుకు సాగుతారు.

రష్మా రమేష్

రేష్మా రమేష్ దేశ విదేశాల్లో తన కవితలు వినిపించిన ప్రతిభాశాలి. తన కవితలు దేశంలోనూ వేలుపలా అనేక భాషల్లోకి తర్జుమా చేయ బడ్డాయి. “స్మాల్ హాండ్స్ అఫ్ శివకాశి’ అనే కవితలో చిన్న పిల్లలు టపాకాయలు తయారు చేసే వృత్తిలో హానికరమైన రసాయనాలు వాడడం చూసి బాధ పడుతుంది. జనం ఈ టపాకాయలు వాడడం ద్వారా బాల కార్మిక వ్యవస్థను పోషించిన్ వాళ్ళవుతున్నారు. మరి కొన్ని కవితలలో ఈ రచయిత్రి ఒంటరితనంతో, తీరని కోరికలతో మూగ బోయినట్లుగా అనిపిస్తుంది. “ఒలింపస్” అనే కవితలో తనకు అన్నీ ఎంతో ఇష్టమైనవి దొరుకుతాయి. తన హృదయం వాటిని వదలి రాకూడదంటారు. ‘అరచేతిలో నదిని మడచి పెట్ట’మనడం, తన ‘ఛాతీపై కొండ నిద్ర లేవడం’ లాoటి భావోద్వేగాలు తన కవిత్వంలో కనుపిస్తూ ఉంటాయి.

Also read: ‘‘అభయం’’

అన్నపూర్ణ శర్మ

అన్నపూర్ణ శర్మ తన “వై డిడ్ హి స్టాప్ కమింగ్?” అనే కవితలో ఒక బిక్షగాడిజీవితానికి అక్షర రూపం ఇస్తారు. అతని గురించిన వర్ణన కళ్ళముందు అతని రూపాన్ని నిలబెడుతుంది. అతని కర్ర శబ్దం, చినిగి పోయిన బట్టలు, అతని బాధామయ జీవితం వివరించడం ఆంగ్ల నవలాకారిణి జేన్ ఆస్టిన్ ను  గుర్తు చేస్తుంది. ఆడవారికి మాత్రమె వీలయ్యే సానుభూతి, ఆర్ద్రత ఆమె కవితల్లో కనిపిస్తాయి. “వన్ డే ఐ విల్ రీచ్ యు” అనే కవితలో భావుకతతో ఆవిడ పైన్ చెట్లను కౌగిలిoచుకుంటా నంటారు. ‘ఎంబూజమింగ్’ అంటూ అర్ధవంతమైన పదాలను సృష్టిస్తారు. “సౌండ్స్” అనే కవితలో పంట కోసేవాడు, పావురం, యోగిని, ఈగలు చేసే శబ్దాలను కడుపులోని బిడ్డ చేసే శబ్దాలతో పోలుస్తారు. పుట్టకముందే బిడ్డను పోగొట్టుకున్న తల్లి ఆవేదనను తెలుపుతారు.

Mahati
ఎం వి సత్యనారాయణ (మహతి)

మహతి కలం పేరుతో  రచనలు చేసే ఎం వి సత్యనారాయణ అనేక సుప్రసిద్ధ రచనలు చేశారు. హిందూ ధార్మిక గ్రందాల ఆధారంగా గ్రంధాలు, సుదీర్ఘ కవితలు రాశారు. రామాయణంలోని సుందరకాండ ఆధారంగా ఫైండింగ్ ది మదర్ లో హనుమంతుడు లంకకు వెళ్లి సీతను వెదకడం ఇతివృత్తం. మాతృకలోని సౌoదర్యాన్ని ఆంగ్లంలోకి తీసుకురాగలగడం దీని పత్యేకత. ఇందులో శైలి సందర్భోచితంగా మిల్టన్ శైలిలా నారికేళ పాకం. గరికపాటి నరసింహారావుగారి రచనకు తన స్వేచ్చానువాదమైన ఓషన్ బ్లూస్ లో ఒక అలతో అనేక విషయాలపై తన అభిప్రాయాలను తెలియజేస్తారు. చoదస్సుపై తన పట్టును తెలియజేస్తుంది ఈ రచన. మరో రచన హరే కృష్ణ ఈయన భక్తికి నిదర్శనం. మరొక దీర్ఘ కవిత ది గాంజెస్ దివినుండి భువికి దిగిన గంగావతరణం గురించి. పై రెండిట్లోనూ శైలి కొంత సరళంగా ఉంటుంది. ఆదునిక కవిత్వ లక్షణాలైన ప్రతీకలు, సంకేతాలు, నర్మగర్భ పద ప్రయోగం ఈయన ఇతర రచనల్లోనూ కనిపిస్తాయి.

సత్యానంద్ సారంగి

ఒరిస్సా వాసి సత్యానంద్ సారంగి “ది గార్డెన్ అఫ్ లైఫ్” అనే కవితలో ఋతువులను మనిషి జీవితంలోని నాలుగు దశలతో పోలుస్తారు. వసంతం లాంటి బాల్యం ఎన్ని బాధలున్నా ఆనంద దాయకమే. కాని కవి తనకు వసంతం, వేసవి ఋతువులు లేవంటారు. (పశ్చిమ దేశాలవారికి వేసవి వెచ్చటి ఆనందకరమైన కాలం). శిశిరం, చలికాలాల్లో మంచు కురిసి మొక్క మొలవడానికి వీలుకాని స్థితి ఉంటుంది. బ్రతుకు సమాధిలా తయారవుతుంది. కాని దైవానుగ్రహంతో మనషి తిరిగి సంతోషంగా ఉండే స్థితి వస్తుందంటారు ఈ కవి.

Also read: “లాల్ బహదూర్ శాస్త్రి”

డాక్టర్ హెచ్ తులసి

డాక్టర్ తులసి హనుమంతు ఒక ప్రముఖ సాహిత్య పత్రికను నడిపిన సాహితీవేత్త.“ఆల్ దట్ గ్లిట్టర్స్ నీడ్ నాట్ బి గోల్డ్” అనే సందేశాత్మక కవిత చక్కటి సూర్యోదయ వర్ణనతో మొదలవుతుంది. కళ్ళలో బంధించిన నిద్రను విడుదలచేసి, దోమలు రాకుండా సూర్యుడు ఏర్పాటు చేసుకున్న మంచు తెరలు తొలగించుకుని బయటకురాగానే అతని భార్య ఆకాశం సంతోషంతో వెలిగి పోతుంది. వెండి బట్టలు వేసుకున్న సూర్యుడు పడమటికి తిరిగే సరికి రంగు రంగు బట్టలతో తమ బిడ్డ సాయంసంధ్యను అలంకరించి భర్త రాకకోసం ఎదురు చూస్తుంటే నీతి, విశ్వాసంలేని సూర్యుడు సముద్రం కౌగిట్లోకి వెళ్ళిపోయాడు. ఎంత అందమైన వర్ణన! అసలు సూర్యుడి గురించి ఈ ఆలోచనే అపూర్వం. ఈ కవితలో తన భాష, ఛందస్సుపై తన ప్రావీణ్యం చెప్పుకో తగినవి.

Also read: “అక్షర ధాం, ఢిల్లీ – అపరూప కళా ఖండం”

కాలంతో పాటు, మనషి జీవితంలోని మార్పులతో కవిత్వంకూడా మారుతూ వచ్చింది. క్లిష్టమైన అనుభవాలు సరికొత్త పుoతలు తొక్కించాయి ఆలోచనలను. ఏనాడూ జీవితాన్ని ప్రతిబింబించలేని, వ్యాఖ్యానించలేని పరిస్థితి రాలేదు కవిత్వానికి. కాని 16వ శతాబ్దం నుoడి 19వ శతాబ్డం వరకు ఉన్న ధోరణి మారి 20వ శతాబ్దం  నుండి సామాన్యులకు అర్దం కానంత క్లిష్టత చోటుచేసుకుంది. ప్రతీకలు, సంకేతాలు, నర్మగర్భ సందేశాలు కవిత్వంలో భాగమయ్యాయి. దీనికి అనుగుణంగా భాషలో మార్పులొచ్చాయి. ఛందో బద్దమయిన, కఠిన పదాలతో కూడిన భాష మారి చిన్న పదాలతోనే గంభీర భావనలను వెలువరించడం జరుగుతూంది. భావ క్లిష్టతకు భాషాక్లిష్టత తోడైతే జనం కవిత్వాన్ని చదవకుండా పక్కన పెట్టే వారు. ఇప్పటికే చాలామంది ఛందస్సును పెద్దగా పట్టించు కోవడం లేదు. రేపటి రోజున చిక్కటి ఆలోచనలను చక్కగా చెప్పే ప్రయత్నంలో దాన్ని పూర్తిగా వదలి వేయొచ్చు.

Also read: “కాశ్మీర్”

మంచి కవిత్వం మనిషి జీవితానికే ఓ అందం. సమయాన్ని రూకల్తో లెక్కించే సమకాలీన సమాజంలో మిగతా మాధ్యమాలకంటే కవితలు, కార్టూన్లే సంఘానికి సందేశాలను, అందాలను, ఆనందాలను పంచగల సాధనాలు. వీటిని ఇతోధికంగా అందించే ప్రయత్నం చేద్దాం.మన జీవితాలను, ప్రపంచాన్ని ఆనందమయం చేద్దాం.

Also read: “ఓట్ల పండగ”

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles