Monday, February 26, 2024

“కాశ్మీర్”

కాశ్మీర్ ను ‘భూతల స్వర్గం’గా వర్ణిస్తారు. ‘దేశీయ స్విcట్జర్లాండ్’గా భావిస్తారు. ఇవి రెండూ నిజమే అనిపిస్తుంది, కాశ్మీర్ ను వేసవిలోనూ, శీతాకాలంలోను చూసిన వాళ్ళకి. వేసవిలో ఇక్కడి పూలతోటలు, ఆపిల్ తోటలు, చినార్ చెట్లు కనువిందు చేసి భూతల స్వర్గంలా కనిపిస్తాయి. ముందు తరం హిందీ సినిమాల్లో కూడా అందరూ చూశారది. అంతటి అందం ఏ దేశంలోని ఏ ప్రాంతంలోను ఆనాడు కనిపించలేదు.  అలాగే శీతాకాలంలో మంచు కొండలు, మనుషులపై తుంపర్లు చల్లుతూ మెల్లిగా కదలే పల్చటి తెల్ల మేఘాలు, మంచులో అడుగు తీసి అడుగు వేస్తూ మంచు ముద్దలు విసురుకుంటూ ఆడుకునే పర్యాటకులు, గుర్రాలమీద మంచుకొండల్లో ప్రయాణం మరచిపోలేని అనుభూతుల్ని మిగిలిస్తాయి. జమ్మూ, కాశ్మీరు రాష్ట్రoలొ ఉగ్రవాదం మొదలైన తరువాత ముఖ్యంగా జమ్మూ ప్రాంతం, వారి స్థావరంగా మారిన తరువాత, కాశ్మీరు వదలి విదేశాల్లో సినిమాలు తీయడం మొదలైంది. కాశ్మీరీలకు ముఖ్య ఆదాయ ఒనరైన పర్యాటకం దెబ్బతింది.

Also read: “మహాభారతంలో శకుని”

ఖడ్గాల్లా కనిపించిన హిమశిఖరాలు

డిసెంబర్ నాలుగో వారంలో దిల్లీ విమానాశ్రయంనుండి శ్రీనగర్ వెళ్ళే స్పైస్ జెట్ విమానం ఎక్కిన కాసేపట్లోనే అనుకోని అద్భుతం. విమానం హిమాలయాలలోని మంచు కొండల మీదుగా ప్రయాణిoచింది. అవి చూడాలనుకున్న చిరకాల కోరిక అప్రయత్నంగా తీరింది. నడచి వెళ్ళినా, బస్సు, కారులాంటి వాహనాల్లో వెళ్ళినా కొచెం దగ్గరగా చాలా కొద్ది  వాటిని మాత్రమే చూడగలం. కాని విమానం నుండి, కొంచెం దూరంనిoచైనా లెక్కలేనన్ని కొండల్ని,  కత్తి లాగున్న వాటి అంచుల్ని, లోయల్ని, జాలువారే ప్రవాహాల్ని, కరుడు గట్టిన మంచు శిఖరాల్ని చూస్తూ ఓ రకమైన ఉద్వేగం మనసులో ఉప్పొంగుతుంటే అనుభవించేదే కాని అది వివరించడానికి వీలైన విషయం కాదు. ఈ అనుభవం కేవలం మా అదృష్టం. ఎందుకంటే తిరుగు ప్రయాణంలో మా విమానం మంచు కొండల  మీదుగా రాలేదు!

Also read: తెలుగు మీడియం

దల్ సరస్సుపై మంచుతెర

కాశ్మీర్ రాజధాని శ్రీనగర్లో దల్ సరస్సు, అక్కడికి దగ్గర్లో ఉన్న పహల్ గావ్, గుల్మార్గ్ లాంటి మంచు నిoడిన ప్రాంతాలు ఒకవైపు, మరోవైపు వైష్ణోదేవి మందిరంలాoటి మనోహర ప్రాంతాలున్నాయి. దల్ సరస్సు 28 కిలోమీటర్ల మేర వ్యాపిoచింది. ఇంత పెద్ద సరస్సు పైభాగం మొత్తం మంచు అద్దంలా మారుతుంది రాత్రిపూట. పగలుమాత్రం ‘షికారా’ అనబడే సన్నటి పడవల్లో షికారు చేస్తారు ప్రకృతి ప్రేమికులు. పడవ అంచు నీటిపై ఆరు అంగుళాల ఎత్తు మాత్రమె ఉంటుంది.

Also read: మనువు చెప్పిన చతుర్వర్ణాల పుట్టుక వెనుక ప్రతీకలు (symbols).

బోటు షికారు అందమైన అనుభవం

నీటిలో తేలుతున్న హౌస్ బోటు లో ఓ రోజు గడపడం అందమైన అనుభవం. అందులో డ్రాయింగ్ రూమ్, హాల్ లాంటివాటితోపాటునలుగు, అయిదు బెడ్ రూములు ఉంటాయి. భోజన సదుపాయం ఉంటుంది. టివి, కరెంటుతో వెచ్చనయ్యే పరుపులతొ పాటు గది మద్యలో చెక్కలతో మండే కుంపటి ఉంటుంది. మంట గాని, పొగ కాని ఉండవు. వేడి మాత్రమే ఉంటుంది. ఏదైనా పొరపాటు జరిగితే నగిషీలతో నిండి రెండు కోట్లు విలువయిన పడవ క్షణాల్లో కాలి బూడిడవుతుంది. డిసంబర్ నెలలో దల్ సరస్సు దగ్గర రాత్రి దాదాపు మైనస్ పది డిగ్రీలు చల్లదనం ఉంటుందిట. చలికి తట్టుకునే బాడి వార్మర్స్, ఉలెన్ దుస్తులు, గ్లోవ్స్, క్యాప్, షూస్ అత్యవసరం. సరైన జాగ్రత్తలు తీసుకుంటే స్వచ్చమైన వాతావరణం కారణంగా ఆరోగ్య సమస్యలు ఉండవు.

Also read: “దృతరాష్టృడు”

మంచుపొరకింద నీటి ప్రవాహం

శ్రీనగర్ కు ఓ గంట దూరంలో ఉంది పహల్ గావ్. కొంత ఎత్తైన ప్రాంతం. దారిలోనే కొన్ని చోట్ల మంచు పేరుకున్నది చూశాం. త్రికోణాకృతిలో ఉండే ఇళ్ళ కప్పులపై దాదాపు ఆరు అంగుళాల ఎత్తున మంచుగడ్డలు. రోడ్డు ప్రక్కన కాలువలో పై భాగం గాజు పలకలా గడ్డకట్టిన ఐస్ పొర కింద నీళ్ళు ప్రవహించడం చూడడానికి చిత్రంగా అనిపించింది. దారిలో మోళ్ళుగా మిగిలిన ఆపిల్ చెట్ల తోటలు, కొండల నిoడా ఆకాశానికి పెరిగిన పైన్, దేవదారు, విల్లో చెట్లు, హిమాలయాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చినార్ చెట్లు. పైకి వెళ్ళే కొద్దీ రోడ్డు కిరువైపులా చెట్లపైన మంచు. ఓ ప్రదేశంలో మా వాహనాన్ని ఆపేసి ముందుకు వెళ్ళేది గుర్రాలపైన అన్నారు. అందరికి గుర్రాలెక్కే ధైర్యం లేకపోయినా ముందేముందో చూడాలన్న ఉత్సుకత మమ్మల్ని గుర్రాలెక్కించింది. రెండు నిముషాల్లో బ్యాలెన్సు చేయడం తెలిసి భయం పోయింది. ఆరు సంవత్సరాల పాపకూడా విడిగా గుర్రం మీద కుర్చుని ముందుకు సాగింది. కాస్త ఎత్తుకు ఎక్కిన తర్వాత కనుచూపుమేర అంతా మంచు కనిపించే చోట నిలిపారు. కాసేపు మంచులో ఆడుకున్న తర్వాత మరోచోటికి బయలు దేరాం. మంచుతో కప్పబడ్డ కొండ రాళ్ళ మధ్య కేవలం గుర్రం కాళ్ళు మాత్రమే పట్టేంత సన్నటి ఎగుడు దిగుడుగా ఉన్న భయంకర మార్గంలో తీసుకెళ్ళారు.

Also read: మహా భారతంలో ధర్మం

దారి తప్పకుండా నడిచే గుర్రాలు

అక్కడినుండి చుట్టూ లోయ, దూరంగా కొండ శిఖరాలు కనిపిస్తుంటే ఎక్కడానికి పడ్డ కష్టం మర్చిపోయాం. తర్వాత కొంత సాఫీగా ఉన్న ప్రాంతంలో చిరు వేగంతో గుర్రపు స్వారీ. అలవాటుపడ్డ గుర్రాలు పగ్గాలు పట్టుకోకపోయినా దారి తప్పకుండా పోతున్నాయి. మా వాహనం దగ్గరకు తిరిగి రాగానే గుర్రాలను నడిపేవారికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు చెప్పి మాట్లాడుకున్న దానికంటే ఎక్కువ డబ్బు ఇచ్చాం, వారి సహకారం, కష్టం, పేదరికం చూసి.

ఊయల కాదు, గది ఊగింది

మా హోటల్ లో రాత్రి 11-15గంటలకు టివి చూస్తూ ఉండగా గది ఊగింది. నాకు బిపి ఇంతగా ఎప్పుదూ పెరగలేదే అనుకున్నాను. ఓ అర నిముషం తర్వాత బలంగా ఊగింది మంచం. అప్పుడు అర్ధమైంది. అది నా బిపి కాదు భూకంపం అని. రూమ్ బయటకు వచ్చేశాం. కాని మిగతా రూముల్లోని మా వాళ్ళు మంచి నిద్రలో ఉన్నారు. భూకంపం కూడా ఆగిపోయింది కదా అని వాళ్ళను లేపలేదు. టివి భూకంప తీవ్రత 6.5 అని చెప్పింది. ఆరు దాటితే భవనాలు కూలిపోవడం జరగొచ్చు. కాని అదృష్టం ఎవరికీ ఏo కాలేదు.

డ్రైవర్ సమయస్ఫూర్తితో బతుకు జీవుడా…

మరుసటిరోజు ఉదయం గుల్ మార్గ్ బయలుదేరాం. శ్రీనగర్ నుండి సుమారు మూడు గంటల ప్రయాణం. కలలుగన్న ప్రాంతం కళ్ళముందు సాకారం కాబోతుందన్న ఆనందం సిటీ దాటకముందే జావగారి పోయింది, ఉగ్రవాదులు చేసిన బండరాళ్ల దాడి చూసి. మోడీ మీద వచ్చిన కోపం టూరిస్ట్ ల కార్లపై  చూపించారు. 8- 30 మధ్య వయసులో ఉన్న ఓ నలభై మంది దారిన వెళుతున్న స్థానిక వాహనాలని వదిలేసి, టాక్సీలను అంటే టూరిస్ట్ లను మాత్రమే బండరాళ్ళ దాడికి గురి చేశారు. వాళ్ళు వాడినవి దాదాపు రెండు నుండి ఐదు కిలోల బరువుడే కొండ రాళ్ళు. మా డ్రైవర్ తెలివిగా కారును వెనక్కి వేగంగా లాగేశాడు. కాబట్టి క్షేమంగా బయట పడ్డాం. కాసేపు ఆగి పోలీసులు వచ్చిన తర్వాత బయలుదేరాం. ఓ ఎత్తైన ప్రాంతానికి వెళ్ళగానే మా టాక్సీ ఆపేశారు. అక్కడ ప్రత్యేకమైన బూట్లు, కోట్లు తీసుకుని కొండ ఎక్కడానికి మరో వాహనం ఎక్కించారు. తిరుపతి కొండలా జడపిన్నులాంటి మలుపులతో కూడిన దారి. ఓవైపు కొండ, మరోవైపు లోయ. మంచు తప్ప నేల ఎక్కడా కనిపించని ప్రదేశం. రోడ్డు మాత్రం మంచు తొలగించే ప్రత్యెక వాహనం ఉపయోగించి శుభ్రంగా ఉంచారు. కొండ పైకి చేరుకున్న తరువాత మంచు సముద్రంలా ఉన్న ఓ గుంట ప్రాంతానికి చెక్కల మిద కూర్చోబెట్టి లాక్కువెళ్ళారు. ఆ మంచు మైదానంలో కాసేపు ఆడుకుని, ఓ కాఫీ తాగి, ఆ చెక్క పలకల మీద బయలుదేరాం. పలకలు లాగే వాళ్ళు కొంత ఎత్తుకు లాగిన తరువాత  మిగిలిన ఎత్తు మమ్మల్ని నడిచి వెళ్ళ మన్నారు. శిఖరం చేరుకోవడానికి ఆయాస పడ్డా అందరం చేరుకున్నాం. అక్కడో చిన్న ఆలయం. దేవి దర్శనం చేసుకుని చుట్టూ చూస్తే దూరంగా ఎన్నో కొండల వరసలు, ఎంతో అందంగా. అక్కడనుండి మరింత ఎత్తుకు నడిచి చుట్టూ కనిపించిన మంచు సముద్రపు తెల్ల నురుగులో మనసు మునిగి తేలుతుంటే వెనక్కి బయలు దేరాం.

Also read: బలరాముడు విష్ణు అవతారమా?

పలకలపై జారడం ఓ సాహసం

అక్కడో సమస్య. మూడంతుస్తుల మేడంత ఎత్తున్న ప్రదేశం నుండి దాదాపు నిట్టనిలువుగా ఉన్న దారిలేని చోట పలకలపై కూర్చొని క్రిందికి జార మన్నారు. అమ్మ బాబోయ్ జరిగే పనేనా అనిపించింది. కాని ముందు ఎవరో ఇద్దరు జారింది చూసి అందరం జారి కిందికి వచ్చాం. మొత్తానికి మంచు కొండల్లో విహరించి క్షేమంగా హోటల్ చేరాం.

పెళ్ళి తివాచీలూ, శాలువలూ

మరుసటి రోజు శ్రీనగర్ నగర సందర్శనం. పార్క్ ల్లో చెట్లు ఆకులు రాల్చేసిన కారణంగా మోళ్ళుగా మిగిలాయి. శీతాకాలం కాకపొతే ఎలా ఉంటాయో ఊహించుకుంటూ షాపులకు వెళ్ళి తివాచీలు, శాలువలు కొన్నాం. సాయంత్రం నాలుగు దాటితే చలి తట్టుకో లేరని మా డ్రైవర్ వారిస్తున్నా కాస్త ఆలస్యం చేసి ఎండిన పళ్ళు, కుంకుమ పువ్వు, చెక్క వస్తువులు, చీరలు కూడా కొన్నారు.

  కాశ్మీరీలు మంచిపేదలు

కాశ్మీరు ప్రజలు మంచిగా, పేదలుగా కనిపించారు. ఆకుపచ్చ జండాలు పట్టుకుని తిరగడంలో ఉన్న శ్రద్ధ వాళ్ళ జీవితాలు బాగుచేసుకోవడంపై కనిపించలేదు. రాజధాని నగరం శ్రీనగర్ లోనే పెద్ద కార్లు రెండు మూడు కంటే ఎక్కువ కనిపించలేదు. వంటిమీద ‘సిగ్రి’ అనబడే ఓ కుండలో నిప్పులు పెట్టుకుని దానిపై పొడవాటి కోటు కప్పుకుని తిరిగేస్తున్నారు జనం. మా హోటల్లో పని చేసేవాళ్లు ఆ చలి ప్రదేశంలో తెల్లవారకముందు చన్నీళ్లతో స్నానం చేసి వస్తారట! మనo భోజనo చేస్తున్నపుడు తాగడానికి, తరువాత చేతులు కడగడానికి వేడి నీళ్ళు వాడక తప్పదు. పొరపాటున మామూలు నీళ్ళలో చెయ్యి పెడితే వేళ్ళు కొంకర్లు పోతాయి. భోజనానికి రోటి, పలావు బియ్యంతో చేసిన అన్నం దొరుకుతాయి. పెరుగు మజ్జిగలాoటి చల్లటి వస్తువుల మీద ఆశ వదులుకోవాలి. పార్కులు, పూలు, చెట్లు తిరుపతిలాంటి చాలా కొండల మీద చూడొచ్చు. మంచు కొండల్లో విహారం మాత్రం కాశ్మీర్ లోనే. ఆరోగ్య సమస్యలు లేని వాళ్లు తప్పకుండా చూడ తగింది చలికాలంలో కాశ్మీర్.

Also read: “ప్రేమ తగ్గితే”

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles